ఈ భూమిపై మొట్టమొదటి హత్య దేవుని ఆరాధనతో ముడిపడి యున్నది. కయీను, హేబెలు దేవునికి అర్పణలు అర్పించిరి. అయితే దేవుడు కయీను అర్పణను అంగీకరింపక, హేబెలు అర్పణను మాత్రమే అంగీకరించెను(ఆది 4:4-5).
"విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతినొందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు" (హెబ్రీ 11:4)
మనకు బోధకలుగునట్లుగా ఈ యిరువురి అన్నదమ్ముల ఆరాధనా విధానము లేఖనములో పేర్కొనబడినది (రోమా 15:4). ఈ దృష్టాంతమును బట్టి మనము కొన్ని సంగతులు నేర్చుకొనగలము.
1) ఆరాధన కంటే మరేదియు దేవునికి ప్రీతికరము కాదను సంగతిని ఇది బయలుపరచుచున్నది. ఆరాధన విషయంలో మనము ఖచ్చితముగా నుండవలెను. కయీను అర్పించిన అర్పణ దేవునికి అంగీకారముగా నుండలేదు.
2) విశ్వాసమును బట్టి దేవుని ఆరాధింపవలెనని ఈ లేఖనము బోధించుచున్నది. కాగా వినుటవలన విశ్వాసము కలుగును (రోమా 10:17). అటు పిమ్మట ఆయన కిష్టమైన ఆరాధనను గూర్చి సహోదరులకు తెలియజేయును.
3) దేవుని ఆజ్ఞకు బదులుగా మనమేది చేసినను అది ప్రాణాంతక మైనదని ఈ లేఖనము బోధించుచున్నది.
4) సత్యారాధనను నిర్ణయించేది దేవుని వాక్యమే గాని మానవ జ్ఞానముకాదని ఈ లేఖనము స్పష్టముగ తెల్పుచున్నది.
చరిత్రలో మూడు యుగములు (Three Periods of History)
బైబిలు చరిత్రలో పితరులు అని పిలువబడిన కాలములో కయీను, హేబెలు జీవించిరి. ఆ కాలములో దేవుని నెట్లు ఆరాధింపవలెనో ఆయనే నేరుగా ఆయా కుటుంబములోని పెద్దలు (పితరులకు) తెలియజేసేడివారు. రెండవయుగము మోషేతో ఆరంభమై క్రీస్తు సిలువతో సమాప్తమైనది. దీని కాలము 1500 సంవత్సరములు. నేడు మనము కైస్తవ యుగములో జీవించుచున్నాము. ఇందు ప్రతిక్రైస్తవుడు యాజకుడే (1 పేతు 2:5). క్రైస్తవ యుగము పెంతుకోస్తునాడు ఆరంభమై ఈ యుగాంతము వరకు కొనసాగును.
ఈ యుగములన్నిటిలోను దేవునిని ఎట్లు ఆరాధింపవలెనో వాటిని గూర్చి మానవులకు కట్టడలను నియమించినప్పటికి అవి అన్ని యుగాములకు ఒకే రీతిగా వర్తించెడివికావు. మోషే యుగములో యూదులకు అనేక కట్టడలు నియమింపబడినవి. జంతుబలులు అర్పించుట, నైవేద్యము, కొన్ని ప్రత్యేక దినములను ఆచరించుట మున్నగునవి వాటిలో గలవు. అట్టి వాటిని గుర్తించి ఆయా కాలములో వర్తింపజేయుటచే పూర్వకాలమందు అర్పించినట్లుగా నేడు మనము జంతుబలులను అర్పించుటలేదు. ఎందుకనగా దేవుడు నేడు వీటిని గైకొనవలెనని ఆజ్ఞాపించలేదు.
