Thursday 24 November 2016

సందేశములు-1



Click the title to open message ☟

1. భక్తి గల వారియెడల దేవుని బాధ్యత ఏమిటీ?
    సరైన మార్గం తెలియక, సత్యాన్వేషణలో కొట్టిమిట్టాడుతున్న భక్తిపరులను దేవుడే వెతుకుతున్నాడు. అంతేకాదు భయభక్తులు కలిగి దేవునిని వెతికేవారు ఎవరైనా ఉంటే వారికి సరైన మార్గం చూపించే బాధ్యత దేవునిదే, ఇది వాస్తవం. గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది. కీర్తన 25:12లో "యెహోవా యందు భయభక్తులుగలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును". ఈ వాక్య భావమేంటంటే నీవు దేవుని యందు భయభక్తులు గలవాడవైతే నీవు ఏ మార్గం కోరుకోవాలో దేవుడే బోధిస్తాడు. ఇది వాస్తవమైన సమాచారం. నీకు సరైన మార్గం చూపించాల్సిన బాధ్యత నాదేనన్నట్టుగా దేవుడు గ్రంథంలో సమాచారం తెలియజేశాడు. దీనికి నిదర్శనంగా క్రొత్త నిబంధన నుంచి రెండు ఉదాహరణలు పరిశీలిద్దాం.

మొదటి ఉదాహరణ:
    ఐతియొపీయు దేశంలో రాణియైన కందాకే దగ్గర మంత్రిగా పనిచేస్తున్న నపుంసకుడు, ఇతడు ఆర్ధిక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఇతడు భక్తిపరుడు, ఆరాధించడానికి యెరూషలేంలో ఉన్న మందిరానికి వస్తున్నాడు. ఐతియొపీయ నుంచి యెరూషలేం రావడమంటే సామన్యవిషయం కాదు, యెరూషలేం రావాలంటే మూడు దేశాలు దాటి రావాలి, మొదటిగా ఫిలిస్తీయుల దేశం, తర్వాత యూదా దేశం, ఆ తర్వాత యెరూషలేం రావాలి. అంటే ఐతియొపీయ, ఫిలిస్తీ, యూదా దేశాలు దాటుకుని ఆరాధించడానికి యెరూషలేం వస్తున్నాడంటే అతడు ఎంత భక్తిపరుడో వేరే చెప్పక్కర్లేదు. మనం ఉన్న ప్రాంతం నుంచి ఆరాధనకు రావడానికే ఎన్నో సాకులు చెపుతూఉంటాం. బస్సు దొరకలేదనో, ట్రాఫిక్ జామైందనో సాకులు చెబుతాం. కాని నపుంసకుడు ఆరాధించడానికి మూడు దేశాలు దాటి వెళ్తున్నాడంటే సామన్య విషయం కాదు. అప్పుడేమైనా విమానాలు, వాహనాలు ఉన్నాయంటే ఏమీలేని పరిస్థితి అయినా తన సొంత రథం మీద యెరూషలేం బయలుదేరి వచ్చాడు. యెరూషలేంలో ఆరాధించి తిరిగి వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ప్రయాణంలో ఖాళీగా ఉండలేదు! యెషయా గ్రంథాన్ని చదువుతూ వెళ్తున్నాడు. చదువుతున్నాడుగాని సంగతులు అర్థంకావట్లేదు. ఒక మంత్రి ఎంత బిజీగా ఉంటాడో మనకందరికి తెలుసు. సహజంగా దేశం గురించో ప్రజల బాగోగుల గురించో ఆలోచించాల్సిన మంత్రి దైవాన్వేషణ చేస్తున్నాడు.  ఈ భక్తిపరుడు గ్రంథాన్ని చదువుతున్నాడు గాని సంగతులు గ్రహించలేకపోతున్నాడు. ధర్మశాస్త్రమును క్రీస్తుప్రభు నెరవేర్చి సిలువలో మేకులతో కొట్టివేసి చేవ్రాతను తుడిచివేసి అడ్డం లేకుండా ఎత్తివేసి పెంతుకోస్తు దినాన కొత్తనిబంధన ప్రారంభించబడినదని, క్రొత్తనిబంధన ప్రకారం ఆరాధన చేయాలని తెలియనివాడు. అందుకోసమే దేవుడు తన బాధ్యతగా జోక్యం పుచ్చుకున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏమిటంటే భక్తిగల వారు ఆరాధన అంటే విసుగు చెందరు, గ్రంథపరిశీలనకు దూరం కారు.

    మొదటిశతాబ్ధపు క్రైస్తవులు ఏది పడితే అది నమ్మేవారు కాదు, దేన్నైనా పరిశీలనగా తెలుసుకునేవారు. గ్రంథంలో అలా ఉన్నవో లేవో ప్రతి దినం లేఖనాలను పరిశోధించేవారు. నేటి క్రైస్తవులుగా, గ్రంథంలో అలా ఉన్నవో లేవోనని పరిశీలించాల్సిన బాధ్యత మనదే. బెరియలో ఉన్న క్రైస్తవులు పౌలు, సీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవనని గ్రంథాన్ని పరిశోధించేవారు. అపొ 17:11లో "వీరు థెస్సలొనికలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి". కాబట్టి భక్తి కలిగిన వారు లేఖనాలు పరిశీలిస్తారు.

    నపుంసకుడు గ్రంథం చదువుతున్నాడు కాని సంగతులు అర్థంకావట్లేదు. వెంటనే పరమదేవుడు కలుగజేసుకుని ఫిలిప్పు‌ను పురుకొల్పి నపుంసకుడి దగ్గరకు వెళ్లమన్నాడు. ఫిలిప్పు పరుగెత్తుకుని వెళ్లి నపుంసకుడిని చేరుకుని నీవు చదువుతున్నది అర్థం అవుతుందా? అని ప్రశ్నించాడు. వాస్తవంగా ఇక్కడ గమనించాల్సిన సంగతి ఒకటుంది. నపుంసకుడి స్థాయి పెద్దది, కాని ఫిలిప్పును నీవెవడివని ఎదురించలేదు. నాకు తెలియజెప్పేవారుంటే కదా! అని శాంతహృదయంతో అడిగాడు. ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడో నాకు అర్థంకావట్లేదని నపుంసకుడు అడుగగానే, ఫిలిప్పు రథం మీదకు ఎక్కి ప్రభువైన క్రీస్తును గూర్చిన సువార్తను తెలియజేశాడు. అపొ 8: 27-34 వరకు "అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రియై ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూష లేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను. ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా?దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను"

