కాలము సంపూర్ణమైనప్పుడు, మెస్సీయానందు యాజకత్వము, రాజరికము ఏకం చేయాలనే ఆలోచన పరమ దేవునికి ఉన్నట్టు లేఖనాలు సూచించాయి. అందుకే అబ్రాహాము కాలంలో రాజై యాజకత్వం చేసేవాడని చెప్పబడ్డ మెల్కిసెదెకు అనే ఒక వింతైన వ్యక్తిని దేవదేవుడు లేఖనాలకు పరిచయం చేశాడు. దీనికి సంబంధించిన చరిత్ర వాస్తవాలను ఆలోచన చేద్దాం.
సహజంగా ప్రవక్తల లేఖనాల్లో సింబాలిక్ భాష (symbolic language) ఉపయోగింప బడింది. వాటిలో “మందిరము” అనేది ఆరాధనకును, యాజకత్వానికిని సింబల్ గా వాడబడింది. పాత నిబంధన ఆరంభ దినాల్లో, పరమ దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య యాజకత్వాన్ని ఏర్పాటు చేశాడు (నిర్గమ 28:1 నుండి 30:1-38). దీనికి ముందు ఆయన వారితో రాజ్యంగా నిబంధన చేసికొన్నాడు (నిర్గమ 19:5-6). ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణకాలంలో, యెహోవా రాజ్యసింహాసము మీద దేవుడును, యెహోవా మందిరములో అహరోను సంతతివారును నియమింపబడిరి. ఇశ్రాయేలీయుల మధ్య యిట్టి ఏర్పాటు క్రమముగా ఆరంభమై కొనసాగుతుంది.
కాలక్రమంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అదృశ్యుడైన సర్వాధిపతి వారిని ఏలడం నచ్చని ఇశ్రాయేలు, సకల జనుల మర్యాదచొప్పున తమకు రాజు కావాలని కోరారు (1 సమూ. 8:5); వారి రాజ్యాంగ చట్టానికి సవరణ అవసరం లేకుండ (ద్వితీయో. 17:14-20), దేవుడు వారికి ఒక రాజును నియమించడం జరిగింది (1 సమూ. 10:24). ఇది వారుతమ వాగ్దాన దేశం స్వతంత్రించుకున్న రమారమి 400 సంవత్సరాల తరువాత జరిగింది. బెన్యామీను గోత్రికుడైన సౌలు వారి తొలి భౌతికమైనరాజు.
దేవుని నిబంధన సంబంధమైన ఆజ్ఞను (ద్వితీయో. 25:17-19), సౌలు అతిక్రమించినందున (1సమూ. 15:1-24), ఇశ్రాయేలీయుల రాజ్యమును అతని చేతిలో నుండి లాగివేసి (1సమూ. 15:28), దావీదుకు దానిని కట్టబెట్టడం జరిగిపోయింది. చివరకు దావీదు సంతతికిని, అతని సింహాసనానికిని సంబంధించిన శాశ్వతమైన నిబంధనను దేవుడు ప్రమాణ పూర్వకంగా చేశాడు (2 సమూ. 7:12-14). అందును బట్టి పాత నిబంధన కాలంలో, యెహోవా రాజ్య సింహాసము మీద దావీదు సంతతి వారును (1 దిన. 28:5), యెహోవా మందిరములో అహరోను సంతతివారును దేవుని ఏర్పాటును బట్టి క్రమముగా కొనసాగుతున్నారు.
అంటే, మందిరములో యాజకులును, పర్వతం మీద రాజులును యధేచ్ఛగా కార్యాలు జరిగిస్తున్నారు. “పర్వతము” అని వాడగానే మరో రకంగా తలంచనవసరం లేదు. పర్వతము అనేది రాజ్యమునకు పాత నిబంధన సింబల్ (symbol). “- నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను” అని దేవుడు తెలియజేసి, ఆ సింబల్ ను స్థిరపరిచాడు (కీర్తన 2:1). గనుక పాత నిబంధనలో రాజ్యమునకు “పర్వత” మనేది సింబల్ గా వినియోగింపబడిందని ఎవడైనా అంగీకరించి తీరాలి. సీయోను అంటే యెహోవా పర్వతం, అంటే పాత నిబంధనలో దేవుని రాజ్యమని అర్థం (యెషయా 11:9).
