Angels that sinned
“దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను” (II పేతురు 2:4)
1. కెరూబులు:
ఇంతకు పాపము చేసిన దూతలు ఎవరు? వారు చేసిన పాపమేమి? వీరు పరలోకమందున్న దూతలేనా? పరలోకమందలి దూతగణంలో కెరూబులున్నారు. దేవుని పరిశుద్ధమైన వాటిని అపవిత్రులు సమీపింప కూడదనే సూత్రంమీద పనికలిగిన వారైయున్నట్టు, యెహోవా మందసం యొక్క నిర్మాణంలో కెరూబులు విడదీయబడని భాగంగా చెక్కబడ్డారు. “మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయ వలెను... మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను... ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను...” (నిర్గమ. 25:16-22). వారు ఎప్పుడైనా పాపము చేసియుంటే, కెరూబుల ముఖరూపాలైన దేవుడు తన సన్నిధానంలో సహించియుండునా?
పైగా, తొలి మానవుడైన ఆదాము దేవునితోగల నిబంధనను భంగం చేసాడు (హోషేయా 6:7). పాపియైన నరుని ఏదెను తోటలోనుండి వెళ్ళగొట్టి కెరూబులను దేవుడు దానికి కావలివారుగా నియమించడంలో, కెరూబులు ఎప్పుడైనా పాపం చేసి ఉంటారనే తలంపుగాని ఊహగాని పుట్టనేరాదు. “అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను” (ఆది. 3:24). పాపము చేసిన నరునికి బదులు దేవుడు కెరూబులను వాని స్థలంలో నిలబెట్టాడంటే, కెరూబులనే దేవదూతలు పాపం చేసారని చెప్పజాలం.
దేవుని సింహాసనమునకు కెరూబులకు సన్నిహితమైన సంబంధం కలిగియున్నట్టు గోచరిస్తుంది. బబులోను సామ్రాజ్యమందున్న యెహెజ్కేలునకు కలిగిన యెహోవా స్వరూప దర్శనంలో ఈ సంగతి కన్పిస్తుంది. ఆ దర్శనంలో వీటికి నాలుగు జీవులున్నారు. యెహెజ్కేలు అధ్యాయం 1లో వీటి వర్ణన తెలియబడింది.
“యెహోవా మహిమ మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగాకెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను. కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.” (యెహె. 10:18-20). దేవ దేవుని సింహాసనంతో సంబంధంగల ఈ జీవులు ప్రకటన 4:6-8లో కూడా కనిపిస్తాయి. దేవుని పరిశుద్ధతను, ఆయన ఘనతను నిత్యము కొనియాడుతూ, ఆయన పరిశుద్ధతకును, ఘనతకును ఏ విధమైన కళంకమైనా కలుగకుండా చూచే పనిలో కెరూబులు రేయింబగళ్ళు నిలకడగా ఉన్నట్టు సూచింపబడ్డారు. వీరా పాపం చేసింది?
2. సెరాపులు (మహా దూతలు):
పరలోకమందున్న దేవదూతలలో సెరాపులు రెండో రకంలా కనిపిస్తారు. సెరాపులు స్తుతి చేయువారుగా దర్శనమిస్తారు. “ఆయనకు పైగా సెరాపులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి” (యెషయా 6:2-3). సెరాపులది దేవుని ముఖదర్శనం చేసికోలేని స్థితి, అది తమ కళ్ళను కప్పుకొనడంలో తెలియబడుతుంది. తమ కాళ్ళని సహితం దేవునికి కనబడకూడదన్నంత మర్యాదను కనుపరచే వారి నిజస్థితికూడా వెల్లడి పరచబడింది. మరియు దేవుని సమీపింపలేని వారిస్థితియు వారు ఎగురుటలో కనుపరచబడుతుంది గదా! దేవునికి విరోధంగా పాపం చేయగల సాహసం వారిచర్యలలో గోచరించదే. పైగా వారు పవిత్రమైన పెదవులు గలవారైనట్టు యెషయా తన దర్శనంలో చూసాడు. అతని పెదవుల అపవిత్రతను వారు గ్రహించినట్టున్నారు. గనుక సెరాపులలో ఒకడు యెషయా పెదవులను కాల్చినట్టును, అతని అపవిత్రతను పోగొట్టినట్టును దృశ్యం సూచిస్తుంది (యెషయా 6:6-8). ఈ సెరాపులనే ఆ మహాదూతలు ఎప్పుడైనా పాపం చేసి ఉంటారా? మరి ఇంతకు పాపం చేసిన దూతలెవరై యుంటారో?