    ఫిలిప్పు నపుంసకుడికి యేసు క్రీస్తు సిలువ మరణం గురించి తెలియజేశాడు. అంటే క్రీస్తు ప్రభువు మరణం దేని గురించో వివరంగా తెలియజేశాడు. 1వ పేతురు 2:24లో "మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసి కొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి". రోమా 6: 6, 7 వచనాల్లో "ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతోకూడ సిలువవేయ బడెనని యెరుగుదుము. చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పు పొందియున్నాడు". ఇలా యేసును గూర్చిన సందేశాన్ని ఫిలిప్పు నపుంసకుడికి తెలియజేశాడు. ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయాలని, నువ్వు చదువుతుంది క్రీస్తు ప్రభువు బలియాగం గురించి అని, ఆయన నీ కొరకు చనిపోయాడని సంగతులు తెలియజేయగానే, మార్గమధ్యలో నీళ్లు కనబడగానే అవిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమేంటని నపుంసకుడు అడగగానే ఫిలిప్పు అభ్యంతర పరిచాడు. ఎందుకంటే అసలు నీ నమ్మకం ఏంటని ప్రశ్నించాడు. నపుంసకుడు నేను యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్ముచున్నానని అనగానే అయితే నేను బాప్తిస్మం ఇస్తాను అన్నాడు ఫిలిప్పు. అపొ 8:38 "వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు-ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు-నీవు పూర్ణహ‌ృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పను, అతడు-యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు-నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను". నపుంసకుని విశ్వాసం సరిగా ఉందని తెలియగానే, ఇద్దరు నీళ్లలోకి దిగి, నపుంసకుడికి ఫిలిప్పు బాప్తిస్మమిచ్చెను. ఇది గ్రంథం తెలియజేసిన సమాచారం.

రెండో ఉదాహరణ:
    తార్సు వాడైన సౌలు, ఇతడు భక్తిగలవాడు, ధర్మశాత్రమందు నిష్టాగరిష్టు గలవాడు, ఇతడు క్రీస్తు ప్రభువు సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు. సౌలు ఇలా చేయడానికి ఒక కారణముంది. అదేమిటంటే ధర్మశాత్రంలో ఒక నియమం ఉంది. దేవునితో నీకున్న సంబంధాన్ని ఎవరూ చెడగొట్టకూడదు. అలా చెడగొడితే చంపేయమని ఆజ్ఞ ఉంది. అందుకోసమే సౌలు సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. యెహోవా దేవుడు కాకుండా, ఈ యేసెవరు?, యేసు చేస్తున్న అద్భుతాలు కళ్లముందే జరగడంతో ఆయనను వెంబడించే క్రైస్తవుల్ని చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడు. సౌలు ఇలా చేయడానికి కారణం. ద్వితీయో 13:1-8 వరకు "ప్రవక్తయేగాని కలలు కనువాడేగాని నీ మధ్యలేచి నీ యెదుట సూచక క్రియనైనను మహత్కార్యమునైనను చేసి, నీవు ఎరుగని యితర దేవతలను అనుసరించి పూజింతము రమ్మని చెప్పినయెడల అతడు నీతో చెప్పిన సూచక క్రియగాని మహత్కార్యముగాని సంభవించినను ఆ ప్రవక్తమాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలిసికొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల ననుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని యుండవలెను. నీవు నడవవలెనని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించిన మార్గములోనుండి నిన్ను తొలగించునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి దాస్యగృహములోనుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త కేమి ఆ కలలు కనువాని కేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు నీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. నీ తల్లి కుమారుడేగాని నీ సహోదరుడేగాని నీ కుమారుడేగాని నీ కుమార్తెయేగాని నీ కౌగిటి భార్యయేగాని నీ ప్రాణస్నేహితుడేగాని భూమియొక్క యీ కొన మొదలుకొని ఆ కొనవరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగానుండినను, నీ చుట్టునుండు జనముల దేవతలలో నీవును నీ పితరులును ఎరుగని యితర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన యెడల ​వారి మాటకు సమ్మతింపకూడదు; వారిమాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు; వారియందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు; అవశ్యముగా వారిని చంపవలెను". సౌలు మనసులో ఈ వాక్యం నాటుకుపోవడం వల్లే సంఘాన్ని హింసించేవాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చేస్తున్న అద్భుతాలు, స్వస్థతలు కళ్లకు కట్టినట్లుగా కనిపించడం అతన్ని విభాృంతికి గురిచేసింది. అంటే యెహోవా దేవుడు కాకుండా ఈ యేసుక్రీస్తు ఎవరని కోపంతో రగిలిపోయేవాడు. ఈ కారణంగానే యేసును వెంబడించే ప్రతీ వ్యక్తిని చంపకుండా ఊరుకునేవాడు కాదు. ఇప్పుడు సౌలునకు క్రొత్త నిబంధన తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. మరి సౌలుకు చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? ఆ బాధ్యత దేవుడే తీసుకున్నాడు. కాబట్టే దేవుడు నేరుగా యేసు క్రీస్తును లైన్లోకి తీసుకొచ్చాడు. సౌలునకు యేసు క్రీస్తు అనాది మర్మాన్ని తెలియజేశాడు. 

    నీవు యెహోవా యందు భయభక్తులు గలవాడవైతే నీకు సరైన మార్గం తెలియజేసే బాధ్యత ఆయనదే. దేవుడు మానవులలో యధార్థంగా జీవించేవారిని పరిశీలిస్తాడు. ఎందుకంటే మార్గం గురించి తెలియజేయాల్సిన బాద్యత ఆయనదే. సౌలు క్రీస్తు దర్శనం వల్ల దేవుని మర్మాన్ని తెలుసుకున్నాడు. ఎఫెసీ 3:1-3 వరకు "ఈ హేతువుచేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని"

