Showing posts with label యేసుక్రీస్తు. Show all posts
Showing posts with label యేసుక్రీస్తు. Show all posts

Saturday, 3 September 2016

దేవత్వము (Godhead)

దేవత్వాన్ని గురించి విశ్వాసులలో సరైన అవగాహన లేకపోవడం దురదృష్ఠకరం. క్రైస్తవులకు ముగ్గురు దేవుళ్లని కొందరు అంటుంటే, ముగ్గురు కలిసి ఒకే దేవుడని మరికొందరంటారు. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మరికొందరంటారు. వాస్తవానికి క్రైస్తవులకు నిజంగా దేవుడున్నాడా? ఉంటే, ఆ దేవుడెవరు అనే విషయంలో ఏకభావంలేదు సరికదా, ఈ విషయం మీదనే క్రైస్తవలోకం బహుగా విభాగింపబడింది. తోచినవారు తోచినట్లు చెప్పుకుంటూ, నమ్ముతూ పోతున్నారు.
పై చెప్పబడిన పరిస్థితులకు సంబంధం లేకుండ, క్రైస్తవులకు క్రీస్తే దేవుడని, క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తారని లోకం అనుకుంటూ ఉంటుంది. అంత మాత్రమే గాకుండ, క్రైస్తవులు అనబడే అనేకులు అలానే తలంచుతూ, కార్యాలు జరిగించుతూ, జీవించుతూ ఉంటారు. ఇంతకు దేవత్వాన్ని గురించి బైబిల్ బోధించే సత్యమేది? ఒక విశ్వాసిగా కాకుండ ఒక పరిశీలకునిగా సంగతిని ఆలోచించడం యుక్తమని తోస్తుంది. అంటే ఎవరి విశ్వాసాన్ని విమర్శించకుండా లేక ఎవరి విశ్వాసాన్ని ప్రోత్సహించకుండ, యింతకు ఈ విషయంపై బైబిల్ ఏమి బోధిస్తుందో పరిశీలకులుగా ఆలోచిద్దాం "సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి" అనే బైబిల్ పంథాలో పోదాం (1థెస్స 5:21).
నిత్యత్వంలో దేవత్వం:
బైబిల్ గ్రంథం తెలిపిన మేరకు సంగతులను ఆలోచింపబద్ధులమైయున్నామని గమనించుదాం. ఎవరి విశ్వాసంతో గాని ఎవరి అభిప్రాయంతో గాని సంబంధం లేకుండ గ్రంథ పరిశీలన చేద్ధాం. నిత్యత్వంలో దేవత్వం అంటే, సృష్టికి ముందున్న దేవత్వం అని అర్ధం. ధర్మశాస్ర్తానికి మధ్యవర్తియైన మోషే (అపొ.7:38; యోహాను 1:17), ఇశ్రాయేలీయుల ఆరాధ్యదైవాన్ని తన ప్రార్థనలో ఇలా వ్యక్త పరిచాడు: "ప్రభువా తరతరములనుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు" (కీర్తన 90:1,2). అంటే, ఇశ్రాయేలీయుల ఆరాధ్యదైవము, ఆదిలేని నిత్యత్వము నుండి ఉన్నవాడని మోషే గుర్తించినట్టు లేఖనం తెలియజేస్తుంది.
మోషే యిలా గుర్తించడానికి ముుందే, దేవుడు తన్నుతాను మోషేకు ప్రత్యక్షపరచుకున్నాడు (నిర్గమ 3:1-10). "నేను ఉన్నవాడను అనువాడనై యున్నానని (దేవుడు) మోషేతో చెప్పెను" (నిర్గమ 3:14). ఉండుననువాడు ఇశ్రాయేలీయుల దేవుడు. తనకు తానుగా ఉన్నవాడు, లేక స్వయంభవుడని అర్థమిస్తుంది గదా?!
ఇశ్రాయేలు పితరులకు ఆయన యింకొక విధంగా తన్నుతాను బయలు పరచుకున్నాడట! సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రత్యక్షమైనట్టు దేవుడు స్వయంగా చెప్పుకున్నాడు (నిర్గమ 6:3). అయితే ఇశ్రాయేలీయులకు మాత్రమే యెహోవా అను తన నామమున తెలియబడినట్టు ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు (నిర్గమ 6:2-3).