అయినా, దేవదూతలు పాపం ఎప్పుడు చేసియుంటారట? లోకం పుట్టకముందా? కాకమ్మ కథలు చెప్పవద్దు సుమీ!!
3. లోకం పుట్టక ముందున్న దూతలు:
లోకం పుట్టక మునుపే దేవదూతలు పాపం చేశారనే కథ ఒకటి ఉంది. ఆ కథ ఎలా పుట్టుకొచ్చిందో తరువాత చర్చించుతాను. అయితే యింతకు లోకం పుట్టకముందు దూతలు పాపం చేసినట్టు గ్రంధంలో సూచన ఉందా? చూద్దాం.
“నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?” (యోబు 38:4-11).
మానవ జాతికొరకు సృష్టి నిర్మాణ కార్యక్రమం ఆరంభమయ్యింది అందులో భూమికి పునాదులు వేయడం జరిగింది. ఆ భూనిర్మాణ కార్యక్రమంలో, ఉదయ నక్షత్రములు ఏకముగాకూడి పాడినప్పుడు, దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేశారంటే, దేవుని కార్యాన్ని హర్షించారన్నమాటే గదా! దేవుని కార్యాలకు ఆనందించి జయధ్వనులు చేయడమే పాపమా? ఏమి? దేవదూతలందరును ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారేగదా? అందులో కొందరు పాల్గొని, మరికొందరు వ్యతిరేకించినట్టు గ్రంధం తెలుపలేదే! ఇది లోకం పుట్టకమునుపటి సంగతియే గదా? అందువలన పరలోకమందున్న దేవదూతలు పాపం చేసినట్టు దేవుని వాక్యాన్ని వక్రీకరించిన వారి చర్యయేగాని, అది బైబిల్ సందేశం కాదు.
II పేతురు 2:4ను మరోసారి చూద్దాం: “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను”. ఈ లేఖనంపై యూదా రచన మరికొంత వెలుగు చిమ్ముతోంది చూడు: “మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను” (యూదా 6).
ఈ దేవదూతలతో అపవాది కూడా ఉన్నాడనే ఒక కట్టు కథ ఉంది. దేవుడు వారిని కటిక చీకటిగల బిలములలో నిత్యపాశములతో బంధించితే, దేవుని బంధకాలను కూడా తెంచుకున్న అపవాది, “గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” ( I పేతురు 5:8) అనే లేఖనాన్ని చూచి, “సంకెళ్ళు తెంచుకున్న సాతాను” అని విమర్శకుల వ్యంగ్య అస్త్రాలను బైబిలు ఎదుర్కోవలసి వచ్చింది. బైబిలుకు నిజమైన శత్రువులు విమర్శకులుకారు; బైబిలుకు నిజమైన శత్రువులు లేనిపోని కథలు అల్లిన కథకులే!!
కవిత్వపు కథ :
అది క్రీ. శ 17వ శతాబ్ద ఆరంభంలో జాన్ మిల్టన్ అనే పేరు మోసిన ఒక ఆంగ్ల కవి ఉండేవాడు. అతడు ఆంగ్లంలోను లాటిన్ లోను కవిత్వం వ్రాసాడు. ఆంగ్లంలో ప్రసిద్ధిచెందిన రెండు కవిత్వపు రచనలకు కారకుడు. వాటిలో మొదటిది, Paradise Lost; రెండొవది Paradise Regain అనేవి. అందులో Debate at Pandemonium అనేది ప్రఖ్యాతగాంచిన భాగం. ఇవి అతని కలం కల్పించిన కల్పనయే. ఆ రచనలకు యితివృత్తం అతడు బైబిలు నుండి తీసుకున్నాడు. అతని కవిత్వం ఆ కాలంలోని విద్యావంతులపై బహుగా ప్రభావాన్ని కనుపరచింది. అది ఎంతవరకు చేరుకుందంటే, క్రీ.శ 1611లో King James V ఆధ్వర్యంలో బైబిల్ మొదటి ఆంగ్ల తర్జుమాను చూచింది. ఆ తర్జుమాలో “తేజో నక్షత్రమా” అనే ప్రయోగానికి “O Day Star” అనడానికి మారుగా, లాటిన్ పదమైన Lucifer అనే పద ప్రయోగం చేయబడింది.
