Saturday, 10 September 2016

వెయ్యేండ్ల పరిపాలనను గూర్చి నీ ఆలోచనేమో కాని ...

ప్రభువైన యేసు మొదటిసారి అనామకుడిగా అవతరించి, పేదవాడుగా పెరిగి తన స్వకీయులనబడిన యూదులచే తృణీకరింపబడి, కడకు నేరస్థుడైనట్టు కఠోరమైన మరణం అనుభవించారు. మూడవ దినాన పునరుత్థానుడై గలిలయులలో కొందరికి కనబడి పరమునకు వెళ్లారు. కాని ఆయన రెండవమారు ఆర్భాటంతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బూరతోను పరలోకంనుండి దిగి వస్తారు. అప్పుడు ఆయన భూమిమీద వెయ్యేండ్ల పాలన చేస్తాడని కొందరు నమ్ముతారు. ఇలాటి నమ్మకాలతో కలిసియున్న యింకా కొన్ని విషయాలను చూద్దాం.

ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పడు మృతులలో తనవారిని మాత్రమే లేపుకుంటారట; దీన్ని మొదటి పునరుత్థానమంటారట! అదే సమయంలో భూమిమీద సజీవులుగానున్న తనవారిని మహిమ దేహులుగా మార్చుకుంటారట. ఈ రెండు రకాలైన జనులు ఆయనను “మధ్యాకాశం”లో కలుసుకుంటారట. అక్కడ వారు ఆయనతో “ఏడేండ్లు” పెండ్లి విందులో పాలుపొందుతారట.

ఆ కాలంలో ప్రభువునకు సంబంధించని భూజనులు ”ఏడేండ్ల శ్రమల్లో” ఉంటారట. “అయ్యో శ్రమలు భయంకర శ్రమలు, మహా శ్రమలు” అంటూ జనములను భయపెట్టే మాటలను చదువరి వినియుండలేదా? వినకపోతే అలాటి శ్రమలొస్తాయని వారి నమ్మకం. అప్పటిలో “కడమ మృతులు” అంటే ప్రభువునకు చెందని మృతులట! వారప్పుడు లేవబడరట!!

ఈ వెయ్యేండ్ల పరిపాలనకు ముందో, వెనుకో, - మొత్తానికి 666వ ముద్ర వేయబడాలట. అసలు రాకడకే ముందైతే, ఆ 666వ ముద్ర ఎప్పడు ప్రారంభమౌతుందో? ఒకవేళ ఈ 666వ ముద్ర, ఈ ఏడేండ్ల శ్రమ కాలంలోనే అయితే వారి ఆలోచన ప్రకారం ప్రభువుకు సంబంధించిన జనులు మధ్యాకాశంలో ఏడేండ్ల పెండ్లి విందులో ఉంటారు గనుక వారికీ ఈ ముద్రకు సంబంధముండకూడదు. అప్పటిలో భూమిమీద విడువబడే జనులందరు సాతాను సంబంధులే అయ్యుండాలి గనుక ఆ ముద్ర ఎవడికీ ప్రత్యేకంగా వేయనవసరం లేదుగదా? అయినా ఆ 666వ ముద్రను ఎలాగో తమ విశ్వాసంలోనికి ప్రవేశపెట్టాలి! అక్షరార్థంగా ఆ ముద్ర వేయించుకున్నవారికే రేషన్ వగైరాలట! లేకపోతే లేదట! వీటికి ఆధారాలు ఎక్కడో? వింటానికి వింతగా ఉంటాయి గనుక వింటారు.

