బైబిలు (Bible) అనే పేరు "బిబ్లోస్" అనే గ్రీకు రూపంనుండి వచ్చింది. బిబ్లోస్ అనే పదానికి - గ్రంథమని అర్ధం. ప్రాచీన సాహిత్యంలో యింతకు మించిన గ్రంథం లేదనే భావంతోనూ, గ్రంథమని పిలువబడే ధన్యత దానికి మాత్రమే చెందుతుందనే ఉద్దేశంతోనూ, దాన్ని"బైబిల్" లేక గ్రంథం అని అన్నారు. రామాయణం, మహాభారతం, మహాభాగవతం అనేవి గ్రంథాల పేర్లు, కాని బైబిలనేది గ్రంథం పేరు కాదు. తిరిగి చెప్పాలంటే - అసలు గ్రంథమనబడేది అదేనట - అందుకే దాన్ని బైబిలన్నారు.
బైబిలు 66 పెద్ద, చిన్న ప్రత్యేక రచనల చేరికయై ఉండి కూడా ఏక గ్రంథంగా భావించబడడమే దాని ప్రత్యేకత. అంటే బైబిలు రచనలో సుమారు 40 మంది కలాలు ఆడినా, ఒకని రచనగానే అది భావింపబడడం వింతయే! రమారమి 1600 సంవత్సరాల కాలం రచనలో ఉండి కూడా ఒకే సమయంలో వ్రాయబడినట్టు భ్రమింపజేసే గ్రంథం బైబిలు. ఎన్ని దేశాలను, నాగరికతలను అది దాటివచ్చినా, ఎన్ని కలాలు అందులో ఆడినా, ఏ యే కాలాలలో అది వ్రాయబడినా, నేటి ప్రజల పరిస్థితులకు కూడా దాని సందేశం "వర్తిస్తుంది" అనేది ప్రసంశనీయం. ఇలాటి బైబిలంటే నీ ఉద్దేశమేమో!
బైబిలు క్రైస్తవ మత గ్రంథమనే తలంపు అనేకుల్లో గూడుకట్టుకొని ఉంది. అయితే అది సరియైన తలంపా? కాదు. అయినా, వాటిని మతాలని పిలవడం సమంజసమైతే రెండు వేర్వేరు మతాలకు చెందియూ, ఒకే గ్రంథంగా రూపొందింది - బైబిలు. అంటే, యూదులు, క్రైస్తవులనే రెండు వేర్వేరు జనాలను మతాలని భావించితే, ఆ రెండింటికి చెందియూ ఏక గ్రంథంగా భావింపబడుతున్న గ్రంథం - బైబిలు.
క్రైస్తవ్యం (Christianity) అనే పేరుతో వాడుకలో ఉన్న మత ప్రపంచాన్ని విమర్శించాలని కంకణం కట్టుకొన్న కొందరు - బైబిలును క్రైస్తవ మత గ్రంథమనే అపోహతోనే దాన్ని చిన్నా భిన్నాలుగా తుంచి, తమకు యిష్టం వచ్చిన చోట అతికించి, బైబిలును అపార్ధం చేశారు. బైబిలును అనుసరిస్తున్నామని చెప్పకొనే కొందరైతే తమకు నచ్చిన చోట చదివి, దాన్ని తమకు వర్తింపజేసికొంటూ అది సరియని అనుకొంటున్నారు. అలా చేయడం వారికి బైబిలునందలి విశ్వాసమో, భక్తో తక్కువై కాదు; కాని బైబిలును గూర్చి వారికి సరియైన అవగాహన లేనందుననే అలాటి పొరపాటు చేస్తున్నారు.
నిజానికి బైబిలు రెండు వేరైన నిబంధనలతో కూడిన గ్రంథం. మొదటిది పూర్వ కాలంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగంతో చేసిన నిబంధన. దాన్ని “పాత నిబంధన" అని అంటారు (హెబ్రీ. 8:13). ఇశ్రాయేలీయులు దైవ రాజ్యంగా ఉండడానికే ఆ నిబంధన చేయబడింది (నిర్గమ. 19:3-5). అయితే వారు ఆ నిబంధనను భంగం చేసికొన్నారు (యిర్మీయా 31:32; హెబ్రీ. 8:8-9).
గనుక జరుగవలసిన ఏర్పాటును బట్టి, దేవుడు క్రీస్తునందు మానవాళితో రెండవ నిబంధన చేశాడు. ఇది క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనయే దేవుని కడవరి ఏర్పాటు (హెబ్రీ. 1:1-2; 1 పేతురు 1:20; మత్తయి 21:27).
