Monday 5 September 2016

పరిశుద్ధాత్మ

The Holy Spirit
నిత్యత్వంలో పరిశుద్ధాత్మ: పరిశుద్ధాత్మ నిత్యుడని బైబిల్ అంటుంది. "నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును" (హెబ్రీ. 9:14). ఆత్మరూపిగా, పరిశుద్ధాత్మ అదృశ్యుడని వేరుగా చెప్పనవసరం లేదు. "అదృశ్యమైనవి నిత్యములు" అనేది బైబిల్ సందేశం (2కొరింధీ. 4:18). నిత్యుడు గనుక జగదుత్పత్తికి ముందటి వాడని చెప్పవచ్చు.
సృష్టి ఆరంభములో పరిశుద్ధాత్మ: సృష్టి ఆరంభములో పరిశుద్ధాత్మ ఉన్నాడనేది నిరాక్షేపము. "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను" (ఆది. 1:1-2). "అల్లాడుచుండెను" అంటే, ఆది భాషలో Brooding Over అని అర్థమిస్తుందట. (పక్షి తన గుడ్లపై పొదిగినట్లనే భావమట).
సృష్టి నిర్మాణంలో పరిశుద్ధాత్మ: శ్రీమంతుడగు అద్వితీయ సత్యదేవుడు సృష్టి నిర్మాణానికి సంబంధించిన Blueprint వేస్తే, ఆయన ఆలోచనలకు రూపకల్పన చేసినవాడు దేవుని, వాక్యమనబడే వ్యక్తియే the Creations Amazing Architect అని బైబిల్ సూచిస్తుంది (యోహాను 1:1-3; కొలస్సీ. 1:15-17). సృష్టి నిర్మాణ కార్యక్రమంలో పరిశుద్ధాత్మ యెుక్క పాత్ర కూడా ఉందా? ఉందని బైబిల్ అంటుంది.
"తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? ఆయనకు మంత్రియై ఆయనకు బోధపరచినవాడెవడు? ఎవనియొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసినవాడెవడు? న్యాయమార్గమును గూర్చి ఆయనకు నేర్పినవాడెవడు? ఆయనకు జ్ఞానమును ఆభ్యసింపజేసినవాడెవడు? ఆయనకు బుద్ధిమార్గము బోధించినవాడెవడు?" (యెషయా 40:12-14). ఈ ప్రశ్నలన్నీ భౌతిక సృష్టికి సంబంధించినవి మాత్రమే. దేవుని నూతన సృష్టికి సంబంధించిన పరిస్థితులు వేరే! ఇది జాగ్రత్తగా గమనించాలి!!
"యెహోవా ఆత్మ" అని వినగానే ఈయన పరిశుద్ధాత్మ కాడనే అనుమానం నీకు కలుగుతుందేమో! సందేహం అక్కరలేదు. యెషయా రచనలో, పరిశుద్ధాత్మ "యెహోవా ఆత్మ" అని వ్యవహరింపబడినట్టు గ్రహించాలి (యెషయా 11:2; 40:13; 61:1 వగైరాలను చూడు). మెస్సీయా మీదికి దిగివచ్చేది "ప్రభువగు యెహోవా ఆత్మ" అని యెషయా ప్రవచించాడు (యెషయా 61:1; 11:2). ప్రభువైన యేసు బాప్తిస్మము పొందినప్పుడు ఆయన మీదికి దిగివచ్చింది, "దేవుని ఆత్మ" అని మత్తయి అంటే (3:16); "పరిశుద్ధాత్మ" అని మార్కు అన్నాడు (1:10).
పరిశుద్ధాత్మ యెుక్క వివిధములైన పేర్లు: లేఖనాల్లో పరిశుద్ధాత్మ ఆయా పేర్లతో గుర్తింపబడ్డాడని గ్రహించాలి. యూదులకియ్యబడిన సాధారణ సందేశంలో ఆయన "దేవుని ఆత్మ" అనియు (ఆది 1:2); యెషయా 11:2; 40:13; 61:1 ల్లో "యెహోవా ఆత్మ" అనియు; (యోవేలు 2:28,29) లో "నా ఆత్మ" అనియు; క్రొత్త నిబంధనలో ఆయన పరిశుద్ధాత్మ అనియు (అపొ. 2:17); "నిత్యుడగు ఆత్మ" అనియు (హెబ్రీ. 9:14); "సత్య స్వరూపియైన ఆత్మ" అనియు (యోహాను 16:13) వగైరా పేర్లతో పరిశుద్ధాత్మ పిలువబడ్డాడు. 
పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ: పాత నిబంధనలో పరిశుద్ధాత్మ యెుక్క ప్రధాన కార్యక్రమం, దేవుని వర్తమానాన్ని తెలియపరచడమైయుంది. ఏ యుగానికి సంబంధించిన దైవ సందేశాన్ని ఆ యుగానికి అందించడం పరిశుద్ధాత్మ యెుక్క ప్రాథమిక పనియైయుంది. మన ముందున్న బైబిల్ పరిశుద్ధాత్మ యెుక్క సృష్టియే. "ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి" (2పేతురు 1:20-21).
"ప్రవచనం" అనగానే, భవిష్యత్తును గూర్చి చెప్పడం అనే సహజమైన ఆలోచన ఎక్కువమందిలో ఉంది. భవిష్యత్తును గూర్చి చెప్పేది ప్రవచనమనే మాట వాస్తవమే. అయితే ఆ భావన ప్రవచనానికి నిజమైన నిర్వచనం కాదు. "పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి, దేవుని మూలముగా పలకడం" అనేది ప్రవచనానికి నిర్వచనమైయుంది. అందువలన భవిష్యత్తును చెప్పేదే ప్రవచనం కానవసరంలేదు.
