Friday, 9 September 2016

అపొస్తలుల బోధ

The Doctrine of the Apostles
"అపొస్తలులు" అంటే పంపబడిన వారని అర్థం. వాస్తవానికి అధికారంచే ఆదేశింపబడి పంపబడినవారని సందర్భాన్నిబట్టి గ్రహించగలం. బైబిల్ నాలుగు రకాలైన అపొస్తలులను ప్రస్తావించింది. వారిని వరుసగా గమనించుదాం.
1. పరలోకపు అపొస్తలుడు: క్రీస్తు ప్రభువు పరలోకపు అపొస్తలుడని గ్రంథం సూచించింది. "ఇందువలన, పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి" అని పరిశుద్ధాత్మ తెలియజేశాడు (హెబ్రీ. 3:1). పరలోకమందున్న తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి తన్ను పంపినట్లు ప్రభువైన యేసు చెప్పుకొనియున్నాడు (యోహాను 10:36). దేవుడు క్రీస్తును పంపినట్లు లోకం నమ్మాలి (యోహాను 17:20). 
2. క్రీస్తు యెుక్క అపొస్తలులు: క్రీస్తు ప్రభువు తన అపొస్తలులను ఏర్పరచుకొనక ముందు, వారి విషయమై పరలోక మందున్న తండ్రితో సంప్రదింపులు జరిగించినట్లు గ్రంథం వలన గ్రహించగలుగుతాము. "ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి, దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి, వారిలో పండ్రెండుమందిని ఏర్పరచి, వారికి అపొస్తలులు అను పేరు పెట్టెను" (లూకా 6:12-13).
క్రీస్తు అపొస్తలులుగా ఎవరు స్థిరపడాలో, వారిని దేవుడు ముందుగా ఏర్పరచినట్లు లేఖనాలు సూచిస్తున్నాయి: "ఆయన (క్రీస్తు ప్రభువు) యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానుమీద వ్రేలాడదీసి చంపిరి. దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే (అపొస్తలులకే) ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను" (అపొ. 10:39-41). క్రీస్తు ప్రభువు యెుక్క పునరుత్థానానికి సాక్షులుగా ఉండునట్లు దేవునిచే ముందుగా ఏర్పరచబడినవారే ఈ అపొస్తలులు. వారు క్రీస్తుతో కూడా కలిసి జీవించినవారు.
అందువలననే, ప్రభువైన యేసు తండ్రికి ప్రార్థించిన చివరి రాత్రి యిలా అన్నాడు: "లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను" (యోహాను 17:6-9).
అపొస్తలులు ఏర్పరచబడిన కాలం: ఆ కాలాన్ని గూర్చి పేతురు యిలా సూచించాడు; "యోహాను బాప్తిస్మమిచ్చినది మెుదలుకొని ప్రభువైన యేసు మన యెుద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు" మధ్యగల కాలంలో ప్రభువుతో కూడా నున్నవారు క్రీస్తు యెుక్క అపోస్తలులుగా నియమించబడ్డారు. అంటే, అధికారికంగా ప్రభువు యెుక్క అపొస్తలులు నియమింపబడిన కాలమది. ఈ కాలం కాని కాలాన్ని అకాలమన్నారు.
అందునుబట్టి అపొస్తలుడైన పౌలు యెుక్క ఏర్పాటు ప్రత్యేకంగా చేయబడినదని లేఖనాలంటున్నాయి (అపొ. 26:15-18). తక్కిన క్రీస్తు యెుక్క అపొస్తలుల వలెనే, తానును క్రీస్తు ప్రభువు వలనను, తండ్రియైన దేవుని వలనను అపొస్తలుడుగా నియమింపబడినట్టు చెప్పుకున్నాడు (గలతీ. 1:1). తాను కూడా క్రీస్తు యెుక్క పునరుత్థానానికి సాక్షియైనట్టు చెప్పి, యిలా అన్నాడు: "అందరికి కడపట అకాలమందు (అంటే, కాలంకాని కాలంలో) పుట్టినట్టున్న నాకును కనబడెను; ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడను దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడనుకాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయనకృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని" (1కొరింథీ 15:8-10).
సకాలంలో ప్రభువైన యేసు ఏర్పరచుకున్న పన్నిద్దరు అపొస్తలులలో పేతురు అగ్రగణ్యుడైయున్నట్టు లేఖనాల్లో కన్పిస్తాడు (అపొ. 2:14, 37, 38; 3:4-10; 4:13-; 5:15; 15:7 వగైరాలు). అపొస్తలుడైన పేతురు అపొస్తలులలో అగ్రగణ్యుడైతే, అకాలంలో పుట్టిన పౌలు పేతురుకు ఏ మాత్రం తీసిపోని వాడని అపొస్తలుల కార్యగ్రంథంలో పరిశుద్ధాత్మ నిరూపించి, పౌలు అపొస్తలత్వానికి ముద్రవేశాడు. పౌలు అపొస్తలుడుగా నియమింపబడిన తరువాత, క్రీస్తుయెుక్క అపొస్తలులు యిక ఎన్నడును నియమింపబడలేదు. 
3. దొంగ అపొస్తలులు: అటు తరువాత క్రీస్తుయెుక్క అపొస్తలుడని చెప్పుకునే ప్రతివాడు దొంగ అపొస్తలుడేయని గ్రంథం వివరిస్తుంది. కొరింథీ సంఘంలోనికి సిఫారసు పత్రికలతో దొంగ అపొస్తలులు ప్రవేశించారు. వారిని గూర్చి లేఖనాలు యిలా అన్నాయి: "ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము (క్రీస్తు యెుక్క అపొస్తలులు) ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానినిగూర్చి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన యీ (దొంగ) అపొస్తలులకంటె లేశమాత్రమును తక్కువవాడను కానని తలంచుకొనుచున్నాను.... ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారికంతము కలుగును" (2కొరింథీ 11:4-15). 