అయితే ఇశ్రాయేలు చరిత్రలో ఒక అపశృతి చోటు చేసుకున్నది. అది రాజైన ఉజ్జియా కాలంలో జరిగింది. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరుషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకేషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకేషునకు మనుష్యులను పంపి అతనిని అక్కడ చంపారు (2దిన. 25:27). అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు మారుగా రాజుగా నియమించారు (2దిన. 26:1).
అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్థిల్లజేసెను (2దిన. 26:5). అతడు తన శత్రువులతో యుద్ధము చేసినప్పుడు, దేవుడు అతనికి సహాయము చేసెను (వ8). అమ్మోనీయులు అతనికి పన్నిచ్చువారైరి. అతడు అధికంగా అభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యముంది. రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పరాక్రమశాలురైన మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది గల సైన్యము వారిచేతి క్రింద ఉండెను. సైన్యానికి ఉజ్జియా ఆయుధాలు చేయించాడు. అతడు స్ధిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను (2దిన. 26:11-15).
“అయితే అతడు స్ధిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులలో ఎనుబది మందియు అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి- ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియే గాని నీ పనికాదు; పరిశుద్ధ స్థలములో నుండి బయటకి పొమ్ము; నీవు ద్రోహము చేసి యున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకై ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకుల మీద కోపమము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడైయుండెను. గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటకి వెళ్లగొట్టిరి, యెహోవా తన్ను మెుత్తెనని యెరిగి బయటకు వెళ్లుటకు తానును త్వరపడెను” (2దిన.26: 16-20).
అయితే యిక్కడ ఏమి జరిగింది? ఏమి జరిగిందంటే, యెహోవా పర్వతం మీద కూర్చుండిన దావీదు సంతతివాడైన ఉజ్జియా, తనదికాని దొడ్డిలో ప్రవేశించి, యెహోవా మందిరములో ధూపము వేయుటకు పూనుకున్నాడు. ఈ కార్యాన్ని “యెహోవా మీద ద్రోహం” చేయడంగా పరిశుద్ధాత్మ వర్ణించాడు. పైగా, అతడు ద్రోహము చేసినట్టునూ, దేవుడైన యెహోవా సన్నిధిని అతనికి ఘనత కలుగదన్నట్టునూ, పరిశుద్ధ స్థలాన్ని విడిచి పొమ్మన్నట్టునూ ఉజ్జియా బోధింపబడ్డాడు. అయితే ఉజ్జియా ఉపదేశాన్ని లక్ష్యపెట్టే స్థితిలోలేడు. గనుక ఉపదేశాన్ని తిరస్కరించి, ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకుల మీద కోపం చూపాడు. దిద్దుబాటును అసహ్యించుకొని, భక్తిహీనుడైనట్టు అతడు తన్ను రుజువుచేసికొన్నాడు (కీర్తన 50:16-17).
దీనికి సంబంధించి యెషయాకు కలిగిన దర్శన సందేశం యిలా యివ్వబడింది: “యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు “పాపిష్ఠి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్టసంతానమా, చెరుపుచేయు పిల్లలారా, మీకుశ్రమ. వారు యెహోవాను విసర్జించి యున్నారు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధదేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు? ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగి యున్నాడు ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరకాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు…” (యెషయా 1:2-6).