ఈ నామము దగ్గర జనులలో కొంత సమస్య సృష్టింప బడుతుంది. గమనించు. ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన నామమును యెహోవా అని తెలుగు వారు తర్జుమా చేసికొన్నారు; ఆంగ్లంలో JEHOVAH అని తర్జుమా చేయబడింది. పేరు అనేది ఏ భాషలోనైన ఒకే విధంగా ఉండాలి. భాష మారినంత మాత్రాన పేరు మారుతుందా? అని ఈ పేరు మీద వాదన పెట్టుకొంటున్న వారు బయలుదేరారు. భాషమారితే ఉచ్ఛరణ మారుతుందనే వాస్తవాన్ని ఈ వాదం చేసేవారు గమనించాలి. నా పేరు నేను DEVADANAM అని వ్రాస్తాను కాని తమిళం వారు దానిని DEVATHANAM అని వ్రాస్తారు. ఉచ్ఛరణలో వ్యత్యాసాన్ని బట్టి వ్రాత ఉంటుంది. నా భార్య పేరు సుకన్య అదే తమిళంలో సుగన్య అని వారు ఉచ్ఛరిస్తారు గనుక అలాగే వ్రాస్తారు. ఇందులో పెద్ద విశేషమేమి లేదు.
అసలు దేవుని పేరు దగ్గరకు వద్దాం. హెబ్రీలో ఉన్న దేవుని పేరును అక్షరాలకు కుదించి, ఆంగ్లంలో పొడి అక్షరాలుగా మార్చి YHWH (יהוה) గా మార్చారు. అంటే, యోద్ హే వావ్ హేగా నున్న దాన్ని YHWH అని అన్నారు. ఈ అక్షరాలన్నీ హెబ్రీభాషలోని హల్లులే. ఈ హల్లులు పలకడానికి అచ్చులు అవసరం. అచ్చులు హల్లుల మిశ్రమాన్ని మనం పలుకగలుగుతాం. ఆంగ్ల అక్షరాలకు అసలు రూపం మరలచూద్దాం. యోద్ అనే హెబ్రీ అక్షరాన్ని ఆంగ్లంలో Y గా గుర్తించారు: హే అనే హెబ్రీ అక్షరాన్ని H గా గుర్తించారు; వావ్ అనే హెబ్రీ అక్షరాన్ని W గా గుర్తించారు. అందువలననే YHWH అనే రూపం వచ్చింది.
ఆంగ్లంలో JEHOVAH గాను తెలుగులో యెహోవా అనే తర్జుమాలు తప్పు అనే వాదించేవాడు తన్నుతాను ఖండించుకొంటున్నాడు! ఎలా? ఎలాగంటావా? దేవుని పేరు ఆది భాషలో ఉన్నట్టు! యాహ్ వే లేక యావే అని ఉచ్ఛరించాలనే వాడు YHWH ని ఉచ్ఛరించలేడు. తాను యాహ్ వే అని అనాలన్నా, YHWH కి YAHWEH - అనే అచ్చులను కలపవలసి యుంటుంది. తెలుగు తర్జుమా వారు ఒక రకమైన అచ్చులను తెచ్చుకుంటేఆంగ్లం వారు వేరే అచ్చులను చేర్చితేనే ఉచ్ఛరించగలడు. దేవుని పేరు మీద వాదన చేసేవాడు తన వాదనను, వైఖరిని మార్చుకోవాలి. ఎందుకంటే YHWH ని ఉచ్ఛరించడం నేరుగా కుదరని పని.
పేరు ఉచ్ఛరణ అనే విషయాలు ప్రక్కన పెట్టి, దేవత్వంలోని అనాది దేవుని గూర్చి ఆలోచన చేద్దాం. అనాది దేవుడు ఇశ్రాయేలు పితరులకు "సర్వశక్తి గల దేవుడు" అను పేరున ప్రత్యక్షమైతే, ఇశ్రాయేలీయులకు మాత్రం యెహోవా అను పేరున ప్రత్యక్షపరచుకున్నట్టు గ్రంథంలో చూశాం. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఆయన తండ్రియని తన్నుతాను బయలు పరచుకున్నాడు (1 కొరింథీ 8:5-6). "దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకి ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి" (1 కొరింథీ. 8:5-6).
