Monday, 12 September 2016

క్రీస్తు సిలువకు ముందున్నలోకపు పరిస్థితి

"ఒక మనుష్యునిద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను" (రోమా 5:12).

          ఒక మనుష్యుడు, ఆదాము ద్వారా లోకంలోనికి పాపప్రవేశం జరిగింది. అది ఆజ్ఞాతిక్రమము వలననైన పాపము (ఆది:2:17). "మంచిచెడ్డల తెలివి నిచ్చు వృక్షఫలములను తినకూడదు (ఆజ్ఞ); నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికాజ్ఞాపించెను". ఆదాము తన భార్యమాటవిని, "నీవు తిన కూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి" అంటే, ఆజ్ఞాతిక్రమం జరిగింది. ఇలా ఆజ్ఞాతిక్రమము వలన లోకంలో పాపం ప్రవేశించింది (3:17).

పాపప్రవేశం వలన లోకంలోనికి ప్రవేశించిన మరణమేది? అది భౌతిక మరణమా? కాదు. ఏలయనగా ఆదాము పాపముచేసిన తోడనే భౌతికంగా చనిపోలేదు. పాపం చేసిన తరువాతనే ఆదామునకు సంతాన ప్రాప్తి జరిగింది (4:1). కయీను, హేబెలు అనుయిద్దరు కుమారులు అతనికి కలిగారు, వారు ఎదిగి పెద్దవారైనట్టును, వారు తమతమ వృత్తులలో స్థిరపడినట్టును, వారు దేవునికి అర్పణలు తెచ్చువయస్సుకు ఎదిగినట్లును, కాలక్రమంలో, పెద్దవాడైన కయీను తన తమ్ముడైన హేబెలును హత్యచేసినట్టును వ్రాయబడియుంది (ఆది. 4). "కయీను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరియొక సంతానమును నియమించెననుకొని అతనికి షేతు అను పేరుపెట్టెను". అంటే, పాపముచేసిన వెంటనే ఆదాము భౌతికంగా చావలేదని రుజువౌతుంది.

          గనుక ఆదాము పాపముద్వారా లోకంలో ప్రవేశించిన మరణం ఏమైయుంటుంది? ఆత్మసంబంధమైన మరణమైయుంటుంది. ఇంతకు మరణమంటే ఏమిటి? మరణమంటే, సంబంధంలేని ఎడబాటు. మనకు దైనిక అనుభవంలో తెలిసింది శరీర మరణమే. శరీర మరణమంటే - దేహము నుండి ప్రాణము సంబంధంలేకుండ వేరవ్వడం. భార్యభర్తలను సంబంధం లేకుండ ఎడబాటు చేసేది ఈ మరణమే. ప్రాణిని తన రక్తబాంధవ్యంనుండి వేరుచేసేది, మనిషిని తన సమాజంనుండి సంబంధంలేకుండ వేరుచేసేది శరీర మరణమే. ఈ కార్యములలో ఏదియు ఆదాము పాపముచేసిన వెంటనే జరుగలేదు.

          ఏదియెలాగున్నా ఆత్మసంబంధమైన మరణమంటే ఏమిటి? ఆత్మ సంబంధమైన మరణమంటే- పాపంచేసిన వ్యక్తి దేవుని వలన కలుగు జీవములోనుండి వేరుచేయబడతాడు (ఎఫెసీ 4:18). దేవుని వలన కలుగ జీవంలోనుండి పాపము పాపిని వేరుచేస్తుంది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పడు, వెంటనే అతడు దేవుని వలన కలుగు జీవంలోనుండి వేరుచేయబడ్డాడు (యెషయా 59.1-2). ఈ ప్రక్రియ వెనుక అపవాది క్రియ ఉంది (ఆది. 3.1-10) పాపము వలన దైవమానవులమధ్య సంబంధంలేని ఎడబాటు ఏర్పడింది. దేవుడు పాపితో సహవాసం చేయలేడు; పాపి దేవుని సముఖానికి రాలేడు. దోషభరితమైన వాని మనస్సాక్షి దేవునియెదుటికి పాపిని రానియ్యదు. ఈలాటి పరిస్థితి పాపంవలన లోకంలో ప్రవేశించింది (ఆది. 3).

          ఈ ప్రక్రియ యింతటితోనే ఆగిందా? అంటే, ఆగనేలేదు. "ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయెను" (రోమా 5:12) ఆత్మసంబంధమైన ఈ మరణము మెల్లగా బలంపుంజుకొని, ప్రభుత్వాన్ని పట్టుకుంది. ఆ ప్రభుత్వం పేరు "మరణం" పార్టీ అధ్యక్షుడు అపవాది. అందువలన ఆత్మసంబంధమైన లోకపు పరిస్థితి ఎలాగుందంటే...

          అంధకారసంబంధమైన అధికారము (కొలస్సి 1.13) ఏలుబడిలో ఉంది. గనుక ఇశ్రాయేలీయులనే దేవుని నిబంధన సంబంధులు తప్ప (రోమా. 9:4-5) మిగిలిన మానవజాతియావత్తు నిర్దేవులై, అంటే దేవుడు లేనివారై క్రీస్తుకు దూరస్తులైన స్థితిలో కొనసాగుతున్నారు (ఎఫెసీ.2:12). ఆ కాలంలో యూదులేమి యూదేతరులేమి, నరులపట్ల దేవుని వైఖరి అనుకూలంగా లేదు: "రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవనికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గనుక ఆయన ఆలకింపకున్నాడు" (యెషయా 59.1-2). ఇది మరణపు ఏలుబడి ప్రభావం.