యెహోవా పర్వతాన్ని, యెహోవా మందిరాన్ని దేవదేవుడు వేరుచేసి, వాటిని వేరుగా నిలిపి ఉంచగా, ఉజ్జియా తన అధికారపు అహంకారముతో వాటిని ఏకంచేయ ప్రయత్నించాడు. అంటే పర్వతంపైన తానే, మందిరములో కూడా తానే కార్యాన్ని జరిగించాలనే ప్రయత్నం చేశాడు. దాని ఫలితమే యెషయా 1లోని దేవుని సందేశం. ఆయన కలుపగా ఎవడును వేరు చేయకూడదు సరికదా, ఆయన వేరు చేయగా ఎవడును కలుపకూడదు. ఆయన వేరు చేసిన వాటిని కలుపగా ఏమి జరిగిందో యెషయా వివరించాడు.
ఎద్దు, గాడిద అనే రెండు జంతువులను రాజు, యాజకులనుగా లేఖనం పోల్చింది. లోకసంబంధమైన కథలో, గాడిద కుక్కపని యాజమాని బడితె దెబ్బలుతిన్నది. అయితే ఇక్కడ ఎద్దు గాడిద పనిచేసి కుష్ఠరోగముతో మెుత్తబడినట్లు చూశాం. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన వాస్తవాన్ని గుర్తించు. ఉజ్జియా యెుక్క శరీరసంబంధమైన స్థితి ఎట్టిదో, తిరగుబాటు చేసిన యూదా జనుల ఆత్మసంబంధమైన స్థితియు అట్టిదేననే సంగతి వివరింపబడింది. అంటే మాట వినక తిరగుబాటు, ద్రోహము చేసే ప్రతి వ్యక్తిని దేవుడు కుష్ఠరోగముతో మెుత్తుతాడని దీని అర్థం కాదు. అయితే ఒక కుష్ఠరోగి ఇశ్రాయేలు సమాజంలో ఎంత హీనంగాను, నీచంగాను చూడబడతాడో, తిరగుబాటు చేసే ప్రతి విశ్వాసిని, ప్రతివ్యక్తిని పరలోక సమాజముగాని, పరమదేవుడుగాని అదే దృష్టితో చూస్తారనే సందేశం అక్కడ యివ్వబడింది.
దేవుని యెదుట ఉజ్జియా కాలపు యూదావారి స్థితి అలా ఉండగా, మెస్సీయా కాలంలోని దేవుని జనుల మధ్య పరిస్థితి ఎలా ఉండబోతుందో దర్శనము వలన యెషయాకు సందేశం అందించబడింది. కాలము సంపూర్ణమైనప్పుడు, జరుగవలసిన ఏర్పాటును (ఎఫెసీ.1:8-10), దేవుడు అమలు చేయపూనుకున్నాడు. అది ఈ దిగువన సూచించబడింది.
“అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వత మునకు మనము వెళ్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పుతీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము” (యెషయా 2:2-5).
అంత్యదినములు అంటే క్రొత్త నిబంధన ఆరంభ దినములు (అపొ. 2:17). పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన దినములు, ఆత్మను గూర్చిన వాగ్దానం నెరవేర్చబడిన దినములు (లూకా 24:48-49; అపొ 1:4-5). “పర్వతములపైన” రాజ్యములపైన, యెహోవా మందిర పర్వతము (సంఘరాజ్యము) అన్నిటికంటె బహుగా హెచ్చింపబడినదై, అన్నిటికంటె మిన్నగా స్థిరపరచబడుతోంది.
ధర్మశాస్త్ర కాలంలో, యెహోవా మందిరములోనికి అన్యజనులకు ప్రవేశము లేనేలేదు (1రాజులు 8:41-42). అన్యజనులు దూరము నుండి వచ్చి, ఆ మందిరము తట్టు తిరిగి ప్రవేశించడానికి అనుమతి పొందారే తప్ప, అందులో ప్రవేశించడానికి అనుమతి పొందలేదు. అన్యజనుల ప్రవేశము వలన నాటి యెహోవా మందిరం అపవిత్రమైపోతుందని యూదులు గట్టిగా నమ్ముతారు (అపొ. 21:27-29). అన్యజనుల ప్రవేశము యెరుషలేము దేవాలయంలో నిషేధింపబడింది. దేవాలయం వద్ద అన్యజనులకు హద్దులు సూచించబడి ఉంటాయి. “హద్దు దాటితే నీ మరణానికి నీవే బాధ్యుడవు” అనే హెచ్చరిక యుంటుందట.
