Saturday 22 October 2016

పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక్కటే అంటే నీ తలంపేమో కానీ...

     క్రొత్త నిబంధన ప్రవేశపెట్టబడక ముందే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చిన వాగ్ధానం నెరవేర్చబడింది. కొందరు తేలిగ్గా తలంచుతున్నట్టు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం మాటి మాటికి జరిగేది కాదు. ఈ సంగతి ఎలాగున్నా అపొ. 10లో కొర్నేలి యింట జరిగింది కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మమేనని మరికొందరి భావన! బాప్తిస్మపు కొలతలో పరిశుద్ధాత్మ యూదుల మీదికి ఒకసారి; అన్యజనుల మీదికి మరియొకసారి వచ్చినట్టు వారు అభిప్రాయ పడుతున్నారు. అభిప్రాయం మంచిగా ఉన్నా అది దేవుని సంకల్పానికి సరిపోయేదో లేదో కూడా ఆలోచింపవలసిన అవసరముంటుంది. గనుక పరిశీలించి చూద్దాం. అలా చేసేటప్పుడు ఆ రెండు సంభవాల్లోని వ్యత్యాసాలను ముందుగా గమనించుదాం:

     దానికి ముందు ఈ విషయాలను మరోసారి ఆలోచించుదాం: అంత్య దినాలకు సంబంధించి ఆత్మను గూర్చిన తండ్రి యొక్క వాగ్ధానం ఉంది (యోవేలు 2:28-32). అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మంగా ఎలా నెరవేర్చబడిందో చూద్దాం: 

     (1) బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చి ప్రస్తావించి - ఆ బాప్తిస్మమిచ్చేవాడు తనకంటె శక్తిమంతుడైనవాడంటూ క్రీస్తు ప్రభువును అతడు సూచించాడు గదా (మత్తయి 3:11)? 

     (2) పరిశుద్ధాత్మ బాప్తిస్మమిచ్చే క్రీస్తు ప్రభువు - అది ఎవరికి, ఎక్కడ, ఎప్పుడు - యిచ్చే వగైరా విషయాలను ఆయన తెలిపాడు గదా? 

     (3) పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తన తండ్రి వాగ్దానంగా ఆయన అభివర్ణించాడు - దీనిని గూర్చి ఆయన తన అపొస్తలులకు ముందుగా తెలియజేశాడు గదా (యోహాను 14:16, 25, 26; 15:26, 27; 16:7, 13)? 

     (4) పరిశుద్ధాత్మ పొందేది తన అపొస్తలులుగా ఆయన సూచించాడు (యోహాను 20:2) తన తండ్రి వాగ్ధానం చేసినది వారి మీదికి తాను పంపనైయున్నట్టు తన పునరుత్తానం తరువాత వారికి మాటయిచ్చాడు గదా (లూకా 24:49)? 

     (5) పరిశుద్ధాత్మ బాప్తిస్మం వారికి యిచ్చే చోటును నియమించాడు - యెరూషలేము లోనే నిలిచియుండాలని ఆయన వారికి ఆజ్ఞాపించాడు గదా (లూకా 24:49; అపొ. 1:4)? వేరే చోట ఆ బాప్తిస్మం వస్తే యెరూషలేములోనే ఎందుకు ఉండాలి? 

     (6) తనవలన వినిన తండ్రి వాగ్ధానం కొరకు కనిపెట్టియుండాలని, తాను ఆరోహణమైన కొద్ది రోజుల్లోనే వారు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుతారని ఆయన తన అపొస్తలులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు గదా (అపొ, 14-5)?

     (7) ఆయన మాట ప్రకారమే యెరూషలేములో కనిపెడుతున్న అపొస్తలులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు (అపొ. 2:1-4). 