          మరణప్రభుత్వంలో, (kidnapping culture) మనుష్య చోరత్వపు నాగరికత అమలులో ఉంది. అపవాది నరులను శోధించి, మోసగించి, వారిచే పాపము చేయించి, మనుష్యచోరత్వం జరిగించి తన ఆవరణములో ఉంచుకొనడం సహజమైపోయింది (మత్తయి 12:29; లూకా 11:22). ఉదా|| స్కూలుకు వెళ్ళుతున్న బాలికను అడ్డగించి, కారులో ఎక్కించుకొని, రహస్యస్థలానికి తర లించి, యింటనున్న తన తండ్రికి ఆ వర్తమానం తెలిపి, రూ.100,000 ఫలానిచోటకు తెచ్చి అందించితే, నీ బిడ్డ నీకు దక్కుతుంది, లేకుంటే నీబిడ్డపై ఆశలు వదలుకోవాలని తెలిపే తరహాలో కార్యాలు జరుగుతున్నాయి. అపవాది యొక్క బంధీలను మరణభయంచేత దాస్యానికి లోబరచియుంచడం అడ్డులే కుండా కొనసాగుతోంది (హెబ్రీ.2:14-15). ఎవరైనా యిట్టికార్యాలను తమపట్లగాని, లేక తమపిల్లల పట్లగాని చేస్తే, లోకంలో ప్రభుత్వాధికారులకు చెప్పుకొని పరిష్కరించుకుంటారు. అయితే ప్రభుత్వపు పై అధికారియే ఈపనికి పూనుకొంటే, జనులు యింకెవరివైపు ఆశతో ఎదురు చూడగలరు?

          పైగా, యింతకు వాస్తవమేమంటే, “ఆదాముచేసిన అత్రిక్రమమును పోలి పాపము చేయని వారిమీదకూడాఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను" అని వ్రాయబడియంది.(రోమా 5:14) ఆదాము మొదలుకొని అంటే, ఏదైను తోట అనుభవం నుండి మోషేవరకు అంటే, మోషే అనే ఒకవ్యక్తి జన్మవరకు అని దాని అర్థంకాదు మోషే ఈ సందర్భంలో ధర్మశాస్తానికి (symbol) గురుతుగా వినియోగింప బడ్డాడు. గనుక మోషే ధర్మశాస్త్రముయొక్క అంతం వరకుఅంటే రమారమి 4,000 సంవత్సరాల కాలము మరణం ఏలుబడిచేసింది.

          రమారమి ఈ 4,000 సంవత్సరాలు తిరుగులేని, అడ్డులేని అధికారాన్ని అపవాది చెలామణి చేస్తున్నాడు. దీనికి దేవుని అనుమతి ఉన్నట్టు కన్పిస్తుంది. "ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు..... అది నాకప్పగింప బడియున్నది...."(లూకా 4:5-6). భూలోక రాజ్యముల అధికారమును, వాటి మహిమయు తనకు అప్పగింపబడియున్నట్టు అపవాది చెప్పకున్నాడు. దానిని వానికి అప్పగించినవాడు సర్వాధికారియు దేవుడునగు ప్రభువే! ఆయన ప్రసాదింపకుండ ఎవనికి ఏదియు ఉండదు (యోహాను19:11). ప్రభువైన యేసు సహితము అపవాదిని ఈ లోకాధికారిగా గుర్తించాడు (యోహాను14:30). అపవాదియొక్క మరణ ప్రభుత్వం క్రింద నరజాతి చెప్పలేనన్ని అగచాట్లు అనుభవిస్తుంది. బంధకాలు, మరణభయం, దాస్యము, గతిలేని, నిరీక్షణలేని, రక్షణగాని, కాపుదలగాని, ఏలాటి భద్రతగాని లేని మిక్కిలి ఘోరమైన దుస్థితిని నరజాతి అనుభవిస్తుంది. దీనంతటికితోడు, దేవుని ఉగ్రత మానవ దుర్నీతిమీద పరలోకంనుండి బయలు పరచబడుతుంది (రోమా 1:18-19).

క్రీస్తుసిలువయాగంలేని లోకంలోని మానవ సమాజపు స్థితిగతి రోమా 1:18-32లో వర్ణించబడింది: "దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్ధులైరి. వారి అవివేకహృదయము అంధకారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి".

          "ఈ హేతువుచేతవారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల పర్యంతము ఆయన స్తోత్రార్దుడైయున్నాడు, ఆమేన్",

          "అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలె పురుషులుకూడ స్త్రీయొక్కస్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరియొడల ఒకరు కామతపలైరి".

మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టమనస్సుకు వారి నప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమను వాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులను, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకవిధేయులును, అవివేకులును మాటతప్పువారును, అనురాగరహితులును, నిర్దయులునైరి. ఇట్టికార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇదిమాత్రమేగాక వాటిని అభ్యసించువారితో సంతోషముగా సమ్మతించుచున్నారు" (రోమా 1: 18-32 ).

క్రీస్తుమరణంలేని అన్యజనుల సమాజపు స్థితిగతియిందు వర్ణించబడింది. ఆకాలంలో, దేవునితో నిబంధన సంబంధంగల యూదుల పరిస్థితి ఏమైనా మెరుగుగా ఉందా అంటే, అదీ లేనేలేదు. దేవడు వారికి ప్రసాదించిన ధర్మశాస్రాన్ని విశ్వాసమూలముగా గాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంబడించారు (రోమా 9:30-32). ఆ నియమాన్నివారు అతిక్రమించడం వలన, పాపమునకు అమ్మబడి శరీరసంబంధులైయ్యారు (రోమా 7:14).  దేవుని నియమానికి వ్యతిరేకమైన వేరొక నియమము వారిలో ప్రత్యక్షమయ్యింది. శరీర సంబంధమైన నియమము, దేవుని ధర్మశాస్రనియమముతో పోరాడుచు పాపనియమానికే వారిని చెరపట్టుకొనిపోయింది. అట్టి మరణమునకు లోనగు శరీరంనుండి విడిపించబడలేని దౌర్భాగ్యపుస్థితిలో యూదులు కొనసాగుతున్నారు (రోమా. 7:14-24).


క్రీస్తు సిలువ మరణంలేని పరలోకపు పరిస్థితి: పరలోకం సహితం సమస్యలేనట్టుకన్పించదు. పరలోకము దేవనియిల్లు (యోహాను 14:1-2); దేవుని అధికారపూర్వకమైన నివాసం. మహామహుని శాశ్వత సింహాసనముండేచోటు (ప్రకటన 4:1-4).  అక్కడ సమస్యలెలాగుంటాయి? క్రీస్తు సిలువమరణంలేని రోజుల్లో అపవాది పరలోకానికి ఆహ్వానంలేని అతిథిగా దర్శించుతుండేవాడు. "దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్టించెను. ఆ దినమున అపవాదియగువాడు వారితో కలిసివచ్చెను" (యోబు 1:6). ఆ మీటింగుకు అపవాదిని పిలిచిందెవరు?