ఉదాహరణకు, ప్రకటన ప్రవచన గ్రంథమని మనకు తెలుసు (ప్రకటన 1:3; 22:19). ఈ ప్రవచన గ్రంథంలో, భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల సమాచారం దాఖలు చేయబడింది వాస్తవం. "కాగా నీవు చూచిన వాటిని (భూతకాలం), ఉన్న వాటిని‌ (వర్తమానంకాలం), వీటివెంట కలుగబోవు వాటిని (భవిష్యత్ కాలము), అనగా నాకుడి చేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ యేడు సవర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము"అని యోహాను ఆదేశింపబడ్డాడు (ప్రకటన 1:19-20).
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికేది ప్రవచనమైనప్పుడు, మనుష్యుడు తన యిచ్ఛను బట్టి పలికేది పరిశుద్ధాత్మ వలన పలుకబడేది కాదు. మనుష్య యిచ్ఛను బట్టి పలికేది దైవసందేశం కానేరదు. గనుక, మనుషేచ్ఛను బట్టికాక, పరిశుద్ధాత్మ వలన పలుకబడిన సంగతులతో గ్రంథం నింపబడింది. మనుషేచ్ఛతో పలుకబడిన సంగతులు గ్రంథంలో ఎన్నోచోట్ల దాఖలు చేయబడినా, దైవ ప్రేరేపితములైన పరిశుద్ధాత్మ పలకులే ప్రవచనమనబడుతోంది. 
ఆదికాండములోని సృష్టిని గూర్చిన వర్ణన గాని, ఆదాము హవ్వలను గూర్చిగాని, జలప్రళయం వగైరాలను గూర్చి గాని మోషే తన యిచ్ఛను బట్టి పలుకలేదు. అంటే, ఆదికాండం మోషే తన సొంత ఊహలతోనో, తాను ఐగుప్తులో అభ్యసించిన సకల విద్యల జ్ఞానంతోనో పలికిన మాటలు కావు, కానేరవు. గనుక అది కేవలం గత చరిత్రయే అయినా, దేవుని మూలముగా పలుకబడిందే. అది మరొక రూపంగా వచ్చింది కాదు. ఆదికాండంలోని సృష్టి నిర్మాణ గాథ, నరుడు ఊహించ సాహసించలేని గతం. అందువలన దాన్ని వ్రాయించినవాడు పరిశుద్ధాత్మ అయ్యుండాలి. గనుక బైబిలు ప్రవచనముతో ఆరంభమై, ప్రవచనంతో ముగించే అద్భుత గ్రంథమైయుంది.
"దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది" (2తిమోతి 3:16-17). దైవావేశము వలన కలిగినది, ఆయా యుగములలోను తరములలోను జీవించిన మానవాళికి యిచ్చే సందేశమైయుంది. ఇది పరిశుద్ధాత్మ పనియే. లేఖనాలు పరిశుద్ధాత్మ నరజాతికి యిచ్చిన బహుమానమే.
లేఖనాలను వ్రాయించడమే కాదు; ఆయా తరములవారికి దైవసందేశం అవసరాన్ని బట్టి అందించడం పరిశుద్ధాత్మ యెుక్క రెండవ పని (హెబ్రీ 1:1; 2సమూ.23:2). "యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నానోట ఉన్నది" అని దావీదు అన్నాడు. ప్రవక్తలు తమ కాలమునాటి జనులతో మాట్లాడినప్పుడు గతాన్ని జ్ఞాపకం చేసి, ప్రస్తుతపు పరిస్థితులను వివరించి, భవిష్యత్ కార్యచరణను గూర్చి ప్రకటించిన సంఘటనలున్నాయి (2దిన. 16:7-9). ఇది ప్రవక్తల విధానం. వారి వెనుక పరిశుద్ధాత్మ ఉన్నాడనేది నిరాక్షేపము.
పరిశుద్ధాత్మ యెుక్క మూడవ పని: లేఖనాల సూచన మేరకు, ఎదురు చూడని పరిస్థితులెదురై, దేవుని ప్రజలు ఆపదలో చిక్కుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదికి బలముగా వచ్చి, ఆ పరిస్థితిని ఎదుర్కొని తప్పించుకొనడానికి సహాయపడేవాడు! ఉదా|| "అప్పుడు సమ్సోను తన తల్లిదండ్రులతోకూడ తిమ్నాతునకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను" (న్యాయా.14:5-6). ఈలాటి కార్యాలు ఆయా రూపాలలో పరిశుద్ధాత్మ జరిగించేవాడు (న్యాయా.14:5-6). 
పరిశుద్ధాత్మ యెుక్క మరో కార్యము: అభిషిక్తులగు ఇశ్రాయేలు రాజులతో పరిశుద్ధాత్మ ఉండేవాడు. వారు దైవ నియమము నుండి తొలిగిపోయినందున, దేవునిచే విసర్జింపబడినప్పుడు, యెహోవా ఆత్మ వారిని విడిచిపోతుండేవాడు. ఇది ఇశ్రాయేలు తొలి రాజైన సౌలుకు సంభవించినట్టు లేఖనం అంటుంది. "యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా" (1సమూ.16:14) అని వ్రాయబడింది. ఆ విషయం దావీదుకు బాగా తెలుసు. గనుక ఇశ్రాయేలు రాజుగా దావీదు పాపము చేసి, ఒప్పింపబడిన మీదట, సౌలువలె పరిశుద్దాత్మ తన యొద్ద నుండి కూడా తొలిగింపబడతాడనే ఆందోళన చెందినవాడై, "నీ సన్నిధిలోనుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నాయొద్దనుండి తీసివేయకుము" అని అతడు దేవుని బతిమాలుకున్నాడు (కీర్తన 51:11).