    సౌలునకు యేసు క్రీస్తు అనాది మర్మమును తెలియజేశాడు. అపొ 9:1-6 వరకు "సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి యీ మార్గ మందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన యెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. అప్పుడతడు నేలమీదపడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును; లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను". దర్శనంలో సౌలునకు అనాది మర్మం తెలియజేయగానే అయ్యో ఇదా సత్యం? ఇంతకాలం గ్రహించలేకపోయనే అని సౌలు కుమిలిపోయాడు. మనసారా ఏడుద్దామన్న కళ్లు రాకపోయాయి. మూడు దినములు అన్నపానములు లేక తను చేసిన నీచమైన కార్యాలను తలచుకుంటూ కుమిలిపోయాడు. ఇంతలో దేవుడు అననీయ అనే శిష్యుడ్ని సౌలు దగ్గరకు వెళ్లమంటే అననీయ భయకంపితుడవుతాడు. 'ప్రభువా, అతని దగ్గరకా పరిశుద్ధుల్ని చంపిన వాడు' అనగానే, దేవుడు వెళ్లమని ఆదేశిస్తాడు. అపొ 8: 10-18 వరకు "దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయా, అని అతనిని పిలువగా అతడు ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచి యున్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి యున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు. ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృష్టి పొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్ల నన్ను పంపి యున్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను"
    నీవు నిజంగా భక్తిపరుడవైతే దేవుడే ఆయన మార్గం గురించి తెలియజేస్తాడు. ఆయనను అంగీకరించే భక్తి నీకుంటే మార్గం చూపిస్తాడు. గ్రంథం నుంచి రెండు ఉదాహరణలు చూశాం. వాస్తవ సమాచారం ఏంటంటే ఆయన మార్గముల గురించి పరిశోధిస్తూ ఉంటే, దేవుడే తన మార్గముల గురించి తెలియజేస్తాడు. తర్వాత నీ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. యెషయా 45:17లో "నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధదేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును". దేవుడు నీకు మార్గం చూపించాక ఆయన నీకు బాధ్యత అప్పగిస్తాడు. ఆ బాధ్యతను సక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. సామర్థ్యం + అవకాశం = బాధ్యత (Ability + Opportunity =Responsibility), అనగా దేవుడు నీకు సామర్థ్యం అవకాశం ఇచ్చినతరువాత అది నీ బాధ్యత అవుతుంది. పౌలు అనబడిన సౌలు మార్పు చెంది మారిన తర్వాత తన బాధ్యతను ఎలా నెరవేర్చాడో గ్రంథాన్ని పరిశీలిద్దాం. అపొ 9:20లో "వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను". దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా చేయాలి, బాధ్యతను విధేయతతో చేయాలి, విశ్వసించి విధేయత చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే శిక్షార్హులవుతారు. పౌలు తెలియక చేశాను కాబట్టే క్షమింపబడ్డాను అన్నాడు. 1వ తిమోతి 1:12లో "​పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై యున్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని" అని తెలియజేశాడు. 
    దేవుడు నీ పట్ల బాధ్యతగా ఉన్నాడు. మరి నీవు బాధ్యతగా ఉండవా? నువ్వు కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతీవాడికి బాధ్యత ఉంది. వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునిని ఆనందింపజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న సంగతి గుర్తెరిగి జీవిద్దాం.
    ఇప్పుడు క్రైస్తవులు తెలియక చేశాను అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే సత్యం వినిపించబడుతుంది. గ్రంథాన్ని పరిశోధించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. తెలియదంటే కుదరదు. దేవుడు నీకనుగ్రహించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే శిక్షార్హులే. ఎందుకంటే యేసు క్రీస్తు మాట్లాడుతూ ఇలా అన్నాడు. యేసు క్రీస్తు కపెర్నహూమా ప్రాంత వాసి, ఆనాడు ప్రజలు యేసు క్రీస్తు మాటలను లెక్కచేయలేదు. సమయముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఆ తర్వాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. మత్తయి 11: 20-24 వరకు "పిమ్మట ఏ యే పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములవారు మారుమనస్సు పొందకపోవుటవలన ఆయన వారి నిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారు మనసు పొందియుందురు. విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొ మలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును. విమర్శదినమందు నీ గతికంటె సొదొమ దేశపువారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాననెను"

    బాధ్యత ఉంటే సత్యాన్వేషణ చేయాలి. సత్యాన్వేషణ గురించి గ్రంథం నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. సొలొమోను జ్ఞానం గురించి షేబ దేశాపు రాణి ఏదో తెలుసుకుందంటా. అంతే వెంటనే సొలొమోను దగ్గరకు వచ్చేసింది. అసలు నిజంగా సొలొమోను జ్ఞానవంతుడేనా? ఏదో తెలిసిందిలే కదా అని విని విడిచిపెట్టకూడదు, సత్యాన్వేషణ చేయాలి. లేదంటే దేవుడు విమర్శిస్తాడు. మత్తయి 12:42లో  "విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు". షేబ దేశపు రాణి సత్యాన్వేషణ చేసింది. అలాగే నీవు కూడా సత్యాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. ఆమె పరిశీలనగా తెలుసుంది. సొలొమోను గురించి తెలియగానే నేనే స్వయంగా పరీక్షిస్తానంది. కాని సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడన్న సంగతి మరిచిపోవద్దు. ఆయనను గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే నీవు మారుమనసు పొందాల్సిన ఆవశ్యకత ఉంది. యేసు క్రీస్తు ఎందుకొరకు మరణించాడో నీవు ఎరుగాల్సిఉంది. ఆయన నీ పాపముల కొరకు చనిపోయాడన్న సంగతి మరువద్దు.

    నీవు బాధ్యతగా బ్రతకాల్సిన అవసరం ఉంది. నీవు మారుమనస్సు పొందకపోవుట నేరం. యేసు ఒక ఉదాహరణ చెప్పాడు. యోనా ఒక అవిధేయుడైన ప్రవక్త, విధేయుడు కాదు, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్లమంటే మరొక ప్రాంతానికి వెళ్లడానికి ఓడ ఎక్కినవాడు.  కనుక మనం అలా కాకుండా ఉండేందుకే మృతుల్లోంచి లేచిన యేసును గుర్చి తెలుసుకోవడం అవసరం ఉంది. మానవ జన్మ ఎత్తిన కారణాన మనకు బాధ్యత ఉంటుంది . సత్యాన్ని సత్యంగా తెలుసుకొనడంలో బాధ్యత ఉంటుంది, విధేయత చూపటంలో బాధ్యత ఉంటుంది, తప్పు మార్గంలో నడుస్తూ ఉంటే సరైన మార్గం తెలుసుకోవలసిన బాధ్యత ఉంటుంది. దేవుని ఆనందింపచేసే బాధ్యత ఉంటుంది. పరమందున్న దేవుడు నిన్ను బాధ్యుడుగా ఎంచుతున్నాడు నీకు బాధ్యత వహిచడం నేర్పిస్తున్నాడు. 
2. మనుష్యు లందరి కంటె దౌర్భాగ్యులు ఎవరు?
ఈరోజుల్లో అనేకమంది క్రీస్తు కోసం నిరీక్షిస్తున్నారు జీవితకాలం మట్టుకే! క్రీస్తునందు నిరీక్షణ ఆర్యోగం కొరకు జీవితకాలం మట్టుకే! ఐశ్వర్యం కొరకు జీవితకాలం మట్టుకే! మంచి హోదా జీవితకాలం మట్టుకే! ఈరోజు అనేక మంది క్రీస్తు ప్రభువును ఇలా ఉపయోగించు కుంటున్నారు. ఇలాంటి వారందరి గురించి పరిశుద్ధాత్ముడు ఏం చెబుతున్నాడంటే. 1వ కొరింథి 15:19లో ‘‘ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటే దౌర్భాగ్యులమై యుందుము’’. ఈ భూమ్మీద దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారనంటే ఈ జీవితకాలం మట్టుకే అంటే మరణం వరకే క్రీస్తునందు నిరీక్షించు వారు మనుష్యులందరి కంటే దౌర్భాగ్యులు. మానవ జాతికి క్రీస్తును అనుగ్రహించింది ఈ జీవితకాలానికి సంబంధించింది కాదు. చావు తర్వాత యుగయుగములు దేవునితో ఉండే నిరీక్షణ అనుగ్రహించాడు. క్రీస్తు భూమిమీద జీవించిన రోజుల్లో అవసరాలు తీర్చుకోవడానికి యేసును వెతికినట్లుగా ఈ రోజుల్లో కూడా మనుషులు భౌతికమైన వాటికోసమే క్రీస్తును వెతుకుతున్నారు. క్రీస్తుబలి ద్వారా అనుగ్రహించబడిన ఈ నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకు కాదు. భౌతికమైన దీవెనల కోసం నీ నిరీక్షణ ఉంటే నీవు దౌర్భాగ్యుడవే. 
ఉదాహరణకు - అది ఒండ్రు మట్టి  ఉన్న గ్రామం. వర్షం పడింది. మొత్తం బురదైపోయింది. నడవలేని పరిస్థితి. ఒక మనిషి బాగా చిత్తుగా తాగాడు, నడుస్తూ బురదలో జారిపడ్డాడు. పడ్డాక వాంతు అయ్యింది. దాంట్లో ఆ మనిషి పొర్లాడుతున్నాడు. ఆ మనిషిని చూసిన వారు దౌర్భాగ్యుడన్నారు. కాని గ్రంథం వాడిని దౌర్భాగ్యుడని అనడం లేదు. ఎవడ్ని దౌర్భాగ్యుడంటుంది అంటే ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షించువాడిని దౌర్భాగ్యుడు అంటుంది. బౌతికంగా ఆలోచించే వాడెవడైనా అందరికంటే దౌర్భాగ్యుడు. నీకేమైనా హోదా ఉందా? అది ఈ జీవితకాలం మట్టుకే! లేకపోతే గుండె తీసి ఇంకో గుండె పెట్టారా? అది కూడా ఈ జీవిత కాలం మట్టుకే! నీకు ఈ భూమ్మీద ఏమొచ్చినా ఈ జీవితకాలం మట్టుకే అన్న సంగతి మరిచిపోవద్దు.