     (8) పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన పన్నిద్దరు అపొస్తలులలోని ఒకడైన పేతురు, జనుల అపహాస్యానికి జవాబిస్తూ - యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి యిదేనని పలికాడు (2:16-21) 

     (9) పెంతెకొస్తు దినాన జరిగిన పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొర్నేలీ యింట జరిగిన ఆకస్మిక సంభవం వంటిది కాదు. పెంతెకొస్తు దినాన జరిగిన సంభవానికి కొర్నేలీ యింట జరిగిన సంభవానికి పలు వ్యత్యాసాలున్నాయి:
            (a) పేతురు కొర్నేలీ యింట బోధిస్తూ ఉండగా - "అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను" అని వ్రాయబడి ఉంది (అపొ. 10:44) పెంతెకొస్తు దినానికీ, కొర్నేలీ యింట జరిగిన దానికీ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించావా? అక్కడైతే బోధించే లేక మాట్లాడే వారిమీదికే పరిశుద్ధాత్మ దిగివచ్చాడు. ఇక్కడైతే వినేవారి మీదికే ఆయన దిగి వచ్చాడు.
            (b) పెంతెకొస్తు దినాన అవిశ్వాసులైనవారికి విభ్రాంతి కలిగేలా పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలలవంటి నాలుకలుగా విభాగింపబడి అపొస్తలులలో ఒక్కొక్కనిమీద వ్రాలగా కూడినవారు చూచారు; వారి మాటలు తమ తమ భాషల్లో విన్నారు. కొరేలీ యింటనైతే - పేతురు వెంటవచ్చిన యూదుల్లోని విశ్వాసులు విభాంతి నొందునట్లు అన్యజనుల మీదికి పరిశుద్ధాత్మదిగివచ్చాడు (అపొ, 10:44).
            (c) పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మను పొందినవారు గాక; పరిశుద్ధాత్మను పొందనివారే నీటి బాప్తిస్మం పొంద నాజ్ఞాపింప బడ్డారు (అపొ, 10:47-48) పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినవారికి నీటి బాప్తిస్మం అక్కరలేకపోగా, కొర్నేలీ యింటివారికి నీటి బాప్తిస్మం ఎందుకు అవసరమయ్యింది? పైగా పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ అపొస్తలుల మీదికి వచ్చినప్పుడు వారు కూడియున్నయిల్లంతయు నిండెను (అపొ, 2:2) కొర్నేలీ యింటిలో పేతురు బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను (అపొ. 10:44). అంటే ఆ గదిలో కూడియున్న అన్యజనుల మీదికి మాత్రమే. పేతురుతో మిగిలిన యూదులున్నారు, వారిమీదికి పరిశుద్ధాత్మదిగలేదు. పెంతెకొస్తు దినమువలె వారు కూడిన యిల్లంతయు నిండియుంటే, పేతురుకు రెండవమారు పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరిగియుండేది గడా?

     అయితే అక్కడా, యిక్కడా కూడా కామన్గా జరిగింది - భాషలు మాట్లాడటం, దాన్ని ఆధారం చేసికొని పేతురు - "మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు (కొర్నేలీ యింటివారు) బాప్తిస్మం పొందకుండ ఎవడైన నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి - యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు" (అపొ. 10:48). కొర్నేలీ యింటివారు ఎన్ని బాప్తిస్మాలు పొందుతారు? లేక ఎన్ని రకాలైన బాప్తిస్మాలు పొందుతారు? 

     జాగ్రత్తగా గమనించు: క్రొత్త నిబంధనకు సంబంధించిన బాప్తిస్మం ఒక్కటే (ఎఫెసీ. 4:4) అది - ప్రభువైన యేసునందు విశ్వాసముంచి, మూర్ఖులగు ఈ తరమువారికి వేరై, యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకొని, పాపక్షమాపణ నిమిత్తం పొందే నీటి బాప్తిస్మం కొర్నేలీ యింటివారికెందుకు? గనుక పెంతెకొస్తు దినాన అపొస్తలులు పొందింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం; కొని కొర్నేలీ యింట జరిగింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కాదని తేలుతుంది.