ప్రభువైన యేసు మీదికి వచ్చిన పరిశుద్ధాత్మ: ధర్మశాస్ర్త చివరి దినాల్లో, ఇశ్రాయేలీయులకు కాబోయే రాజుగా అవతరించిన, నజరేయుడైన యేసుకు దేవుడు కొలతలేని ఆత్మననుగ్రహించాడు: "ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును" అని వ్రాయబడియుంది (యోహాను 3:34). రమారమి ముప్పది ఏండ్ల ప్రాయంలో యేసు బాప్తిస్మం పొందినప్పుడు, ఈ ప్రక్రియ ఆరంభమైనట్టుంది (మత్త. 3:16; మార్కు 1:10). "యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దానునదినుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాదిచేత శోధింపబడెను" (లూకా 4:1).
ధర్మశాస్రపు అంత్యదినాల్లో పరిశుద్ధాత్మ: క్రొత్తనిబంధనలో పని జరిగించబోయే పరిశుద్ధాత్మను గూర్చి పరమదేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు (యోవేలు 2:29-32). ఆ కాలం సమీపిస్తున్న కొలది, ప్రవక్తలు ఆ విషయాన్ని గూర్చి ప్రస్తావించనారంభించారు. పాతనిబంధన చివరి ప్రవక్తలలో బాప్తిస్మమిచ్చు యోహాను ఒకడు (మత్తయి 11:10-11). ఈ యోహాను పరిశుద్ధాత్మను గూర్చి ప్రస్తావించి ఇలా అన్నాడు: "నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటె శక్తిమంతుడు; ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును" (మత్తయి 3:11).
తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ఎవరిమీదికి పంపాలో, అది క్రీస్తు స్వాధీనం చేయబడింది. ఆయన తండ్రి వాగ్దానాన్ని తన అపొస్తలులపైకి పంప తలపెట్టినట్టున్నాడు. గనుక తన భౌతిక జీవితకాలంలో చివరి దినాన ప్రభువు పరిశుద్ధాత్మను గూర్చి తన అపొస్తలులతో విస్తరించి మాట్లాడాడు: "నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును" (యోహాను 14:25-26).
"తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును" (యోహాను 15:26). అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియ జేయును" (యోహాను 16:13).
గనుక పరిశుద్ధాత్మను పంపే అదికారం పొందిన క్రీస్తు, తన అపొస్తలులకు ఈ మాట యిచ్చాడు. "ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపు చున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను" (లూకా 24:49) "ఆయన మృతులలో నుండి లేచిన తరువాత, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది - పరిశుద్ధాత్మను పొందుడి...." (యోహాను 20:21-22).
పరిశుద్ధాత్మ బాప్తిస్మము: "ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి; యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను" (అపొ. 1:4-5). ఎట్టకేలకు అపొస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందడానికి రంగం సిద్ధపరచబడింది. 
పరిశుద్ధాత్మ బాప్తిస్మం ప్రభువైన యేసు యెుక్క ఆరోహణపు కార్యక్రమంలో పాల్గొని, అపొస్తలులతోపాటుగా యెరుషలేమునకు తిరిగివచ్చిన 120 మంది పొందినట్లు కొందరు అభిప్రాయంపడ్డారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాగ్దానం చేయబడింది క్రీస్తు యెుక్క అపొస్తలులకు మాత్రమే! ఇంతకు ఏమి జరిగింది? ఏమి జరిగిందటే, క్రీస్తువారి అపొస్తులులలో ఒకడు తన అపొస్తలత్వాన్ని కోల్పోయాడు. అతని స్థానాన్ని పూరించడానికి, 120 మంది సహకరించినట్టున్నారు. ఆ దినముననే ఆ కార్యక్రమం ముగిసిపోయింది (అపొ. 1:15-26).
ప్రభువు యెుక్క ఆదేశాన్ని పాటించిన అపొస్తలులల తప్ప, మిగిలిన ఎక్కడివారు అక్కడికి వెళ్లినట్టున్నారు. ఆ రోజు నుండి పరిశుద్ధాత్మ వారి మీదికి దిగి వచ్చే దినమువరకు మధ్య 7 నుండి 10 రోజుల వ్యవధి ఉంది. ఎందుకంటే, పస్కా పండుగకును పెంతెకోస్తుకును మధ్య 50 దినాల వ్యవధి ఉంది. తన పునరుత్థానం తరువాత ప్రభువు వారికి 40 దినాలు కనబడుతూనే ఉన్నారు (అపొ. 1:3). పెంతెకొస్తు దినం వరకు అక్కడ నిలిచియుండి ప్రభువు ఆదేశం మేరకు ఆత్మ కొరకు కనిపెట్టుచుండిన వారు కేవలం అపోస్తలు లేయని తరువాత సంభవం తేల్చిచెప్పింది. 
"పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యెుక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి" (అపొ. 2:1-5).