అపొస్తలుడైన పౌలు నియమింపబడిన మీదట, యింకెవరును క్రీస్తు యెుక్క అపొస్తలులుగా నియమించబడలేదను మాట సృష్టమే. అటు తరువాత వచ్చినవాడెవడైనా, తాను అపొస్తలుడును అని చెప్పుకుంటే, వాడు దొంగ అపొస్తలుడును, మోసగాడైన పనివాడును సాతానుయెుక్క ఏజెంటు అనే విషయం ప్రతివాడు గుర్తించాలి.
4. సంఘపు అపొస్తలులు: సంఘముచే పంపబడినవారు. పరిశుద్ధాత్మ ఆదేశం మేరకు అంతియెుకయలోనున్న సంఘం, బర్నబాను పౌలును "ప్రార్థన చేసి వారిమీద చేతులుంచి వారిని పంపినట్లు" లేఖనాల్లో చూస్తాం (అపొ.13:1-3). అందువలననే అపొస్తలులైన బర్నబాయు పౌలును" అనే ప్రయోగం కనిపిస్తుంది (అపొ. 14:14). బర్నబా అపొస్తలుడనబడింది, అంతియెుకలో సంఘపు అపొస్తలుడనే ఉద్ధేశంతోనే చెప్పబడ్డాడు కాని అతడు క్రీస్తుయెుక్క అపొస్తలులలో ఒకడు అనే భావంతో ఆ పద ప్రయోగం చేయబడలేదు. అట్టి వారిని సంఘపు అపొస్తలులంటారు.
"అపొస్తలుల బోధ" అనే మన చర్చనీయాంశం, క్రీస్తు యెుక్క అపొస్తలుల బోధకు సంబంధించిందే కాని వేరే అపొస్తలుల బోధకు సంబంధించింది కాదు. దేవుని సంకల్పంలో అపొస్తలుల బోధ అనే అంశాన్ని మనం చర్చించక ముందు, అనాది దేవుని సంకల్పాన్ని గూర్చి ప్రస్తావించుకుందాం.
   దేవుని అనాది సంకల్పం లేక ప్రణాళికలో అయిదు ప్రత్యేకాంశాలున్నట్టు లేఖనాలు సూచిస్తున్నాయి:
(i) క్రీస్తుబలి రక్తం (1పేతురు 1:18-21);
(ii) అపొస్తలుల బోధ (రోమా 16:25-27);
(iii) దత్తస్వీకారం (ఎఫెసీ.1:4-6)
(iv) క్రీస్తు సంఘం (ఎఫెసీ. 3:8-11, 20-21)
(v) స్వీకరింపబడిన దేవుని పిల్లలు క్రీస్తు సారుప్యం గల వారగుటకు జరిగిన నిర్ణయం (ఎఫెసీ. 4:11; రోమా 8:28-31).
ఈ పై ఆ అయిదు విషయాలను లేఖనాలు తెరిచి చూద్దాం.
(i) క్రీస్తు బలి రక్తము: శ్రీమంతుడైన అద్వితీయ సత్యదేవుడు, తన అనాది సంకల్పానికి క్రీస్తు రక్తబలిని కేంద్ర బిందువుగా నిలుపుకొనినట్లు లేఖనాలు సూచిస్తాయి: "పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడియున్నవి" (1పేతురు 1:18-21).
(ii) అపోస్తలుల బోధ: సువార్త సందేశంగా నరజాతికి ఏమి ప్రకటింపబడవలెనో, దానిని సయితం దేవుడు అనాదిలోనే నిర్ణయించినట్లు లేఖనాలు తెలుపుతున్నాయి. "సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగు నట్లు, అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము, నిత్యదేవుని ఆజ్ఞప్రకారము ప్రవక్తల లేఖనములద్వారా వారికి తెలుపబడియున్నది" (రోమా 16:25-26). "తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు" (ఆమోసు 3:7). ఆ ప్రవక్తలకు తెలుపబడిన మర్మమును అనుసరించినదే అపొస్తలుల బోధ (రోమా 16:27).
దేవుని అనాది మర్మమును అనుసరించియే సువార్తను ప్రకటించిన అపొస్తలులు యిలా అంటున్నారు: "సహోదరులారా, నేను మీయొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను, యేసుక్రీస్తును అనగా, సిలువవేయబడిన యేసుక్రీస్తును తప్ప, మరిదేనిని మీమధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని… మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక, దేవుని శక్తిని ఆధారము చేసికొని యుండవలెనని, నేను మాటలాడినను సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు" (1కొరింథీ 2:1-8).
అపొస్తలుల బోధ అనాది దేవుని మర్మమును అనుసరించినది. సువార్తగా అపొస్తలుల బోధ మాత్రమే ప్రకటించబడాలి, దీనికి భిన్నంగా ఏ ఒక్కడు బోధించినా, కడకు పరలోకం నుండి వచ్చిన యెుక దేవదూత బోధించినా, అతడు శాపగ్రస్తుడను విషయం లేఖనం తెలుపుతోంది (గలతీ.1:6-9). నీవు ప్రకటించే సువార్త క్రీస్తు యెుక్క అపొస్తలులు సువార్తయేనా? కాకపోతే శాపగ్రస్తుడవైయున్నావు, గదా!
(iii) దత్తస్వీకారం (కుమారులుగా స్వీకరించుట):దేవుని అనాది సంకల్పం ప్రకారం, అపొస్తలుల బోధకు లోబడిన వారిని దేవుడు తనకు కుమారులనుగా స్వీకరించ నిర్ణయించుకొన్నట్టు లేఖనాలు తెలుపుతున్నాయి: "మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను" (ఎఫెసీ. 1:3). పరలోకమందున్న అద్వితీయ సత్య దేవుడు ఈ ఏర్పాటును క్రీస్తునందు చేశాడు.
"ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయాసంకల్పముచొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను" (ఎఫెసీ. 1:4-6).
అపొస్తలుల క్రమమైన ఉపదేశానికి హృదయపూర్వకంగా లోబడిన వారిని పాపము నుండి విడుదల చేసి, నీతికి దాసులనుగా నిలిపి వారికి కుమారత్వం అనుగ్రహించాలనేది దేవుని ప్రణాళికయైయున్నట్టు గోచరిస్తుంది (రోమా. 8:12-15). అధికారికమైన దత్తస్వీకారం క్రీస్తు నందు జరుగుతుంది. "మరియు మీరు కుమారులైయున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను" దీనితో వారసత్వం ఖరారు చేయబడింది (గలతీ. 4:6-7; రోమా 8:12-15).
(iv) క్రీస్తు సంఘం: అపొస్తలుల బోధకు విధేయులైనవారిని కుమారులనుగా స్వీకరించిన దేవుడు (ఎఫెసీ. 1:13-14) క్రీస్తు శరీరమైన సంఘంలోవారిని నిలిపి, పెంచాలనే భావనతో క్రీస్తుసంఘాన్ని సంకల్పించినట్టున్నాడు (ఎఫెసీ. 3:8-11; 20-21). ఇంతకంటెను మరి ఉన్నతమైన ఉద్దేశమే అనాది సంకల్పంలో క్రీస్తుసంఘం పట్ల ఉన్నట్టు లేఖనాలు తేటపరుస్తున్నాయి: చూద్దాం.
"దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించె"నని అపొస్తలుడైన పౌలు విశదపరిచాడు (ఎఫెసీ 3:8-11).
క్రీస్తుయేసు మూలంగా దేవుని మహిమపరిచే ఏకైక సంస్థ క్రీస్తు ప్రభువు సంఘమే: "మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయశక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక, ఆమేన్‌" (ఎఫెసీ. 3:20-21).
(v) క్రీస్తు సారుప్యముగలవారగుటకు నిర్ణయము: అపొస్తలుల బోధ ప్రకారముు, క్రీస్తుయేసు నందు విశ్వసించి విధేయులైనవారిని కుమారులనుగా స్వీకరించి, అట్లు స్వీకరించిన కుమారులను క్రీస్తు శరీరమైన సంఘమందు నిలిపి, క్రీస్తు సారుప్యము వారుసాధించే దిశగుండా ఆ జనులను నడిపించి, నిత్యత్వంలో వారిని మహిమపరిచేదే ఆయన అనాది సంకల్పం యెుక్క చివరి దశగా లేఖనాలు చిత్రించాయి (ఎఫెసీ. 4:11-13; రోమా 8:28-30).
అపొస్తలుల బోధకు మూలమేది? అంటే అపొస్తలులకు బోధ ఎక్కడనుండి వచ్చింది? దేవుని అనాది సంకల్పమే దానికి మూలం: "అనాదినుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము" అపొస్తలుల బోధ! (రోమా 16:25-26). అది "వాక్చాతుర్యముతో గాని మానవ జ్ఞానాతిశయముతోగాని ప్రకటింపబడేదికాదు" (1కొరింథీ.2:1). "మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసికొనక" ఉండాలంటే అపొస్తలుల బోధనే విని, విశ్వసించాలి (1కొరింథీ 2:4). అపొస్తలుల బోధ దేవుని జ్ఞానమైయున్నది: "దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను" అని గ్రంథం అంటుంది (1కొరింథీ. 2:7). అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అనాది సంకల్పాన్ని మార్చడానికి ఎవనికీ అధికారముండదు. ప్రభువైన క్రీస్తు మరణానికి సంబంధించిన దేవుని అనాది సంకల్పాన్ని మార్చడానికి, క్రీస్తు వారికే సాధ్యం కాలేదంటే (మత్తయి 26:38-42; లూకా 22:39-46; హెబ్రీ 5:7-8); అపొస్తలుల బోధను మార్చి దేవునికి యిష్ఠుడైయుండడం యింకెవనికైనా సాధ్యమౌతుందా? ప్రభువైన యేసు మహారోదనతోను కన్నీళ్లతోను ఏడ్చి ప్రార్థించినా, ఆయన కొరకు నియమించిన సిలువ మరణాన్ని తప్పించుకొనలేక పోయినప్పుడు, అపొస్తలుల బోధ కాకుండ మరి ఎవని బోధనైనా దేవుడు అంగీకరించునా? అది జరిగేపని కాదు.
దేవుని అనాది సంకల్పానికి సంబంధించిన సమాచారం అపొస్తలులకు ఎలా వచ్చింది? మెుదటిగా, లోకములోనుండి దేవుడే స్వయంగా ఆ మనుష్యులను క్రీస్తు వారికి అనుగ్రహించాడట (యోహాను 17:6). వారు దేవునివలన నియమింపబడిన వారని పరిశుద్ధాత్మ అన్నాడు (2కొరింథీ. 2:17). యోహాను బాప్తిస్మమిచ్చినది మెుదలు ప్రభువైన యేసు పరలోకమునకు చేర్చుకొనబడిన దినము వరకు క్రీస్తుతో కూడ సహజీవనము చేసినవారు అపొస్తలులు (అపొ.1:21-22).
పరలోకములో దేవునియెుద్ద బోధింపబడిన యిద్దరు దైవీకమైన వ్యక్తులచేత బోధింపబడినవారు అపొస్తలులు. వారిలో మెుదటి బోధకుడు క్రీస్తు ప్రభువే! ".....నా అంతట నేనే ఏమియు చేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నానియు మీరు గ్రహించెదరు" అని ప్రభువైన యేసు అన్నారు (యోహాను 8:28). "ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు; నేను ఏమనవలెనో యేమి మాటలాడవలెనో దానినిగూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ యిచ్చియున్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేనెరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పినప్రకారము చెప్పుచున్నానని" ప్రభువైన యేసు అన్నారు (యోహాను 12:49-50). పరలోకంనుండి సందేశం తెచ్చి అపొస్తలులకు అప్పగించిన తొలిబోధకుడు క్రీస్తు.