మధ్యాకాశంలో ఏడేండ్లు పెండ్లి విందు అయిపోతుందట; మహిమ దేహం ధరించి ఆకాశంలోనికి కనురెప్పపాటులో వెళ్లగలిగిన తన ప్రజలతో ప్రభువైన యేసు ఆ పెండ్లి విందు ముగించుకొని భూమిమీదికి దిగి వస్తారట. ఆయన ఇశ్రాయేలు దేశానికి వచ్చి యెరూషలేమును కేంద్రంగా చేసికొని, భూమిమీద భౌతిక రాజ్యపాలన సాగిస్తారట; ఈ పాలనకు ప్రారంభంలోనే సాతానును బంధించివేస్తారట. ఆదాము మొదలు రెండవ రాకడవరకు జీవించిన తనవారందరితో ఈ వెయ్యేండ్ల పాలనను యేసు చేస్తారట. మరి వారికందరికి స్థలమెక్కడో? దీనికి ముందున్న సాతాను జనులు ఎక్కడికి పోతారో తెలియదు. అయితే యూదులందరు ఆయన పక్షముగా చేరుతారట; యెరూషలేం దేవాలయం తిరిగి కట్టబడుతుందట!!

అప్పటిలో సాతాను ప్రజలకు ఏలిక ఏవరైయుంటారో? ఏదియెలాగున్నా ప్రభువైన యేసు పాలనలో మాత్రం - తోడేలు గొర్రెపిల్లయొద్ద వాసము చేయడం; చిరుతపులి మేకపిల్లయొద్ద పండుకొనడం; యొద్దు మేసినట్టు సింహం గడ్డి మేయడం, పసిబాలుడు నాగుపాము పుట్టయొద్ద ఆటలాడడం, పాలుకుడుచు బిడ్డ మిడినాగు కంటిపాపను తన వ్రేలితో తాకడం వంటి పనులు జరుగుతాయట! మరి సాతాను జనుల మధ్య పరిస్థితులేలాగుంటాయో సరిగా తెలియదు.

ఆ వెయ్యేండ్లు గడిచాక అపవాది విడిపింపబడతాడట. వాడు వచ్చి జనులను తన పక్షంగా చేర్చుకొని, క్రీస్తుతోను ఆయన ప్రజలతోను “హెర్మెగెద్దోన్” అనే యుద్ధం చేస్తాడట. సాతాను జనం ఓడింపబడతారట. చివరిగా సాతాను సంబంధులై మృతులైనవారిని ఆయన బ్రతికిస్తాడట. అప్పుడు అంత్య తీర్పు జరుగుతుందట. గొర్రెలవాడు మేకలలోనుండి గొర్రెలను వేరుచేసినట్టు ఆయన తనవారిని కుడివైపున చేర్చుకొని నిత్యజీవానికి పంపుతూ, తన ఎడమవైపున ఉన్నవారిని అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి పంపుతారట. కొందరు ఈ కూర్పును వ్యత్యాసంగా కూర్చినా, మొత్తం మీద వెయ్యేండ్ల పరిపాలనను నమ్మేవారు సంగతులను యిలా నమ్ముతారు. ఈ నమ్మకానికి బైబిల్లో ఆధారం లేదు.

ఇలాటి తప్పుడు బోధను ప్రారంభించినవాడు ఫ్రిగియాలోని హీరాపోలిస్ సంఘంలో అధ్యక్షుడైన పేసియస్ అనేవాడట. చరిత్రకారుడైన ఇసూబియస్ పేసియస్ను గూర్చి యిలా వ్రాసాడు: “వింతైన ఉపమానాలను పుక్కిట పురాణాలను అతడు (పేసియస్) అంగీకరించేవాడు. వాటిలో మృతుల పునరుత్థానం తరువాత వెయ్యేండ్లు క్రీస్తు భౌతిక రాజ్యాన్ని భూమిమీద ఏర్పాటు చేస్తాడనేది ఒకటి. అపొస్తలుల రచనల్లో ఆత్మ సంబంధంగాను, అలంకారంగాను ఉన్నవాటిని అతడు అపార్ధం చేసికొని యిలాటి భావానికి వచ్చాడని నాకు (ఇసూబియస్) తోస్తుంది. తన రచనలను బట్టి అతడు (పేసియస్) అంత జ్ఞానం కలవాడు కాడని తేలుతుంది, ప్రాచీన కాలపువాడని అతనిపై ఆధారపడిన అనేకమంది క్రైస్తవ రచయితలు కూడ అదే అభిప్రాయాన్ని కలిగియున్నారు” (Ibid. Eusebius quoted by Mattox, The Eternal Kingdom).