ధర్మశాస్త్రము కొట్టివేయబడినది (Law Abolished)
పాతనిబంధన చట్టము సిలువకు మేకులతో కొట్టివేయబడినది. “దేవుడు వ్రాత రుపకమైన ఆజ్ఞల వలన మన మీద ఋణముగాను, మనకు విరొధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండ దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి, ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసేను” (కొలస్సి 2:14). అనగా శాసనము ద్వారా నేడు ధర్మశాస్త్రము మనలను బంధించుటలేదు గనుక పాతనిబంధన కాలములో జరిగించిన ఆరాధనను గైకొనవలసిన అవసరములేదు. పాతనిబందనలో గల మాదిరిని గూర్చి నేర్చుకొనగలము గాని చట్టము మనకు వర్తించదు.
నేడు మనము పది ఆజ్ఞల క్రిందలేము గనుక హత్యచేయుటకు, దురాశ కలిగియుండుటకు, వ్యభిచరించుటకు స్వేచ్చ గలదని భావముగాదు. వీటిని చేయరాదని మోషే ధర్మశాస్త్రములో ఖండితముగా ఆజ్ఞాపించెను. అట్లే క్రొత్తనిబంధన గూడ వీటిని ఖండించుచున్నది. పాతనిబంధన వీటిని అనుమతించుటలేదు గనుక మనము కూడా వీటిని చేయరాదని కాదుగాని నేడు మనపై అధికారము గలిగిన క్రొత్తనిబంధన కూడా వీటిని నిషేధించుచున్నందున మనము వీటిని చేయరాదు.
ఆరాధనలో వాయిద్య సంగీతములను సమర్ధించుట (Attempts to Justify Instrumental Music in Worship)
ఆరాధనలో వాయిద్య సంగీతముల నుపయోగించుటను గూర్చి ఇపుడు మనము చర్చించుచున్నాము. గృహముల యొద్ద, పాఠశాలలోను మనము చేసేవాటిని గూర్చి యిపుడు చర్చించుటలేదు. కళాదృష్టితో చూస్తే యిది ఆహ్లాదకరమైనదే. వీటిని వాయించు వారియొక్క నైపుణ్యము మెచ్చుకోదగినదే. వీటిని వాయించేటప్పుడు వారి క్రమశిక్షణ మొదలుగునవి మెచ్చుకోదగినవే. ఒకని నైపుణ్యతబట్టి అతడు వాయించే వాయిద్యమును ఆరాధనలో ఉపయోగించుట ఎంతవరకు సమర్ధనీయము.
1) దావీదు వాయిద్యములను వాయించినాడు:
దావీదు నివసించిన పాతనిబంధన క్రింద మనము నేడు నివసించుటలేదని మొదట గ్రహించాలి. అతడు బూరలను, సితారను ఉపయోగించుట నాట్యమాడుట గూడా చేసెను (కీర్త 150). ధర్మశాస్త్రము క్రింద అనేక మంది భార్యలను కలిగియున్న దావీదు నేడు మనకు మాదిరి కాడు.
2) ఏ లేఖన భాగము వీటిని నిషేధించుట లేదు:
లేఖనము ఖచ్చితముగాను, ప్రత్యక్షముగాను ఖండిచుటలేదు గనుక వీటిని ఉపయోగించే స్వేఛ్చ గలదను అభిప్రాయము బలముగా కలదు. ఇదే నిజమైనచో మనము కొన్ని సమస్యలు ఎదుర్కొనక తప్పదు. దహన బలులను, జపమాలలోని పూసలను లెక్కించుట, వాయిద్య సంగీతము, ప్రభువు బల్ల సమయములో భోజనము మాంసమును తినుట, చిలకరింపు, బహుభార్యత్వము మొదలగు వాటిని క్రొత్తనిబంధన ఎక్కడైనా ప్రత్యక్షముగా నిషేదించుచున్నదా?
లేఖనము యొక్క మౌనమును అపార్థము చెసికొనరాదు. "మన ప్రభువు యూదా సంతానమందు జనియించెననుట స్పష్టమే; ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు" (హెబ్రీ 7:14). యూదా గోత్రము నుండి యాజకులెవరు ఉండబోరు అని చెప్పవలసిన అవసరత మోషేకు కలుగలేదు అందుచేతనే యాజకులు లేవీ గోత్రమునకు చెందినవారై ఉండవలెనని చెప్పినాడు. అతడు యూదా గోత్రము గూర్చి ఏమియు చెప్పలేదు. అతని మౌనము నుండే ఈ సంగతిని మనము గ్రహించగలము.