     అట్లయితే కొర్నేలీ యింట జరిగిందేమి? అని అడుగుతావేమో, చూడు; ధర్మశాస్రానికి బదులు, దాని స్థానంలో క్రొత్త నిబంధన ప్రవేశపెట్టబడి, అప్పటికి రమారమి ఐదారేండ్లు జరిగినట్టుంది. అయినా యూదులకు ధర్మశాస్త్రపు మత్తు వదలనట్టుంది. దానివలననే తాము చేస్తున్న పరిచర్యలో అన్యజనులకు పాలు లేదని వారు భావిస్తున్నారు. క్రొత్త నిబంధనలో అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులనే సంగతి అప్పటిలో విశ్వాసులకు గ్రహింపు కానట్టుంది.
అదంతా ఎందుకు? క్రొత్త నిబంధన ప్రారంభోత్సవంలో ప్రముఖ పాత్రను వహించిన పేతురు దగ్గరకే వద్దాం. అతడు ప్రసంగిస్తూ - "ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికి చెందును" అని అన్నాడు (అపొ. 2:38, 39). అయినా అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అతడు వెనుకంజ వేశాడు; వెరచాడు (అపొ. 10:25-28). "సమస్త జనులను శిష్యులనుగా చేయుడి" అని ఆజ్ఞాపించిన ప్రభువు ఆజ్ఞను మరిచాడు (మత్తయి 28:18).

     పునరుత్థానుడైన ప్రభువు అపొస్తలులమీద ఊది "పరిశుద్ధాత్మను పొందుడి" అని
అన్న తరువాత "మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని" వారితో చెప్పారు (యోహాను 20:23). అంటే పరిశుద్ధాత్మను పొందిన అపొస్తలుల ద్వారా మాత్రమే పాపక్షమాపణ (లేక) రక్షణ మార్గం ప్రజలకు అందింపబడుతుందని ఆయన స్పష్టం చేశారు. వారి బోధఎక్కడ ప్రకటింపబడలేదో అక్కడ ప్రజలకు పాపం నిలిచియుంటుందని దాని భావం. 

     గనుకనే తాను భక్తిపరుడై, తన యింటివారందరితో కూడ దేవునియందు భయభక్తులు గలిగి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేస్తూ, ఎల్లప్పుడు దేవునికి ప్రార్థించే కొర్నేలీకి, అతని యింటివారికి అపొస్తలుల బోధ అవసరం. పేతురే అన్యజనుల్లో కూడా సువార్త ద్వారాలు తెరవాలి. కొర్నేలీ ప్రార్ధిస్తున్నప్పుడు, దేవదూత అతని యింట నిలిచి - అతడును అతని యింటివారును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలను తెలియ జేయడానికి పేతురును పిలిపించుకోమని అడ్రస్ యిచ్చిపోయాడు (అపొ. 11:14). ఈ  సందర్భంలో దేవుడు జోక్యం పుచ్చుకొని పేతురుకు దర్శనమిస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి పలుకులతో అతడు దాన్ని నెట్టివేయజూచాడు (అపొ. 10:9-15) అంతలోపేతురును తన యింటికి పిలిపించుకొనడానికి కొర్నేలీ యొద్దనుండి యిద్దరు మనుష్యులు రానే వచ్చారు. మరునాడు పేతురు వారివెంట వెళ్లినా, అన్యజాతివానితో సహవాసం చేయుట యైనను వానిని ముట్టుటయైనను యూదునికి ధర్మం కాదంటూ, యింకా వెనుకా ముందూ కొట్టబడుతున్నట్టే ప్రసంగం ప్రారంభించాడు. ఆ సందర్భంలో అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులును ఒక్క శరీరంలోని సాటి అవయవములును, వాగ్ధానంలో పాలివారునైయున్నారనే (ఎఫెసీ. 3:6) వాస్తవాన్ని స్థాపించడానికే, క్రీస్తునందు ముందుగా విశ్వాసులైన యూదులకు విబ్రాంతి కలిగించేలా, పరిశుద్ధాత్మ కొర్నేలి యింట శ్రోతలపైకి దిగి వచ్చాడు. అదే అక్కడ జరిగిన సంగతి. 

    గనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒక్కటే. అది పెంతెకొస్తు దినాన అపొస్తలులకు యివ్వబడింది. పెంతెకొస్తు అనే పేరుతో ఈ మధ్య మతశాఖలు ప్రారంభమయ్యాయ్. వీటికి బైబిలుకు ఏ సంబంధమూ లేదు. వాటిలోనికి పోకుండా పైపైన ఆలోచన చేస్తేనే మనకు ఈ సంగతి తేటబడుతుంది: 

     (1) ఆనాటి పెంతెకొస్తు యూదుల పండుగ దినం (అపొ. 2:1). ఈనాడు పెంతెకొస్తు ఏ దినమూ కాదు. 

     (2) ఆనాటి పెంతెకొస్తు దినమున యెరూషలేములో ప్రభువు సంఘం ఏర్పడింది (అపొ. 11:22). ఈనాడు పెంతెకొస్తుకు ఏ సంఘం ఏర్పడిందో! ఆదివారమున బిడ్డ పడితే - వాని పేరు ఆదివారం కాదు, అలాగే పెంతెకొస్తను పండుగ రోజున సంఘం ప్రారంభింపబడితే అది పెంతెకొస్తు సంఘమని పిలువబడడం అర్థరహితం కదూ? 

     (3) యెరూషలేములో అపొస్తలులు ప్రభువు చేసిన వాగ్ధానం కొరకు కనిపెట్టి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందారు; ఈనాటివారు కనిపెట్టడానికి ఏ విధమైన వాగ్ధానమూ ప్రభువువలన చేయబడలేదు. 

     (4) అపొస్తలులు కూడియున్న స్థలానికి పరిశుద్ధాత్మ తానె నేరుగా పైనుండి శబ్దం చేసికొంటూ జనులను ఆకర్షించుకొంటూ వచ్చాడు (అపొ. 2:1-3); నేడు పరిశుద్ధాత్మ అలా రాడు, గనుక వారి కూడికల్లో వారే అల్లరి చేసికొంటూ శరీర సంబంధమైన తమ మనస్సుచేత ఊరకే ఉప్పొంగుతూ ఉంటారు. 

     (5) అపొస్తలులు పెంతెకొస్తు దినమున తాము నేర్చుకొనని, యితరులకు అర్థమయ్యే భాషల్లో మాట్లాడారు (అపొ, 2:6-9). ఈనాటి జనం ఏమి మాట్లాడుతున్నారో వినేవారికి తెలియని పలుకులు పలుకుతారు.

     (6) పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన పేతురు నడుస్తున్నప్పుడు అతని నీడ పైబడితేనే రోగులందరూ స్వస్థత పొందారు (అపొ. 5:15-16). వారెప్పుడూ స్వస్థత కూటాలు పెట్టలేదు; నేటి జనం స్వస్థత కూటాలని పెట్టినా, జనులను మోసగించడానికే ఆ పని జరిగిస్తున్నట్టున్నారు. గనుక నేటి పెంతెకొస్తవారి విషయం జాగ్రత్త! దేవుడు ఏ కార్యాన్నైనా తన సంకల్పం ప్రకారమే జరిగిస్తాడు!

Source: వీటిని గూర్చి నీ తత్వమేమో కానీ by Br. G.Devadanam 

2 comments:

  1. వందనాలు చాలా మంచి విషయం సంగతులు
    తేలియజేసారు.ఈ సమాచారాని గ్రహిస్తే పరిశుద్ధాత్మ
    గురించి మంచి అవగాహన కల్గుతుంది.

    ReplyDelete