పెంతెకొస్తు దినాన మాటలాడిన భాషలు అర్థరహితమైన పలుకులు కావు. అవి అన్యభాషలే. అంటే, తమవి కాని భాషలు, లేక వారు నేర్చుకొనని భాషలు. అయితే అవి శ్రోతలకు అర్థం కాని భాషలు మాత్రంకావు. ఎలాగంటే, "అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?" (అపొ. 2:7-8). వాస్తవానికి, అపొస్తలుల సంఖ్య కంటె, అక్కడ కూడి వచ్చిన వారి ప్రాంతాల సంఖ్య ఎక్కువే. అందువలన అపొస్తలులు ఏ భాషలలో మాట్లాడారో తెలియదుగాని, వారు మాటలాడిన సందేశం అందరికి అర్థమయ్యింది. అందులో ఏ సందేహము లేదు. 
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన సంగతి ఏమంటే, పెంతెకొస్తు నాటి భాషలు, జనులకు అర్థమయ్యే భాషలే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన అపొస్తలులు, తాము నేర్చుకొనని భాషలు మాట్లాడారు‌. దీనికి భిన్నమైనది పెంతెకొస్తు అనుభవం కాదు. పెంతెకొస్తు భాషలు కృపావరముల వలన వచ్చిన భాషలు కావు. పెంతెకొస్తు దినపు అనుభవానికిని, కృపావరములు లేక పరిశుద్ధాత్మ వరములకు వ్యత్యాసమున్నది. గనుక దీనిని కృపావరములతో ముడివేయకూడదు; జాగ్రత్త.
"వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని" ఆనాటి శ్రోతలే చెప్పుకున్నారు (అపొ. 2:11). అందరు విభ్రాంతి నొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే - వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి. ప్రతి మంచి కార్యాన్ని అపహసించే అపహాసకులు ఎల్లప్పుడు ఉండనే ఉంటారు. అపహాసకుల మాటలను పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే అపహాస్యం సత్యాన్ని మరుగు చేయనేరదు (2పేతురు 3:3-4). 
"అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను - యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే" (అపొ. 2:14-16). అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ప్రభువైన యేసు వలన అపొస్తలులు వినిన తండ్రి యెుక్క వాగ్దానమది. అంటే, ప్రభువు సెలవిచ్చినట్టు యెరుషలేములో అపొస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందారు.
పరిశుద్ధాత్మ పంపిణీ కార్యక్రమం: ఈ కార్యక్రమంలో యిటు పరిశుద్ధాత్మయు‌, అటు అపొస్తలులును జట్టుగా పనిచేస్తున్నారని గమనించాలి. "మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి (అంటే, కృపావరములను గూర్చి) మీకు తెలియకుండుట నా కిష్టము లేదు..... కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే. మరియు పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు చున్నది" (1కొరింథీ. 12:4-8).
కృపావరములను యిలా పంచి యివ్వడంలో, పరిశుద్ధాత్మ క్రీస్తుయెుక్క అపొస్తలుల సహకారము తీసికొంటున్నట్టు గమనించాలి. "మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను" అని పౌలు రోమీయులతో అన్నాడు (రోమా 1:11-12). అంటే, పరిశుద్ధాత్మ తన కృపావరములు ప్రసాదించాలన్నా, అలా పొందేవారి మీద అపొస్తలులు చేతులుంచి ప్రార్థించాలి.
ఉదా||‌ "సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి. అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి" (అపొ. 8:14-16). కృపావరములు పంచియిచ్చే పరిశుద్ధాత్మ ఎవరిమీదనైనా దిగాలంటే, పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు అపొస్తలులు ప్రార్థనచేయాలనే విషయం యిక్కడ స్పష్టం చేయబడింది. మెుదటి శతాబ్దపు సంఘ ఆరంభదినాల్లో, అపొస్తలులును పరిశుద్ధాత్మయు యిట్టి పరస్పర అనుబంధముతో పనిచేశారని గమనించాలి.
"అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు (సమరయ విశ్వాసులు) పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి వారియెదుట ద్రవ్యము పెట్టి - నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను. అందుకు పేతురు - నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక. నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారు మనస్సునొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను" (అపొ. 8:17-23).
తాము ఎవరి మీద చేతులుంచి ప్రార్థిస్తారో, వారిమీదికి పరిశుద్ధాత్మ దిగివచ్చే ఏర్పాటు, దేవుడు క్రీస్తుయెుక్క అపొస్తలులకు మాత్రమే ప్రసాదించిన వరమైయుంది. ఇది ద్రవ్యముతో కొనగలిగేది కాదు. వేరొకరికి మరోవిధంగా లభ్యమయ్యేది కూడా కాదు. ఇది యెుక రహస్యకార్యము కాదు. కాని అపొస్తలులు చేతులుంచి ప్రార్థించితే, కనబడే రూపంలో జనులమీదికి పరిశుద్ధాత్మ దిగివస్తాడు. అది నీతిమంతులకు మాత్రమే కనబడే విధానంలో కాదు సుమీ! దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్న గారడీవానికి సహా కనబడిన విధానంలో కార్యం జరిగింది గదా! "హృదయ శుద్ధిగలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు"అని వ్రాయబడింది (మత్తయి 5:8). కాని అపొస్తలులు చేతులుంచి ప్రార్థించినప్పుడు, హృదయ శుద్ధిలేని వానికి కూడా పరిశుద్ధాత్మ దిగివచ్చినట్టు కన్పించిందని గమనించాలి. అలా దిగివచ్చి పరిశుద్ధాత్మ ఆయా కృపావరములను వారికి పంచియిచ్చాడు.