ఆహ్వానంలేకుండ వచ్చిన అపవాదిని దేవుడు నిరాకరిస్తాడా? వారి మీటింగుతో ప్రవేశంలేదని వానిని బయటికి పంపుతాడా? అంటే అదీలేదు. ఆహ్వానం లేకుండ వచ్చినవానిని దేవుడు పలుకరించకమానడు. ఆయన వానిని కుశల ప్రశ్నలడుగుతాడు: "యెహోవా - నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది - భూమిమీద ఇటుఅటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను". సంభాషణ అంతటితో ఆగదు (యోబు 1:7).

శత్రు స్వభావముగలవానితో సహితము దీర్ఘశాంతపరుడు సంభాషిస్తనే ఉంటాడు. అందుకు యెహోవా - నీవు నాసేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమిమీద అతని వంటివాడెవడునులేడు అని అడుగగా అపవాది - యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా? నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టుకంచెవేసితివిగదా? నీవు అతని చేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది. అయినను నీవు ఇప్పడు నీచేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అని యెహోవాతో అనగా - ఇదిగో యెహోవా అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికి మాత్రము ఏహానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లేను" (యోబు 1:8-12).

క్రీస్తు సిలువమరణానికిముందు, అపవాది దేవుని సన్నిధికి నిరాటంకంగా వచ్చుచు పోవుచున్నట్టు గోచరిస్తుంది. దేవుడు వానితో ముచ్చటిస్తున్నట్టు కన్పిస్తుంది (యోబు 2:1-5) దేవదూతలు యెహోవాసన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితో కూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను (యోబు 2:1). పరలోకపు దేవదూతల మీటింగులో, వీడు ఆహ్వానంలేని అతిథి (uninvited guest) ఈ ఆహ్వానంలేని అతిథి ఊరకయే కూర్చుండి ఏమి జరుగుతుందో కేవలం చూస్తూఉంటాడా? అంటే అదీలేదు. వారి మీటింగులో పానకంలోని పుడక అన్నట్టు, బహుగా అంతరాయం కలిగిస్తూ, దేవుని న్యాయాన్ని ప్రశ్నిస్తూ, దానినెమ్మదిని చెడగొడుతూ ఉంటాడు!!    

పూర్వకాలంలో పాపం చేసి, మారుమనస్సు పొందిన తన భక్తులను దేవుడు చేర్చుకొని, వారిని అంగీకరిస్తుంటాడు. పాపంచేసిన ఆలాటి భక్తులను అంగీకరించడం దేవునికి ఎంతవరకు న్యాయమనేది ఆయన యెదుట అపవాది ప్రశ్న "కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము.... రాత్రింబగళ్లు మన  దేవునియెదుట  మన సహోదరులమీద నేరము మోపువాడు (ప్రకటన 12:9-10). దేవుడు దావీదును అంగీకరించడం ఎంతవరకు న్యాయం అంటూరాత్రింబగళ్ళు పరలోకపు దేవుని సన్నిధిలో అంటుంటే ఈ సమస్యకు న్యాయ సమ్మతమైన పరిష్కారం కావాలిగదా? - ధ్రర్తశ్రాస్త్రంలో ప్రాపపు సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు (హెబ్రీ 10:2-4) సరిగదా ఆధర్మశాస్త్రమే సమస్యగా మల్చబడింది.

దేవుడు ఏదేనులో ప్రవేశపెట్టిన పాపమరణముల నియమాన్ని అపవాది ఆసరాగా తీసుకొని, ఆ నియమాన్ని, అపవాది తనకు అనుకూలంగా మల్చుకొని, జనులను మోసగించి (II కొరింథీ.11:3; ప్రకటన 12:9), తన ఆధిపత్యాన్ని విస్తరింపజేసుకున్నాడు.

కాలక్రమంలో, అబ్రాహాము అనే వ్యక్తి దేవునికి లోబడిన వాడైనందున (ఆది. 12:1-3; హెబ్రీ.11:8), అతనితో దేవుడు నిబంధన చేసికొని (ఆది. 17:8-10), అతని సంతతియైన ఇశ్రాయేలీయులను తన జనముగా ఏర్పరచుకొని, వారిద్వారా దేవుడు తన కార్యాలను జరిగింపబూనుకున్నాడు. వారితో పరమదేవుడు ఒక నిబంధన చేసికున్నాడు (ద్వితియో, 5:1-3). అది మోషేద్వారా ఆనుగ్రహింపబడిన ధర్మశాస్త్రము. "అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి" (రోమా.9:31-32) అని గమనించాం.

పాపమరణముల నియమమునుండి తప్పించడానికి ఉద్దేశింపబడిన ధర్మశాస్తాన్ని ఇశ్రాయేలీయులు సద్వినియోగం చేసికోలేదు. గనుక వారి ధర్మశాస్రాన్నే అపవాది వారికి విరోధముగా మల్చివారిని తన వశం చేసికొన్నాడు. "ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను. గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలేదు"(రోమా 5:13) ధర్మశాస్త్రము ఉత్తమమైనది. "అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ ఆదాము మొదలుకొని మోషేవరకు మరణమేలెను" (రోమా. 5:14).

సాతాను అంధకారసంబంధమైన అధిపతి ధర్మశాస్త్రమున్నా అతని మరణప్రభుత్వం నిరాటంకంగానే కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం క్రింద జరుగుతున్నదేమి? నరులచే పాపం చేయించి, దేవునితో వారికున్న బాంధవ్యాన్ని సంబంధంలేకుండ తెంచివేయడం, దైవమానవులకు సంబంధంకుదరకుండ చేయడమే వాని ప్రభుత్వపు లక్ష్యం.... ధర్మశాస్త్రంలేకుంటే, పాపం ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే (ఏలుబడి చేస్తున్న) పాపము ఆజ్ఞను హేతువు చేసికొని (లేక సాధనంగా ఉపయోగించుకొని), సకలవిధములైన దురాశలను నరులయందు పట్టించెను. వారియందుపట్టే దురాశలు పాపం చేయునట్లు వారిని ప్రేరేపించాయి. పాపము ధర్మసాస్త్రసంబంధమైన ఆజ్ఞను ఆధారం చేసికొని యూదులను మోసపుచ్చింది; దానిచేతనే వారిని చంపింది. ధర్మశాస్త్రం క్రింద యూదుని దుస్థితి యిది. అందునుబట్టియే, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను" - అంటే, మోషేధర్మశాస్త్రమునకు సింబల్గా యిక్కడ ఉపయోగించబడ్డాడు. భూలోకప అధికారియొక్క స్థాయిలోను, దేవుని భక్తులను పాపం చేయించిన అధికారంలోను అపవది పరలోకానికి వెళ్లి వస్తున్నట్టున్నాడు. ఆదాము నుండి మోషేవరకు అంటే, ధర్మశాస్త్రముయొక్క అంతము వరకు రమారమి 4000 సంవత్సరాలు మరణ ప్రభుత్వం కొనసాగిందని అనుకున్నాం.