లూసిఫర్ మిల్టన్ కల్పన
లూసిఫర్ అనేది John Milton రచనలో, సాతానుకు అతడు పెట్టిన పేరు. అది King James తర్జుమాలోనికి వచ్చిందంటే, అతని కవిత్వపు ప్రభావాన్ని పసిగట్టవచ్చు. అతని కవిత్వంలో అపవాది ఒక పడిపోయిన దూత, అపవాదితో పడద్రోయబడిన దూతలే - ఈ పాపం చేసిన దూతలనే విశ్వాసం జనులలో బలంగా నాటుకుపోయింది. ఇది John Milton కవిత్వమేగాని, బైబిలు సత్యంకాదు.
అయితే ఒకమాట. బైబిలు ప్రకారం అపవాది పడద్రోయబడిన దేవదూత అనేది మాత్రం వాస్తవం కాదు. పాపం చేసిన దేవదూతల సంగతి మనం చర్చించకముందు, అపవాది ఎప్పుడు? ఎందుకు? ఎలా? పడద్రోయబడ్దాడో ఆలోచిద్దాం. కథలు వద్దు. కవిత్వం అంతకంటే వద్దు. దైవ సత్యమే మనకీ విషయంలో కావాలి. గనుక లేఖనాలు జాగ్రత్తగా గమనించవచ్చు.
అపవాది ఒకప్పుడు దేవదూత కాదు:
బైబిల్ ప్రకారం, అపవాదియగువాడు ఎన్నడూ దేవదూతయైయుండలేదు. మళ్ళీ అంటున్నా, అపవాది మొదటిలో ఒక దేవదూత అనేది ఒక కల్పనా కథ మాత్రమే. బైబిలు ఇలా అంటుంది: “అపవాది మొదటినుండి పాపము చేయుచున్నాడు” (యోహాను 3:8). ”ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచినవాడు కాడు” (యోహాను 8:44). “కాగా సర్వలోకమును మోసపుచ్చుచును, అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము...” (ప్రకటన 12:9). దీనికి ముందు బైబిలు అపవాదిని గురించి మాట్లాడదు. అంతకుముందు అపవాదిని గూర్చి చెప్పబడినవన్నియు చమత్కారంగా కల్పించిన కథలే!
దేవదూతలతో కూడా అపవాది దేవుని సముఖమునకు ప్రవేశించునప్పుడు కూడా వాడు అపవాదియే కాని దేవదూత కాదు. గమనించు. “దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను” (యోబు 1:6) రెండవసారి కూడా అదే పరిస్థితి (యోబు 2:1-2).
దేవదూతలు దేవునితో కలసిన వేళ:
దేవదూతలతో కలసి అపవాది దేవుని సముఖానికివస్తే, దేవుడు వానిని అసహ్యించుకున్నాడా? లేక ఎందుకు వచ్చావని ఆయన ప్రశ్నించాడా? లేదే! అంతకు ముందు అపవాదియగు వాడు, పరలోక వాతావరణాన్ని అపవిత్ర పరచి, శత్రుత్వాన్ని పెంచుకొని, పరలోకపు దేవదూతలలో కొందరిని తన పక్షాన చేర్చుకొని, దేవునితో యుద్ధానికి దిగి, ఆ తరువాత పడద్రోయబడియుంటే, తిరిగి అపవాది పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు ఎందుకు సమ్మతించి యున్నట్టు? అలా సమ్మతించకపోతే, పిలువా పెట్టని పేరంటానికి వచ్చినట్టున్న అపవాదితో దేవుడు ఎలా సరసంగా సంభాషించాడు?
దేవదూతలు తన సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినాన, అపవాదియగువాడు వారితో కలిసివస్తే, తన సన్నిధికి వచ్చిన దూతలను పట్టించుకున్నట్టు కనిపించదు. అయితే పరమదేవుడు అపవాదితో పనికట్టుకొని మాట్లాడటం ఆశ్చర్యంగా లేదా? ఆ సందర్భంలో, అపవాది యోగక్షేమాన్ని ఆయన విచారించినట్టు కనిపిస్తుంది. “యెహోవా - నీవు ఎక్కడ నుండి వచ్చితివని అపవాదిని అడుగగా...” అపవాది ప్రత్యుత్తరమిచ్చాడు. తరువాత దేవుడు -”నీవు నా సేవకుడైన యోబును చూచితివా?...” అపవాది దానికి సుముఖంగా స్పందించలేదు.