పరలోకమందున్న తండ్రియెుద్ద క్రీస్తు ప్రభువు ఏమి నేర్చుకున్నాడో, ఆ సంగతులను ఆయన తన అపొస్తలులకు అప్పగించినట్టు చెప్పుకున్నాడు: "వారు ( అపొస్తలులు) నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి" (యోహాను 17:6-8). అపొస్తలులల స్వయంగా ప్రభువైన యేసుతో పాటు ఉన్నవారు; ఆయనచే స్వయంగా బోధింపబడినవారు. పరలోకపు దేవుని సందేశం క్రీస్తు ప్రభువు ద్వారా అపొస్తలులకు అందింది. అయితే కాలక్రమంలో వారు దాన్ని మరిచిపోయే అవకాశముంది కదా!
ఈ సహజమైన మానవ బలహీనతను అధిగమించడానికిగాను, ప్రభువైన యేసు, పరలోకంలో తర్ఫీదు పొందిన మరొక బోధకుని అపొస్తలులకు అండగా నివ్వజూపాడు. పరిశుద్ధాత్మ కూడా దేవుని యెుద్ద ఈ సంగతులను నేర్చుకున్నవాడే (యోహాను 16:13). ప్రభువైన యేసు వెళ్లిపోతే, ఈ రెండవ బోధకుడు వస్తాడు: "అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును" అని ప్రభువు తన అపొస్తలులకు సూచించాడు (యోహాను 16:7-8).
పరలోకమునుండి దిగివచ్చే రెండవ బోధకుడు పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి అపొస్తలులకు ఏమి చేస్తాడు? ఏమి చేస్తాడో ప్రభువు మాటల్లోనే విందాం: "నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు (అపొస్తలులకు) బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును" (యోహాను 14:25-26). ప్రభువు మాటలను బోధలను అపొస్తలులు మరిచిపోయే అవకాశం యిందునుబట్టి లేదు. మెుదటి బోధకుడు బోధించిన సంగతులను రెండవ బోధకుడు జ్ఞాపకము చేస్తాడు. రెండవది, పరిశుద్ధాత్మ వారికి సమస్తాన్ని బోధిస్తాడు. అలా బోధించడంలో పరిశుద్ధాత్మ సొంత బోధచేయడు. పరిశుద్ధాత్మ పరలోకంలో నేర్చుకున్న సంగతులనే బోధిస్తాడు.
"అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన (పరిశుద్ధాత్మ) తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని నీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును"అని ప్రభువు వివరించాడు (యోహాను 16:13-14). పరలోకపు తండ్రి యెుద్ద క్రీస్తుప్రభువు ఏమి నేర్చుకున్నారో, ఆ విషయాలను ఆయన తన అపొస్తలులకు వినిపించాడు; పరిశుద్ధాత్మ సయితం, ఏమి విన్నాడో దానినే అపొస్తలులకు బోధించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలోనికి నడిపించాడంటే, అపొస్తలుల బోధకు భిన్నంగా సత్యం ఏమియు మిగిలియుండదు. దేవుని అనాది సంకల్పానికి సంబంధించిన సమస్త సందేశం, పరలోకసంబంధమైన యిద్దరు బోధకుల ద్వారా అపొస్తలులకు అందించబడింది. అందుచేతనే, "మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక" అని అపొస్తలులు అన్నారు (గలతీ. 1:8). 
అపొస్తలుల బోధ పరలోకపు దేవుని అనాది మర్మము ననుసరించినదే (రోమా 16:25-27). అపొస్తలుల బోధ, క్రీస్తు బోధ వేరువేరు కానేరదు (2యోహాను 9). అపొస్తలుల బోధ సార్వత్రికము సర్వకాలికము: "అయితే యేసు వారియొద్దకు వచ్చి పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు(అపొస్తలులు) వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను" (మత్తయి 28:18-20).
అపొస్తలులను సర్వసత్యంలోనికి నడిపించుటలో, పరిశుద్ధాత్మ బహు శ్రద్ధ వహించాడు. 1. దేవుని అనాది సంకల్పానికి భిన్నంగా లేనంతవరకు ఆయన అపొస్తలుల అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అనుమతించాడు (1కొరింథీ. 7:6-8). 2. దేవుని సంకల్పాన్ని బయలుపరచడానికి అవసరమైన పదజాలాన్ని పరిశుద్ధాత్మ అందించాడు (1కొరింథీ. 2:12-13). 3. అవసరంలేని అంశాలను లేఖికులు వ్రాయబూనినప్పుడు, పరిశుద్ధాత్మ దానిని అడ్డగించి వ్రాయవలసిన సంగతులను సూచించి, వ్రాయించాడు (యూదా 3). గనుక అపొస్తలుల బోధ అనాది దేవుని మర్మమును అనుసరించినదే అనడంలో ఏ సందేహమూ లేదు.
అపొస్తలుల బోధకు భిన్నమైనది దేవునివలన కలిగినదికాదు, కానేరదు‌. "సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతి రేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు" అని అపొస్తలుడైన పౌలు అన్నాడు (రోమా. 16:17-18). అపొస్తలుల లేఖనాలను అతిక్రమించడానికిగాను ఏ వ్యక్తిని హెచ్చింపకూడదు (1కొరింథీ. 4:6). మానవ అభిప్రాయములకు తావులేదు (1కొరింథీ.14:37).
ఇంతకు అపొస్తులులకే బోధ ఎందుకు అప్పగింపబడింది? అనాది సంకల్పానికి దేవుడు ప్రత్యేకించి క్రీస్తు యెుక్క అపొస్తలులకే ఎందుకు అప్పగించాడు? ఇది ఆలోచింపదగిన ప్రశ్నయే! ఈ ప్రశ్నకు ఇందుకు పలు బలమైన కారణాలున్నాయి. 