క్రీస్తువారి సిలువలేని లోకంలో - నరునికి పాపమునుండి విమోచనలేదు; యూదునికి ధర్మశాస్రమునుండి విడుదలయులేదు. మరణ ప్రభుత్వాన్ని అడ్డగించునదేదియులేదు. అపవాది ఆటలు యధేశ్చగా కొనసాగుతున్నాయి. అపవాది మరణముయొక్క బలముగలవాడు (హెబ్రీ.2:14), ఆయుధములు ధరించినవాడు (మత్తయి 12:29; లూకా 11:21) మనుష్యచోరత్వం నిరాటంకంగా జరుగుతుంది. దేవుని పిల్లలను పట్టుకొనిపోయి, చీకటిలో బంధించి, మరణ భయముచేత, వారిని దాస్యమునకు లోబరచిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. విడుదలకు విన్నపాలు జరుగుతున్నా లాభంలేదు. అపవాది ఈ లోకాధికారి (యోహాను14:30) ఆత్మసంబంధంగా లోకముయొక్క పరిస్థితి బహుదారుణంగా బహుదైన్యంగా నిలిచిపోయింది. మరణ ప్రభుత్వపు ఏలుబడి అంధకార సంబంధమైన అధికారము తిరుగులేనిది అన్నట్టు పరిస్థితులు స్థంభించియున్నాయి.  క్రీస్తుసిలువలేకుంటే, అంధకారం, అయోమయం అలాటి ఘోరమైన పరిస్థితికి పరిష్కారంలేదు.

లోకపు వాతావరణం ఎలాంటి క్లిష్టపరిస్థితిలో ఉందో ఆలోచింపవచ్చు. అంతేకాదు దేవుని దూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన సమయంలోకూడా, ఈలాటి పరిస్థితి తటస్థిస్తే, ఎలాగుంటుందో ఊహించవచ్చు.


క్రీస్తు సిలువ మరణానికి ముందున్న మృతులలోకపు స్థితిగతి: ఇశ్రాయేలు జాతీయ చరిత్రలో సమూయేలు ఒక అసాధారణమైన వ్యక్తి: అతని తల్లి గొడ్రాలైయుండి, తన నిందను పోగొట్టుకొనడానికి మ్రొక్కులు మ్రొక్కి అతని కన్నది (సమూ. 1:10-25) అతని బాల్యము బహువింతైనది. తక్కిన ఇశ్రాయేలీయులందరివలె కాక, పాలు విడుచువరకు తన యింటపెరిగి, పాలువిడిచిన పసికూనగా షిలోహులోని దేవుని మందిరములో, దేవుని సేవ చేయడానికి అతడు విడిచిపెట్టబడ్డాడు: "తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్టితుడని" తన తల్లి చెప్పినతోడనే "వాడు అక్కడనే యెహోవాకు మ్రొకెను" (1సమూ.1:28) అని వ్రాయబడియుంది.

బాలుడైన సమూయేలు "యాజకుడైన ఏలీయెదుట యెహోవాకు పరిచర్యజేయుచుండెను" (I సమూ. 2:11బి) యెహోవాకు పరిచర్య అంటే, ఏమిచేస్తుండేవాడు?" "బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్యజేయుచుండెను" అని వ్రాయబడింది (సమూ.2:18) ఏఫోదు ధరించుకొని చేసే పరిచర్య యాజకత్వం (నిర్గమ.39:2-3) నరులకు దేవునికిని మధ్య నిలిచేపని. జనులపక్షముగా దేవుని సన్నిధిలో చేసేపరిచర్య. "బాలుడైన సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయుండును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను" (1సమూ 2:26).

దేవుని వాక్కు ప్రత్యక్షత అరుదుగానున్నదినములలో ఆ ప్రత్యక్షతను పొందినవాడు సమూయేలు (1సమూ.3) "సమూయేలు పెద్దవాడుకాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు" (సమూ. 3:19), షిలోహులో యెహోవా తన వాక్కుచేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను (వ21). అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను" (I సమూ, 4:18).

పాతనిబంధన కాలమంతటిలో దేవునికి ప్రార్థించే భక్తులలో సమూయేలు అగ్రగణ్యుడు. అతడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమందించిన మోషేకు సాటిగా ఎంచబడ్డాడు (యిర్మియా 15:1). "ఆయన యూజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారికుత్తరమిచ్చెను" (కీర్తన.99:6).

ఇశ్రాయేలీయుల తొలిరాజును అభిషేకించిన ఘనత సమూయేలుకు మాత్రమే దక్కింది ( సమూ. 10:1-2). అవిధేయత వలన రాజైన సౌలు ఆ కృపనుండి దూరము కాగా, అతని స్థానంలో అతనికి మారుగా దావీదును రాజుగా అభిషేకించిన ఘనతకూడా సమూయేలుకే సొంతమయ్యింది (1సమూ.16:11-13) ఇశ్రాయేలులో 40సంవత్సరాలు న్యాయాధిపతిగాను, యాజకుడుగాను, ప్రవక్తగాను విరాజిల్లన ఏకైన వ్యక్తి సమూయేలు. ఈలాటి మహత్తరమైన భక్తుడు, సాటిలేని ఇశ్రాయేలీయుడు చనిపోయి పాతిపెట్టబడ్డాడు (1సమూ.28:3).