అన్యజనులకు ప్రవేశముండే దేవుని మందిరము క్రీస్తుప్రభువు యెుక్క సంఘమే (ఎఫెసీ 3:6). దేవుని మందిరమంటే, క్రొత్త నిబంధనలో సంఘమని సూచించబడింది: “శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను” అని పౌలు తిమోతితో అన్నాడు (1తిమోతి 3:14-15). ఇది కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటే సుమీ!
అంత్యదినములలో యెహోవా మందిర పర్వతం కేవలం యెహోవా మందిరము కాదు యెహోవా పర్వతమూ కాదు. అది ఎంతగా మందిరపర్వతమనబడింది అంటే సంఘరాజ్యము, పర్వతశిఖరమున స్థిరపరచబడి, తక్కిన రాజ్యాలకంటే గొప్పగా ఎంచబడుతోంది. ఆ కాలమున సీయోనులో నుండి ధర్మశాస్త్రము వస్తుంది. దీనికి ముందు సీనాయిలోనుండి ధర్మశాస్త్రము వచ్చింది; దానిని మోషే ధర్మశాస్త్రమన్నారు. ఆ ధర్మశాస్త్రం యెహోవా పర్వతాన్ని, మందిరాన్ని వేరుచేసింది. గాని సీయోనులో నుండి వచ్చిన ధర్మశాస్త్రమైతే, అంటే క్రొత్త నిబంధన, మందిరాన్ని పర్వతాన్ని ఏకంచేసి, యెహోవా మందిర పర్వతంగా రూపించింది. యెరుషలేమునుండి యెహోవా వాక్కు అనేది అపోస్తలులబోధ లేక క్రీస్తుబోధ బయలు వెళ్లింది.
ఈ దశకు పరిస్థితులు రాకముందే, దీనికి అనుకూలమైన ఏర్పాట్లను దేవుడు సిద్ధం చేశాడు. యూదులకు బబులోను చెరకాలం అంతరించింది. యెరుషలేములో దేవాలయ నిర్మాణ కార్యక్రమం ముగింపబడింది. ఆ సమయంలో యిలాటి సమాచారం ప్రవక్తయైన జెకర్యా ద్వారా వినిపించబడింది.
“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడినవారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి టోబీయా యెదాయా అనువారు జెఫన్యా కుమారుడగు యోషీయా యింట దిగియున్నారు; వారు చేరిన దినముననే నీవు ఆ యింటికిపోయి వారి నడిగి వెండి బంగారములను తీసికొని కిరీటముచేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహో షువ తలమీద ఉంచి అతనితో ఇట్లనుము - సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా - చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును; అతడే యెహోవా ఆలయము కట్టును; అతడు ఘనత వహించుకొని సింహాసనా సీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ యిద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును” (జెకర్యా 6:9-13).
“చిగురు” అనునొకడు తన స్ధలములో నుండి చిగుర్చునట! ఎవరు ఈ చిగురు? ఎవరంటే, “యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు - రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు” (యిర్మియా 23:5-6). యింతకు ఈ చిగురు అనే వ్యక్తి ఎవరబ్బా? “యెష్షయి మెుద్దునుండి పుట్టే చిగురు. వాని వేరుల నుండి ఎదిగి ఫలించే అంకురము” అని యెషయా అంటున్నాడు (యెషయా 11:1). వాస్తవానికి ఆయన దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహమే; వధింపబడినట్లుండిన గొఱ్ఱెపిల్ల (ప్రకటన 5:5-6). ఆయన వేరెవరో కాదు ప్రభువైన యేసే. అంటే ప్రభువైన క్రీస్తునందు యాజకత్వం రాజరికం ఏకం చేయబడునని గ్రంథం అంటుంది. ఆయన యెహోవామందిర పర్వతంలో పని కలిగియుంటాడనేది లేఖనానుసారమైన భావమైయుంది.