పరిశుద్ధాత్మ తన కార్యాలు చేయాలన్నా, అపొస్తలుల సహకారం ఉండాలి. నేడు క్రీస్తుయెుక్క అపొస్తలులు సజీవంగా లేరు గనుక, ఆది సంఘపు విశ్వసులవలె కృపావరములు పొందే అవకాశము నేటి విశ్వసులకు ఉండదు. అట్టి దేవుని వరమును ద్రవ్యంతో సంపాదించు కొనజూచిన గారడీవాడు, శపింపబడ్డాడేగాని, ఆ వరమును సంపాదించుకోలేదు. గనుక ఎవడైనా తనకు కృపావరము లున్నాయని నేడు చెప్పబూనుకొంటే, అతడు సత్యానికి విరోధంగా అబద్ధమాడుతున్నాడని ఎరగాలి. అపొస్తలులు బ్రతికి ఉన్న దినాల్లో సయితం, దూరంనుండి ఉత్తరం ద్వారా కృపావరములు పంపలేని స్థితి ఉన్నట్టు వారే స్వయంగా అంగీకరించారు (రోమా 1:11-12). 
ఏదియెలాగున్నా, కృపావరములు లేక పరిశుద్ధాత్మ వరముల వెనుక దాగియున్న నగ్నసత్యమేమంటే, అవి తాత్కాలికమైనవియు, అసంపూర్ణములైనవియునైయున్నవి. కొరింథీలోని పరిశుద్ధులు ఏ కృపావరమునందును లోపములేక యున్నారని అపొస్తులుడైన పౌలు తెలిపాడు (1కొరింథీ 1:7). అయినా, కొరింథీ సంఘంలో ఉన్నన్ని సమస్యలు మరి ఏ యితర స్థానిక సంఘంలో లేనట్టు గ్రంథం వలన గ్రహింపవచ్చు. కృపావరములు లోపంలేనివారి మధ్య సమస్యలు అన్ని ఎందుకు ఉన్నాయనే ప్రశ్న సహజమైనదే! దానికి సరియైన జవాబు లేదు.
ఆ సంగతి అలా ఉంచి, ప్రేమలేని కృపావరములు వ్యర్థమైనవని పౌలు సూచించాడు (1కొరింథీ. 13:1-2). అనుగ్రహింపబడిన కృపావరములనుబట్టి, మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను మాటలాడినా ప్రయోజనంలేదని, ప్రవచించే కృపావరమున్నా, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసమనే కృపావరమున్నా, ప్రేమలేనిదే ప్రయోజనంలేదని అపొస్తలుడు వారికి వివరించాడు. కృపావరములు తమలోతాము సంపూర్ణమైనవికావు.
తాను చేతులుంచి ప్రార్థించుడం వలన కొరింథీ పరిశుద్ధులు పొందిన కృపావరములు తాత్కాలికమైనవనియు, అసంపూర్ణమైనవనియు తెలుపుతూ పౌలు చెప్పిందేమంటే, ప్రేమ శాశ్వతకాలముంటుంది; కృపావరములు శాశ్వతమైనవికావు అంటూ, "ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచిపోవును; జ్ఞానమైనను నిరర్థకమగును" (1కొరింథీ 13:8). 
కృపావరముల వలన, "మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును. కృపావరముల కాలంలో, నేను పిల్లవాడనై యున్నప్పుడు పిల్లవానివలె మాటలాడితిని, పిల్లవానివలె తలంచితిని, పిల్లవానివలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని". కృపావరముల కాలంలో, అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము,  కొంతమట్టుకే యెరిగియున్నాను; కృపావరములు పూర్ణమైనదానికొరకు కనిపెట్టుతూ, ఎదురు చూస్తున్నట్టున్నాయి. పూర్ణమైనది క్రొత్త నిబంధన లేఖనాలు (యాకోబు 1:21-25). క్రొత్తనిబంధన "స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమము" అని పిలువబడుతుంది (యాకోబు 1:25).
కృపావరములు అపొస్తలుల బోధను స్థిరపరచనుద్ధేశింపబడినవే! "కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టు కొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున, ప్రతి అతి క్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను, మహత్కార్య ములచేతను,నానావిధములైన అద్భుతములచేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను (కృపావరములను) అనుగ్రహించుటచేతను, వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢ పరచబడెను" (హెబ్రీ. 2:1-4). వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా, అంటే ఎవరితో కూడ? అపొస్తలులతో కూడ. తక్కిన వాటితోపాటు కృపావరములు కూడ సాక్ష్యమిస్తున్నాయి.
క్రొత్తనిబంధన లేఖనాలు లేని దినాల్లో, ఆరంభ స్థానిక సంఘాలను దైవఆరాధనలో నడిపించడానికి ప్రధానంగా కృపావరములు ఉద్ధేశింపబడ్డాయి (1కొరింథీ‌. 14). వాటిని పొందిన వారు, కృపావరములను గూర్చిన సరియైన అవగాహన లేని వారై, వాటి వినియోగంలో తొట్రుపడ్డట్టు 1కొరింథీ.14పేర్కొంటుంది. నేడు కృపావరములులేవు; వాటి అవసరత అసలే లేదు. పూర్ణమైన క్రొత్తనిబంధన అందుబాటులో ఉంది; పూర్ణముకాని కృపావరములు, నిరర్థకమయ్యాయి; నిలిచిపోయాయి కూడా (1కొరింథీ. 13:8-10).