మృతుల లోకంపైన అపవాది తిరుగులేని ఆధిపత్యాన్ని చెలామణి చేస్తున్నట్టున్నాడు. సాతానుకు అనేకమంది సేవకులున్నట్టు కన్పిస్తారు. వారిలో అధముడు కర్ణపిశాచము అనుకుందాం. కర్ణపిశాచమనే సాతాను ఏజెంటువలన సోదెచెప్పే ప్రక్రియ జరుగుతుంది. చిల్లంగివారు సాతాను పరిచారకులలో మరోరకం. ఏజెంట్లలో అల్పమైన కర్ణపిశాచము సమూయేలును పైకిరమ్మని తొందరపెట్టి తీసికొని రాగలిగింది (1సమూ.28:12-15) క్రీస్తు ప్రభువు సిలువ మరణంలేని దినాల్లో చనిపోయిన భక్తులను సహితము తొందరపెట్టి పైకిరప్పించే
అపవాది క్రియ జరుగుతుందన్నమాట! దేవుని ప్రవక్తలలోనేమి, భక్తులలోనేమి అగ్రగణ్యుని, సాతాను పరిచారకులలో అల్పుడైన కర్ణపిశాచము తొందరపెట్టి పైకి తోడుకొని రాగలిగిందంటే, మృతులైన దేవుని ప్రజలు భద్రత ఏమేరలో ఉందో చెప్పనవసరంలేదు.

ఇదంతా ఎందుకు? "ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని యే సూచిక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో వాటి విషయములోను; ఆ బాహు బలమంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నులయెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక ప్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు" (ద్వితియో, 30:10-12) అని ఎవనిగూర్చి వ్రాయబడిందో, సాటిలేని మోషే అనే ప్రవక్త మృతిపొందాడు. అయితే, ఆ విషయం ఇశ్రాయేలీయులలో ఎవనికిని తెలియకుండ దేవుడు దానిని మర్మముగా ఉంచగోరినట్టున్నా, అపవాది మోషే మృతదేహంనొద్ద (యూదా 9) ప్రత్యక్షమవ్వడం ఆశ్చర్యంగా ఉంది!

మోషే మృతదేహాన్ని గూర్చి అపవాది మిఖాయేలుతో తర్కం పెట్టుకున్నాడట! ద్వితియో, 34:7 మోషే మరణాన్ని నమోదు చేస్తుంది. అతడు మరణించినప్పుడు ఏమి జరిగిందో ఇశ్రాయేలీయులలో ఎవరికిని తెలిసినట్టులేదు. కాని ఆ సమయంలో పరమదేవుడు తన సేవకుని సమాధి కార్యక్రమముకొరకు ఇశ్రాయేలీయులపట్ల దేవుని యుద్ధాలను జరిగించే మిఖాయేలను ప్రధాన దూతను రంగంలోనికి దించాడు. తన తరుపున అపవాది వేరెవరిని పంపకుండ స్వయంగా తానే ఆచోటుకు వచ్చిచేరుకున్నాడు. అప్పుడు మోషే శరీరాన్నిగూర్చి మిఖాయేలునకు అపవాదికిని మధ్య తర్కం జరిగింది. "అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు, దూషించి తీర్పు తీర్చ తెగింపక - ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను" (యూదా:9). ఆ కాలపు భక్తులలో మోషేకు సాటిఎవడు? అయినా, అతని మరణానంతరం అతని శరీరం తన వశం చేయాలంటూ సాతాను వాదనను గూర్చి ఆలోచిస్తుంటే, మృతుల లోకంమీద అపవాదికి ఏమేరకు పట్టు ఉందో గోచరిస్తుంది. ఇదంతా క్రీస్తు సిలువమరణానికి ముందటిమాటయే!

క్రీస్తుసిలువ మరణంలేని భూలోకం మరణ ప్రభుత్వం క్రింద, అంధకార సంబంధమైన అధికారములో నిరీక్షలేని దిశగుండా పాలన కొనసాగుతోంది. (Kidnapping) "మనుష్యచోరత్వము" అనే నాగరికత కొనసాగుతుండేయి. మరణభయముచేత జనులను దాస్యమునకు లోబరచి, చెరలో - యుద్ధఖైదీలుగా ఉంచబడిన వాతావరణ కాలుష్యం నెలకొంది. ఆ దుస్థితిలో ఆత్మరక్షణ అనేది బహుదూరంగా ఉంది.

క్రీస్తుమరణంలేని దినాల్లో పరలోకపస్థితికూడా అంతక్షేమంగాలేదు. ఆహ్వానంలేని అతిథిగా అపవాది దేవుని సముఖంలో ప్రవేశించడం, దేవదూతలు దేవునితో కూడివచ్చిన సమయంలో వారి కార్యకలాపాలకు అంతరాయం కలిగించేలా, రాత్రింబగళ్లు మన సహోదరులమీద దేవుని ఎదుట నేరం మోపడం వంటి కార్యాలు కొనసాగుతుండేయి. సహోదరులమీద నేరం మోపడమంటే, వారిని తన జనంగా స్వీకరించే దేవుని న్యాయంమీద నేరం మోపడమే జరుగుతూ వస్తుంది. పరలోకపు దేవుని నెమ్మదిని, పరలోకపు ప్రశాంతకరమైన వాతావరణాన్ని భగ్నంచేస్తుంది.

ఇంతకు భక్తులైనవారి మృతులలోకం మినహాయించబడలేదు. వీటికిని యింకా అనేక విధములైన సమస్యలకు పరిష్కారం దేవునియొద్దఉంది. ఇదంతా క్రీస్తుయేసు సిలువమరణమందు గుప్తం చేయబడింది. పాతనిబంధన భక్తులు దోషరహితులుకారు. వారు పాపముచేసినవారైనా, వారి విశ్వాసము ద్వారా దేవుడు వారిని నీతిమంతులుగా తీర్చేది న్యాయవిరుద్ధమనేది అపవాది వాదన! ఋణం తీర్చకుండా, ఋణస్టుడు ఋణస్టుడుకాడు అనడం అసలు సమస్య; పరిహారం చెల్లింపకుండ సమస్య పరిష్కారంకానేరదు. పరలోకంమీద అపవాది ఫిర్యాదు యిదే! క్రీస్తుమరణం ఈ ఫిర్యాదును ఊరకే కొట్టి పారవేస్తుంది. అయితే ఆయన మరణం జరుగలేదే!! మూడు లోకాలలో తిరుగులేని చాంపియన్ (Champion) గా కొనసాగుతున్న అపవాది మీదికి దేవుని (Challenger) చాలెంజర్ క్రీస్తు గోదాలో దింపబడ్డాడు (మార్కు. 1:9-12).