క్రైస్తవుడు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి?
జీవంతో కూడిన నిరీక్షణ:
క్రైస్తవుడు జీవంతో కూడిన నిరీక్షణ కలిగి ఉండాలి. గ్రంథం ఈ విధంగా తెలియజేస్తోంది. 1వ పేతురు 1:4లో ‘‘మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను’’. జీవముతో కూడిన నిరీక్షణ ఎవరికి ఉంటుంది అంటే మరల జన్మించిన వారికి మాత్రమే ఉంటుంది. మరల జన్మించడమంటే ఒకసారి తల్లి గర్భంలో జన్మించావ్, కాని దేవుడు మరల జన్మింపజేస్తానంటున్నాడు. అదెలాగు అంటే పునర్జన్మసంబంధమైన స్నానం ద్వారా జన్మింపజేస్తాడు. 1వ పేతురు 1:21లో ‘‘మీరు క్షయబీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు’’. అంటే దేవుడు వ్యాకమనే బీజం ద్వారా నిన్ను జన్మింపజేశాడు. ఒకవేళ ప్రభువైన యేసు మృతుల్లోంచి లేవకపోతే క్రైస్తవుడు లేడు అసలు విశ్వాసం లేదు. యేసు మృతుల్లోంచి లేవడం వల్లే క్రైస్తవుడికి నిరీక్షణ దొరికింది. 1వ కొరింథి 15: 15-17 వరకు ‘‘దేవుడు క్రీస్తును లేపెనని, ఆయననుగూర్చి మేము సాక్ష్యము చెప్పియున్నాము గదా? మృతులు లేపబడనియెడల దేవుడాయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. మృతులు లేపబడని యెడల క్రీస్తుకూడ లేపబడలేదు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు’’. క్రీస్తు మృతుల్లోంచి తిరిగిలేచుట వలన క్రైస్తవుడి నిరీక్షణకు ఒక ఆధారం దొరికింది.
                               
వాస్తవ సమాచారం ఏంటంటే తరాలుగా మేధావులు తలలు పగులగొట్టుకొని సాధించింది ఏమిటంటే చావు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటారు. చావు దగ్గర ఆగిపోయిన కాలం అజ్ఞాన కాలం. అప్పుడు దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు. అపొ 17: 30, 31లో ‘‘ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు’’. యేసు క్రీస్తు మృతుల్లోంచి లేచుట వలన మనకు జీవంతో కూడిన నిరీక్షణ  వచ్చింది. లేకపోతే మనకు నిరీక్షణ ఎక్కడది? 
జీవంతో కూడిన నిరీక్షణ అనేది దేవుని సంబంధులకు మాత్రమే, అంటే క్రీస్తు నందు మరల ఎవరు జన్మిస్తారో వారికి మాత్రమే. ఇంతకి మరల జన్మింపజేసేది ఎవరంటే దేవుడే. 1వ పేతురు 1: 4లో ‘‘మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్థము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింప జేసెను’’. మొదటి సారి తల్లి గర్భంలో జన్మిస్తే రెండోసారి దేవుని రాజ్యంలో జన్మింపజేసింది దేవుడే. నీవు మరల జన్మింపకపోతే దేవుని బీజము వలన పుట్టినవాడవు కాదు. ఇది గ్రంథం చెబుతున్న వాస్తవ సమాచారం. 
నీకొదేము అనే ఒక పరిసయ్యడు ఉన్నాడు. అతడు బోధకుడు. మరల జన్మించిన అనుభవం లేదు. అతనితో యేసు మాట్లాడుతూ. ఒకడు నీటిమూలముగాను, ఆత్మమూలముగాను జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడన్నాడు. అందుకు నీకొదేము ముసలివాడినైన నేను మరల తల్లి గర్భంలో ఎలా వెళ్లగలను అని ప్రశ్నించాడు. అందుకు యేసు బోధకుడివైయుండి ఈ సంగతులు ఎరుగవా? అని ప్రశ్నించాడు. యోహాను 3:1-10 ‘‘యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. అందుకు నీకొదేము ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బ మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నీకొదేము ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా?’’. ఈ సంగతులను బట్టి కచ్చితంగా రెండోసారి జన్మిస్తేనే దేవుని రాజ్యంలో ప్రవేశం ఉంటుందన్న సంగతి స్పష్టం. కనుక రెండోసారి జన్మించిన వాడికే నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ అంటే నీకు నీ తండ్రి ఆస్తిలో నీకు స్వాస్థ్యం ఉంటుంది. నీ తండ్రి ఆస్తిలో నీకు వాటా ఉందంటే నీవు ఎంత గొప్పోడివో ఆలోచించు. ఎఫెసీ 1::13, 14లో ‘‘మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు’’. దేవుని మూలంగా పుట్టిన వాడికే ఈ స్వాస్థ్యం ఉంటుంది. నిరీక్షణ అంటే విశ్వాసంతో ఎదురుచూచుట. ఒకటి తండ్రి ఆస్తిలో వాటా ఉందని నిరీక్షణ, రెండోది ఈ దేహం యొక్క విమోచన కొరకు ఎదురుచూచుట. క్రైస్తవుడికి ఇంతకన్న గొప్ప భాగ్యం మరొకటి ఉంటుందా?

