Thursday, 27 April 2017

యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమంటే...

అధునాతనంగా, "యేసుక్రీస్తు సంఘము" అనే పేరుతో ఒక సంఘం ప్రారంభ మయ్యింది. అందులో నా ప్రియ స్నేహితులలో ఒకరు చేరాడు. తనతో కలిసికొని మాట్లాడినప్పడు, వారు నమ్మే కొన్ని విషయాలను నాతో ముచ్చటించాడు. వాటిలో ప్రధానంగా, సంఘం "యేసుక్రీస్తు సంఘ"మని పిలువబడాలని; యేసు వేరు, క్రీస్తు వేరని; బాప్తిస్మము యేసుక్రీస్తు నామములోనే యివ్వాలని తెలిపాడు. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మమివ్వడమంటే - బాప్తిస్మమిచ్చే వ్యక్తి బాప్తిస్మపు నీటిలో, బాప్తిస్మం పొందేవానిని, "యేసుక్రీస్తు నామమున నీకు బాప్తిస్మమిస్తున్నాను" అని చెప్పి ముంచడం యివ్వాలనేది వారి సిద్దాంతమట. "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు" అని పేతురు పెంతెకొస్తు దినాన మాట్లాడిన మాటలకు అర్థం అదేనట (అపొ. 2:38). యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందడమంటే నీ తాత్పర్యం ఏమో కాని, ఆ చర్చకు వెళ్లక ముందు, యేసు వేరు, క్రీస్తు వేరు కాదనే విషయాన్ని క్లుప్తంగా చూచి వెళ్లదాం.

యేసు వేరు, క్రీస్తు వేరు అనే వారి నమ్మకానికి నా ప్రియ మిత్రుడు చూపిన లేఖన భాగం ఎఫెసీ. 4:20-21. అక్కడ యిలా వ్రాయబడియుంది. "అయితే మీరు యేసును గూర్చి విని, ఆయనయందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింప బడినవారమైన యెడల, మీరాలాగున క్రీస్తును నేర్చుకున్నవారు కారు." ఈ లేఖన భావం సంగతి అలా ఉంచి, యేసు వేరు, క్రీస్తు వేరని పౌలు యిక్కడ ఉపదేశింపబూను కొన్నట్టయితే, పౌలు తన్ను తానే వ్యతిరేకించుకున్నవాడు, తన్ను తానే ఖండించుకొన్న వాడౌతాడు! ఎందుకో తెలుసా? ఎందుకంటే, యేసే క్రీస్తయి ఉన్నాడని అతడు ఉపదేశించి నట్టు డాక్యూమెంట్సు ఉన్నాయి.

మొదటిది, అతడు మార్పు పొందిన తొలి దినాల్లో అతడింకను దమస్కులో ఉండగా, -"యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినినవారందరు విబ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికికూడ వచ్చియున్నాడని చెప్పకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి - ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవర పరచెను" (అపొ. 9:20ఎ-22), దమస్కులో యేసే క్రీస్తని పౌలు రుజువుపరచాడు.

రెండవది, తన సువార్త ప్రయాణంలో, థెస్సలొనీకకు వచ్చి, "పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి - క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట అవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతమునెత్తి విప్పి చెప్పతూ, "యేసు వేరు, క్రీస్తు వేరు అనే భావం గలవారితో పౌలు తర్మించుతూ, లేఖనాల్లోనుండి దృష్టాంతములనెత్తి - యేసే క్రీస్తయి ఉన్నాడని సమాజమందిరములో రుజువుచేశాడు" (అపొ, 17:3-4).