కొర్నేలియింట జరిగిన సంభవం: అవిశ్వాసులను ఒప్పించుటకు దిగివచ్చిన పరిశుద్ధాత్మ: "అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే" దేవుని అనాది మర్మం (ఎఫెసీ. 3:6). తమ వాగ్థానము ననుసరించి, ఇశ్రాయేలీయులతో క్రొత్తనిబంధన చేసినప్పుడు, అపొస్తులుడైన పేతురునోట దేవుడు యిలా పలికించాడు: "ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందును" (అపొ. 2:39). అయితే, "సువార్తవలన క్రీస్తుయేసు నందు అన్యజనులు యూదులతో పాలివారనే సత్యాన్ని యూదులు నమ్మలేదు. గనుకనే, స్తెఫను విషయములో కలిగిన శ్రమనుబట్టి చెదిరి పోయినవారు, యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫెనీకే, కుప్ర, అంతియెుకయ ప్రదేశముల వరకు సంచరించిరి" అని వ్రాయబడియుంది (అపొ.11:19).
"ఆరంభమునందు అన్యజనులు" తన నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున యూదాజనాంగంలో దేవుడు పేతురును ఏర్పరచుకున్నాడట (అపొ.15:7). అయినా పేతురు సహితం అన్యజనుల విషయం పట్టించుకొనకపోవడాన్ని బట్టి, పేతురును తన యింటికి పిలిపించుకోవలసిన గతి కొర్నేలీకి పట్టింది (అపొ.10:4-8). పేతురు కొర్నేలీయింటికి వచ్చిన తరువాత కూడా, "అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదంటూ పేతురు కొర్నేలీకి తెలిపాడు. ఈ ప్రయాణం కొరకు కొర్నేలీయింట నుండి పేతురుకు ఆహ్వానం అందితే, వెళ్లమని పరిశుద్ధాత్మ ఆదేశించవలసి వచ్చింది" (అపొ. 10:19-20). ఇంత జరిగినా అన్యజనులపట్ల పేతురు దృక్పధంలో మార్పు కన్పించక పోవడం వింతగానే ఉంది. పేతురుతోపాటు యింకా ఆరుగురు యూదులు కొర్నేలీయింటికి చేరుకున్నారు.
ఎట్టకేలకు కొర్నేలీయింట పేతురు తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. "పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మవరము అన్యజనుల మీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి" (అపొ. 10:44-46). అన్యజనులు కూడా యూదులతో సమానంగా క్రీస్తుయేసు నందు అంగీకరింపబడ్డారనే సత్యాన్ని, కొర్నేలీయింట దిగివచ్చిన పరిశుద్ధాత్మ ద్వారానే యూదులు ఒప్పింపబడ్డారు. ఇందు నిమిత్తమే ఆ సంఘటన జరిగినట్టుంది. 
కొర్నేలీయింట జరిగింది మరొక పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు. క్రీస్తుయేసు నందు సువార్త వలన యూదుల వలె అన్యజనులు కూడా అంగీకరింపబడినట్టు ఒప్పింపబడిన "పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి, యేసు నామమందు వారు బాప్తిస్మముపొందవలెనని ఆజ్ఞాపించెను" (అపొ. 10:47-48).
ఈ విషయం ఇంతటితోనే ముగియలేదు. గనుక "పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు -నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి" (అపొ. 11:2-3). తాను కొర్నేలీయింటికి పోవలసిన హేతువును గూర్చియు, తాను వెళ్లిన తరువాత జరిగిన సంగతులను గూర్చియు వివరించుతూ, "నేను మాటలాడ నారంభించినప్పుడు, పరిశుద్ధాత్మ మెుదట మన మీదికిదిగిన ప్రకారము వారి మీదికిని దిగెను" (అపొ.11:15) అని తెలిపాడు.
"అప్పుడు -యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమాన వరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను" (అపొ.11:16-17). కొర్నేలీ యింటివారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినట్లు పేతురు చెప్పలేదు. ఇంతకు పేతురు వారికి చెప్పనుద్ధేశించిన సందేశమేమంటే, పరిశుద్ధాత్మ మన మీదికి దిగి, దేవుడు వారిని మన వలనే అంగీకరించినట్టు రుజువు చేశాడు. గనుక నేను వ్యక్తిగతంగా ఒప్పింపబడిన వాడనై, వారితో కూడా భోజనం చేశాను అని పేతురు వివరించాడు.
"వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక - అట్లయితే అన్య జనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి" (అపొ. 11:18). కొర్నేలీ యింటిలోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చేవరకు, సువార్తవలన అన్యజనులకు క్రీస్తుయేసులో పాలు ఉన్నదన్న సత్యాన్ని యూదులు నమ్మకున్నారు. అపొస్తలుడైన పేతురు సయితం అదే కోవకు చెందినవాడైయున్నాడు. సువార్తలో అన్యజనుల ప్రవేశాన్ని గూర్చి యూదులను ఒప్పించడానికి దేవుడు కొర్నేలీయింట పరిశుద్ధాత్మ దిగివచ్చేలా చేశాడు. దానితో సమస్త వివాదం సద్దణగింది. అయితే కొర్నేలీయింట జరిగింది, పరిశుద్ధాత్మ బాప్తిస్మము కాదు కానేరదు.