నిత్యత్వంలో దేవుడు ఒక్కడేనా? ఆయనతో యింకెవరైనా ఉన్నారా? నిత్యత్వంలో దేవుని వాక్యమనబడే మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు లేఖనాలు సూచిస్తున్నాయి. ఆ వాక్యము శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడుగా జీవించిన దినాల్లో ప్రార్థించుతూ, ఆయన యిలా అన్నాడు. "తండ్రీ, లోకము పుట్టక మునుపు నీయెుద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయెుద్ద మహిమపరచుము (యోహాను 17:5). అంటే లోకము పుట్టక మునుపు అనాది దేవుని యెుద్ద మరొక వ్యక్తి కూడా ఉన్నట్టు తెలుస్తుంది గదా? నేడు క్రీస్తు అని పిలువబడే ఆయన కూడా అనాది నుండి ఉన్నాడనేది నిర్వివాదమైన సత్యమై యుంది. లోకం పుట్టక ముందే ఆయన మరణం పొందడానికి నియమింపబడినట్టు కూడ లేఖనాలు తెలుపుతున్నాయి (1పేతురు 1:19-20).
లోకం పుట్టక ముందు నిత్యుడగు యింకొక వ్యక్తి కూడా ఉన్నట్టు లేఖనాలు సూచిస్తున్నాయి. "నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్ధోషినిగా సమర్పించుకొనిన క్రీస్తు యెుక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో యెక్కువగా శుద్ధిచేయును" (హెబ్రీ 9:14). "నిత్యుడగు ఆత్మ" అనే ఈయనను, లేఖనాలు "దేవుని ఆత్మ" (ఆది.1:2; మత్తయి 3:16); పరిశుద్ధాత్మ (మార్కు 1:12); యెహోవా ఆత్మ (యెషయా 61:1) వగైరా పేర్లతో గుర్తిస్తాయి. గనుక యింతవరకు మనకు అందిన సమాచారాన్ని బట్టి, అనాది దేవుడు, దేవుని వాక్యమనే నామము గలవాడు; దేవుని ఆత్మ అని పిలువబడే మూడవ వ్యక్తి గూడా నిత్యత్వంలో ఉన్నట్టు తేలిపోయింది.
సృష్టి నిర్మాణంలో దేవత్వం:
"ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను" (ఆది.1:1-2) భూమ్యాకాశములను సృజించినప్పుడు, దేవుడు, దేవుని ఆత్మ అనే యిద్దరు ఉన్నట్టు యిక్కడ కనిపిస్తారు. నిత్యత్వంలో కనిపించిన మూడవవ్యక్తి యిప్పుడు ఎక్కడికి పోయినట్లు? ఆయన ఎక్కడికి పోలేదు. ఆదియందు భూమ్యాకాశములను సృజించిన ఘనతను, అక్కడ ప్రస్తావించబడని వ్యక్తికి దేవుడు స్వయంగా ఆరోపిస్తున్నాడు; గమనించు.
అంటే, ఇశ్రాయేలీయుల అనాది దేవుడు స్వయాన భూమ్యాకాశములను సృజించలేదట! ఎవరన్నారు? ఆయనే అన్నాడు!! "పాపముల విషయంలో శుద్ధీకరణము ఎవరు చేసి, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్ఛున్నాడో, ఆయనను గూర్చి మాట్లాడుతూ, హెబ్రీ 1:10 లో దేవుడు ఇలా అన్నాడు; "మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే".
అంటే, "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు" (యోహాను 1:1-3). ఆదియందు దేవునియెుద్ద దేవుడైయున్న వాక్యము భూమ్యాకాశములను సృజించినట్టు తెలియజేయబడుతుంది. "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు" (కొలస్సీ 1:15-17).