పౌలు మాసిడోనియ పర్యటనను ముగించి, అకయలో ప్రవేశించి కొరింథీ  పట్టణానికి వచ్చి చేరుకున్నాడు. సీలయు తిమోతియు కూడా మాసిడోనియనుండి వచ్చి అతని కలిసికొన్నారు. అప్పుడు, "పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను" (అపొ, 18:5). అపొల్లో కూడ కొరింథునకు వచ్చినప్పుడు, "యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించెను" (అపొ, 18:28). మొదటి శతాబ్దపు సువార్తికులందరు యేసే క్రీస్తని రుజువు చేశారనుకో! తక్కినవారి సంగతి ఎలాగున్నా అపొస్తలుడైన పౌలు దమస్కులోను, థెస్సలొనీకలోను, కొరింథులోను - యేసే క్రీస్తయి ఉన్నాడని రుజువు చేస్తూ, ఎదురాడేవారిని ఖండించుతూ తర్కించుతూ ఉండి, ఎఫెసులో మాత్రం యేసు వేరు క్రీస్తు వేరు అని బోధించుతున్నాడనడం లేఖనాలను అపహసించడమే ఔతుంది.

ప్రభువు యొక్కదీర్ఘశాంతము రక్షణార్థమైనదంటూ, పౌలు పత్రికలను గూర్చిపేతురు యిలా వ్రాశాడు: "ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్ధము చేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు? (లేక, మూల భాషలో ఉన్నట్టు, "వక్రముగా త్రిప్పుదురు" ) (2 పేతురు 8:15-16).

ఒక స్థలంలో ఒక విధంగా మరో స్థలంలో యింకో విధంగా సందేశాన్ని మార్చలేదని పౌలు ఖండితంగా చెప్పాడు. తక్కిన సువార్తికులు కూడా అదే మాదిరిని అనుసరించారని పౌలు ఈ క్రింది విధంగా సూచించాడు. తిమోతి అదే చేస్తాడట, తిమోతిని కొరింథుకు పంపుతూ, తిమోతి ఉపదేశం విషయంలో వారికి పౌలు యిలా హామి యిస్తున్నాడు: "ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును? (1 కొరింథీ, 4:17). తాను ఏ స్థలములో బోధించినా, బోధ ఒకే విధంగా ఉందని పౌలు సూచించాడు. గనుక దమస్కు థెస్సలొనీక, కొరింథులో - యేసే క్రీస్తని, ఎఫెసిలో మాత్రం యేసు వేరు, క్రీస్తు వేరు అని బోధించలేదని పౌలు తన సందేశంలో గుప్తం చేశాడు.

గనుక ఎఫెసీ 4:20-21తో పౌలు తెలియజేసిన సమాచారమేమంటే - యేసే క్రీస్తయి ఉన్నాడు గనుక, ఆయనను గూర్చిన సమాచారం ఉన్నది ఉన్నట్టుగానే ఆయనయందు ఉపదేశింపబడినవారైతే, మునుపు నడుచుకొన్నట్టు మీరిక మీదట నడుచుకొనకూడదు. అలా మీరు నడుచుకున్నట్టయితే, క్రీస్తును గూర్చి మీరు బోధింపబడిన వారు కారు - అనేది అక్కడ సంక్షిప్త సందేశం. సంగతిని వివరించడానికి యిది సమయం కాదు గనుక ప్రస్తుతానికి దాన్ని విడిచిపెడుతున్నా. 

"యేసు క్రీస్తు సంఘం" వారు, యేసు వేరు - క్రీస్తు వేరు అని అనడంలో - యేసు శరీరమని, క్రీస్తు శిరస్సు అని - అవి రెండు కలిస్తేనే, అది సంపూర్ణమైన నామం ఔతుందని, అందువలన సంఘానికి సంపూర్ణమైన నామం "యేసు క్రీస్తు సంఘం" అని ఉండాలని వారు తలంచుతారు. సంఘాన్ని అలా గుర్తించడంలో, అంటే సంఘం యేసు క్రీస్తువారికి చెందిందని అనడంలో ఏ తప్పూ లేదు. అయితే ఘోరమైన తప్పు ఎక్కడ జరిగిందంటే - యేసు శరీరమని, క్రీస్తు శిరస్సు అని విభజించడంలోనే.