పెంతెకొస్తు దినాన జరిగిన సంఘటనకును దీనికిని మధ్య వ్యత్యాసమున్నది; గమనించు:
1. పెంతెకొస్తు పండుగ దినాన, వేగముగా వీచు బలమైన గాలివంటి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వచ్చింది. అలాంటి కార్యం కొర్నేలీ యింట జరుగలేదు.
2. అలా వచ్చిన పరిశుద్ధాత్మ వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను; కొర్నేలీయింట అలా జరుగలేదు; పేతురు బోధవిన్నవారిమీదికి మాత్రమే పరిశుద్ధాత్మ దిగెను. ఆ యింట ఉన్నవారిలో, పేతురును అతనితో కూడ వచ్చిన యూదులను అందు మినహాయింప బడ్డారు.
3. అగ్ని జ్వాలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కనిమీద వ్రాలగా, కొర్నేలీయింట అలాగేమి జరుగలేదు.
4. అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై, యిలా కూడా కొర్నేలీయింట జరిగినట్టు చెప్పబడలేదు.పెంతెకొస్తు దినానికి, కొర్నేలీయింట పరిశుద్ధాత్మ దిగి వచ్చిన దానికి ఒకేఒక పోలిక ఏమంటే‌,‌ దినాన అన్యభాషలు మాట్లాడారు, వీరు కూడ భాషలతో మాట్లాడారు. ఇదే ఆ రెండు సంభవాలకు మధ్య పోలిక!
పేతురు ప్రసంగము వింటున్న వారిమీదికి పరిశుద్ధాత్మ కొర్నేలీయింట దిగిరావడం వెనుక ఉన్న ఏకైక ఉద్ధేశం, అన్యజనులు, సువార్త వలన క్రీస్తుయేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములును వాగ్దానములలో పాలివారై యున్నారనే సత్యాన్ని ఒప్పించడానికి జరిగిన సంభవమే. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వారు, నీటి బాప్తిస్మం పొందినట్టు దాఖలు లేదు, కాని కొర్నేలీయింట పరిశుద్ధాత్మ పొందినవారు నీటి బాప్తిస్మానికి ఆజ్ఞాపించబడ్డారు. (అపొ. 10:48-49). దీనితో ఈ చర్చను విడిచి, వేరే విషయానికి వెళ్లుదము. అన్యజనులు క్రీస్తుయేసు నందలి దేవుని కృపా సంకల్పంలోనికి అంగీకరింప బడ్డారనే సత్యాన్ని, అన్యజనుల మీదికి దిగిన పరిశుద్ధాత్మ సంఘటన వలన మాత్రమే యూదులు ఒప్పింపబడ్డారు.     
పరిశుద్ధాత్మ అనే వరము: అపొస్తలుల బోధకు లోబడిన వారికి పరిశుద్ధాత్మ అను వరము వాగ్దానం చేయబడింది. "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మీరు మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి" (అపొ. 2:38-41).
అపొస్తలుల బోధకు లోబడిన వారికి పరిశుద్ధాత్మ అను వరము వాగ్దానం చేయబడిందని గమనించాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. "దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయనవలన నిశ్చయములై యున్నవి. మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించి యున్నాడు" (2కొరింథీ 1:20-22). అంటే, అపొస్తలుల బోధకు ఒకడు లోబడింది నిజమైతే, పరిశుద్ధాత్మ అను వరము పొందినదికూడా నిజమే. క్రమమైన ఉపదేశమునకు హృదయపూర్వకంగా లోబడినవారు, పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు అనేది నిస్సందేహం. మెుదటిది నిజం కాకపోతే,‌రెండవది కూడా నిజంకాదు. దీనికి, కృపావరములకు ఎట్టి సంబంధమునులేదు.
క్రొత్తనిబంధన షరతులకు మనం లోబడినప్పుడు, వాగ్దానం చేసిన ప్రకారం, ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించునది ఖాయం. "మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి". ఇది భౌతికమైన ముద్రకాదు. గనుక భూ సంబంధులు దాన్ని చూడనేరరు; అయితే అది తేజోవాసులు చూడగల ముద్రయైయుంటుంది. ముద్ర సొంతగాని తనాన్ని (ownership), గమ్యస్థానాన్ని (destiny) సూచిస్తుంది. ముద్రవేయబడిన వాడు, తనపై తనకున్న అధికారాన్ని కోల్పోతాడు. "మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు" అని గ్రంథం అంటుంది (1కొరింథీ. 6:19-20). ఆత్మచే ముద్రింపబడినవారు, దేవుని మహిమకు కీర్తికలుగుటకై, ఆయన సంపాదించుకొన్న ప్రజలౌతారు (ఎఫెసీ. 1:1-4).
అపొస్తలుల బోధకు లోబడిన వారిని, దేవుడు తన పిల్లలనుగా స్వీకరిస్తాడు (ఎఫెసీ. 1:4-6). అంటే, చట్టబద్ధంగా దత్తస్వీకారము చేసి (గలతీ 4:5-6), నాయన, తండ్రీ, అని మెుఱ్ఱ పెట్టే హక్కును ఆయన వారికి ప్రసాదిస్తాడు.
"ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము - అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టుచున్నాము" (రోమా 8:15). "మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము" (రోమా 8:16).
