Monday, 12 September 2016

ఏదెను తోటలో మానవ పతనమునకు మూలకారణము

         
         ఏదెను తోటలో అంతటి పతనమునకు కారణమేమి? అంతటి ఆపదకును, అవమానమునకు దారితీసిన వాస్తవమేమి? అబద్ధబోధ; దాని యందలి మానవ విశ్వాసమే యింతటి చేటు తెచ్చింది.

          దేవుని మాటలకు వక్రమైన భావములుండవు. ఆయన తెలియజేసిన సత్యము వేరొక రూపములో సత్యము కానేరదు. “God means What He Says”. దేవుని మాటలలో కపటములేదు; అబద్ధములేదు; వేషధారణను కప్పిపుచ్చు దుష్టత్వము లేదు. ప్రేమతో బహు జాగ్రత్తగా ఆలోచించుకొని తనకొరకు మానవుని నిర్మించుకొనిన దేవునికంటే ఎక్కువగా వాని క్షేమమును నిత్యత్వపు దృష్టితో కోరగల మరెవ్వరును లేరు. ఈ వాస్తవమును ఆదాము హవ్వలకు బహు ఆలస్యముగా అర్ధమైనట్లున్నది. అయినను ప్రయోజనము లేదు. (It was too late to acknowledge these facts). అయితే వారి ద్వారా తరువాత వచ్చిన తరములవారు దేవుని మాటలను లక్ష్యపెట్టు విషయములో బహుజాగ్రత్త వహింప వలసినవారై యున్నారు కారా? అబద్ధబోధ అనునది దేవుని మాటలతో కొంతచేర్చి మాట్లాడునది. లేక కొంత తీసివేసి మాట్లాడునది. దేవుని మాటలకు భావము వేరుగా చూపునది. ఆయన ఉద్ధేశమును మార్చునది. తాత్కాలిక సుఖమును ప్రోత్సహించునది; మేలు కీడుగాను, కీడు మేలుగాను ప్రదర్శించునది; శ్రోతలను నమ్మించునట్లే జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగించునది. వినువారి స్వకీయ దురాశకు అనుకూలమైన మాటలను ప్రయోగించునది; భ్రమపరచునది; మోసగించునది. ఏదెను తోటలో హవ్వ యెుద్ద అపవాది ప్రయోగించిన సాధనము అబద్ధబోధయే. అబద్ధబోధ అపవాదికి సంబంధించినది.

           అబద్ధబోధను బోధించుటకు అపవాది ఉపయోగించిన పద్ధతులు పలువిధములు. ఆదిలో తన బోధను నమ్మించుటకు వాడు అద్భుతరీతిగా సర్పమును మానవ స్వరముతో మాట్లాడించినట్లు కనిపించును. అందువలన “ సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము” అని వాడు వర్ణింపబడెను ( ప్రకటన 12:9). అయితే కొందరు అపార్ధము చేసికొనినట్లు సర్పము అను భూజంతువు సాతాను కాదు. తన కార్యమును సాధించుకొనుటకు ఎవరు అనుకూలముగా నుందరో వారిని; వారి జ్ఞానబలమును వాడు ప్రయోగించుకొనజూచును. ఆదామును నేరుగా అపవాది వంచలేక పోయినను (1 తిమోతి 2:13), అతని కౌగిట భార్యను మెుదట లోబరచుకొని (2 కొరింధీ 11:2); ఆమె ద్వారా ఆదామును సహా అతడు లోబరచుకొనెను.

             ఏదెనులో అబద్ధబోధను చేయుటకు అపవాది చేసిన రెండవ ఏర్పాటు; కొంత సత్యమును కొంత అబద్ధముతో బోధించుటయు; తాత్కాలికమైన మేలును శాశ్వతమైన కీడుతో పెనవేయబడుటయునే. మనుష్యులను భ్రమపెట్టి వారిని సులభంగా మోసగించుటకు ఇదియే వాని మార్గము. ఉదా: వ్యాపారియెుకడు ఒక కుండనిండ నీళ్లు మోసుకొని పోవుచు “ పాలు పాలో” అని కేక వేయసాగాడట, అతనియెుద్ద పాలు కొనడానికి పిలిచిన ప్రతివాడును వానిని తృణీకరించి పంపివేశారట! ఎంత బుద్ధిలేనివాడైనను, ఆ నీళ్లను చూస్తూ పాలను కొనడు కదా. అయితే అతడు కొన్ని నీళ్లలో కొన్ని పాలుపోసుకొని మరొక వీధికి వెళ్లి “ పాలు పాలో” అంటూ అమ్మజూపాడట. ఎంత బుద్ధిమంతులైనను వాటిని పాలనే కొనడానికి మెుదలుపెట్టారట. భౌతిక జీవిత విధానంలో అదెలాగున్నను, ఆత్మ సంబంధమైన పరిధిలో ఇది ఎంతటి వాస్తవమో చెప్పలేము.

             “మీ కండ్లు తెరవబడును”, మీరు మంచిచెడ్డల నెరుగుదురు”, దేవుని వలె నుందురు అను సత్యములను “మీరు చావనే చావరు” అను ఒక్క అబద్ధముతో జోడించి, హవ్వను అపవాది మోసగించగలిగెను. అబద్ధబోధ కేవలము అబద్ధపు మాటల మూటలే అయిన యెడల మనుష్యులను మోసగించుట అంత సులభము కాదు కదా! కనుక సత్యముతో అబద్ధమును కలిపి చెరిపిన బోధయే ఏదెను సంఘటనకు మూలకారణము.

Source: “దేవుని విమోచనా సంకల్పం” by జి. దేవదానం గారు

0 comments:

Post a Comment