"శరీరము" వేరే, "ప్రభువు” (యేసు) వేరేనని ఎఫెసీ 4:4-5లో మనం ముందుగానే గమనించాం. "యేసు" శరీరమనే భావన బైబిల్లోనుండి పుట్టింది కాదు. "సంఘము" అనేది శరీరం. ఈ విషయాన్ని ఎఫెసీ. 1:22-23లో పౌలు యిలా వివరిస్తున్నాడు: "మరియు సమస్తమును ఆయన (క్రీస్తు) పాదముల క్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను (క్రీస్తును) సంఘమునకు శిరస్సుగా నియమించెను (నియమించినవాడు తండ్రి). ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును సంపూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై యున్నది." సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరం గాని, యేసు అనే శరీరానికి క్రీస్తు శిరస్సు అని అంటే, లేఖనాలను అపహాస్యం చేయడమే అయ్యుంటుంది. ఎందుకో తెలుసా? ఆ సంఘము ఆయన శరీరమని పౌలు వివరించడం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క ప్రాధాన్యతను వివరించడంలో కూడా పౌలు ఈ విషయాన్ని వివరించాడు. "సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ." (కొలస్సీ 1:18).

"క్రీస్తు సంఘం" అనే పిలుపు అసంపూర్ణమైనట్టును, "యేసు క్రీస్తు సంఘం" అంటేనే అది సంపూర్ణమైనట్టును భావించి, యేసు వేరు, క్రీస్తు వేరు - యేసు శరీరం, క్రీస్తు శిరస్సు అనే తప్పుడు సిద్దాంతాన్ని రూపించినవారే, యేసు క్రీస్తు నామమున బాప్తిస్మమియ్యాలనే సిద్ధాంతాన్ని కూడా చేశారు. వారు ముందు చూప బూనిన వ్యత్యాసానికి ఎఫెసీ. 4:20-21ని ఎలా కోట్ చేశారో, అలాగే బాప్తిస్మానికి వారు పెంతెకొస్తు రోజున పేతురు పలికిన మాటలను కోట్ చేశారు. "మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడని పేతురు అన్నాడు గనుక - బాప్తిస్మం యిచ్చేవాడు, పుచ్చుకునేవానిని ముంచేటప్పుడు, "యేసుక్రీస్తు నామమున నీకు బాప్తిస్మమిచ్చుచున్నాను" అని అనాలి అనేది వారి తీర్మానం. ఈ విషయంలో నీ తాత్పర్యమేమో కాని ముందు విషయం మనం ఎలాగు లేఖనపు వెలుగులో పరిశీలించామో, ఈ విషయాన్ని కూడా అలాగే పరిశీలన చేద్దాం. క్రీస్తు సంఘం అనిపించుకునేవారిలో కొందరు యిదే తాత్పర్యం కలిగియున్నట్టు నా చెవికి వచ్చింది. ఎవరేమనుకున్నా లేఖనాల సారాంశమేమో ఆలోచన చేద్దాం.

ఈ విషయంలో, లేఖనాలను చదివి, వాటి సందేశ సారాన్ని మనుష్యులు గ్రహించాలి "నీ వాక్య సారాంశము సత్యము" అనే సంగతిని మరచిపోకూడదు (కీర్తన. 119:160ఎ) సత్యాన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరు చేయవలసిన పని అదే. ఇక్కడ బాప్తిస్మం యిచ్చేవారికి వేరుగా, పుచ్చుకునేవారికి వేరుగా ఆజ్ఞలున్నాయి, ಅಲ್ జరిగించితే, దాని సారాంశమేమో కూడా లేఖనాల్లో సూచనలున్నాయి. క్రొత్త సిద్దాంతం ఒకటి కనిపెట్టాలి, సత్య మార్గం నుండి తొలిగిపోవాలి, తనకు గుర్తింపు తెచ్చుకోవాలనే భావనతో కాకుండ, సత్యాన్ని సహృదయంతో అంగీకరించాలనే తలంపు ఉంటే, లేఖన సందేశంలో మాత్రం సమస్య లేదు. సమస్యలు కలిగించడానికి దేవుడు తన సందేశాన్ని యివ్వనేలేదు. "యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి" అని పేతురు ఆజ్ఞాపించాడు గదా? అవును (అపొ. 2:38: 10:48). ప్రభువైన యేసు నామమున వారు బాప్తిస్మము పొందారని వ్రాయబడియుంది కదా? అవును (అపొ. 8:16; 19:5). అలాటప్పడు "తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్దాత్మయొక్కయు నామంలోనికి బాప్తిస్మం యివ్వాలంటారేమి? (మత్తయి 28:19), ఈ ప్రశ్ననే చర్చించబోతున్నా శ్రద్ధగా గమనించు. 