ఆయన రాజరికం శాశ్వతమయ్యింది. “ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు యేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును'' (లూకా 1:32). అలాగుననే ఆయన యాజకత్వం కూడా శాశ్వతమైనదే; “ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను” (హెబ్రి 7:23). క్రీస్తు ప్రభువు పట్టాభిషేకానికి సంబంధించి యిలా ప్రవచింపబడింది; “ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు - నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగ జేయుచున్నాడు. నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము” (కీర్తన 110:1-2).
అదే సమయానికి సంబంధించి మరొక లేఖనం ఇలా అంటుంది: “మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు” (కీర్తన 110-4). మెల్కిసెదెకును పోలి, ప్రభువైన క్రీస్తు ఎప్పుడు యాజకుడో అప్పుడే ఆయన రాజైయున్నాడు; లేదా ఆయన ఎప్పుడు రాజై యుంటాడో, అప్పుడే యాజకుడై యుంటాడు. గనుకనే పరమదేవుడు ఆయన (క్రీస్తు) కొరకు యెహోవా పర్వతాన్ని మందిరాన్ని ఏకంచేసి, దానిని యెహోవా మందిరపర్వతంగా రూపొందించాడు. మందిరపర్వతమంటే సంఘరాజ్యమని వేరుగా చెప్పనవసరం లేదు. పాత నిబంధన కాలంలో, పర్వతాన్ని, మందిరాన్ని దేవుడు వేరుగా ఉంచి; పర్వతం మీద రాజును, మందిరంలో యాజకుని నిలిపి కార్యాలను జరిగిస్తూ ఉంటే, దావీదు సంతతివాడైన ఉజ్జియా గర్వించి చెడిపోయినవాడై, ఆ రెండింటిని తన అధికారంతో ఏకం చేయబూని,కుష్ఠముతో మెుత్తబడిన సంగతిని మనం ముందుగానే చూశాం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు క్రీస్తు ప్రభువు కొరకు మందిరాన్ని పర్వతాన్ని ఏకంచేశాడు. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది? ఏమి జరుగుతుందంటే, దేవుడు ఏకంచేసిన దానిని క్రీస్తు సంఘంలో కొందరు విడగొట్టడానికి ప్రసవవేదన పడుతున్నారు. అంటే సంఘ వేరు రాజ్యం వేరు అని బోధింప ప్రయాస బడుతున్నారు. ఉజ్జియా ఒక రకంగా తిరగుబాటు చేసియుంటే, వీరు మరో రకంగా తిరుగుబాటు చేస్తున్నారు జాగ్రత్త! సంఘం వేరు రాజ్యం వేరు కాదు సుమీ! సత్యాన్ని స్ధాపింప బూను కొన్నవాడు అబద్ధాలను మూటకట్టుకోవచ్చా? లేకుంటే, సంఘం వేరు రాజ్యం వేరు అని చెప్పడానికి ఎందుకింత ప్రసవవేదన? ఆ సంగతి అలాగుంచి, మనం విషయానికి వద్దాం: “జనులు గుంపులు గుంపులుగా వచ్చి-యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు వెళ్లుదము రండి” ఎందుకు? ఉజ్జియాలా తమ సొంత ఉద్ధేశాలను నెరవేర్చు కొనడానికా? దేవుని మందిరములో తమ యిష్టాన్ని నెరవేర్చడానికా? లేక తమ తీర్మనాలను ప్రవేశపెట్టడానికా? కాదు సుమా!!