1. క్రీస్తును వెంబడించడానికిగాను వారు సమస్తాన్ని వదులుకున్నారు: ప్రభువైన యేసును వారు కలిసికొన్నది మెుదలు, ఆయన మాట మీద అత్యంత గౌరవాన్ని వారు కనుపరచారు: వారి అనుభవాలకు విరుద్ధంగా వారాయన మాటను గౌరవించారు: "సీమోను -ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మా కేమియు దొరుకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను" (లూకా 5:5). సమస్తాన్ని వదులుకొని ఉన్నపాటున లేచి ఆయనను వెంబడించిన అపొస్తులులు! (మత్తయి 9:9)
a. వారాయన భోజనం కొరకు రాలేదు; ఆయన యెుక్క నిత్యజీవపు మాటల కొరకు వచ్చారు (యోహాను 6:68). 
b. ఆయన (నజరేయుడైన యేసును) దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించారు (మత్తయి 16:16; గలతీ.2:20)
c. క్రీస్తు, తండ్రిని వారికి ప్రత్యక్ష పరచి, ఆయన వాక్యాన్ని వారికిచ్చినప్పుడు, వారావాక్యాన్ని అంగీకరించారు. (యోహాను 17:68).
d. తండ్రియైన దేవుడే వారిని క్రీస్తువారికి అప్పగించాడు (యోహాను 17:6-7).
e. క్రీస్తు లోకసంబంధి కానట్టు, అపొస్తులులు కూడా లోక సంబంధులు కారట (యోహాను 17:16).
2. పనిలో పరిశుద్ధాత్మకు అపొస్తులులతో గల ఏకైక సంబంధం: దేవుని పని విషయంలో పరిశుద్ధాత్మతో అపొస్తులులతో గల సంబంధం బహు వింతైనది. పరిశుద్ధాత్మ వారిలోను, వారితోను నిలిచి కార్యములు జరిగించాడు (1పేతురు 1:10-12). నరజాతిలో వేరెవ్వరు అలాటి బాంధవ్యాన్ని అటు క్రీస్తు ప్రభువుతోగాని, యిటు పరిశుద్ధాత్మతోగాని అనుభవించినవారు లేరు. ప్రభువైన యేసు వారికి యిలా వాగ్దానం చేశారు: "నేను తండ్రిని వేడుకొందును, మీ యెుద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణ కర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీ కనుగ్రహించును" (యోహాను 14:16). దేవుని పనిలో అలాటి సంబంధం వేరెవ్వరికి ఉండదు.
అందువలన, పేతురు నడిచి వెళ్లుతున్నప్పుడు, కేవలం అతని నీడ మాత్రమే పడిన రోగులను అపవిత్రాత్మచే పీడింపబడిన వారును స్వస్థత పొందారు (అపొ. 5:15-16). అలాగే పౌలు చేతికి తగిలిన గుడ్డలైనా, అతని ఒంటికి కట్టుకున్న నడికట్టులైనా రోగులవద్దకు తీసుకొనిపోతే రోగాలు వారిని విడిచాయి, దయ్యములు కూడా వారిని విడిచిపోయాయి (అపొ. 19:11-12). ఈనాడు చెప్పుకొనే ఏ అబద్ధికుడి వలనను యిట్టి కార్యాలు సాధ్యంకాదు. వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి, వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్" (మార్కు 16:20). 
3. దేవుని వాక్యాన్ని ఇతరులవలె వారు వినియోగించేవారుకారు: "కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించు చున్నాము"అని అపొస్తలుడైన పౌలు తెలిపాడు (2కొరింథీ 2:17) దేవుని వాక్యానికి సొంత ఆలోచనను జతచేస్తే, అది భిన్న అభిప్రాయమౌతుంది. భిన్నమైతే వచ్చే ఫలితం, పోకిరి చేష్టలు అనుసరించే వారు బయలుదేరుతారు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడుతుంది (2పేతురు 2:2-3).
అపొస్తలుల బోధకు, నీ అభిప్రాయం వేరుగా ఉంటే, అది నాశనకరమైన భిన్నాభిప్రాయమని;   కల్పనా వాక్యములు చెప్పడమని లేఖనాలు తెలిపాయి (2పేతురు 2:1-3). అట్టివారి నాశనం కునికి నిద్రపోదట! మోసపోయి కూడా భిన్నమైన అభిప్రాయం చెప్పకూడదు; దీనికి సంబంధించి పాత నిబంధన ప్రవక్తలలో నుండి ఒక ఉదహరణ చూద్దాం: "ప్రవక్త యొకడు మోసపోయి ఒకమాట చెప్పినయెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీయులలో నుండి వానిని నిర్మూలము చేతును...... ప్రవక్తయొద్ద విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును, ఇదే యెహోవా వాక్కు" (యెహె. 14:9-11).
4. తమ వలన జరిగిన సూచక క్రియలకు ఘనత అపొస్తులులు తమకు ఆరోపించుకోలేదు: సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములు చేయడం అపొస్తులుల యెుక్క చిహ్నములై యున్నాయి (2కొరింథీ. 12:12). అపొస్తలులు చేసిన అద్భుత కార్యాలకు తాము ఘనపరచబడకోరలేదు. యెరూషలేం దేవాలయానికి వచ్చిపోయే వారికి సుపరిచయమైన జన్మతో కుంటి వానికి, నడువను కాళ్లిచ్చిన పేతురు, యోహానులు, గతంలో కని విని యెరుగని ఒక మహత్కార్యం చేశారు. "చేయి పట్టుకొని, లేచి నడవమని యేసు నామమున వారు పలికారు" (అపొ.3:1-7).