లేఖనాల గ్రహింపులో సమస్య ఉంది గనుక ఈ విషయం ముందుగా ప్రస్తావించినా, దాన్నే మరలా చెప్పుతున్నా బాప్తిస్మం యిచ్చేవారికి వేరుగా, బాప్తిస్మం పొందేవారికి వేరుగా ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఈ విషయం ఎన్నడూ మరచిపోకూడదు. బాప్తిస్మం యిచ్చేవారికి శిష్యులుగా చేసే పని, బాప్తిస్మం పొందేవారికి శిష్యులుగా చేయబడే పని నియమించబడ్డాయి. ఆ రెండు ఒక్కటే కాదు. అంటే ప్రకటించేవాడు, వినేవాడు ఎలాగు వేరు వేరైయుంటారో, అలాగే వారికి యివ్వబడిన ఆజ్ఞలు కూడా వేరు వేరుగా ఉన్నాయి.

పెంతెకొస్తు దినాన పరిశుద్దాత్మ పూర్ణుడై, బాప్తిస్మం పొందవలసినవారికి పేతురు యిలా ఆజ్ఞాపించాడు: 'మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్ధానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చుచు - మీరు మూరులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను" (అపొ. 2:38–40).

ఈ మాటలు పేతురు స్వయంగా మాట్లాడినవి కావు. పరిశుద్దాత్మవలన ఈ పలుకులు తన నోటికి అందింపబడినవే గాని, అతని హృదయానికి గోచరమైనవి కావు. అది నీకు ఎలా తెలుసు అని అడుగుతావేమో! అది నాకు ఎలా తెలుసంటే - "ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును" అని తన శ్రోతలైన యూదులతో అన్న తరువాత, "దూరస్టులందరికిని, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని" పేతురు పలికాడు. అయితే ఈ వాగ్ధానం అన్యజనులకు వర్తిస్తుందన్న సంగతిని అతడు గ్రహించినవాడు కాడు. కొర్నేలీకి దేవదూతచేత వర్తమానం వచ్చి - పేతురును

పిలిపించుకోమని ఆదేశించినంతవరకు - కొర్నేలీ ఆహ్వానానికి అడ్డం చెప్పకుండ వెళ్లుమనే దర్శనం, ఆదేశంవలన అతడు హెచ్చరింపబడేవరకు - పెంతెకొస్తు దినాన తాను పలికిన మాటలకు పేతురుకే అర్థం తెలియలేదు. అన్యజనుల మీదికి పరిశుద్దాత్మ దిగేవరకు అతడు ఆ విషయం నమ్మలేదు (అపొ. 10:48) అలాటప్పుడు -"యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడని" పేతురు అన్నమాటలకు - "యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ మిస్తున్నాను" అని పలికి బాప్తిస్మమివ్వాలనే నిర్ణయానికి రావడం తప్పు ఔతుంది! అది ఎలా తప్పు అవుతుంది? అని అడుగుతారేమో, దాన్నే వివరించబోతున్నా చూడు!

ఈ సందర్భంలో మరో సంగతి గమనించు. ఆరంభంలో యూదులు తన నోట సువార్త వాక్యం విని ఎలా విశ్వసించారో, అలాగే అన్యజనుల ప్రవేశపు ఆరంభమందును "అన్యజనులు" తన నోట సువార్త వాక్యం వివి విశ్వసించులాగున దేవుడు పేతురును ఏర్పరచుకొన్నాడు (అపొ. 2:41, 15:7) గనుక ఆరంభంలో, పెంతెకొస్తు దినాన బాప్తిస్మం పొందవలసిన యూదులకు ఎలా ఆజ్ఞాపించబడిందో (అపొ, 2:38); అన్యజనుల ఆరంభమందు తన నోట సువార్త వాక్యం విని బాప్తిస్మం పొందవలసినవారికి అదే సంగతి చెప్పబడింది (అపొ. 10:40) అంటే, మీరు మారుమనస్సు పొంది. ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడని” యూదులకు ఆజ్ఞాపించిన పేతురు, కొర్నేలీ యింట అన్యజనులతో మాట్లాడినపుడు కూడా "యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలెనని" వారికి ఆజ్ఞాపించాడు (అపొ. 10:48). "యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందడమంటే అర్థం ఏమో నీకు తెలియకపోయినా, యిది
పొందేవారికి యివ్వబడిన ఆజ్ఞ అనే సంగతి మనస్సులో ఉంచుకొనడం అవసరం.