దేవుని సేవకుడైన యోబుయొక్క స్థితి పై అపవాది అసూయను, అక్కసు, ద్వేషాన్ని వ్యక్తం చేసి, అతని పాడు చేయడానికి దేవుని ప్రేరేపించితే, యుద్దము, పతనం తరువాత కూడా యిలాటి కార్యాకలాపాలు చోటు చేసికొనడం ఎంతవరకు సమంజసం? అందువలన, అంతకుముందు ఎప్పుడో, ఎందులకో పరలోకం నుండి పడద్రోయ బడ్డాడన్న సిద్ధాంతపు బోధలో ఏదో తిరకాసు ఉన్నట్టు తేటపడుతుంది కదూ?
అపార్ధం చేయబడిన అపహాస్య గీతం:
అయినా అపవాది పడద్రోయబడ్డాడని ఈ సిద్ధాంతవాదులు చూప ప్రయత్నిచే లేఖనం యెషయా 14: 12-14. “తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమున కెక్కిపోయెదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తరదిక్కున నున్న సభాపర్వతముమీద కూర్చుందును. మేఘమండలముమీది కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా?”.
ఈ లేఖనాన్ని అపవాదికి వర్తింప జేయడం అసందర్భం. అసందర్భంగా లేఖనాలను వర్తింపజేయడం వాటిని అపార్ధం చేయడమే అవుతుంది. యెషయా 14: 12-14 లోని సందర్భం బబులోను రాజును గూర్చిన అపహాస్యపుగీతంలోని భాగమే. ఇది అపవాదిని గూర్చినది కాదు. యెహెజ్కేలు 28: 1-19 కూడా తప్పుగానే ఉపయోగించబడుతుంది. అది తూరు రాజుకు సంబంధించిన సందేశమే. అపవాదికి సంబంధించినది కాదు. ఇలాగున జనులు తమ స్వకీయ నాశనమునకు లేఖనాలను అపార్ధం చేస్తూ (2 పేతురు 3:16-17), తాము మోసపోతూ, నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుచున్నారు.
అపవాది పతనం:
అపవాది పతనం గూర్చి లేఖనాలు వేరుగా చర్చించాయి. యిప్పుడు మనం ఆలోచన చేద్దాం. భూలోకంలో దేవుని కుమారుని అవతరణ అనంతరం, ఆయన పరిచర్య ఆరంభంలో, తన 70మంది శిష్యులకు ఆయన ప్రసాదించిన అధికారం వలన, యేసు నామమున దెయ్యాలు వారికి లోబడుతున్నాయి. దీనితో అపవాది నడ్డివిరిచినట్టయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన - “సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుటచూచితిని. ఇదిగో పాములను తేళ్ళను త్రోక్కుటకును శత్రువు బలమంతటి మీదను అధికారము అనుగ్రహించియున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడియున్నవని సంతోషించుడని వారితో చెప్పెను” (లూకా 10:18-20). అయితే అది సాతాను యొక్క అంత్య పతనంకాదు. చిట్టచివరిగా, క్రీస్తు ప్రభువు తన మరణం ద్వారా వానిని నశింపచేస్తాడు (హెబ్రీ. 2:14-16). మెల్లగా సిలువ మరణం చెంతకు చేరుదాం.
”సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రింద చంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును” ఆమె గర్భిణియై ప్రసవవేదన పడుచుండెను. వివరాలకు ప్రకటన గ్రంధంయొక్క నా వ్యాఖ్యానం చూడు. స్త్రీ ఇశ్రాయేలు వంశం లేక కుటుంబానికి సూచనగా ఉంది (ప్రకటన 12:1-2; ఆది. 37: 9-10). ఇశ్రాయేలుల వంశం నుండి అవతరించిన మెస్సీయాను మ్రింగి వేయవలెనని మహా ఘటసర్పమొకటి కాచుకొనియుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి భూమిమీద పడవేసినంత పరిమాణంగలది. ఇంతకు ఈ మహాఘటసర్పము ఎవరోకాదు; అపవాదియే (ప్రకటన 12: 3-9).