"నిబంధన" అంటే ఒప్పందం కదూ! దేవునికి మానవాళికి జరిగే చివరి ఒప్పందం క్రీస్తు రక్తంవల్ల ఏర్పడింది (లూకా 22:20), సామాన్యంగా రాజు తన మాట యిస్తేనే చాలు. దాన్ని అమల్లో పెట్టడానికి అవసరమైతే తన అధికారమంతటిని వినియోగిస్తాడు. ఒకవేళ అలాటి రాజు తన రక్తంతోనే ఒక ఒప్పందానికి సంతకం చేస్తేనో?! అది ఎంతో శ్రద్ధగా అమల్లో ఉంటుంది. ఒక రాజు తన రక్తంతో సంతకం చేసిన ఒప్పందం ఎలాటిదో క్రొత్త నిబంధన కూడా అలాటిదే (హెబ్రీ. 7:15-16). నీవేమనుకున్నాసరే! క్రీస్తుయేసు మాత్రం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్న మాట వాస్తవం (ప్రకటన 19:16). ఆయన రక్తం క్రొత్త నిబంధనను ముద్రించియుండగా, దైవ మానవుల సంబంధ బాంధవ్యాలు కేవలం ఆ నిబంధన మీదనే ఆధారపడి ఉంటాయ్ (యోహాను 12:48-50).
పాపక్షమాపణ (ఎఫెసీ. 1:7; అపొ. 2:37-38); పరిశుద్ధాత్మ అను వరం (ఎఫెసీ. 1:13-14), ప్రార్థనలకు ప్రతిఫలం (గలతీ. 4:4-6; యోహాను 15:7); పరలోక పౌరత్వం (ఫిలిప్పీ. 3:20); దైవ సహవాసం (1 కొరింథీ. 1:9; 1 యోహాను 1:3); నిత్య జీవార్ధమైన నిరీక్షణ; నిత్య స్వాస్థ్యం మొదలైన దీవెనలన్నిటిని అనుభవించడానికి నేటి మానవుడు సయితం ఆ క్రొత్త నిబంధనకే తిరిగి రావాలి! ఇది పరలోక రాజ్యపు రాజ్యాంగ చట్టం. క్రీస్తు యేసే ఈ రాజ్యానికి రాజు. క్రొత్త నిబంధన క్రిందనున్నవారే ఆయన ప్రజలు; పరలోకం వారి దేశం; భూమిమీద వారు యాత్రికులు - పరదేశులు (1 పేతురు 2:9-11). వారు భూమిమీద జీవించే దినాల్లో తమ ప్రభువును బట్టి భౌతిక అధికారాలకు లోబడి ఉంటారు (రోమా 13:1-6).
అలాటప్పడు బైబిల్లో ఉన్న పాత నిబంధన ఎందుకు? దానివలన ప్రయోజనమేమి? అని అడుగుతావేమో! పాత నిబంధన లేఖనాలు దైవావేశంవలన కలిగినవే (2 పేతురు 1:20-21; 2 తిమోతి 3:16) అవి “ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్ప దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నవి." పైగా క్రీస్తు ప్రభువు ఎవరో (యోహాను 1:45; లూకా 24:44-46); క్రొత్త నిబంధన ఎందుకు ఎలా వచ్చిందో తెలిసికోడానికి అవి సహాయపడతాయి (యిర్మీయా 31:31-84) అంతేకాదు, దేవుని మాటలపై ఎలా నిరీక్షణ కోల్పోకుండా ఉండాలో కూడా అవి సూచిస్తాయ్ (రోమా 15:4). దైవ రాజ్యంగా ఉండకుండ పడిపోయిన ఇశ్రాయేలీయుల్లా మనం ఉండకూడదని మనకు బుద్ది కలగడానికి అవి ఉన్నాయ్. అంటే, వారిలాగా మనం చెడ్డవాటిని ఆశింపకూడదని; విగ్రహారాధకులమై ఉండ కూడదని; ప్రభువును శోధింప కూడదని; సణగ కూడదని వారికి దృష్టాంతములుగా సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి వ్రాయబడ్డాయ్ (1 కొరింథీ. 10:5).
అంతేగాని ఒకేసారి ఆ రెండు నిబంధనల క్రింద కట్టుబడి ఉండడానికి బైబిలు యివ్వబడలేదు. “కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్రము (పాత నిబంధన) మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియా యెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద (పాత నిబంధన క్రింద) ఉండము' (గలతీ. 3:24-25; 5:1-2). ఈ వాస్తవం తెలియనందున కూడా అనేకులు బైబిలును అపార్థం చేసికొనడం జరిగింది.
ఏదియెలాగున్నా దేవుని వద్ద ఆత్మసంబంధమైన ఏ దీవెన పొందాలన్నా ప్రతివాడు ఈ క్రొత్త నిబంధన క్రిందికే రావాలి, ఎవరు ఎలా తలంచినా, దానికి బయట దైవ మానవ నివాస సంబంధాలు నిజంగానే లేవు. ఈలాటి బైబిలు కేవలం మత గ్రంథమేనా?
nice post
ReplyDeleteReally good i got it everyone understand.
ReplyDeleteBible is not a religeion book.
Really good i got it everyone understand.
ReplyDeleteBible is not a religeion book.