ఎందుకంటే, “ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలయందు నడుతము” ఎంతటి ఆదర్శమైనది ఆయన సంఘరాజ్యము? ఉజ్జియా అయితే ఆయన మార్గముల విషయమై బోధింపబడ్డాడు. ఆనాటి ప్రధాన యాజకుడైన అజర్యా దేవుని మార్గాలను అతనికి బోధించాడు. ఉజ్జియా ఆ మాటలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు సరికదా, అతడు రౌద్రుడై, యాజకుల మీద కోపం చూపాడు (2దిన. 26:19). కాని సంఘ రాజ్యంలోని ప్రజలు అలాటివారుకారు; వీరు సాధు స్వభావులు, దీన మనస్సుగల వారు, భక్తిగలవారు; దిద్దుబాటును ప్రేమించేవారు, పసిబిడ్డలవలె దేవుని మాటలము అంగీకరించే వారు (మత్తయి 18:1-3).
యెహోవా మందిరపర్వతంలోని జనులు యింకా ఎలాటి వారైయుంటారు? “వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును” (యెషయా 2:4). ఆహా! అది నిజముగా ఎంతటి మార్పు?
ఖడ్గము యుద్ధము చేసే ఆయుధం. హాని చేసేది; ప్రాణాలు తీసేది; బాధించేది; వేధించేది! నాగటినక్కు బీడుభూములను దున్నేది, ఆశాజనకమైనది, ఉత్పత్తికి సాధనమైనది; ప్రాణాధారమైనది. ప్రాణాలుతీసే ఖడ్గాన్ని, ప్రాణపోషణకు ఆధారమైన నాగటినక్కుగా మార్చుకొనడం నిజంగా ఆశ్చర్యమే. మరియు వారు తమ యీటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. హానికరమైన యీటెలను, ప్రయోజనకరమైన పనికి సాధనమైన మచ్చుకత్తిగా మార్చుకొనడం సంఘరాజ్యపు వాతావరణాన్ని సూచిస్తుంది. ఈ చర్యలు వారి క్రొత్త జన్మకు నిదర్శనంగా ఉన్నాయి.
ఆ మీదట వారిలా అంటారు: “యాకోబు వంశస్థులారా రండి”. దేనికి? గుద్దులాడుకొనడానికా? కలహపడటానికా? లేక ధన సంపాదనకా? కాదు సుమా! అందులకు కానేకాదు. మరిదేనికట! “మనము యెహోవా వెలుగులో నడుచుకొందము” (యెషయా 2:5). వెలుగు నీతికి సహజమైన సింబల్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన వారిని పిలిచాడు (1పేతురు 2:9). యెహోవా మందిరపర్వత వాసులు క్రీస్తు యెుక్క వెలుగులో (యోహాను 1:9); వాక్యపు వెలుగులో నడుచుకొంటారు (కీర్తన 119:105). యెహోవా వెలుగులో నడుచు కొనడమంటే, దేవున్ సహవాసంలో నలిచియుండడం అని అర్థం.
“మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమాన మేమనగా - దేవుడు వెలుగై యున్నాడు; ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడ సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినయెడల మనమబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసురక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహాను 1:5-7).
“మీరు పూర్వమందు చీకటియై యుంటిరి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై యున్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి” (ఎఫెసీ 5:8-14) అనే క్రొత్త నిబంధన సందేశం వారి జీవిత అనుభవంలో భాగమై యుంటుంది.