నేటి అబద్ధికులవలె, జనుల దృష్టిని ఆకర్షించే ఏ చిల్లరి పనులు వారు చేసిన వారు కాదు సరికదా, కుంటివానికి కాళ్లివ్వడంలో కనీసం వారు ప్రార్థన కూడ చేసినవారుకాదు. స్వస్థత పొందేవానిలో విశ్వాసాన్ని ఎదురు చూచినవారు అంతకంటెకాదు (అపొ.3:1-10). అలాటి బహు వింతైన కార్యం జరిగించగా, ఎరిగిన జనులు ఆశ్చర్యపడి, వారియెుద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చారు. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను - "ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తేరిచూచుచున్నారు?" ఈలాటి మాటలు శరీరంలో జీవిస్తున్న నరులు అనలేని మాటలు! శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు, ఆత్మలేనివారు జనుల మధ్య గుర్తింపు కోరతారు. తాము ఏమి చేయజాలకపోయినా, జనుల మధ్య గుర్తింపు పొందడమే ధ్యేయంగా ఎంచుకుంటారు. అయితే అపొస్తులులు అట్టివారుకారు. క్రీస్తు ప్రభువు చెప్పినట్టు: "నేను లోక సంబంధిని కానట్టు వారును లోకసంబంధులుకారు" అని అపొస్తలులు ఋజువుచేసుకున్నారు. శరీరముయెుక్క స్వభావానికిని, దేహము యెుక్క తత్వానికిని అతీతులుగా నిలిచినవారు అపొస్తులులు. తమ ఘనతను చాటుకునే వారికి దేవుడు తన వాక్యాన్ని ప్రకటించే బాధ్యతను అప్పగించడు. దేవుని అనాది మర్మాన్ని ప్రకటించే బాధ్యతను దేవుడు అపొస్తులులకు అప్పగించడంలో, ఆయన జ్ఞానం బయలుపరచబడింది. గుర్తింపుకోరే వాడికి దేవుడు ఈ బాధ్యతను అప్పగించడనే విషయం వేరుగా చెప్పనవసరం రాలేదు.
5. క్రీస్తు నామము నిమిత్తం అవమానపరచబడడం ఘనతగా ఎంచినవారు అపొస్తులులు: కొట్టి, బెదిరించి, చెరసాలలో వేసిన ఏ అధికారమును, సువార్త ప్రకటించే వారి నోళ్లను మూయించలేకపోయింది (అపొ.4:1-20). ఇంత జరిగిన తరువాత కూడ, "అపొస్తులులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు మహాసభ యెదుట నుండి వెళ్లిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి" (అపొ. 5:40-42). 
నేటి సువార్త ప్రకటన ఎలా మారిపోయిందో మనకు తెలుసు. గుర్తింపు కొరకు కొందరు, పేరు ప్రతిష్టలకొరకు కొందరు, మరికొందరు ధనసంపాదన కొరకు, యింకను కొందరు సమాజంలో గొప్పవారనిపించుకొనుట కొరకు మరికొందరు వగైరా కారణాల కొరకు సువార్త ప్రకటిస్తున్నారే గాని, అపొస్తులులవలె సధ్బావనతో ప్రకటించే వారు ఎక్కువ మందిలేరనే చెప్పాలి. గనుక దేవుడు తన అనాది సంకల్పాన్ని ప్రకటించే బాధ్యతను అప్పగించడంలో అపొస్తులుల గుణగణాలు, స్వభావ లక్షణాలు సాటిలేనివిగా గుర్తించాలి. వారి బోధయే సార్వత్రికంగాను, సర్వకాలికంగాను నిలిచియుంటుంది. ప్రకటించే వాడెవడైనా, వారి బోధనే ప్రకటించాలి (2తిమోతి 2:2); వేరొకటి, లేక భిన్నమైనది చేయకూడదు. అయినా ఇంతటి నగ్నసత్యాన్ని పాటించే వారెక్కడ?
6. దేవుని మందిర నిర్మాణ కార్యక్రమము అపొస్తులులకు అప్పగింపబడింది: దేవుడు తన ప్రజల మధ్య నివసించాలనేది ఆయన చిరకాల కోరికయైయుంది (నిర్గమ. 25:8-9). ఇది రాబోవుచున్న మేలులు ఛాయగలదియేగాని ఆవస్తువుల నిజస్వరూపము గలదికాదు (హెబ్రీ. 10:1). రాజైన దావీదు తన హయాములో దేవునికి ఒక మందిరం నిర్మించాలనే అభిప్రాయం కలవాడైయున్నాడు (2సమూ. 7:1-8). ఆ పనిని దేవుడు అతని కుమారుడైన సొలొమోనుకు అప్పగించియున్నాడు (1దిన.28:5-6). సొలొమోను తనకు అప్పగించిన పనిని జరిగించి ముగించిన తరువాత, ఒక సత్యాన్ని యిలా గుర్తించాడు: "నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు; ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు; నేను కట్టించిన యీ మందిరము ఎలాగు పట్టును?" (1రాజులు 8:27).
"జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు" (అపొ.17:24).
ఆయన కోరుకున్న ఆలయ నిర్మాణానికి సంబంధించి, పునాది రాయిగా ఒక చెక్కుడురాతిని, దానిపై వేసే కొలనూలును నిర్మాణంలో ఉపయోగించే మట్టపుగుండును చేతపట్టుకొని, నిర్మించే పనివారి కొరకు ఆయన ఎదురుచూస్తున్నారు. ఆ మందిర నిర్మాణపు పనిని దక్కించుకొనడానికిగాను, యూదా మతనాయకులు ముందుకు వచ్చినట్టున్నారు (అపొ.4:11). 
అయితే దేవుడు ఏర్పరచుకున్న మూలరాతిని, కొలనూలును, మట్టపుగుండును ఉపయోగించి (యెషయా 28:16-17) నిర్మాణం చేయడం వారి వలన కాకుండ పోయింది (అపొ. 4:11; మత్తయి 21:41-42). దేవుని వస్తువులను వినియోగించి దేవునికి మందిరమును నిర్మించ గల సమర్థులు క్రీస్తుయెుక్క అపొస్తలులు మాత్రమే!