అంతా తికమకగా ఉన్నట్టుంది! ఇంతకు సృష్టి కర్త ఎవరు? దేవుడా? దేవునియెుద్ద ఉన్న వాక్యమనబడే వేరొకరా? జవాబు గ్రంథం బాగానే చెప్పింది. అయితే అది నీకు తికమకగా ఉంటే, దీనిపై మరొక లేఖనం తన వెలుగును చిమ్ముతుంది జాగ్రత్తగా గమనించు.  "దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము. అయితే అందరియందు ఈజ్ఞానము లేదు" (1కొరింథీ.8:5-7).
ఇంతకు ఏమి జరిగిందట? ఏమి జరిగినట్టు గ్రంథం చెప్పుతుందంటే, సృష్టికి సంబంధించిన సంకల్పం దేవుని మనస్సులో నుండి ఉద్భవించిందట; దానికి రూపకల్పన చేసినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తట!! సృష్టికి సంబంధించిన ఏర్పాటు దేవుని మనస్సులో నుండి బయలు దేరిన కారణాన, సృష్టికర్తయొక్క ఘనత అనాది దేవునికి ఆరోపించబడింది. గనుక, "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" (ఆది.1:1). సృష్టకి రూపకల్పన చేసినందుకు గాను, ఘనత వాక్యమనబడే వ్యక్తికి కూడా ఆరోపింపబడింది.  "సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు" అని వ్రాయబడింది (యోహాను 1:1-3). Christ was the Creation's Amazing Architect. ఇందులో ఏ సమస్యాలేదు. సృష్టి నిర్మాణ కార్యక్రమంలో కనీసం యిద్దరు పాత్ర ఉన్నట్టు తేటపడింది. ఇందులో యింకెవరి పాత్ర అయినా ఉందా? చూద్దాం.
"ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను" (ఆది. 1:1-2). యూదుల రచనల్లో "దేవుని ఆత్మ" అనబడే మరొక వ్యక్తిని (మత్తయి 3:16) పరిశుద్ధాత్మ అని కూడా అంటారు (మార్కు1:9-10). పాత నిబంధన ప్రవక్తల రచనల్లో ఆయన యెహోవా ఆత్మ అని కూడా పిలువబడ్డాడు. ఈ విషయం ముందుగానే గమనించాం (యెషయా 61:1).
ఇంతకు సృష్టి నిర్మాణ కార్యక్రమంలో ఈయన పాత్ర కూడా ఏమైనా ఉందా? "జలములపై అల్లాడుచుండెను" అంటే పరిశుద్ధాత్మ ఏడుస్తున్నాడని కొందరు అపహసించారు! ఏది ఏమైనా, సృష్టి నిర్మాణంలో ఈయన పాత్ర కూడా ఏమైనా ఉన్నట్టు లేఖనాలు అంటున్నాయా? చూద్దాం.
"తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను?" (యెషయా 40:12-13).
"పుడిసిలి" అంటే చేర. (చేరతో చేరడు యవలు అన్నట్టు) జలరాసులను కొలవడానికి చేరను వినియోగించాడంటే, ఏమనాలి? జేనతో ఆకాశాలను కొలచూడటం వింతగదా! ఆకాశాలను కొలచడానికి నరుడు కాంతి సంవత్సరాలను వినియోగిస్తాడు. దేవుని ఆత్మయైతే జేనను ఉపయోగించాడంటే, ఏమనాలి? ఒక సెకండుకు కాంతి రమారమి 1,86,000 మైళ్ల వేగంతో పయనిస్తుంది. అలాంటప్పుడు ఒక కాంతి సంవత్సరం అంటే, 60 సెకండ్లు ఒక నిమిషం, 60 నిమిషాలు ఒక గంట, 24 గంటలు ఒక దినం, 365 దినాలు ఒక సంవత్సరం; దీన్ని బట్టి- "1x186000x60x60x24x365" అయితే ఒక కాంతి సంవత్సరం అవుతుంది. ఆకాశాలను కొలచూడటానికి ఒకటి కంటే ఎక్కువ కాంతి సంవత్సరాలు కావలసి వస్తాయని శాస్త్రవేత్తలంటారు. ఏదిఎలాగున్నా, చేయబడిన సృష్టి కి కొలతలు వేసి స్థాపించినవాడు పరిశుద్ధాత్మయని తేలుతుంది. పర్వతాలు, కొండలు తూయడంలాంటి మిగిలిన సంగతులను మీ ఆలోచనకు విడిచిపెట్టాను.