ఈలాటి ఆత్మ సంబంధమైన వాతావరణం కొరకు, యెహోవా మందిరపర్వతము లేక సంఘరాజ్యమనేది దేవుని చిరకాల కోరికయై యున్నట్టు గోచరిస్తుంది. అయితే అది తలవని తలంపుగా ఉద్భవించింది మాత్రం కాదు. దీనిని దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటుగా నియమించినట్టున్నాడు (ఎఫెసీ 1:7-10). కాలములు సమయములు దేవుడు తమ స్వాధీనంలో ఉంచుకొని, ఎప్పుడు, ఏది జరగడం వలన తన జనులకు మేలు కలుగుతుందో, అప్పుడు ఆయా పథకాలను ప్రవేశపెట్టుతూ, పరమదేవుడు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. యెహోవా మందిరపర్వతంలో క్రీస్తు ప్రభువు యెుక్క పనిమీదికి దృష్టిమళ్ళించుదాం. మెుదటిగా, ఆయన పరలోకం తరుపున మాటలాడటానికి నియమింపబడియున్నాడు (Heavenly Spokes Person). శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యెుక్క (Absolute Authority) అధికారమునుండి, క్రీస్తు ప్రభువుకు అధికారమివ్వబడింది. పరమతండ్రిది సొంతమైన అధికారం! క్రీస్తువారిదియియ్యబడిన అధికారం (Delegated Authority) (మత్తయి 28:18). ఈ అధికారపు హోదాలో పరలోకం తరుపున ఆయన మాట్లాడుతాడు.
“పూర్వకాలమందు నానాసమయములలోను నానావిధములు గాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై యుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్టుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను” (హెబ్రి 1:1-4). యెహోవా మందిరపర్వత వాసులు ఆయన తమతో ఏమి చెప్పినను, అన్ని విషయములలో ఆయన మాట ఎవడు వినడో, వాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగును (అపొ. 3:22-23). దేవుని కుడిపార్శ్యమంటే, దేవుని తరువాత స్థానములో అని అర్థం.
క్రీస్తురాజు చేసే రెండవపని: దేవుని కొరకు ఆయన ప్రజలను ఏలుట! “మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను” (అపొ. 2:36). దావీదు/యెహోవా రాజ్య సింహాసము మీద క్రీస్తు ఆసీనునిగా చేయబడినప్పుడు, ఆయన భూసంబంధమైన దావీదు వంశస్థుల వలెగాక, దేవుని నూతన రాజ్యాంగ చట్టమైన క్రొత్త నిబంధనకు జనులను లోబరచువాడైయుంటాడు. వారి మనస్సులో దేవుని ధర్మ విధులు నిలిపి, వారి హృదయముల మీద అవి నామాక్షరంగా చెక్కబడేలా ఆయన పరిపాలన సాగిస్తాడు.
అవిధేయులై, తిరుగుబాటుచేస్తూ, ధర్మశాస్త్రనిబంధన క్రింద కొనసాగిన యూదులవలె గాక, దేవుని చిత్తాన్ని గౌరవించి, హృదయపూర్వకంగాను, యిష్టపూర్వకంగాను లోబడే జనులుగా వారిని తీర్చి దిద్దడమనే దిశగుండా క్రీస్తు రాజు తన ఏలుబడిని కొనసాగిస్తాడు. ప్రజలకొరకు తన ప్రాణం పెట్టిన ప్రేమతో జనులను ఆకర్షించి, దేవుని పరలోకపు వాతావరణంలో జీవింపగోరే ప్రజలను సిద్ధపరచడం క్రీస్తు వారి పనియై యుంటుంది. ఆయన ఏలుబడిలో భూసంబంధులు పరలోక సంబంధులుగాను, శరీరసంబంధులు ఆత్మ సంబంధులుగాను, ప్రకృతి సంబంధులు పరిశుద్ధులుగాను, మల్చబడే దిశగా ఆయన పరిపాలన కొనసాగుతుంది.
అందువలన “మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తి గలదేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక, ఆమేన్” (ఎఫెసీ 3:20-21). క్రీస్తు పాలనలో ఉండే ఆత్మ సంబంధమైన పథకాలను బట్టి, జనులు తమ రాజులా ఉండగోరి ఆయన ప్రదర్శించిన ఆదర్శ జీవిత విధానాన్ని అనుకరించుతూ, అన్ని విషయములలో ఆయనవలె ఉండనపేక్షగలవారై, ఆ రూపును సాధించే కృషిచేస్తుంటారు.