సమయ సందర్భాలు తేటగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఊహలకు తావులేదు. ఇంతకు యిక్కడి వాస్తవ మేమంటే, క్రీస్తుయేసు వారి జన్మలోనే అపవాది ఆయనను నశింపజేయ ప్రయత్నించాడు. హేరోదుచేత వాడు చేయించిన ప్రయత్నం ఫలియించలేదు (మత్తయి 2:12-15). కాలక్రమంలో ఆయనను వశపరచుకోగోరి, అపవాది ప్రభువును శోధించాడు. అయితే ఆయనను జయించడం వాని వలన కాలేదు (మత్తయి 4:1-10; హెబ్రీ 4:15). ఆయన చేత పాపం చేయించాలనే వాని పన్నాగంలో, అపవాది వాని అనుచరులను ప్రయోగించాడు; అందులోను విఫలమయ్యాడు (మార్కు 11:53-54). అపవాది సంబంధులు, ప్రశ్నలతో ఆయనను వేటాడి, వేధించుట చాలించిన మీదట, ఆయన - “నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?” అని ఆయన వారి ఆటలను కట్టివేసాడు (యోహాను 8:46).
కడకు కల్వరి సిలువ హింసతో క్రీస్తును లొంగదీసుకోవాలనే పన్నాగంతో అపవాది ఆయనను సిలువలో ఎదుర్కొన్నాడు. పాతనిబంధన కాలంలో జరిగిన భక్తుల పాపాలకు పరిహారం కలుగలేదు (హెబ్రీ. 10:2-4), గనుక పరలోకానికి వెళ్లి, ఆనాటి విస్వాసులైన వారిపై అపవాది నేరం మోపుతూ ఉండేవాడు (ప్రకటన 12:10). భూజనులచేత పాపం చేయించి, భూలోకంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చేపట్టాడు (యోహాను 14:30; లూకా 4:6). ఈస్థితి యంతటినుండి వానిని కూలద్రోయడానికి రంగం సిద్ధం చేయబడింది. కల్వరి సిలువ దానికై నియమింపబడిన చోటు. తన మరణం ద్వారా క్రీస్తు అపవాదిని నశింపజేయ సిద్ధపడ్డాడు. (హెబ్రీ. 2:14-15).
మొదటగా, “మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధములనుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున” (హెబ్రీ. 9:15), పూర్వకాలపు విశ్వాసులపై నేరం మోపడానికి అపవాది సంపాదించిన హక్కు మంటగలసి పోయింది. అంటే, పరలోకంలోని దేవుని సముఖంలోనికి ప్రవేశించే హక్కును అపవాది శాశ్వతంగా కోల్పోయాడు. గనుక అక్కడినుండి వాడు పడద్రోయబడ్డాడు. దీనిని గ్రంధం యిలా వర్ణించింది.
“అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటిని. రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు...” (ప్రకటన 12: 7-10).
పడద్రోయబడింది దేవదూతలు కారు:
ఇక్కడ పడద్రోయబడిన వారు అపవాది వాని దూతలేగాని, అపవాదితో పడద్రోయ బడినవారు దేవుని దూతలు కారు. అలా పడద్రోయబడినవారు నేడు ఆకాశమందున్న దురాత్మల సమూహములై యుండనగును (ఎఫెసీ. 6:12). ఎందుకంటే పడద్రోయబడిన అపవాది ”వాయు మండల సంబంధమైన అధిపతియని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతియని సూచింపబడ్డాడు”(ఎఫెసీ. 2:2).
ఇంతకు పాపం చేసిన దూతలెవరు? వారు చేసిన పాపమేమిటి? అనే విషయాలు బయలుపడలేదు. పరలోకంలో అపవాది గర్వించాడని, దేవదూతలలో కొందరిని తన పక్షముగా చేర్చుకున్నాడని వారే పడిపోయిన దూతలనే కథను బైబిలు అంగీకరించలేదు; అంగీకరించదు కూడా. అయినా, మన చర్చలోని దేవదూతలు పాపం చేసినవారు; లేక “తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాసస్థలమును విడచిన దేవదూతలు” దీనినుండి మనదృష్టి మరోవైపు మరల్చకూడదు. ఇంతకు పాపం చేసిన ఆ దూతలెవరు? వారు చేసిన పాపమేమి?