నీతి న్యాయములు కొలనూలు మట్టపుగుండులు గాను, మూలరాతి యెుక్క రెండు అంచులు తగ్గింపు, శ్రమానుభవములను సూచిస్తుండగా, అపొస్తులుడైన పౌలు యిలా అన్నాడు: "దేవుడు నాకనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరియైన శిల్పకారునివలె పునాది వేసితిని.. వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే" (1కొరింథీ. 3:10-11). ఈ మందిరము క్రీస్తుసంఘమే (1తిమోతి 3:15), పునాది రాయికి ధీటుగా, చెక్కిన ఆత్మ సంబంధమైన రాళ్లతో కట్టబడేది ఈ మందిరం (1పేతురు 2:4-5). అపొస్తలుల వంటి తగ్గింపు, వారివలె శ్రమానుభవామికి యిష్ఠపడే వారివలన ఈ పని కొనసాగింపబడుతుందేగాని, యూదా మతనాయకులులా హెచ్చించుకొనేవారుగాని, గుర్తింపుకోరే వారుగాని ఈ మందిరపు పనివారుగా పనికిరారు.
"క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియైయుండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటుకు వృద్ధిపొందుచున్నది, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగ దేవుని నివాస స్థలమైయుండుటకు కట్టబడుచున్నారు " (ఎఫెసీ. 2:20-22). ఈ పనికి దేవుడు క్రీస్తుయెుక్క అపొస్తలులను మాత్రమే వినియోగించుకున్నాడు. అపొస్తలులతో పాటు పనిచేసిన క్రొత్త నిబంధన ప్రవక్తలు ఈ పనిలో అపొస్తులులకు సహకారులైయున్నారు.
"ఎట్లనగాక్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచ బడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమునుగూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియ పరచబడలేదు" (ఎఫెసీ. 3:3-5).
దేవుని అనాది మర్మమును అపొస్తులుల వశము చేయడంలో, వేరే కారణాలు కూడా ఉన్నాయి: "పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితివిు గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా యేసు వారితో (అపొస్తలులతో) ఇట్లనెను - (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు" (మత్తయి 19:27-28). "పునర్జననము" అనేది PALIN GENESIA అనే గ్రీకు పదంనుండి తర్జుమా చేయబడింది. PALIN అంటే, మరల, GENESIA అంటే జన్మ. క్రొత్తజన్మ, ప్రత్యుత్పత్తి, నూతనంగా చేయబడడం, తిరిగి సృష్టింపబడి, తిరిగి క్రొత్తగా చేయబడిన, దేవునికి సమర్పణ చేయబడిన నూతన ఉత్పత్తి, శ్రేష్ఠమైన దానికొరకు పూర్తి మారుమనస్సు బాప్తిస్మమందు తటస్థించు అనే భావాన్ని సూచిస్తుంది. క్రొత్తనిబంధనలో తీతు 3:5లో ఈ ప్రయోగం కనిపిస్తుందని vine అంటాడు. ప్రపంచంయెుక్క మెుదటిస్థితి, పాపరహితమైన స్థితి, క్రీస్తునందు తిరిగి స్థాపింపబడినప్పుడు (2కొరింథీ. 5:17; ఎఫెసీ 2:8-10), క్రీస్తుప్రభువు తన రాజ్యసింహాసనంమీద ఆసీనులైయుంటారు. అప్పుడు అపొస్తలులు తమ అధికారపీఠము మీద నిలిచియుండి , దేవుని ప్రజలకు మార్గం నిర్ధేశిస్తారు అని ప్రభువు తెలిపారు. వివరాలకు Digging for the Divine Eternal Blueprint అనే నా రచనను చూడు. 
7. అపొస్తలులు క్రీస్తు రాజ్యపు రాయబారులు: క్రీస్తు యెుక్క ఆత్మ సంబంధమైన రాజ్యంలో అపొస్తలులు రాయబారులుగా నియమించబడ్డారు. "కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము" అని అపొస్తలుడైన పౌలు అన్నాడు (2కొరింథీ 5:20).
8. అపొస్తలులు దేవుని మర్మములకు గృహనిర్వాహకులు: పాతనిబంధనలో మోషే సాటిలేని ప్రవక్త. అయినా అతడు ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: "రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు" (ద్వితి. 29:29). అంటే, రహస్యములు లేక మర్మాలు నాకు తెలియవు అని మోషే తేటపరిచాడు. అయితే క్రీస్తు యెుక్క అపొస్తలులు దేవుని మర్మాలకు గృహనిర్వాహకులుగా నియమించబడ్డారు; "ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును (అపొస్తలులు) భావింపవలెను" (1కొరింథీ 4:1).
9. అపొస్తలులు క్రొత్తనిబంధనకు పరిచారకులు: "మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. క్రీస్తు ప్రభువు అధికారమును బట్టి క్రొత్తనిబంధన సూత్రాలను సూచించే అవకాశం ఆయన అపొస్తలులకే ప్రసాదించబడింది" (2కొరింథీ. 3:5-8).