అపవాది, సశరీరుడుగా ప్రత్యక్షుడైన క్రీస్తును వశపరచుకుంటే, మూడులోకాలలో తిరుగులేని ఆధిపత్యాన్ని కైవసం చేసికొనవచ్చుననే యోచనగలవాడై, ప్రభువైన యేసును శోధింప మొదలు పెట్టాడు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంభమనే తన (traditional) ఆయుధాలను ప్రయోగించాడు.శరీరులందరిమీద విజయం తనకు సాధించి పెట్టినవి ఆ ఆయుధములే. అయితే శరీరధారియై, అంటే రక్తమాంసములలో పాలివాడైన క్రీస్తు మీద అవి పనిచేయలేదు.  అపవాది తీవ్రంగా తన శోధనలయందు ఓడింపబడ్డాడు (మత్తయి 4:1-10; లూకా 4:1-10).

వీటిలో ప్రత్యేకించి, విరోధభావంతోగాక, స్నేహభావంతో క్రీస్తును వాడు సంధించబూనాడు. క్రీస్తు దేవుని ప్రజలను ఏలేరాజు అనేది వాస్తవమని, ముందుగా ప్రవచింపబడింది (మీకా 5:2; ఆయన జన్మలో అది స్థిరపరచబడింది (మత్తయి 2:1-10) అయితే దేవుడు తనకొరకు నియమించిన రాజ్యము శ్రమలతో సంపాదించే రాజ్యమైయుంది (లూకా 22:28-30). అయినా అపవాది, దానికి భిన్నంగా శ్రమల రహితమైన రాజ్యాన్నియిస్తానని, అయితే క్రీస్తు దాన్ని పొందడానికి వానికి మ్రొక్కితే చాలునని అన్నాడు (లూకా 4:5-8). అయితే క్రీస్తు దాన్ని నిరాకరించి, సాతాను అధికారానికి వ్యతిరేకతనే ప్రకటించారు.

అప్పటినుండి భూమిపై క్రీస్తు జీవితం కొద్దిగాను, వీరోచితంగాను, విజయవంతంగాను కొనసాగింది. ఆయన కార్యాలలో ఉన్న త్వరితగతిని, పాలస్తీనాలోని గ్రామాల్లోను పట్టణాలలోను ఆయనయొక్క సుడిగాలి పర్యటనలు, దేవుని చిత్తాన్ని జరిగించడంలో విరామంలేని ప్రయాస, మరణ ప్రభుత్వంలో కల్లోలం కలిగించింది (మార్కు 1: 10,12,18,19,21,28.29.30,45). ఎంతవేగంగా కార్యాలు జరిగాయో తేటగా ప్రత్యక్షమయ్యింది.

అపవాదియొక్క దృష్టిలోనూ కోణాదియొక్క దృష్టిలోను, వానియోధుల దృష్టిలోను, శరీరంలో ప్రత్యక్షుడైన క్రీస్తు, ఎదురాడలేని శత్రువుగా గోచరించబడ్డాడు. ఆయన తీవ్ర చర్యలు అరికట్టబడాలి. ఆయన ఉద్దేశాలు ఓడింపబడాలి భూలోకంనుండి ఆయన పేరు తుడుపుపెట్టబడాలి. క్రీస్తు జన్మసందర్భంగా అపవాది హీనమైన అవమానాన్ని చవిచూచాడు. ఈ విషయాన్ని ముందుగానే చూచాం. తన లక్ష్యసాధనలో అపవాది బహుచాతుర్యం గలవాడైయున్నాడు. ఏదియెలాగున్నా క్రీస్తు అపవాదికంటే బలవంతుడన్న విషయం అడుగడుగున రుజువచేస్తూనేయున్నాడు (హెబ్రీ  4:15).

అపవాది కొంత వెనుకకుతగ్గి, అంటే, ప్రత్యక్షంగా తన ప్రయత్నాన్నిమాని, పరోక్షగా, అంటే, తన పిల్లలద్వారా తన యుద్ధతంత్రాన్ని కొనసాగించాడు (యోహాను 8:44) తన పక్షంగాఉన్న యూదా మతనాయకులను రంగంలోనికి దించాడు. వారు ఆయనను తన మాటలలో చికుపరచాలని వెంటాడారు (మార్కు 12:13-17) మత్తయి 22:34-36) వగైరాలు. వీరి మీదకూడ యేసు తన విజయాన్నిస్థిరంగా నమోదు చేశారు.

"నేను సత్యమునే చెప్పచున్నాను గనుక మీరు నన్నునమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?" (యోహాను 8:45-46) అనివారిమీద తన సవ్వాలు విసరాడు.

ఈ యుద్ధతంత్రములోకూడ అపవాది తిరుగులేని అపజయాన్ని రుచిచూచాడు. ఇలా మాటిమాటికి జరిగింది (మత్తయి 22:23-45). "క్రీస్తునుగూర్చిన ప్రశ్నయే వారి మతనాయకులలో గగ్గోలంరేపింది.

"ఒకప్పుడు పరిసయ్యలు కూడియుండగా యేసువారినిచూచి - క్రీస్తునుగూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగెను. వారు - ఆయన దావీదు కుమారుడనిరి. అందుకాయన - ఆలాగైతే -నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏలచెప్పచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా ఎవడును మారుమూట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడగ తెగింపలేదు" (మత్తయి 22:41-46)