"నామమున? అనేది గ్రీకులో ఎలా ఉపయోగింపబడిందో చూడు. "Onama" అనే పదంనుండి "నామమున" అనేది వచ్చింది. ఈ "Onama" అనేదాన్ని తన Greek-English Lexiconలో థేయర్ ఎలా వివరించాడో చూడు:

Onama = to do a thing that is by one's Command and authority, acting on his behalf, promoting his cause, to do a thing of Jesus (p. 447)

యేసుక్రీస్తు నామమున అంటే, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారం చేయడం, ఆయన
అధికారమును బట్టి చేయడం, ఆయన పక్షంగా చేయడం, ఆయన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం,
యేసు యొక్క కార్యాన్ని జరిగించడం - అని ఆ పదానికి అర్థం. శృగాంరమను దేవాలయపు ద్వారమునొద్ద కూర్చుండి భిక్షమడుగు నలభై ఏండ్ల ఈడుగల పుట్టు కుంటివానిని - నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని పేతురు వాని స్వస్థపరచిన తరువాత - యూదా మతాధికారులు పేతురు యోహానులను దాని విషయమై విచారించినప్పడు ఈ పద భావం వివరించబడింది. "వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి - మీరు ఏ బలముచేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని" అడిగారు (అపొ. 4:7) మీకు ఈ శక్తి ఎక్కడనుండి వచ్చింది, మీకు ఈ అధికారమిచ్చినవాడెవడు అనేది వారి ప్రశ్నకు అర్థం.

ఇప్పటివరకు బాప్తిస్మం పొందేవారిని గూర్చి కొంతవరకు ఆలోచించాం. ఇకపోతే బాప్తిస్మం యిచ్చేవారికి యివ్వబడిన ఆజ్ఞ యొద్దకు వద్దాం. సమయాన్ని సందర్భాన్ని గమనించు. పదునొకండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయకొండకు వెళ్లారు. పునరుత్దానుడైన ప్రభువు వారికి తాను ముందుగా సూచించినట్టు, అక్కడ వారిని కలిసికో వచ్చాడు. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని, కొందరు సందేహించారు. అయితే ఆయన వారియొద్దకు వచ్చి "-పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్దాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి, ఇదిగో నేను యుగ సమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను" (మత్తయి 28:18-20).

బాప్తిస్మం యిచ్చేవారికి యివ్వబడిన ప్రభువు యొక్క ఆదేశాలను గమనించు:
    (1) పరలోకమందును భూమిమీదను ఆయనకు సర్వాధికారమియ్య బడినందున వారు ఆయన ఆజ్ఞ ప్రకారము, ఆయన అధికారం క్రింద పని చేయాలి.
    (2) సమస్త జనులను - అంటే యూదులను యూదేతరులను ఆయనకు శిష్యులగునట్టు చేయాలి.
    (3) అలా శిష్యులుగా చేయబడుతున్నవారికి -"తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి" బాప్తిస్మమియ్యాలి. 
    (4) ఆయన తన అపొస్తలులకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని బాప్తిస్మం పొందినవారు గైకొనేలా - వారు వీరికి బోధించాలి.
    (5) ఇది యుగ సమాప్తివరకు ఉండే ఏర్పాటైయుంది.