విశ్వాసంతో కూడిన నిరీక్షణ
పరలోకమందు స్వాస్థ్యం ఉందన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. విశ్వాసంతో కూడిన నిరీక్షణ ఉంటే పరలోకమందు స్వాస్థ్యం ఉంటుంది. 2వ కొరింథి 5: 1-4 వరకు ‘‘భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్ట బడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గు చున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము’’. శాశ్వతమైన స్వాస్థ్యము ఉన్నదన్న సంగతి మరిచిపోకూడదు. తల్లిదండ్రుల బీజానికి దేవుడు దేహం ఇచ్చాడు. మరల దేవుడు శాశ్వతమైన జీవం అనుగ్రహిస్తాడు. ఈ లోకం ఏమిచ్చినా ఈ జీవితకాలం మట్టుకే, కారు కొన్నా ఈ జీవితకాలం మట్టుకే, బంగారం కొనుకున్నా ఈ జీవితకాలం మట్టుకే, గుండె పోయి కొత్త గుండె వచ్చినా ఈ జీవితకాలం మట్టుకే అన్న సంగతి మరిచిపోకూడదు. కనుక భౌతికమైన వాటి కోసం ప్రాకులాడడం మానుకోవాలి.

భక్తి కలిగిన నిరీక్షణ
నిరీక్షణకు కచ్చితంగా భక్తి అవసరం. నిత్యజీవానికి పోవాలంటే ముఖ్యమైనది భక్తి. తీతుకు 1: 1, 2లో ‘‘దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము నిమిత్తమును, నిత్యజీవమును  గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును’’. అంటే నిత్యజీవానికి పోవాలంటే కచ్చితంగా భక్తి అవసరం. భక్తి లేని నిరీక్షణ అర్థరహితం. మనం దేవుని బీజం వలన పుట్టిన వారం కాబట్టి మన భక్తి ఎలాగుండాలంటే పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. 1వ యోహాను 3: 1-3 ‘‘ మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును’’. 

శుభప్రదమైన నిరీక్షణ
శుభప్రదమైన నిరీక్షణ అంటే యేసు ప్రత్యక్షమవుతాడన్న నిరీక్షణ కలిగి ఉండాలి. తీతుకు 2:11-13 ‘‘ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది’’. 
ఆయన ప్రత్యక్షమైతే ఏం జరుగుతుందో గ్రంథం ఇలా తెలియజేస్తుంది. 
1. ఫిలిప్పీ 3:20, 21లో ‘‘మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును’’. అంటే నీ రోగం తిరిగి బాగుపడినా, ఏమీ ప్రయోజనం ఉండదు గాని, దేవుడు మాత్రం ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మారుస్తాడు. ఇంతకన్న గొప్ప భాగ్యం ఏముంటుంది?
2. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా ప్రత్యక్షమవుతాం. అందండి క్రైస్తవుడి గొప్పతనం. కొలొస్స 3:4లో ‘‘మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు’’. ఇది క్రైస్తవుడి నిరీక్షణ.
3. యేసు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే. అదిగో నీ స్వాస్థ్యం తీసుకోమని చెబుతాడు. అంటే నీ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉందన్నమాట. 1వ పేతురు 1:5లో ‘‘కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధ ముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీకొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది’’. 

మహిమ నిరీక్షణ
క్రైస్తవుడికి ఇంకెలాంటి నిరీక్షణ ఉందంటే మహిమ నిరీక్షణ ఉంది. కొలొస్సీ 1:27లో ‘‘అన్యజనులలో ఈ మర్మముయొక్క మహి మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను’’
ఇన్ని సంగతులు గ్రంథం నుంచి తెలుసుకున్న తర్వాత నిరీక్షణ మీద నమ్మకముంచాలి. విశ్వాసం లేకపోతే ఏదీ దక్కించుకోలేవు. మనకు జీవంతో కూడిన నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ దేవుని బీజం వలన పుట్టిన వారికే, మిగతావారు అనాధాలే!. నీకొదేము నేను మరల ఎలా జన్మిస్తాను? అని ప్రశ్నించాడు. కాని నీవు మరల జన్మిస్తేనే పరలోకంలో నీకు స్వాస్థ్యం ఉంటుంది. నీవు ఎంత వర్థిల్లావో ప్రాముఖ్యం కాదు. నీకు దేవునితో ఉన్న బాంధవ్యాలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి. షడ్రక్, మేషెక్, అబెద్నేగులు అను వారు మేము కాలిపోయిన ఫర్వాలేదు కాని ఆ విగ్రహానికి మాత్రం మొక్కం అన్నారు. అది వారి యొక్క విశ్వాసం. నీ తండ్రి ధనవంతుడు అన్నీ సమకూర్చగలడు. చాలా మంది ప్రభువును నమ్మగానే రోగం పోయిందని, ఉద్యోగం వచ్చిందని అంటుంటారు. ఇవన్నీ భౌతికమైనవి, తాత్కాలిక మైనవి. వస్తాయి పోతుంటాయన్న సంగతి మరిచిపోకూడదు. యేసు వచ్చింది నిత్యజీవం అనుగ్రహించడానికేగాని, భౌతికమైన దీవెనలు అనుగ్రహించడానికి మాత్రం రాలేదు. రెండో జన్మద్వారా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నూతన స్వభావం అనుగ్రహిస్తాడు. ఇలాంటి వారికి శుభప్రదమైన నిరీక్షణ ఉంటుంది. తండ్రి కలిగిన వారుగా,  ఆస్తి, అంతస్థు కలిగిన వారుగా ఉంటారు. ఈ జీవంలో ప్రవేశించాలంటే పవిత్రమైన జీవితాన్ని కలిగి భక్తిగా నిరీక్షణతో జీవించాలి.
3. రేకాబీయులు లా మాటలకు కట్టుబడి జీవించే స్వభావం నేటి క్రైస్తవులకు ఉన్నదా?
యిర్మియా గ్రంధం 35వ అధ్యాయం

"1  యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్దనుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై 
2 నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాటలాడి, యెహోవా మంది రములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి, త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవియ్యగా 
3 నేను, యిర్మీయా కుమారుడును యజన్యా మనుమడునైన హబజ్జిన్యాను అతని సహోదరులను అతని కుమారుల నందరిని, అనగా రేకాబీయుల కుటుంబికులనందరిని, తోడుకొని వచ్చితిని. 
4 యెహోవా మందిరములో దైవ జనుడగు యిగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసికొని వచ్చితిని. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడునైన మయశేయా గదికి పైగా ఉండెను. 
5 ​నేను రేకాబీయుల యెదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టిద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా 
6 వారుమా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనా దాబుమీరైనను మీ సంతతివారైనను ఎప్పుడును ద్రాక్షా రసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. 
7 మరియు మీరు ఇల్లు కట్టు కొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్షతోట నాటవద్దు, అది మీకుండనేకూడదు; మీరు పరవాసముచేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నియు గుడారములలోనే మీరు నివసింపవలెనని అతడు మాకాజ్ఞా పించెను. 
8 కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు. 
9 మా తండ్రియైన యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్తమునుబట్టి మేము విధేయులమగు నట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు 
10  గుడారములలోనే నివసించు చున్నాము....."

ఈ అధ్యాయంలో యిర్మియా ద్వారా రేకాబీయులకు దేవుడు ఒక సందేశాన్ని పంపిస్తాడు. ఏంటంటే దేవుని మందిరంలోకి వారిని తీసుకొచ్చి వారికి ద్రాక్షారసం ఇమ్మంటాడు. కానీ రేకాబీయులు దాన్ని తిరసర్కరిస్తారు. వారు మా పితరుడైన యెహోనాదాబు మాటలనే మేము గౌరవిస్తాం తప్ప ఆ పని మాత్రం చేయమంటారు.