యాజకులు ఉపయోగించవలసిన అగ్నిని గూర్చి మోషే వారికి ఖచ్చితముగా ఆజ్ఞాపించినాడు (లేవీ 16:12). అయితే నాదాబు అబీహులు "యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసికొని ఆయనకు బలి అర్పింపబూను కొనిరి (లేవీ 10:1). ఆ అగ్నిని గూర్చి దేవుడేమియు చెప్పలేదు అయినను వారిరువురు లేఖనము యొక్క మౌనమును గుర్తింపకపోయిరి.
సంఖ్యాకాండము 20:8 లో ఇశ్రాయేలీయులకు అవసరమగు నీటిని గూర్చి ఈ "రాతితో మాట్లాడుమని" దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. అయితే అతడు రాతిని రెండుసార్లు కొట్టినాడు. ఆ రాతిని కొట్టవద్దని దేవుడు ఆజ్ఞాపించలేదు. ఆ విషయములో లేఖనము మౌనముగానున్నది. ఈ అవిధేయతవలనే మోషే ఇశ్రాయేలీయులను కానాను దేశాములోనికి నడిపించు తరుణమును పోగొట్టుకున్నాడు. ఏమి చేయాలో దానిని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అనవసరమైన వాటిని గూర్చి ఆయన ప్రస్తావించడు. అయినను మోషే దేవుని మౌనమును గౌరవించలేదు.
3) ఇది యొక సహకారి:
కొన్ని వస్తువులు ఆరాధనకు మనకు సహకారిగా ఉండగలవు. ఉదా: కీర్తనల పుస్తకములు, పెట్రోమాక్సు లైట్లు, ప్రభువు బల్ల కోరకుపయోగపడు చిన్న గ్లాసులు, ప్లేట్లు మొదలుగునవి. సహకారిగా నుండునదేది గూడ ఆరాధనకు సంబంధించిన ఆజ్ఞను దేనిని మార్చజాలదు లేదా ఆ ఆజ్ఞకు ప్రత్యామ్నాయముగా గూడా నుండకూడదు. పాడుటకు మాత్రమే కీర్తన పుస్తకములు ఉపయోగపడును. ప్రభువు బల్లలొ పాలుపొందుటకు కప్పులు, ప్లేట్లు ఉపయోగపడును. అయితే వాయిద్యములను ఉపయోగించుట ఒక ప్రత్యేకమైన సంగీతమైయుండి అది 'పాడుట' అను ఆజ్ఞను బదులుగా వాయిద్యములకు దారితీయుచున్నది.
4) 'సేలో' (PSALLO) ఇది గ్రీకు పదము:
ఎఫెసీ 5:19 లో సంగీతములను గూర్చిన ప్రస్తావన కలదు. "ఒకనినొకడు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువుకు గూర్చి పాడుచూ కీర్తించుచు .... .... ...." కావున హృదయమే మనకు వాయిద్యముగా నుండవలెను.
పియానోగాని హార్మోనుగాని లేదా వేరొక రకమైన వాయిద్యమును గూర్చి గ్రీకు పదము పేర్కొనినచో అప్పుడు ఆ వాయిద్యము లేకుండా మనము దేవుని ఆరాదింపలేము. ఎందుకనగా దేవుని ఆజ్ఞలకు బదులుగా వేరొక దానిని చేయలేము. వాయిద్యముల నుపయోగించు అనేకులు గూడ వాటిని వాడుటకు అనుమతి లేదనియు మరియు వాటిని ఎల్లప్పుడు ఉపయోగించుట లేదనియు కూడ చెప్పుదురు. వాటిని ఉపయోగించాలి అనే ఆజ్ఞ ఉంటే అవికూడ ఆరాధనలో నొకభాగముగా నుండెడివి.