అయితే యిప్పడు బాప్తిస్మం పొందేవారు చేయవలసిన పనులకు - బాప్తిస్మం యిచ్చేవారు చేయవలసిన కార్యాలకు గల వ్యత్యాసాన్ని గమనించావా? లేకుంటే చూడు: బాప్తిస్మం పొందేవారు యేసును గూర్చి విని విశ్వసించి, మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం - యేసుక్రీస్తు నామమున (ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన అధికారం క్రింద) బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం యిచ్చేవారు ఏమి చేయాలి? ఆయన అధికారం క్రింద ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయనకు శిష్యులైయుండగోరేలా సమస్త జనులకు ఉపదేశం చేయాలి. అలా శిష్యులైయుండగోరినవారికి– “తండ్రియొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్దాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మమిస్తూ" - ఆయన తమకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని గైకొనేలా వీరు వారికి బోధించాలి!

సంగతులు యింత తేటగా ఉండగా, సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తించావా? లేకుంటే చూడు. ఇంతకు సమస్య ఎక్కడనుండి వచ్చిందంటే - బాప్తిస్మం యిచ్చేవారు బాప్తిస్మం పుచ్చుకునేవారి స్థానంలో నిలిచియుండినందుననే సమస్య ఉత్పన్నమయ్యింది. "యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి" అనేది బాప్తిస్మం పొందేవారికి యివ్వబడిన ఆజ్ఞయేగాని, బాప్తిస్మం యిచ్చేవారికి యివ్వబడిన ఆజ్ఞ కాదు. అది యూదులకును యూదేతరులకును ఒకని నోటనే ప్రకటింపబడింది (అపొ. 2:38, 10:48). క్రొత్త నిబంధన నీటి బాప్తిస్మానికి సంబంధించినంత వరకు బాప్తిస్మం పొందేవారికి యివ్వబడిన తక్కిన ఆజ్ఞలు - బాప్తిస్మం యిచ్చేవారికి ఎలా వర్తించవో, ఆలాగుననే, "యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి" అనేది కూడా వర్తించదు. అలాటప్పడు కుక్కపెత్తనం గాడిద తీసికొంటే ఏమి జరుగుతుంది? ఈ విషయంలో కూడా జరిగేది అదే! ఎవరికి నియమించబడిన పని వారు శ్రద్ధగా చేసికొంటూ పోతే ఈ లేని పోని సమస్య తల ఎత్తదు గదా?

గనుక జాగ్రత్తగా గమనించు. పొందేవారు, తమకు ఆజ్ఞాపించినట్టే - "యేసుక్రీస్తు నామమున (ఆయన ఆజ్ఞను బట్టి, అధికారమును బట్టి, అపొ, 4:7బి) బాప్తిస్మం పొందితే; యిచ్చేవారు - తమకు ఆజ్ఞాపింపబడినట్టే, "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి బాప్తిస్మం" యిస్తే అలా బాప్తిస్మం పొందినవారు "ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొంది"నవారై యుంటారు (అపొ. 8:16; 19:5 చూడు). దీనికి భిన్నమైనది లేఖన సారాంశం కాదు. కానేరదు. అది ప్రారంభింపబడిన నాటనుండి యుగసమాప్తివరకు యిందులో ఏ మార్పు జరగడానికి వీలుండదు సుమీ!

Source: "వీటిని గూర్చి నీ తత్వమేమో గాని" by Br. G.Devadanam
Alert: Content is protected !!

4 comments:

  1. బ్రదర్ వందనాలు తండ్రి కుమారా పరిశుద్ధాత్మ నాముము‌న. బాప్తిస్మము ఇస్తే యేసు క్రీస్తు నామమున ఇచ్చినట్టా చాలా తప్పు

    ReplyDelete
    Replies
    1. వివరణ అయోమయానికి గురిచేసింది

      Delete
  2. వివరణ ఒకే .కానీ యేసు నామమున బాప్తీస్మం అనేది కేవలము యేసుని రక్షకునిగా అంగీకరించని వారికి మాత్రమే అక్కడ యూదులు,ఇశ్రాయేలీయులు తండ్రిని.పరిశుద్దాత్మ ను నమ్ముతారు .నమ్మనిది యేసుక్రీస్తును మాత్రమే..అందుకే ఇప్పుడు వారికీ kshamapana కలగాలంటే యేసు నామమున బాప్తీస్మం పొందాలి

    ReplyDelete