రేకాబీయులు చాలా విచిత్రమైన మనుషులు. రేకాబీయుల పితరుడైన యోహోనాదాబు మాట మీద లక్ష్యముంచిన వారు. మా పితరుడు మాకు ఏమీ చెప్పాడంటే ఇల్లు కట్టుకోవద్దన్నాడు ద్రాక్షారసం తాగొద్దన్నాడు. పొలం దున్నొద్దన్నాడు, విత్తనాలు చల్లద్దొన్నాడు మేం మా పితరుడి చెప్పిన మాటలకు మేమంతా కట్టుబడి ఉన్నామని యిర్మియాకు తెగసిచెబుతారు. నిజంగా ఒక వ్యక్తి మాటలకు కట్టుబడి ఉన్నారంటే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది. మేం మా పితురుడి చెప్పిన మాటలే వింటాం కానీ, లోకాచారం ప్రకారం నడుచుకోమని కుండబద్ధలు కొట్టినట్లు చెబుతారు.  వారు "యిర్మియా నీకో విషయం చెప్పాలి, నువ్వు కాదు కదా, దేవుడు దిగొచ్చి చెప్పినా మేం వినం. మా పితరుడి మాటను మేం జవదాటం" అంటారు. కానీ నేటి క్రైస్తవులు యేసు చెప్పిన మాటలకు ఎంత వరకు లోబడి ఉంటున్నారో ఒక సారి ఆలోచించండి. చాలా మంది అనుకూలంగా ఉంటే అనుసరిస్తారు, లేకపోతే నడుచుకోరు. మత్తయి 12:30-31లో యేసు మాట్లాడుతూ - "నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి" అని అన్నాడు.

ఇక ఇశ్రాయేలీయుల విషయంలోకి వస్తే, దేవుడు యిర్మియాతో మాట్లాడుతూ ఆవేదన చెందుతాడు. యిర్మియా ఒకసారి రేకాబీయులను చూడు అన్యజనులైన రేకాబీయులు ఒక వ్యక్తి మాటకు కట్టుబడి ద్రాక్షారసం తాగలేదో చూడు. కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడుదల చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తే వారు నా మాటలు లెక్కచేయలేదని ఆవేదన చెందాడు. ఐగుప్తులో మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించా, ఎర్రసముద్రాన్ని రెండు పాయలు చేయించా, అరణ్యంలో మన్నా కురిపించా, బండలో నుంచి నీళ్లు రప్పించా, భూమ్మీద ఏ మనుషుడు అనుభవించని జీవితాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులు అనుభవించారు. కానీ వారు ఎప్పుడు నా మాటలకు కట్టుబడి ఉండలేదు, నన్ను సేవించలేదని దేవుడు ఆవేదన చెందుతాడు.

రేకాబీయులు  వ్యక్తి చెప్పిన మాటలకు కట్టుబడి ఉండడం ఎంత విశేషం!
మత్తయి 6:19లో యేసు మాట్లాడుతూ, "భూమ్మీద మీరు ధనం కూర్చుకోవద్దన్నాడు" ఈ మాటకు క్రైస్తవులు ఎంత మంది కట్టుబడి ఉన్నారు. ఈ మాటను పరిగణనలోకి తీసుకుంటారా? అనుకూలంగా ఉంటే అంగీకరిస్తారు లేకపోతే పట్టించుకోరు. కానీ రేకాబీయులు అలాంటి వారు కాదు, పితరుడు ద్రాక్షారసం తాగొద్దన్నాడు, తాగలేదు, ఇల్లు కట్టుకోవద్దన్నాడు, ఇల్లు కట్టుకోలేదు, గుడారాల్లోనే ఉండమన్నాడు, గుడరాల్లోనే ఉంటామని అలా రేకాబీయులు ప్రత్యేకంగా జీవించారు. యిర్మియా చెప్పినా వినం ఇంకెవరు చెప్పినా వినం మా పితరుడు యోహోనాదాబు చెప్పినట్లుగానే నడుస్తామని రేకాబీయులు తెగేసి చెప్పారు. 

ఎఫెసీ 5:2లో మీరు పరిమళ వాసనగా ఉండాలన్నాడు లోభత్వం ఉండకూడదన్నారు. ఇది విగ్రహారాధానతో సమానం కానీ నేటి క్రైస్తవులు విడిచిపెడుతున్నారా? దేవుడు చెప్పినట్లుగా నేటి క్రైస్తవులు ఎందుకు జీవించట్లేదు. నిత్య రాజ్యానికి వారసులుగా ఉండలేనప్పుడు ఆదివారం ఆదివారం గుడికి రావడం అవసరమా? కొలస్సి 3:5లో వీటిని చంపేయమన్నాడు. మరీ వీటిని క్రైస్తవులు చంపేస్తున్నారా? 
చివరిగా పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం - రేకాబీయులు ఓ వ్యక్తి చెప్పిన మాటలకు కట్టుబడి జీవిస్తే, నేటి క్రైస్తవులు మాత్రం యేసు చెప్పినట్లుగా జీవించట్లేదు. మరి నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవాలంటే కచ్చితంగా దేవుడు గీసిన గీతలోనే నీవెళ్లాలి. అంతకు మంచి నీ సొంత ఆలోచన ప్రకారం జీవిస్తే. నీ మరణ శాసానాన్ని నువ్వే గీసుకున్నట్లు. ప్రతీ క్రైస్తవుడు గ్రంథానికి లోబడి జీవించాల్సిందే. దేవుడికి విధేయత ముఖ్యం. అది నీలో లేకపోతే నీవు ఆయన సంబంధివి కాదు.
G. Devadanam  
4. నీవెవరివాడవో తెలుసుకోవడం ఎలా?
బైబిల్ పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాని, లేక చర్చి‌కి వెళ్లే వారిని చూసి గాని లోకస్తులు ఏమంటారంటే వీడు దేవుని బిడ్డరా...  లేక వీడు ప్రభు బిడ్డరా...  అంటూవుంటారు. అలా అనిపించుకుంటున్న వాళ్లంతా వారు ఎవరి సంబంధులో ఆలోచిస్తున్నారా? మనం ఎవరి సంబంధులమో ఎవరినో సోది అడగనవసరం లేదు, లేదా ఊహించుకోవాల్సిన అవసరం అసలే  లేదు. మనం ఎవరిమో చేతిలో ఉన్న గ్రంథాన్ని అడిగితే చెప్పేస్తోంది. 1వ యోహాను 3:10లో ‘‘దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును’’. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎవరివారమో మనమే తెలుసుకోవచ్చు. దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడా? అని దేవుడ్ని అడగనవసరం లేదు. ఆ సంగతి నీకే వదిలేశాడు. అన్నీ గ్రంథంలోనే రాయించిపెట్టాడు. గ్రంథంలో దేవుడు కొలతలు పెట్టాడు. ఆ కొలతల్లో నీవు ఉన్నావో లేవో చూసుకుంటే తెలిసిపోతుంది. (ఉదా: కానిస్టేబుల్‌గా సెలక్ట్ కావాలంటే దానికి కొలతలుంటాయి, హైటుండాలి, చెస్ట్ ఉండాలి, పరుగు పందెంలో గెలవాలి, అలాగే పరీక్షలో గెలవాలి. వీటన్నింటిలో గెలిస్తేనే పోలీస్ అవుతాడు. అలాగే నీవెవరివో చెప్పడానికి గ్రంథంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి). మనమెవరిమో గ్రంథమే చెబుతుంది. 2వ కొరింథి 13:5లో ‘‘మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?’’.