సృష్టి నిర్మాణంలో, దేవుని పాత్ర, దేవుని వాక్యం పాత్ర, దేవుని ఆత్మ పాత్ర వగైరా సంగతులను చూచాం. వీరిలో ఒకరితో ఒకరికి ఏమైన సంబంధం బాంధవ్యాలు ఉన్నాయా? వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు అని నీవు అనవచ్చు; యింకెవరైన ఏదైన అనవచ్చు. కాని, వారి సంబంధ బాంధవ్యాలను గురించి వారు ఒకరితో నొకరు ఏమని చెప్పుకుంటున్నారు?
దేవత్వం మధ్య సంబంధ బాంధవ్యాలు:
వాక్యమైన దేవుడు శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మానవ జాతి మధ్య నివసించినట్లు గతంలో చూచాం (యోహాను 1:14). ఆయన ఇలా అన్నాడు: "అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము" (యోహాను 17:3). ప్రభువైన యేసు మాటలలో దేవుడు అద్వితీయుడు. అద్వితీయుడంటే, ద్వితీయములేని (no second) సాటిలేనివాడు అని అర్థం.
ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఆజ్ఞలలో, ప్రధానమైనదేది? అనే ప్రశ్నకు యేసు జవాబిస్తూ యిలా అన్నాడు: "ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. ఆయనను ప్రశ్నించిన శాస్త్రి - బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే" ( మార్కు 12:29,32).
దేవుడు అద్వితీయుడు అనే సత్యాన్ని క్రొత్త నిబంధన స్థాపిస్తుంది. "సకల యుగములలో రాజైయుండి, అక్షయుడును అదృ శ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక" (1 తిమోతి 1:17). "శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌" (1 తిమోతి 6:15-16).
అద్వితీయ సత్యదేవుడే అందరికి తండ్రియైన దేవుడు. "అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు" (ఎఫెసీ 4:6). ఈయనే మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా తండ్రియైన దేవుడైఉన్నాడు (ఎఫెసీ 1:3; 1 పేతురు 1:3).
దేవునికిని క్రీస్తుకును గల సంబంధం:
"అద్వితీయ సత్య దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కూడా దేవుడే! షాకయ్యావా? కానవసరం లేదు. ముగ్గురు సాక్షుల నోట ఈ మాట స్థాపించబడుతుంది జాగ్రత్తగా గమనించు:
సాక్ష్యం - 1: ఇది యేసు క్రీస్తు వారి సొంత సాక్ష్యం; ఆయన సిలువ మరణ సమయంలో, "ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము." (మార్కు 15:34). నా ఆరాధ్యదైవమా, నా ఆరాధ్యదైవమా అని అర్థమిచ్చేకేక అది (కీర్తన 22:1). ఆయన పునరుత్థానుడైన తరువాత కూడా ఈ సత్యానికే సాక్ష్యమిస్తున్నాడు: మరియతో మాట్లాడుతూ,"నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను" (యోహాను 20:17).
సాక్ష్యం - 2: ఇది పరిశుద్ధాత్మ యెుక్క సాక్ష్యం. "మరియు మీ మనో నేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యమెట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమునుబట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తియొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో, మీరు తెలిసికొనవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, పౌలు ఎఫెసీయుల కొరకు ప్రార్థిస్తున్నాడట! (ఎఫెసీ 1:17-19). పరిశుద్ధాత్మ ఏమని సాక్ష్యమిచ్చాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యెుక్క దేవుడు మహిమా స్వరూపియగు తండ్రి అని గమనించావా?