ఇందులో కూడా   ఘోర పరాజయాన్నీ అనుభవించిన అపవాది, తన యుద్ధతంత్రాన్ని మరోకోణానికి మార్చాడు. ఇందులో జనాభిమానాన్ని ఆయనకు వ్యతిరేకంగా త్రిప్పడం. ప్రభువైన యేసు తన పరిచర్యలో  మహత్కార్యాలు, సూచికక్రియలు, స్వస్థతలు, వగైరాలు ప్రజలమధ్య చంచలనాత్మకమైన అభిమానాన్ని వారియందు రేకెత్తించాయి. ఆయన బోధలు జనసమూహాన్ని మంత్రముగ్గులను చేశాయి  (మత్తయి 7.28-29; యోహాను 7:45-47), జనాభిమానం ఆయనపై వెల్లువైపారి ప్రవహించింది. అది ఆయన శత్రువులలో అసూయను, ద్వేషాన్ని పగను పెంచింది. ఆయన కార్యాలు శత్రువులను కలతపెట్టాయి (యోహాను 11.47-48) ఆయన ప్రవక్తయుని సాధారణ జనసమూహాలు విశ్వాసముంచాయి (యోహాను 6:14) ఆయన కార్యములు వారిని అబ్బురపరచాయి; ఆయన బోధలు వారిని ఆకట్టుకున్నాయి; అయితే నాయకులలో యివి మరింత ఈర్ష్యం, ద్వేషాలను పెంచాయి. గనుక ఆయనను అంతమొందించాలని వారు కత్తికట్టారు (యోహాను 11:47-48) అయితే యిందులో ఎదురయ్యే సమస్యను వారు చూడగలిగారు. అది ఆయన పైనున్న ప్రజాభిమానం. దానినే ఆయనకు వ్యతిరేకంగా త్రిప్పడానికి శత్రువులు పూనుకున్నారు (యోహాను 12:12-19) కేవలం ఒక వారంరోజులలోనే వారు యిందులో ఘనవిజయం సాధించారు. బహుజన సమూహము ఆయనను ఎదుర్కొనబోయి - జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసినవారు. వారం రోజుల వ్యవధిలోనే, ఆయనను "సిలువవేయుము, సిలువవేయుము" అని పిలాతు ఎదుట కేకలు వేశారు (లూకా 23:13-23). ఎంతటి వింతైన మార్పు జరిగిందో! ఏది యెలాగున్నా కడకు వారి కేకలే గెలిచాయి.

అపవాది కడపటిగా, క్రీస్తును కల్వరి సిలువలో ఎదుర్కొనడానికి పూనుకున్నాడు. క్రీస్తు సశరీరుడుగా ప్రత్యక్షుడైన నాటనుండి, అపవాది ఆయనను ఏకోణంనుండి ఢీకొన్నా ప్రతిసారి అవమానాన్ని అపజయాన్ని మాత్రమే ఎదుర్కొన్నాడు. ఈ విషయం ముందుగా చూస్తూనేవచ్చాం. గత్యంతరం లేక తన జనులే కడకు వానిని ఈ స్థితిలోనికి దించారు. కడసారి చావోరేవో తేల్చుకొనడానికి అపవాది పూనుకున్నాడు. ఇక్కడ ఓటమిపాలైతే, భూలోకమందున్న తన 4000 సంవత్సరాల పాలన రద్దవుతుంది. భూలోకానికి తిరుగులేని అధిపతిగా, పరలోకంలో దేవుడు ఆయన దూతలు కూడిన స్థలంలో ప్రవేశించే ఆధిక్యతను కోల్పోతాడు. మృతులలోకంలోని దేవుని పరిశుద్దులపై తనకు ఉన్న పట్టును శాశ్వతంగా కోల్పోతాడు. అపవాది తనకున్న సమస్తవైభవాన్ని ఆధిపత్యాన్ని అధికారాన్ని కోల్పోయి, కోరలు పీకివేయబడిన పాములా పడియుంటాడు. బుసకొట్టగలడేగాని కాటువేయలేని వాడుగా నిలిచిపోతాడు. అపవాదికి యిది చిన్న పరీక్షకాదు.

దేవుని పరిశుద్ధతను సన్మానించే విశ్వాసపు స్థితినుండి నరులను కూల్చడంలో రమారమి 4000 సంవత్సరాలు అనుభవము గడించిన అపవాది శరీరధారియైయున్న క్రీస్తుపై తన నిప్పుల జల్లులు కురిపించనైయున్నాడు. ఎలాగైనా శ్రమపెట్టి, ఎంతగానైనా హింసించి, ఎంత నీచంగానైనా అవమానించి ఆయనను లొంగదీసికొనడానికి వాడు తన ఆయుధాలకు పదునుపెట్టియున్నాడు. తన జనులను సిద్ధపరచియుంచాడు. తన మూకను ఆయనకు వ్యతిరేకంగా రెచ్చగొట్టియున్నాడు. క్రీస్తును సిలువలో ఢీకొనడానికి అపవాది తన క్రూరత్వమంతటితో సర్వసన్నుద్ధమైయున్నాడు


ఈ కడపటి పోరుకొరకు క్రీస్తు తగిన తర్ఫీదు పొందుతునే ఉన్నాడు: The school of hard knocks లో ఈ తర్ఫీదు జరిగింది. అది ఖఠినమైన గుద్దులాట బడి. ప్రతి రాజకుమారుడు, తన సింహాసనాన్ని పొందకముందు ఈలాటి తర్ఫీదే పొందుతాడు. కత్తిసాము, కర్రసాము, మల్లయుద్ధం: గుర్రపుస్వారి, పర్వతారోహణం, వగైరాల్లో తర్ఫీదు పొందవలసిన వాడైయున్నట్టు, దేవుని కుమారుడు ఆలాటి ఆత్మసంబంధమైన పాఠశాలకు అనుదినం హాజరౌతుండేవాడు. కడకు జరుగబోయే చివరిపోరు బహు ఘోరమును మహా భయంకరమైనదే!!

"అలసిన వానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసియున్నాడు శిషులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినబుద్ది పుట్టించుచున్నాడు.  ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ది పుట్టింపగా నేను ఆనమీదుగబాటు చేయలేదు. వినకుండ తొలగిపోలేదు. కొట్టవారికి నావీపును అప్పగించితిని వెంట్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని.  ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు. ప్రభువగు యెహోవ నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసుకుంటిని" (యెషయా 50:4-6). ఇదీ ఆయన తర్ఫీదు ఫలితం!

ఇలాటి కఠినమైన సహింపకు తర్ఫీదుపొందినవాడై దేవుని పక్షంగా అపవాదితో ఢీకొన సిద్ధపడిన యేసు, కేవలం నరమాత్రుడుకాదు. ఆయన రక్తమాంసములలో పాలివాడే!  ఆయన శరీరానికి మనలాంటి బాధ, శ్రమ అనుభవాలు ఉంటాయి. అయినా ఆయన కేవలం మానవ మాత్రుడుకాడు. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ఇశ్రాయేలురాజు (యోహాను 1:49). ఆయన దేవత్వంలోను (కొలస్సి 2:9) నిత్యత్వంలోను (ఫిలిప్పీ 2:6-8), నిత్యమహిమలోను పాలుగలవాడు (యెహాను 17:5) గనుక ఆయన త్యాగము అనంతమైన కొలతలేని ప్రభావం కలిగినదైయుంటుంది.