విశ్వాసంలో కొట్టబడడం దేవుని సంకల్పం కాదు. విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి. అవుతుందా? లేదా? అన్న సందేహించొద్దు. చాలా మంది రక్షింపబడ్డానో లేదోనన్న అనుమానం. ఇంకొంతమంది మేం దేవుని సంబంధులమంటూ భ్రమపడుతుంటారు. ఒకవేళ దేవుని సంబంధి కాకపోతే అపాయకరమైన పరిస్థితిలో ఉన్నట్టే. యోహాను 8:44లో ఇలా రాయబడి ఉంది. ‘‘మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు’’. ఈ వాక్యాన్ని బట్టి దురాశలను నెరవేర్చుగోరువాడు దేవుని సంబంధి కాదు. అంటే సాతాను స్వభావం అనుసరించి పాపం చేసే వాడు.

బైబిల్‌లో పాపం రెండు రకాలుగా కనిపిస్తోంది. స్వాభావికంగా పాపం చేసే వాళ్లున్నారు. అస్వాభావికంగా పాపం చేసే వాళ్లున్నారు. (ఉదా: అదొక మురికి కాలువ, దాటడానికి పంది వచ్చింది. ఆ కాల్వలోకి దిగి కొంతసేపు దొర్లాడదామని దిగి అందులోనే ఉండిపోయింది. ఇది స్వాభావికంగా పాపం చేసేవాడి స్వభావం. అస్వాభావికంగా పాపం చేసే వాడు, అంటే గొర్రె వచ్చింది, అప్పుడు గొర్రె కాలువ పైనుంచి దూకింది. రెండు కాళ్లు ముందు, రెండు కాళ్లు బురదలో పడ్డాయి. ఇది అస్వాభావికంగా పాపం చేయడం. అందుకే దేవుడెమంటున్నాడు అంటే నీవు స్వాభావికంగా పాపం చేసే వాడివా? లేకా అస్వాభావికంగా పాపం చేసే వాడివా? పరీక్షించుకోమన్నాడు. అంటే నీవెవరి సంబంధివో నీకు నీవే తెలుసుకోవాలన్నాడు. 1వ యోహాను 3:7-9 ‘‘చిన్న పిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు’’. దీంట్లో రహస్యం లేదు. స్వాభావికంగా పాపం చేసే వాడు అపవాది సంబంధి. గొర్రె పంది జాతి కాదు. నీతిని జరిగించే వాడు తన సహోదరుని ప్రేమించేవాడు. సహోదరుని ప్రేమించని వాడు నీతిని ప్రేమించడు. గొర్రెకు బురద అసహ్యం, కాని గొర్రెకు బురద అయ్యింది. అది స్వాభావికంగా అవలేదు. అస్వాభావికంగా అయింది. అస్వాభావికంగా పాపం అంటుకుంటే దాన్ని కడగడానికి ఒకాయన ఉన్నాడు. 1వ యోహాను 2:1లో ‘‘నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు’’. అంటే తెలియకుండా జరిగే పాపాలను కడిగేందుకు యేసు అను ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి భయపడనవసరం లేదు.

బుద్ధిపూర్వకం(స్వాభావికం)గా పాపం చేస్తే?
ఎవడైనను బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే అంటే స్వాభావికంగా పాపం చేసినట్లే. దీనికేమైనా క్షమాపణ మార్గం ఏమైనా ఉందా? అంటే ఏమీలేదు. హెబ్రీ 10:26, 27లో ‘‘మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును’’. స్వాభావికంగా పాపం చేసే స్వభావం పంది స్వభావం. క్రీస్తు రక్తం పందులను కడగడానికి కాదు. కనుక స్వాభావికంగా పాపం చేయడానికి ఎవరూ సాహసించకూడదు.

దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేస్తాడా?
దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు. కనుక దుష్టుడు ముట్టడానికి ప్రయత్నించడు. 1వ యోహాను 5:18లో ‘‘దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు’’. ఒకవేళ సహోదరుడు మరణకరముకాని పాపం చేస్తే అంటే అస్వాభావికంగా పాపం చేస్తే అతని కొరకు సహోదరులు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. 1వ యోహాను 5:15లో ‘‘తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును’’. 

మనుష్యుడు పాపం చేయకుండా దేవుడు తీసుకున్న జాగ్రత్తలేంటి?
పరిశుద్ధులు పాపం చేయకుండా దేవుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నీవెవరివో దేవుడు చెప్పాడు. యోహాను 1: 12, 13లో ‘‘తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు’’. దేవుని పిల్లలు ఎలా అవుతారంటే క్రీస్తు ప్రభువును అంగీకరించుట వలన జరుగుతుంది. యోహాను 1:49లో ‘‘నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను’’. ఇలా అంగీకరిస్తేనే దేవుని కుమారుడివి అవుతావ్. అంటే, నీ ఆలోచనలు ఆయన అధికారం కింద పెట్టాలి. నీ అలవాట్లు, నీ ఆచరాలు, ప్రతీది క్రీస్తు ప్రభువు అధికారం కింద పెట్టాలి. ఎప్పుడైతే పెడతావో అప్పుడు దేవుని కుమారడవుతావ్. ఒక వేళ పెట్టకపోతే నీవు దేవుని కుమారుడివి కాదు. ఆయన ముందు డైలాగ్‌లు పనికిరావ్. అన్నింటిని ఆయనకు స్వాధీనం చేస్తేనే దేవుని కుమారుడివి అవుతావ్.

నీతిని జరిగిస్తేనే దేవుని సంబంధివి
నీతిని జరిగిస్తేనే దేవుని సంబంధి. 1వ యోహాను 2:29లో ‘‘ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు’’. యేసు పరలోక సంబంధి. యూదులంతా బాప్తస్మమిచ్చు యోహాను గారు దగ్గర బాప్తిస్మం తీసుకుంటుండగా యేసు కూడా బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే. యోహాను గారు నేను మీకు బాప్తిస్మం ఇవ్వడమేంటని అనగానే యేసు మాట్లాడుతూ, నీతి యావత్తు ఇలానే జరగాలంటాడు. మత్తయి 3:13-15లో ‘‘ఆ సమయమున యోహానుచేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయనుండి యొర్దాను దగ్గర నున్న అతనియొద్దకు వచ్చెను. అందుకు యోహాను నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నాయొద్దకు వచ్చు చున్నావా? అని ఆయనను నివారింపజూచెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను’’. చిన్నవాడు పెద్దవాడికి బాప్తిస్మం ఇవ్వొచ్చు. నీతి యావత్తు ఇలానే జరగాలి. గ్రంథం ఏది ఆదిసిస్తే అదే చేయాలి. దేవుని చిత్తాన్ని దాటి పోవద్దు. యేసు కంటే యోహాను చిన్నోడే. నీతి యావత్తు ఇలానే జరగాలని యేసు సెలవిచ్చాడు.