5) ఆరాధన భావావేశముతో కూడినది:
ఆరాధన భావావేశముతో కూడినదైతే అప్పుడు వాయిద్యముతో ఆరాధించుట కుదరదు. ఆరాధనలో భావావేశములకు తావుండుట మాత్రమే కాదు గాని మన మనస్సు, మన చిత్తము కూడ యిందుడును. కాలము ఆరాధన భావావేశముతో కూడినది మాత్రమే కాదు గాని యిది యెుక క్రియయైయున్నది.
యేసును వెదకుచు వచ్చిన జ్ఞానులు కూడ యిట్లనిరి, "తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి" (మత్తయి 2:2). అమెరిన్ స్టాండర్డ్ వెర్షన్లో ఈ వచనమునకు దిగువనీయబడిన వివరణలో గల గ్రీకు పదమునకు అర్థమేమనగా, "సృష్టిని గాని, సృష్టికర్తను గాని భక్తితో మ్రెుక్కి పూజించుట" కావున ఈ క్రియను వారు చేసిరి. యిందుకొరకే జ్ఞానులు వచ్చిరి. ఆయనను పూజించుటకు వారు వచ్చిరి. అయితే దేవుని ఆరాదించుటకుపయోగపడు క్రియలను గూర్చి క్రొత్త నిబంధన స్పష్టముగా పేర్కొనుచున్నది. అవి: పాడుట, ప్రార్థన, ప్రభువుబల్ల, కానుకలు, బోధించుట.
మనము చేయునదంతయు ఆరాధన కాదు. అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించుటకు వెళ్లినప్పుడు తన సేవకులతో ఇక్కడనే నిలిచియుండుడి; "నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్లినప్పుడు దేవునికి మ్రెుక్కి మరల మీ యెుద్దకు వచ్చెదమని చెప్పిరి" (ఆది 22:5). వారు చేయునదంతయు ఆరాధన కాదు గాని మేము వెళ్లి మ్రెుక్కి వచ్చెదమనిరి. ఆరాధన అనగా ప్రభువు మాత్రమే నిర్ణయించే క్రియయైయున్నది.
6) ఆరాధనకు నమూన యేది లేదు:
ఆరాధనకు ఒక ప్రత్యేకమైన నమూన లేదు. గనుక వాయిద్యసంగీతమును కూడ వాడవచ్చుననుటకు ఎవడైనను తెగింపవచ్చును. నమూనా లేనిచో ఏ పద్ధతియైన అంగీకారయోగ్యమే కదా! అట్టితరి మనకు యిష్టము వచ్చిన దాని నేదైనను, ఏ పద్ధతిలోనైనను ఆరాధింపవచ్చును.
7) ఆరాధించుటకు మనకు అధికారము అవసరము లేదు:
అట్టి పరిస్థితులో తన అధికారము ప్రకారమే ఆరాధింపవలెనని బైబిలు చెప్పుకొనినచో నమ్ముట కష్టమే కదా! ఆది నుండి అంతము వరకు దేవుని అధికారము మన విధెయతపై ఆధారపడి యున్నది. అధికారము యెుక్క అవసరత లేనిచో మనకు మనమే శాసనకర్తలు (చట్టము)గా నుందుము.
ఆరాధనలో మనమేల వాయిద్యసంగీతముల నుపయోగించుటలేదు (why we do not use Instruments of Music in Worship)
1) 'పాడుమని' బైబిలు చెప్పుచున్నది:
"అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్లిరి" (మత్తయి 26:30)
"అయితే మధ్య రాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్ధించుచు కీర్తనలు పాడుచుండురి" (అ.కా. 16:25)
"నీ నామ సంకీర్తనము చేయుదును" (రోమా 15:9)
"ఆత్మతోను పాడుదును, మనస్సుతోను పాడుదును" (1కొరింథీ 14:15)
"ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి కీర్తించుచు.......(ఎఫెసీ 5:19)
సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనినొకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి" (కొలస్సి 3:16).
"సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను" (హెబ్రి 2:12)
"ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను" (యాకోబు 5:13)
"వారు మెాషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనలు పాడుతున్నారు" (ప్రక 5:9; 14:3; 15:3)
క్రొత్త నిబంధన ఈ అంశములను గూర్చి మాట్లాడునప్పుడెల్లా "పాడుట" అని పదమునకు వినియోగించెను. కొలస్సి 3:16 లో ఈ అంశమును గూర్చి నొక్కి చెప్పుటకు మూడు పదములను ఉపయోగించినాడు. అవి బోధించుట, హెచ్చరించుట, పాడుట అనునవి కేవలము గానము చేయుటయందు ద్వారానే జరుగును. నీవు సరిగా జీవించాలని హార్మోనియం ఏ విధముగానైన నిన్ను హెచ్చరింపగలదా? అయితే పాటలు పాడుట ద్వారా ఒకనినొకడు హెచ్చరించుకోవచ్చును.
2) యోహాను 4:24 ప్రకారమే:
"దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెను". యేసు సత్యారాధనను గూర్చి మూడు గురుతులిచ్చియున్నాడు. 1. దేవునికే చెందాలి, 2. పరిపూర్ణమైన ఆత్మతో అర్పింపబడాలి, 3. అది సత్యప్రకారమైనదై యుండాలి. ఇది సత్యారాధన యెుక్క నమూనాయైయున్నది.
"సత్యమందు వారిని ప్రతిష్ఠించుము! నీవాక్యమే సత్యము" (యోహాను 17:17). దీని అర్థ మేమనగా మన ఆరాధన దేవుని వాక్యముననుసరించునదై నుండవలెను. ఎందుకనగా వాక్యమే సత్యము. కాగా వాయిద్యసంగీతములను గూర్చిన ఆజ్ఞయేది? దానికి నమూన గలదా? దాని యెుక్క అవసరత గలదా?
3) సామాన్యమైన మరియు ప్రత్యేకమైన ఆజ్ఞలు:
చితిసారకపు మ్రానుతో ఓడను కట్టుమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించెను; ఇది యెుక ప్రత్యేకమైన ఆజ్ఞ. అనగా తక్కిన మ్రానును ఉపయోగించరాదని అర్థం. ఏదో ఒక 'మ్రాను' ఉపయోగించిమనెడి సామాన్యమైన ఆజ్ఞ యిక్కడ లేదు. అవసరమైన దానిని గూర్చి చెప్పుటచే ఆయన అవసరము కాని వాటిని త్రోసివేసియున్నాడు. గనుక ఈ విషయములలో నోవహుకు స్వేచ్ఛలేదు. ఇంకొక రకమైన 'మ్రాను' ఉపయోగించుట దీనికి సహకారిగా నుండుటకు కాదు గాని అట్టిది చేయుటయందు వాక్యమునకు కలుపుటయే.
పస్కాపండుగ కొరకు గొఱ్ఱెపిల్లను వధించమని మోషే యూదులకు ఆజ్ఞాపించాడు (నిర్గమ 12:1-5). ఒక ప్రత్యేకమైన జంతువును గూర్చి మోషే ఆజ్ఞాపించుటచే తక్కిన జంతువులు అనర్హమైనవని దీని భావము. కావున అట్టి అనర్హమైన జతువుల పట్టిక యెుక్క అవసరత ఎంతమాత్రము లేదు. ఏ జంతువు అవసరమైనదో చెప్పుటచే తక్కినవన్నియు అవసరము లేనివని వారు గ్రహించిరి.