సాక్ష్యం - 3: ఇది తండ్రి యెుక్క సాక్ష్యమే! "తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే - దేవా, (దేవత్వము గలవాడా) నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను" (హెబ్రీ. 1:7-9). "దేవుడు నీ దేవుడు" అని సాక్ష్యమిచ్చాడు. నేను నీ దేవుడనని తండ్రి పలికాడు.
దేవత్వంలోని ముగ్గురి సాక్ష్యంతో ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు దేవుడైయున్నాడని స్థాపించబడింది. ప్రభువైన యేసు తండ్రిని ఆరాధించినట్టు కూడా చెప్పుకున్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడుతూ, " -అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము..." అంటే, నేను కూడా ఆరాధకుడనే అని ప్రభువు తేటగా మాట్లాడాడు (యోహాను 4:21-23).
కోపగించుకోకు, నేను క్రీస్తు ప్రభువును తగ్గించడంలేదు. క్రీస్తు దేవుడా? కాడా? అనే ప్రశ్నను నీవు లేవనెత్తుతావని నాకు తెలుసు. క్రీస్తు దేవత్వాన్ని శంకించేవాడనైతే, సృష్టి నిర్మాణంలో ఆయన దేవుడైయుండెనని ఎలా సూచిస్తాను? క్రీస్తు దేవత్వం మీద నాకు ఏ రవ్వంతైనా సందేహంగాని, ఆయన మీద చిన్నచూపు గాని లేదు. దేవుడు తన కుమారుని గూర్చి మాట్లాడినప్పుడు, ఆయన - "దేవా" అని సంబోధించిన సంగతి కూడా ప్రస్తావించాను గదా! క్రీస్తు వారి దేవత్వం నిస్సందేహామైనది. దీనికి దేవుని సాక్ష్యం ఉంది (హెబ్రీ 1:10); పరిశుద్దాత్మ సాక్ష్యంకూడా దాఖలైయున్నాయి.
ఆయన ఆదియందు దేవుడై ఉన్నాడు (యోహాను 1:1-3); ఆయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడైయున్నాడు (రోమ 9:5); మహా దేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు అనే వర్ణనను ఉన్నాయి (తీతు 2: 13). ప్రవచనంలో క్రీస్తునుగూర్చి ఇలా చెప్పబడింది; "ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును" అనేది యెషయా ప్రవచన సందేశం (యెషయా 9:6). దీనినంతటిని పౌలు కొలస్సీ లో ఇలా వ్యాఖ్యానించాడు. "ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది" (కొలస్సీ 2:8-9). యెషయా ప్రవచనానికి అర్థం అదే.
క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తారా?
కళ్ళు మూసుకొని జవాబు చెప్ప ప్రయత్నించకు. గ్రంధం ఏమి చెప్పుతుందో ఆలోచించు. బాలుడైన యేసు జ్ఞానులు పూజింపవచ్చారు (మత్తయి 2:1-5). గొర్రెల కాపరులు కూడా వచ్చారు (లూకా 2:8-14) అని చెప్ప ప్రయత్నించకు. ఇంతకు క్రైస్తవులు ఎవరిని ఆరాధించ ఆజ్ఞాపించబడ్డారు. ఇంతకు క్రైస్తవుల ఆరాధనను కోరిన వాడెవరు? "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను" (యోహాను 4:23-24). ఇంతకు ఆరాధనను కోరినవాడు తండ్రియైన దేవుడేయని, ఆయననే ఆరాధించాలని క్రీస్తు ప్రభువు బోధించినపుడు, ఆయన ఆరాధనను కోరలేదని; తానే శరీరంలో ఆరాధించిన వాడనని, ఆయన తన శిష్యుల ఆరాధనను కోరలేదని; యదార్ధమైన ఆరాధికులు తండ్రియైన దేవునే ఆరాధించాలని ప్రభువైన యేసు ఖండితముగా తెలియజేశాడు. ఆరాధకులు కావాలనేది తండ్రి కోర్కెయే గాని తన కోర్కె కాదన్నట్టు క్రీస్తు తేటపరిచాడు.