10. క్రీస్తు ప్రభువు రాజ్యాంగ చట్టానికి రూపురేఖలు దిద్దినవారు అపొస్తలులు: దాని సైజు ఎంతదైన; ప్రతి రాజ్యానికి లేక దేశానికి ఒక రాజ్యాంగ చట్టం ఉండడం అవసరం. రాజ్యాంగ చట్టం లేకుండ ఏ రాజ్యము నడిపింపబడదు. క్రొత్తనిబంధన క్రీస్తు యెుక్క రాజ్యాంగ చట్టమైయుంది. ఈ రాజ్యాంగ చట్టానికి లేఖికులు ప్రధానంగా క్రీస్తుయెుక్క అపొస్తలులే! వారితో జతపనివారిగా పనిచేసిన క్రొత్త నిబంధన ప్రవక్తలును యిందులో తమ పాత్రను పోషించారు (ఎఫెసీ 3:3-5). క్రీస్తు రాజ్యమందలి ప్రజలయెుక్క ప్రతి కదలికను శాసించే రూపంగా క్రొత్తనిబంధన తీర్చిదిద్దబడింది. "ఎవడైనను తాను ప్రవక్తననియైనను ఆత్మసంబంధినని యైనను తలంచుకొనిన యెడల, నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువుయొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలిసికొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే యుండనిమ్ము" (1కొరింథీ. 14:37-38).
11. అపొస్తలులు తమ బోధ విషయంలో రాజీపడినవారు కారు: "మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును దెబ్బలయందును చెరసాలలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పుగలవారమై, పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోను దయతోను పరిశుద్ధాత్మవలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుటవలనను దేవుని బలమువలనను కుడియెడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతా ఘనతలవలనను సుకీర్తి దుష్కీర్తులవలనను దేవుని పరిచారకులమై యుండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమై నట్లుండియు సత్యవంతులము....." (2కొరింథీ. 6:4-9).
"అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడు చున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము. యేసుయొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసుయొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడును వహించుకొని పోవుచున్నాము" (2కొరింథీ.4:7-10). అపొస్తలులు తమ బోధ పట్ల వారు కనపరచిన శ్రద్ధ ఇది.
అపొస్తలుల బోధకు సంబంధించిన సంగతులు యింకా ఉన్నా, పత్రిక ముగింపుకు చేరుకుంది. చర్చించిన కొన్ని విషయాలు జ్ఞాపకము చేసి ముగించుతాను. అపొస్తలుల బోధ దేవుని అనాది సంకల్పంలో ముఖ్యమైన భాగమైయుంది. దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము అనాదిలోనే ఏర్పరిచాడు (1కొరింథీ 2:6-7). ఇది అనాది నుండి రహస్యముగా ఉంచబడి యిప్పుడు బయలుపరచబడిన మర్మమై ఉంది (రోమా 16:25-27). మానవ విమోచనకు సంబంధించి దేవుని అనాది ప్రణాళిక, సమస్త లోకములో ఉన్న సమస్త మానవాళికి వినిపించడానికి పరమ దేవుడు అపొస్తలుల బోధను సంకల్పించాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఆ బోధతో ఈ లోకానికి పంపించాడు (గలతీ. 4:4-6). మానవ జాతి యావత్తుకు మానవుల ద్వారానే ఆ సందేశం చేర్చాలని సంకల్పించినందున, అలా ఆ సందేశాన్ని చేర్చేవారు క్రీస్తుయెుక్క అపొస్తలులుగా దేవుడు నిర్ణయించాడు. 
ప్రభువైన యేసు ఆ సందేశాన్ని అపొస్తులులకు అప్పగించాడు. మరిచిపోయే అవకాశాన్ని రద్దు చేస్తూ, ఆయన బోధను అపొస్తులులకు జ్ఞాపకం చేసే పని పరిశుద్ధాత్మకు నియమించాడు. పరిశుద్ధాత్మ సయితం తాము తండ్రి యెుద్ద విన్న సంగతులనే అపొస్తలులకు బోధించి, సర్వసత్యంలోనికి వారిని నడిపించారు. పరిశుద్ధాత్మ యెుక్క ఆధ్వర్యంలో అపోస్తలులు ఆ సందేశాన్ని తమ తరము వారికి ఉపదేశించి, రాబోవు తరము వారి కొరకు గ్రంథస్తం చేశారు (2పేతురు 1:12-15). పరిశుద్ధాత్మ యెుక్క ఆధీనంలో లేఖనాలు దాఖలు చేయబడ్డాయి (యూదా 3).
అపొస్తలుల బోధకు ఏదియు కలుపకూడదు అందులో నుండి ఏదియు తీసివేయకూడదు. ఆ బోధకు భిన్నమైనది అపవాది సంబంధమైనదే (2కొరింథీ 11:13-15). అపొస్తలుల బోధకు అభిప్రాయభేదమున్న అది నాశనకరమైనదని, పోకిరి చేష్టలతో ప్రేరేపించేదని, అట్టివి కల్పనాకథలని, నీతి మార్గాన్ని దూషించేదని లేఖనం సూచించింది (2పేతురు 2:1-3). అపొస్తలుల బోధకు వ్యతిరేఖమైన భేదములు ఆటంకాలుంటే, అట్టి వారిలో నుండి తొలగిపోవాలని, అట్టివారు ప్రభువైన క్రీస్తుకు దాసులుకారు (రోమా 16:17-18). అని గ్రంథం తేల్చేసింది.
నీవు చేసేది అపోస్తలుల బోధయేనా? నీవు నిలిచింది అపోస్తలుల బోధలోనేనా? అపొస్తలుల బోధ అనేది ఒకటి ఉంది, దానికి నమ్మకంగా ఉండాలనే జ్ఞానం నీకు ఉందా? అలా కాకపోతే, నీ గతి ఏమౌతుందో ఆలోచించు. అపొస్తలుల బోధకు భిన్నమైన సువార్తను ప్రకటించే వాడెవడైన శాపగ్రస్తుడని విషయాన్ని నీవు పట్టించుకోవా? (గలతీ 1:6-9). నిత్యత్వం విషయంలో ఆటలాడకూడదు!! దేవుని అనాది సంకల్పం (ప్రణాళిక) లోని అపొస్తలుల బోధ రాజీపడే అవకాశంలేనిదై ఉంది (గలతీ. 1:6-8). గనుక జాగ్రత్త!!
జి. దేవదానం

0 comments:

Post a Comment