ప్రభురాత్రి భోజనము సమయములో యేసుక్రీస్తు ఒక రొట్టెను, ద్రాక్షరసమును తీసికొని ఇది నా శరీరమునకు, రక్తమునకు గుర్తుగా మీరు తీసుకొనవలెనని చెప్పెను. ఆయన "భోజనమును" తీసికొని నన్ను జ్ఞాపకము చేసుకొనుడని చెప్పలేదు. ఈ సందర్భములో గూడ ఏరకమైన ఆహారమైనను అంగీకారమైనచో మనము ఆహారమైనను, మాంసమును గూడ తీసుకొనగలము. కావున ఆయన సామాన్యమైన ఆజ్ఞను యివ్వక. ప్రత్యేకమైన ఆజ్ఞనే యిచ్చెను. ఈ విందునకు ఏదైన మనము చేర్చినచో అది దేవుని చిత్తమునకు హాని చేయుటయేనని గ్రహింపుము.
అదే రీతిగా క్రొత్త నిబంధన సంగీతమును గూర్చి మాట్లాడుచు వారు 'పాడిరి' అని తెలియజేయబడినది. సంగీతములో రెండు రకములు మాత్రమే గలవు. అవి గాత్రము, జంత్రము. గాత్రము అనగా నోటితో గానము చేయుట. జంత్రము అనగా వాయిద్యములను ఉపయోగించుట. అనేక రకములైన మ్రానులు, వివిధ జంతువులు, పలువిధములగు ఆహారములు మెుదలగు విషయములో లేఖనమేమి చెప్పెనో సంగీత విషయములో కూడ అట్టి ప్రత్యేకమైన ఆజ్ఞనే యిచ్చెను. దేవుడు ప్రత్యేక పరచినప్పుడు ఆయన తక్కిన వాటిని త్రోసివేసెనని భావము.
4) మనము సురక్షితముగా నుంటిమి:
వాయిద్యసంగీతములను ఉపయోగించకుండ అంగీకారయోగ్యమగు ఆరాధనను చేయగలమని ప్రతి వారు తలంపరు. గనుక మనము పొరపాటు చేయని స్థితిలోనే యుంటిమి. అపొస్తలులు సర్వసత్యములోనికి నడిపించబడినప్పటికి వాయిద్యములను గూర్చి వారు బోధించలేదు. వీటిని సత్యమునకు కలుప లేదు. గనుక సత్యములో వీటికి చోటు లేదు (యోహాను 16:13).
ఆదిమ సంఘము వీటిని ఉపయోగించలేదు. ఆరువందల సంవత్సరముల వరకు ఇవి వాడుకలోనికి రాలేదు. వీటిని గూర్చిన ఆజ్ఞ లేదు. ఆదిమ సంఘ ఆరాధన యెుక్క నమూన (మాదిరి) లో కూడ వీటి ప్రస్తావన లేదు. క్రొత్తనిబంధనలో ఏ లేఖన భాగము వీటికి అధికారమిచ్చుట లేదు. మనము విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము (2కొరింథీ. 5:6). ఇది పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినదికాదు. గనుక విశ్వాసములో దీనికి చోటులేదు.
ముగింపు:
ఒక వైద్యుడు రోగికి అవసరమైన మందులను గూర్చి వ్రాసినప్పుడు తక్కిన వన్నియు అనవసరమని నర్సుకు తెలియును. మనమెుక రెస్టారెంటుకు వెళ్లినప్పుడు మన ఆర్డరు ప్రకారమే ఫలహారము నిచ్చును గాని అనవసరమైన పట్టిక నంతటిని అతడు యివ్వడు. నీ వాహనమునకు భీమా సౌకర్యమున్నప్పుడు తక్కిన వాహనమునకు కూడ అదే సరిపోవునని చెప్పుట సమంజసమా? "పాడమని" దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దానికి నాట్యములను కలుపుట అపహాస్యము కాదా? వాయిద్యసంగీతములనెక్కడైతే ప్రవేశపెట్టుదురో వాటి వలన మేలు కంటె కీడే యెక్కువ జరుగునని గ్రహించుము.
Brother ఆరాధనలో instruments use cheyakudadhu adi clarity vachindi music తో unna songs vinocha? అది ఆరాధన time lo kakunda mamul ga free time lo ?
ReplyDeletesuper messsage sir
ReplyDeletei like it