మానవునితో అంతగా సహవాసము కావలెనని కోరుకొను దేవుడు, ఆ తోటలోనికి వచ్చి వారిని శోధింపకుండునట్లు కాపాడలేడా? కాపాడగలడు. ఏదెను తోటలోనికి సాతాను వచ్చి వారిని శోధింపకుండునట్లు మహోన్నతుడు అడ్డుపడినచో, ఆయన మానవ స్వాతంత్య్రంమును పూర్తిగా తీసివేసినట్లేయగునుకదా; ఉదా: తన భార్యను బాగుగా ప్రేమించి ఆమెతోనే సహవాసమును కోరుకొనిన భర్త, ఆమెను విడిచి ఉద్యోగమునకు పోవునప్పుడు తన భార్యను ఇంటిలోపెట్టి తాళము బిగించుకుపోయిన ఎట్లుండునో, ఏదెను తోటలోనికి సాతాను ప్రవేశింపకుండ దేవుడు అడ్డుపడుటయు అట్లే యుండును. తన భార్య ఇతరులతో ఆరోగ్యకరమగు సాంఘీక సంబంధము కలిగియున్నంత మాత్రమున సమస్య ఎట్లుండదో, అట్లే ఏదెను తోటలోనికి సాతాను ప్రవేశించినందున సమస్యలేదు. అయితే ఆ స్ర్తీ తన పురుషుని విసర్జించి వేరొకని కోరుకొనినచో సమస్య ఎట్లు వచ్చునో అట్లే ఆది మానవులు దేవుని విసర్జించి సాతానును అనుసరింప కోరుకొనినందున సమస్య వచ్చినది. కనుక తన భార్యను, పురుషుడు ఇంటిలో పెట్టి తాళము బిగించి వెళ్ళుట ఎట్లు అవివేకమో, దేవుడు ఏదెను తోటలోనికి సాతానును రాకుండ చేయుట అట్లే అవివేకమగును. ఒకవేళ మనుష్యులు అవివేకముగా ప్రవర్తించిన ప్రవర్తింపవచ్చునుగాని దేవుడైతే అలాగున చేయడు. ఆయన నిర్మించిన మానవుడు బలహీనుడు కాడు.
మానవ సమాజములో స్త్రీ పురుషులు కలిసియుండవలసినదే, ఒక స్త్రీ వ్యభిచరింపకయే జీవించవలెనన్న భర్త తప్ప వేరొక పురుషుడు ఉండకూడదు. వేరొక పురుషుడున్నచో ఆమె వ్యభిచరించును అనుకొనుట ఎట్లు విడ్డూరమో, లేదా ఒక పురుషుడు మోహపు చూపు చూడకయే ఉండవలెనన్న తన భార్యగాక వేరొక స్త్రీ ఎన్నడును తన కంటికి కనబడకయే ఉండవలెననుట ఎంతటి విపరీతమో; అట్లే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమింపకయే ఉండవలెనన్న సాతాను ఉండకూడదు, మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము ఏదెనులో ఉండకూడదు, దేవుడు ఆ చెట్టును మెులిపించి యుండకూడదు, మెులిపించినను దానిని తినకూడదని ఆజ్ఞాపించియుండకూడదు అని భావించుటయు, అట్లే బుద్ధిహీనతయగును. జాగ్రత్తగా ఆలోచించినచో అనేక మార్లు మనము అడుగు ప్రశ్నలు అర్థరహితమైనవిగా గోచరించును.
Source: “దేవుని విమోచనా సంకల్పం” by Br. జి. దేవదానం గారు
well said brother..... clearly explained thankyou
ReplyDelete