క్రీస్తు ప్రభువు దేవుని గూర్చి తెలిపిన సంగతులు:
1. దేవుడు తనకు తండ్రియని తనకు ఆయన దేవుడని (యోహాను 20:17),
2. తండ్రియైన దేవుడు అద్వితీయుడని (మార్కు 12:29-30),
3. తండ్రి పంపితేనే తాను వచ్చానని (యోహాను 17:3),
4. తండ్రి చిత్తం జరిగించడానికే గాని, తన ఇష్టం నెరవేర్చుకొనడానికి తాను రాలేదని (యోహాను 6:38),
5. నా తండ్రి నాకంటే గొప్పవాడని;
6. నా తండ్రి అందరికంటే గొప్పవాడని (యోహాను 10:29),
7. అధికారాలను అనుగ్రచించేవాడు తండ్రియని (యోహాను 17: 11),
8. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొన్నాడని (అపొ. 1:7), ఇంకా అనేక సంగతులను క్రీస్తు ప్రభువు తండ్రిని గూర్చి తెలియజేశాడు.
సకలయుగములలో రాజైయుండి, అక్షయుడును, అదృశ్యుడును, అధ్వితీయుడైన వాడు దేవుడు. దేవుడని బైబిలు మాట్లాడేవాడు - అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. దేవుడు జ్ఞానబలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రచించువాడునై యున్నాడు (దాని. 2: 20-21).
 క్రీస్తు క్రైస్తవులకు ఏమైయున్నాడు:
మోషే కేవలం నరమాత్రుడు. దేవత్వంలో గాని, ఆదిలేని నిత్యత్వంలోగాని ఏ సంబంధం లేని వాడు. ఐతే ఒకనాడు దేవుడు మోషేని ఫరోకు దేవునిగా నియమించాడు (నిర్గమ 7:1). నజరేయుడైన యేసైతే, నిత్యత్వంలో ఉండి, సృష్టికర్త స్థానంలో నిలిచినవాడు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణతయు కలవాడు. క్రొత్త నిబంధన ఇశ్రాయేలుకు ఆయనను దేవుడు, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. " మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను"(అపొ. 2:36). అలా నియమించే అధికారం అద్వితీయ సత్యదేవునికే సొంతం (యెహోను 3:17; 19:10-11).
క్రైస్తవులకు క్రీస్తు దేవుడుగా నియమించబడలేదు. ఆయన కేవలం ప్రభువుగాను క్రీస్తుగాను మాత్రమే నియమింపబడ్డాడు. ఇలా నియమించే అధికారి దేవుడే. క్రైస్తవులకు దేవుడొక్కడే, ఆయన తండ్రి (I కోరింధీ. 8:6); క్రైస్తవులకు ప్రభువు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు (I కోరింధీ. 8:6). మహాదేవుడు అని వర్ణింపబడిన క్రీస్తు మనకు రక్షకుడని చెప్పబడ్డాడేగాని, మనకు దేవుడని చెప్పబడలేదు (తీతు 2:13). "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు" (రోమా 10:9-10).
అనవసరంగా సత్యాన్ని తికమక పెట్టవద్దు. దేవత్వంలోని వారిలో ఎవరి పాత్ర ఏమో యిలా సూచింపబడింది: "శరీర మొక్కటే, ఆత్మయు (పరిశుద్ధాత్మ) ఒక్కడే; ఆ ప్రకారమే మీ పిలుపువిషయమై యొక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు (యేసుక్రీస్తు) ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే, అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు" (ఎఫెసీ. 4:4-6).
క్రైస్తవుల ఆరాధ్యదైవము తండ్రియైన దేవుడు మాత్రమే (యోహాను 4: 23-24). అయితే క్రీస్తుతో క్రైస్తవులకుండే సంబంధం ఎలాటిది? "... మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి" అని క్రైస్తవులు ఆదేశించబడ్డారు (1పేతురు 3:15). Sanctify Him in your heart. మీ హృదయాన్ని ఆయన కొరకు ప్రత్యేకపరచు. మీ హృదయములో ఆయన ఏలుబడి ఉండనిమ్ము. ఒక వ్యక్తిని తన హృదయంలో ప్రతిష్టించుకొంటే ఏమి జరుగుతుందో పాతనిబంధనలో ఒక ఉదాహరణ చూద్దాం.
నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి - ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు - మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబు - మీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షా రసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను.  గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను.  కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు" (యిర్మియా 35:5-8).
రేకాబీయులు యోహోనాదాబు మాటలను తమ హృదయములో ప్రతిష్టించుకున్నట్టు, క్రైస్తవులు క్రీస్తు ప్రభువు మాటలను, హృదయములో ప్రతిష్టించుకొనవలసిన వారై ఉంటారు. ఇదే క్రైస్తవులు క్రీస్తుకు సమర్పించవలసిన కానుక! ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడమే క్రైస్తవుని విధి. అంతేగాని కేవలం ఆయనను నోటితో ముఖస్తుతి చేయడం కాదు. "నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?" అని క్రీస్తు ప్రశ్నిస్తున్నారు (లూకా 6: 46). ఆయన చెప్పిన మాట ప్రకారం చేయుటయే క్రైస్తవుల విధి. "భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొన వద్దు" అని క్రీస్తు క్రైస్తవులకు ఆదేశించాడు (మత్తయి 6: 19). ఐనా ఆయన మాటలను పట్టించుకునే వారెవరు?
పరిశుద్దాత్మపట్ల క్రైస్తవుని బాధ్యత:
క్రైస్తవునితో నివసించే పరిశుద్దాత్మ వాని స్వాస్థ్యమునకు సంచకరువు (ఎఫెసీ 1: 13-14). దేహము పరిశుద్దాత్మకు ఆలయంగా ఉండునట్లు కొనబడినవాడు క్రైస్తవుడు (I కొరింధీ 6:19). దేహాన్ని పరిశుద్దాత్మ నివాసయోగ్యమగునట్లు, పరిశుద్ధంగా నిలుపుకోవాలి. "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు" అని ఆదేశింపబడ్డారు (ఎఫెసీ 4: 30). దురాలోచనలు, అసూయ, అక్కసు, చెడుతనం జరిగిస్తే, పరిశుద్దాత్మ తనలో దుఃఖపరచబడరా? దేహంలో పరిశుద్దాత్మ దుఃఖపరచకుండా నివసించేలా బాధ్యతగలవాడు క్రైస్తవుడు! అయితే ఏమి జరుగుతోంది?
రేపు దేవుని ఇంటిలో నిత్య స్వాస్థ్యం అనుభవించాలని ఎదురు చూచే క్రైస్తవుడు, దేవత్వం పట్ల ఎట్టి బాధ్యతగల వాడైయుంటాడో గుర్తుచేసుకొని ఈ చర్చ ముగించుకుందాం. లేఖనాలు తెలిపినట్లు, దేవుడు ఒక్కడే ఆయన తండ్రి (1 కొరింధీ. 8:6; ఎఫెసీ 4:6). ఆయన ఆరాధనను కోరుతున్నాడు గనుక యదార్ధమైన ఆరాధకులుగా ఆయనను ఆరాధించాలి (యోహాను 4: 23-24). క్రైస్తవులకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు (1 కోరింధీ. 8:6; ఎఫసీ 4:5). ఆయనను హృదయంలో ప్రతిష్టించుకొని; అన్ని విషయములలో ఆయన చెప్పిన ప్రతి మాట వినాలి. ఆయన మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశన మౌతాడు (1 పేతురు 3:16; అపొ. 3:22-23). చివరగా, పరిశుద్దాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా నివసించునట్లు, మన దేహాలను ఆయనకు ఆలయంగా నిలుపుకోవాలి (ఎఫెసీ 4:30; 1కొరింధీ 6:19). నిత్యజీవమును ఆశించేవాడవుగా, అద్వితీయ సత్యదేవుని, ఆయన పంపిన యేసుక్రీస్తును నీవు యెరిగావా? దేవుని యెరుగకపోవడమే, నరకపాత్రమైన దోషమౌతుంది సుమీ (2థెస. 1: 6-8). ఆయనను యెరుగుదుమని చెప్పుకొంటేనే చాలదు (తీతు 1:16). గనుక జాగ్రత్త!!   

జి. దేవదానం