"ఏమి తీసికొని వచ్చినేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొనివచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయునా? నా అతిక్రమమునకై నాజెష్ణపత్రుని నేనిత్తునా? నా పాపపరిహారమునకై నాగర్భఫలమును నేనిత్తునా?" (మీకా 6:6-7).

ఒకని పాపపరిహారమునకై లేక అతిక్రమమునకై తలంచిన వెల యింతైన యెడల, సమస్తమానవకోటియొక్క పాపపరిహారవెల ఎంతైయుండునో గదామానవజాతి పాపం లేక అపరాధ పరిహారార్థపు వెల దేవుని న్యాయమైన తూనికలో ఎంతైయుంటుందో, దానినంతటిని పరమదేవుడు కొలవేసి, దానినంతటిని దేవుని ఉగ్రతను పాత్రలోపోసి, దానికొరకైన శిక్షను క్రీస్తుపైన మోపడానికి దేవుడు క్రీస్తు సిలువలో రంగం సిద్ధంచేసి యుంచాడు (లూకా 22:42-43).

"నిత్యడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన మీ మనసాక్షిని ఎంతోయెక్కువగా శుద్ధిచేయును" (హెబ్రీ.9:14).

ఏదియెలాగున్నా సిలువలో అసమాన ఉజ్జీలు రెండును తలపడ్డాయి. ఇందులో ఒకటి బాధించేది, రెండవది సహించేది; ఒకటి క్రూరమైనది (మహాఘటసర్పము) రెండవది సాధువైనది (గొర్రెపిల్ల). బాధించి, వేదించి, శ్రమపరచి, అవమానించి లొంగదీసికోవాలనుకునేది అపవాది. ఎంతశ్రమయైనా, అవమానమైనా లొంగిపోకుండ నిలబడాలనుకునేది గొర్రెపిల్ల


క్రీస్తు సిలువ మరణం: 
మరణసాధనంగా యూదులు సిలువను అసహించుకున్నారు. పట్టణం కూల్చివేయబడినపిమ్మట మహా అలెగ్జాండరు తూరీయులలో రెండవేలమంది బంధీయులను సిలువవేయించాడు. రోమా పౌరులు మాత్రం యిలాటి మరణం పొందకుండ తమచట్టం వలన మినహాయించబడ్డారు. కనీసం యూదయలో ఒకడు సిలువకు మేకులతో కొట్టబడినట్టయితే, ఆవేదనను చంపివేయడానికి మత్తుకలిగించే చిరక అందింపబడుతుంది. ఉపయోగింపబడే మేకులు యిన్ని అనే నిర్ణయముండదు. గాయాలు చీలిపోకుండడానికిగాను పాదములు ఆనించుకొనడానికి ఒక చిన్న ఆనుడు చెక్క సిలువలో భాగమైయున్నట్టుందట!

సిలువ మరణం వలన కలిగే బాధ బహు తీవ్రస్థాయిలో ఉంటుంది. ప్రత్యేకించి వేడి వాతావరణంలో గాయమైనచోట చర్మం ఉబ్బి, రక్త ప్రవాహాన్ని తగ్గించి భాదను తారాస్థాయికి చేర్చుతుంది. జారిపడిన గాయాల వలన విషజ్వరమువచ్చిసూర్యకిరణాలు శోకడం వలన తీవ్రం చేయబడుతుంది. వేసారిన దేహపు స్థితి; శిరస్సు ఉదరము యొక్క సిరలు రక్తముచే సంధించబడి భరింపనలివికాని తలనొప్పి ఆరంభమౌతుంది. మనస్సు తికమక చెంది ఆతురతతో నింపబడి భీతిని రేకెత్తిస్తుంది. సిలువమరణం అనుభవించే వ్యక్తి అక్షరార్థంగా వెయ్యిచావులు చచ్చిన అనుభవాన్ని అనుభవిస్తాడు. శ్రమలు భయానకంగా ఉంటాయి. సిలువ శ్రమ వర్ణనాతీతం.  కీర్తన 22 ఈ దృశాన్ని తేటగా వర్ణిస్తుంది. ఈ భయానకమైన వేదనయంతటితోడు, సహింపనలవికాని అవమానము, అపహాస్యము జతచేయబడింది. అయినా, అంతటి భీకరమైన శ్రమానుభవంలోను, వేదనలోను అవమానం వికట  అపహాస్యం నడుమ నరశరీరంలో నిలిచిన క్రీస్తు దేవుని పరిశుద్ధతను సన్మానించుతూ, నూటికి నూరుపాళ్లు దేవుని చిత్తాన్ని జరిగించుతూ నమ్మకముగా నిలిచియున్నాడు.

తన యుద్ధవిజయ పరంపరను కొనసాగించుతూ, యేసు కల్వరి సిలువలో వ్రేలాడుతున్నాడు. గంటల తరబడి పోరు బహుఘోరంగా కొనసాగుతుంది. గనుకరాత్రింబగళ్లు దేవుని పరిశుద్ధతను సన్మానించి స్తుతించుచు నుండు దూతగణం ఎప్పుడైనా ఆకార్యాన్నిఆపుచేసియుండినట్టయితే, అది కేవలం క్రీస్తు కల్వరిసిలువపై వ్రేలాడుతున్నప్పుడు మాత్రమే అయ్యుండాలి. అపవాది తనకుయుక్తిని, నైపుణ్యాన్ని చాతుర్యాన్ని క్రూరత్వాన్ని వికట అపహాస్యాన్నంతటిని ప్రయోగించి, ప్రయోగించి వేసారిపోయినట్టున్నాడు. గాని తాను కోరుకొన్నది సాధించలేక పోయాడు. పైగా, క్రీస్తు "శరీరమందు శ్రమపడుట" అనే ఆయన ధరించిన ఆయుధాన్ని అపవాది ఛేదించలేకపోయాడు. సిలువలో వ్రేలాడిన క్రీస్తు అపవాది శిరస్సుపై తన మడిమనుంచి, అదిచితికి పోయేలా నలుగద్రోక్కాడు. అపవాది కడకు క్రీస్తు సిలువమరణం ద్వారా తల చితుక త్రోక్కబడిన అపవాది (knock out) నాక్ అవుట్ అయ్యాడు. ఫలితాలు తరువాత,



From దేవుని అనాది మర్మమైన క్రీస్తు బలి by Br G. Devadaanam

0 comments:

Post a Comment