వారసులంటే, తండ్రి ఆస్తిలో భాగస్వాములు. ఈ భాగస్వాములకు స్వాస్థ్యముందని వేరుగా చెప్పనవసరం లేదు. వారి స్వాస్థ్యము అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైయుండి, కడవరి కాలమందు బయలు పరచబడుటకు సిద్ధముగానున్నది (1పేతురు 1:4-5). ఆ స్వాస్థ్యమునకు (గ్యారంటి) సంచకరువే ఈ పరిశుద్ధాత్మ అను వరము (ఎఫెసీ. 1:13-14). అపొస్తలుల బోధకు లోబడువారి భాగ్యమెంతో వర్ణింప తరముకాదు.
ఆ ఆత్మ ఈ స్వాస్థ్యమునకు సంచకరువు మాత్రమే కాదు; ఈ దేహం రాలిపోతే, మహిమ దేహం పొందుదురనే వాస్తవానికి కూడా, ఆ ఆత్మయే గ్యారంటీగా ఉంటాడు. "భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుముదీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించియున్నాడు" (2కొరింథీ. 5:1-5).
దేవుని అనాది సంకల్పంలో భాగంగా (ఎఫెసీ. 1:10), అపొస్తలుల బోధకు లోబడినవారికి, పరిశుద్ధాత్మ అను వరము అనుగ్రహించడం వలన ఏమి జరిగింది? ఏమి జరిగిందటే,ఒకప్పుడు పాపం ఏలుబడి చేసిన నరదేహంలో, పరలోక వాసియైన పరిశుద్ధాత్మ నివసింప వస్తాడు "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి" (1కొరింథీ 6:19-20). పరిశుద్ధాత్మ మానవ దేహములో నివసింపరావడం బహువింతైన సమాచారమై యుంది. "పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని దేవుని సంకల్ప నిర్ణయంలో యిది ఒక భాగమేయని గమనించాలి" (ఎఫెసీ.1:10).
పరిశుద్ధాత్మ క్రైస్తవ దేహములో ఎంతకాలముంటాడు? "దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు" (ఎఫెసీ. 4:30). నరదేహంలో పరిశుద్ధాత్మ తాత్కాలికమైన సందర్శకుడో, లేక అప్పుడప్పుడు సందర్శించేవాడో కాడు. విమోచన దినము వరకు ఆయన మనలో ముద్రగా నివసింప ఉద్ధేశింపబడ్డాడు. ఆయన నివాసానికి అనుకూలముగా మన దేహాన్ని, హృదయాన్ని ఎలా నిలుపుకోవాలో గదా!!
ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రంలో ఒక భాగాన్ని దర్శించ వస్తున్నాడంటే, ప్రభుత్వయంత్రాంగం ఎంత బందోబస్తు చేస్తుందో, ప్రాంతీయ జనులు వాతావరణాన్ని ఎంత శుభ్రంగా ఉంచ ప్రయత్నిస్తారో మనకు తెలియనిది కాదు. అలాటి పరిస్థితుల్లో, పరలోక వాసి, నరదేహంలోనికి రాకముందు, సువార్తకు లోబడడం వలన, క్రీస్తు రక్తం దాన్ని శుద్ధీకరించి పరిమళవాసనగా చేస్తుంది (ఎఫెసి. 5:1-2) అలా శుద్ధీకరింపబడినహృదయంలో, పరిశుద్ధాత్మ ముద్రగా నిలుస్తాడు. గనుక పరిశుద్ధులు ఆయనను దుఃఖపరచవద్దని ఆదేశింపబడ్డారు (ఎఫెసీ. 4:30). మన స్వాస్థ్యమునకు సంచకరువుగా నిలిచిన ఆయన ఎలా దుఃఖపరచబడతాడో?
          "మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు; ఇవి మీకు తగవు. వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును" (ఎఫెసీ. 5:3-5). మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్న పరిశుద్ధాత్మ,దేవుని రాజ్యమునకు హక్కును కోల్పోయినవారిలో కొనసాగడని చెప్పనవసరంలేదు, గనుక జాగ్రత్త!!
పరిశుద్ధాత్మను గూర్చి మనం పఠించనారంభించి, ఆయన నిత్యత్వం సంగతి, సృష్ఠి నిర్మాణంలో ఆయన పాత్ర, పాతనిబంధన కాలంలో ఆయన నిర్వహించిన పాత్ర, క్రీస్తు ప్రభువుతో పరిశుద్ధాత్మ పాత్ర, అపొస్తలుల మీదికి బాప్తిస్మం పరిమాణంలో పరిశుద్ధాత్మ పాత్ర అపొస్తలుల బోధకు లోబడిన వారికి వాగ్దానం చేయబడిన వరముగా పరిశుద్ధాత్మ, అనేక విషయాలను క్లుప్తంగా చూచాం.

యుగములలోను తరములలోను పరిశుద్ధాత్మ నిర్వహించిన పాత్రలలో, నేటికి ఆయన పనులన్నిటిలో మిగిలియున్నవి కేవలం రెండే! వాటిలో ఒకటి, పరిశుద్ధాత్మ సందేశం ద్వారా జనులకు బోధించుట, సంఘములో నిలిచి పరిశుద్ధులను హెచ్చరించి నడిపించుట. రెండవది, అపొస్తలుల బోధకు లోబడిన వారి స్వాస్థ్యమునకు సంచకరువుగా నిలిచియుండుట. నీ స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మ నీలో నివసిస్తున్నాడా? నీ దేహము ఆయనకు ఆలయముగా అలకరింపబడి, పరిశుద్ధంగా ఉందా? లేకుంటే, దాన్ని చక్కపరచుకో. "ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు" (మత్తయి 12:31-32).

జి. దేవదానం

0 comments:

Post a Comment