దేవుని కుమారుడివని తెలుసుకొనుటకు మరో కారణం
దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడు. 1వ యోహాను 3:9లో ‘‘దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు’’. దేవుని మూలంగా పుట్టిన వాడు పంది కాదు. 2వ పేతురు 2:22లో ‘‘కుక్కతన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లి నట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను’’. ఒకసారి కడుగబడిన వాడు వేరొక బీజం కనుక పాపం చేయడు. వేరొక బీజమంటే దేవుని మూలంగా పుట్టినవాడు. సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదు. దేవుని మూలంగా పుట్టినవాడు సహోదరున్ని ప్రేమిస్తాడు.

సహోదరున్ని ఎలా  ప్రేమించాలి?
సహోదరుడ్ని ప్రేమించే విషయంలో మాటలు కాదు, చేతలు కావాలి. సహోదరుడు దీనస్థితిలో ఉంటే నీవు ఆదుకోవల్సిందే, కనికరం చూపకపోతే దేవుని సంబంధికాదు. 1వ యోహాను 3:17లో ‘‘ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?’’. నీవు కల్గిన స్థితిలో ఉన్నప్పుడు సహోదరున్ని ప్రేమించాలి. సహోదరున్ని ప్రేమింపనివాడు దేవుని సంబంధి కాదు. 1వ యోహాను 3:18లో ‘‘చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము’’. బీదలైన సహోదరుల్ని ద్వేషించొద్దు, దేవుని మూలంగా పుడితే సహోదరున్ని ఆదుకోవాలి. కలిమిలో ఉండి కళ్లు మూసుకుని వెళ్లేవాడు అసలు సహోదరుడే కాదు. మాటలతో అసలు మభ్యపెట్టొద్దు, క్రియలు ముఖ్యం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో, సాతాను పిల్లలెవరో తేలికగా చెప్పొచ్చు.

దేవుని మూలంగా పుడితే ఇంకేస్తారు?
దేవుని మూలంగా పుట్టినవాడు లోకం వైపు చూడడు. లోకాన్ని జయిస్తాడు. 1వ యోహాను 5:4, 5లో ‘‘దేవుని మూలముగా పుట్టినవారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, యేసు దేవుని కుమారుడని నమ్ము వాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?", అంటే విశ్వాసి లోకాన్ని జయించాలి. విశ్వాసం అంటే దేవుని అందలి విశ్వాసం. అలాగే కుమారుని అందలి విశ్వాసం. ఈ విశ్వాసానికి కర్త యేసు. ఓపికతో ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి. హెబ్రీ 12:లో ‘‘విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము’’. లోకాన్ని జయించేది విశ్వాసం మాత్రమే, విశ్వాసి లోకానికి ఆకర్షితులు కాకూడదు. 1వ యోహాను 15, 16లో ‘‘ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీ రాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే’’. 

యేసును సాతాను వశపర్చుకోవాలనుకుంది. రక్తమాంసాల్లో ఉన్న యేసును సాతాను ఏం చేసిందంటే. ‘‘అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను’’. కాని యేసు ఈ లోకాన్ని తృణీకరించాడు. శిలువ మరణాన్ని అనుభవించడానికే వచ్చానన్నాడు. యేసు సాతానును అణచడానికే వచ్చాడు. అందుకే ఆయన శిలువ మరణం ద్వారా అపవాది క్రియలను అణచివేశాడు. అలాగే విశ్వాసికి కూడా ఏ పని అప్పగించబడిందో ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. క్రైస్తవుడు మేలు చేసి కీడుననుభవించాలి. 1వ పేతురు 2: 19లో ‘‘ఎవడైనను అన్యాయముగా శ్రమపొందుచు, దేవునిగూర్చిన మనస్సాక్షికలిగి, దుఃఖము సహించినయెడల అది హితమగును’’. సాతాను దృష్టి మరల్చకుండా ఉండాలంటే కీడుకు ప్రతికీడు ఎవరికి చేయొద్దు. 1వ పేతురు 3:9లో ‘‘ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి’’. ప్రతీ క్రైస్తవుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి.
  
క్రైస్తవ జీవితానికి ఒక గమ్యం ఉంది. ఒక సాధన ఉంది.  అందుకోసమే పిలవబడితిరి. లోకాన్ని జయించుట అనే ఒక విశేషమైన కార్యం ఉంది. ఇది మారణాయుధాలతో చేసేది కాదు. లోకంలో మారణాయుధాలు ఉపయోగిస్తారు. కాని మనం అలా ఉండకూడదు. క్రైస్తవుడి ఆయుధాలు ఈ లోకంలో ఉన్నటువంటివి కావు. అంటే శరీర సంబంధమైనవి కావు. 2వ కొరింథి 10:3లో ‘‘మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి’’. యేసు ఎలాంటి ఆయుధాలు ధరించుకున్నాడో మనం అలాంటి ఆయుధాల్నే ధరించుకోవాలి. 1వ పేతురు 4:1లో ‘‘క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి’’. 

ముగింపు - నీవు ఎక్కడికి వెళతావో ఊహలొద్దు!. అంటే పరలోకం వెళ్తావో, అగ్నిగుండానికి వెళ్తావో గ్రంధమే చెబుతుంది. అలాగే నీవు ఎవరి సంబంధివో నీకు నీవే పరిక్షించుకోవాలి. మీరు దేవుని మూలంగా పుడితే యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. అంతేకాదు నీతిని జరిగించాలి. అలాగే దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు. అస్వాభావికంగా పాపం చేస్తే క్షమింపబడతారు. దేవుని మూలంగా పట్టిన వాడు సహోదరుడ్ని ప్రేమిస్తాడు. సహోదరున్ని ప్రేమించుట అంటే లేమిలో ఉన్నవాడ్ని ఆదుకోవడం. అంటే క్రియతో, సత్యంతో ప్రేమించాలి. అలా చేయకపోతే వారు అపవాది సంబంధలు. కనుక క్రైస్తవ జీవితం అంటే ఊహజనితం కాదన్న సంగతి గుర్తించాలి. యేసు నందు విశ్వాస ముంచువాడే దేవుని సంబంధి. యోహాను 3:36లో ‘‘కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును’’. గ్రంథం చెబుతున్నట్టుగా నీకు నీవే పరీక్షించుకో. వాక్యాన్ని సందేహించకు. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉంటేనే నిత్యజీవాన్ని స్వతంత్రించుకుంటావు

1 comment:

  1. యేహెజ్కేలు గ్రంథం పై ఉన్న పాపములు ఏమైనా దయచేసో నా ఫోన్ కి పంపగలరని మనవి.
    9032227668

    ReplyDelete