యెహోవా మందిరపర్వతంలో క్రీస్తు రాజు జరిగించే మూడవ కార్యం: అనుభవము, శ్రద్ధగల కాపరికి తనమందను ఎలా నడిపించాలో బాగా తెలుసు. మందను కాచిన యాకోబు తన అనుభవాన్ని యిలా పంచుకొంటున్నాడు: “నాయొద్ద నున్న పిల్లలు పసిపిల్ల లనియు, గొఱ్ఱెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్లవలెను. నేను నా ప్రభువునొద్దకు శేయీరునకు వచ్చువరకు, నా ముందర నున్న మందలు నడువగలిగిన కొలదిని ఈ పిల్లలు నడువగలిగినకొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చెదనని” యాకోబు ఏశావుతో అన్నాడు (ఆది. 33:13-14). తన మందను ప్రేమించే కాపరియెుక్క అక్కర అది.
మనుష్యులనే దేవుని గొఱ్ఱెలను మేపు కాపరులను గూర్చి గ్రంథం యిలా అంది: “-తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ; కాపరులు గొఱ్ఱెలను మేపవలెనుగదా? మీరు క్రొవ్విన గొఱ్ఱెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొఱ్ఱెలను మేపరు, బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరల తోలుకొనిరారు, తప్పిపోయినవాటిని వెదకరు, అది మాత్రమేగాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు” (యెహె.34:2-4,31).
తన గొఱ్ఱెలను నిజంగా ఏమి చేయాలో, పసిపిల్లలను, పాలిచ్చువాటిని ఎలా తోలాలో ఎరిగి శ్రద్ధగాను, యిష్టపూర్వకంగాను, ప్రేమతోను వాటిమి మేపే క్రీస్తు రాజు వాటి మీద కాపరిగా నియమింపబడ్డాడు. ఆయన వాటికి కాపరిగా ఉండి వాటిని మేపుని. ఇలా వాటిని నడిపించడంలో బలహీనమైన వాటి విషయములలోను తాలిమి చూపగలిగిందే ఆయన యాజకత్వం (హెబ్రి. 5:1-3). వాస్తవంగా ఎవరు ఆయన పాలన క్రింద, నడిపింపు క్రింద, ఏలుబడి క్రింద ఉంటారో, వారికి మాత్రమే ఆయన ప్రధానయాజకుడుగా ఉంటాడు. అంటే, ఆయన రాజ్యంలో ఉన్నవారికే ఆయన యాజకత్వం జరిగిస్తాడు (హెబ్రి. 7:25).
“ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము” (హెబ్రి 4:14-16).
సంగతులు విస్తరించి చెప్పబూనుకోలేదు. అయితే యాకోబు దేవుని మందిరములో యెహోవా పర్వతంలో క్రీస్తురాజు ఈ పనులు చేయడానికి గాను, దేవుడు సమస్త కార్యాలను స్వయంగా సమకూర్చి, కడకు యెహోవా మందిరపర్వతాన్ని, అంటే సంఘరాజ్యన్ని ఏర్పాటు చేశాడు. ఆయన వేరు చేసినప్పుడు, ఏకంచేయడానికి ప్రయత్నించిన ఉజ్జియాలా, ఆయన మందిరపర్వతాన్ని ఏకం చేసినప్పుడు వాటిని విడదీయ ప్రయత్నించకూడదు. ఆయన విడదీసినప్పుడు వాటిని కలుప ప్రయత్నించకూడదు. ఆయన విడదీసినప్పుడు ఏకం చేయడానికి ప్రయత్నించిన ఉజ్జియా దోషమేలాటిదో, ఆయన కలిపిన వాటిని విడదీసే వారిదోషంకూడా అట్టిదేనని గుర్తించాలి. సంఘము రాజ్యము వేరువేరైనవనే తప్పుడు బోధ క్రీస్తు సంఘము పేరున జరుగుతోంది; దాని విషయమై జాగ్రత్త సుమీ!
G. Devadanam
0 comments:
Post a Comment