“దూత” అనే పదం క్రొత్త నిబంధనలో ఎలా ప్రయోగింపబడినదో చూద్దాం. “నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని” (ఫిలిప్పీ. 2:25). ఎపఫ్రొదితు దేవదూతకాడు సుమీ! అతడు ఫిలిప్పీ సంఘపు దూతమాత్రమే. అయితే దూత అంటే, ఒకరి పక్షముగా మరియొకరికి సందేశం తెచ్చినవాడును; ఉపచరించిన వాడునైన వ్యక్తియే. ఈలాటి వానిని “దూత” అని గ్రంధం సంభోదించింది.
దేవదూతలను గూర్చిన బైబిలు ప్రయోగం :
తనకు అనుగ్రహింపబడిన ప్రాధాన్యతను నిలబెట్టుకొనక భ్రష్టులైన నరులను బైబిలు పాపం చేసిన దేవదూతలంది. వారిలో మొదట యాజకులు, ప్రవక్తలు, రాజులు లేక అధిపతులు వగైరాలు ఉన్నారు. అయితే యిలా మనం ఊహించడం ధర్మంకాదు; గ్రంధమే విషయాన్ని బయటపెట్టాలి. అంతవరకు పరిశీలించుదాం.
ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిన తరువాత, అరణ్య ప్రయాణకాలంలో దేవుడు లేవీయులకు ప్రత్యేక గుర్తింపునిచ్చాడు. లేవీయులు ఇశ్రాయేలు సంఖ్యలో చేర్చబడక ప్రత్యేకింపబడ్డారు. (సంఖ్యా. 1:47-49). ప్రత్యక్షగుడారపు పని వారికి అప్పగింపబడింది (సంఖ్యా. 1:50-51). ఇశ్రాయేలీయులలో తొలిచూలుయైన ప్రతి మగపిల్లకు మారుగా, లేవీయులను దేవుడు తనసొత్తుగా చేసికొనియున్నాడు; ఆయన వారిని తనకొరకు ప్రతిష్టించుకున్నాడు. “వారు నా వారై యుందురు. నేను యెహోవాను” అని వ్రాయబడింది (సంఖ్యా. 3: 11-13).
లేవీయులలో నుండి అహరోను సంతతి వారికి యాజకత్వం అప్పగించబడింది. వారు ఇశ్రాయేలీయులను దీవించు ఆధిక్యతను పొందియున్నారు (సంఖ్యా. 6: 23 - 26). మరియు ప్రత్యక్ష గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును, వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, వారిలో లేవీయులైన అహరోనుకును అతని కుమారులకును యాజకత్వం దేవుడు అప్పగించియున్నాడు. అందువలన “ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును” (సంఖ్యా. 8: 19-29).
యాజకులు ప్రజలలో యజమానులు(లేవీయ. 21:4). వారు యెహోవాకు హోమద్రవ్యము నర్పించువారు (లేవీయ. 21: 8-9). వారు దేవుని అభిషేకతైలమను కిరీటముగలవారు (లేవీయ. 21: 12). యెహోవా మందిరపు సేవచేయడానికి లేవీయులు నియమించబడ్డారు. అదేమి స్వల్ప కార్యంకాదు (సంఖ్యా. 16:9). దానికంటే మరి ఘనమైనది యెహోవాకు ధూపంవేయుట! ధూపంవేయుటకు ప్రతిష్టింపబడినవారు యాజకులు (2 దినవృ. 26: 18). కనీసం అభిషేకింపబడిన రాజులు సహితం దానికి యోగ్యులు కారు. ధూపంవేసే వాడు ఘనుడుగాను, పరిశుద్ధుడుగాను ఎంచబడతాడు. అది బహుగా కోరదగినదైయున్నట్టు కోరహును అతని అనుచరులు భావించి, ఆ పని కొరకు తిరుగుబాటుచేసి శిక్షింపబడ్డారు(సంఖ్యా. 16: 1-15).
యాజకునికి యజమానుడు, ప్రతిష్టితుడు, పరిశుద్ధుడు అనే గుర్తింపులుంటాయి (లేవీయ. 21: 3-9). ప్రజల నిమిత్తము అతడు ప్రాయశ్చిత్తము చేయువాడై యుంటాడు, ప్రజలయొద్దనుండి దశమాంసములను పొండువాడైయుంటాడు. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అర్హతగలవాడై యుంటాడు. యెహోవాకు హోమద్రవ్యమును ఆహారమును అర్పించువాడై యాజకుడుంటాడు (లేవీయ. 21: 8-9). ఇశ్రాయేలులో ఎంతో ప్రధానత్వం గలవారు యాజకులు. ఆ యాజకులను గూర్చి అసందర్భంగా మాట్లాడుతున్నానని నీవు భావించ పనిలేదు. అసలైన సంగతియిదే! ఇంతకు పాపంచేసిన దేవదూతలు, తమ ప్రధానత్వమును నిలుపుకోనక తమ నివాస స్థలమును విడచిన దేవదూతలు వీరేయని లేఖనం వివరిస్తుంది; ఇది నీకు వింతగాను, విడ్డూరంగాను కన్పించినా, బైబిలు ఈ విషయంలో బోధించే సత్యమిదే! గ్రంధం చూడు.
పడిపోయిన దేవదూతలు :
“యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు దూతలు” యెహోవా దూతలన్నా, దేవదూతలన్నా ఒక్కటేగదా? అందులో వ్యత్యాసమేమైనా ఉందా? లేదుగదా!! అయితే లేఖనాన్ని మరోసారి చూడు; “యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను” అయితే (ఏమిజరిగిందట?) “అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి, లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసియున్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమునుబట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింప దగినవారినిగాను నీచులనుగాను చేసియున్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు” (మలాకీ 2: 7-9). ఇక్కడ ఏమిజరిగిందో గమనించావా? లేకుంటే, తిరిగి గమనించు;
1. పాపం చేసిన దేవదూతలు, అహరోను సంతతివారైన యాజకులని పరమదేవుడు సూచించాడు.
2. ప్రజలలో యజమానులు, ప్రతిష్టితులు, పరిశుద్ధులు అనే తమ ప్రధానత్వంను నిలుపుకొనక పక్షపాతులుగాను జనులందరి దృష్టికి తృణీకరింపబడిన వారుగాను, నీచులుగాను చేయబడ్డారు (మలాకీ 2:9). వారు తమ ఔన్నత్యస్థితిని మార్గం తప్పడం వలన కోల్పోయారు (మలాకీ 2:8). “అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు” (యిర్మియా 6:13).
“ఘోరమైన భయంకరకార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు?” అని దేవుడు అడుగుచున్నాడు (యిర్మియా 5:30-31).
పాపం చేసిన దేవుని దూతలు ఈలాటి యాజకులే! “దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను” (2 పేతురు 2:4), లేదా, “మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను” (యూదా 6).
కృపపొందియు హెచ్చింపబడిన లేవీయ యాజకులు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పోతే, నేడు క్రీస్తునందు అత్యంత కృపకును, హెచ్చింపునకును పాత్రులనుగా మేల్కిసెదెకు క్రమము చొప్పున (రాజులైన యాజకులుగా) చేసిన దేవుని యెదుట మనం పాపం చేస్తే, మన గతి యికనేమై యుంటుందో ఆలోచించుకొని, భయభక్తులతో బ్రతుకుట ఏంతో అవసరమైయుంది, యింతకు అక్కడ సందేశం అదే.
“మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును” (హెబ్రీ. 10: 26-27). మరి నీ సంగతి ఏంటి?
“దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచి పెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను” అని వ్రాయించింది (2 పేతురు 2:4), కాకమ్మ కథలు చెప్పుకొని జ్ఞానులమనుకొని భ్రమపడుతూ, ప్రగల్భాలు పలుకుతూ కాలం గడపడానికి కాదు సుమీ. అది క్రైస్తవులకు కఠినమైన హెచ్చరికగా ఉండ ఉద్దేశింపబడినదై, తమ జీవితాలను తాము పరీక్షించుకుంటూ, తమ ప్రధానత్వం నిలుపుకోని యాజకులు పడిపోయినట్టు, మనమును భ్రష్ఠులము కాకుండా భద్రం చేసికొంటామని సర్వ కృపానిధియగు దేవుడు ఆ మాటలను మనకు హెచ్చరికలుగా నిలిపాడు. గమనించు.
జి. దేవదానం
Good information brother thank you very much .. Vandanaalu
ReplyDeleteఈ లోకం లో ఉన్న కల్పన కథలు వాస్తవాలుగ నమ్ముతున్నారు ! బైబిల్ నిజ సత్యం తెలియజేసినందుకు వేలాది వందనాలు
ReplyDeleteVandanamulu..sir
ReplyDeleteChala chakkaga vivarincharu brother vandanalu
ReplyDelete