వాస్తవాలు యిలా ఉండగా క్రీస్తు ఏలుబడిని గూర్చిన సత్యమేమి? వెయ్యేండ్ల పరిపాలన లేదా? ఉంటే అది ఎవరికి సంబంధించినది? క్రీస్తుకా? తన ప్రజలకా వగైరా సంగతులను పరిష్కారంగా తెలిసికోడానికి ప్రయత్నిద్దాం. లేఖనాలను పరిశీలి నమ్మదగిన బోధను గట్టిగా చేపటుదాం. పుక్కిట పురాణాలనుండి, వింతైన ఉపమానాలు నుండి తొలిగిపోదాం. నిత్యజీవానికై నిరీక్షించుదాం. సరేనా! అయితే చూడు;

వెయ్యి (1000) అనేది అలంకార ప్రయోగమే: “నీ గురించి మాట్లాడుకొంటున్నా అంతలో నీవొచ్చావ్, నీకు నూరేండ్లు” అనే ప్రయోగం నేటి సాంఘిక సహజీవనం వినిలేదా? అలా అనడంలో అతడు నూరుకంటె ఎక్కువ యేండ్లు బ్రతుకకూడదని కాదు. లేక అతడు అంతకాలం బ్రతుకుతాడనీ కాదు. ”నీకు నూరేండ్లాయుష్షు” అనేది దీర్ఘకాల జీవితాన్ని సూచించే కోర్కెగా నేడు ఎలా ప్రయోగింపబడుతుందో, అలాగే లేఖనాల్లో వెయ్యి అనే ప్రయోగం చేయబడింది. కావాలంటే ఈ క్రింది లేఖన భాగాలను చూడు

1. “నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించువాడనైయున్నాను” (నిర్గమ. 20:6). వెయ్యి తరాలకంటే ఆయన ఎక్కువ కరుణించడని దాని భావమూ? కాదు.

2. అడవి మృగములన్నియు వేయి కొండలమీద పశువులన్నియు నావేగదా? (కీర్తన 50:10). తక్కిన కొండలమీద పశువులకు సృష్టికర్త మరొకడని దాని అర్థం కాదు. ఎందుకంటే, “భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులు యెహోవావే”!! (కీర్తన. 24:1).

3. “నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి. రాత్రియందలి యొక జామువలెనున్నవి” (కీర్తన. 90:4). వేయి సంవత్సరముల ఎన్నిక ఎంతో? ఒక రోజా? లేక రాత్రిలో ఒక జామా?

4. “ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి” (2 పేతురు 3:8). “వెయ్యి” అనేది యిక్కడ దీర్ఘకాలం అనే భావంతోనే ప్రయోగింపబడింది.

5. “... మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక తమ నొసళ్లయందుగాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొననివారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి...” (ప్రకటన 20:4-6) ఇక్కడ “వెయ్యి” అనే మాటను పట్టుకొని 999+1 సంవత్సరాలని భావం చెప్పడం తప్పు కాదా?

“వెయ్యేండ్ల పాలకులకు” ఈ లేఖన భాగమే ఆధారం. వెయ్యేండ్ల పాలన కొరకు ఈ లేఖన భాగాన్ని వారు అక్షరార్థంగా వ్యాఖ్యానించగోరితే, దానిలో పాలుపొందేదెవరో తిరిగి చదివి చూడు:

1. క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయనివారు.

2. తమ నొసళ్లయందుగాని చేతులయందుగాని దాని ముద్ర వేయించుకొననివారు.

3. యేసు నిమిత్తమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనం చేయబడినవారు -”వారు బ్రతికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి” అని వ్రాయబడియుంది. క్రీస్తు వెయ్యేండ్లు రాజ్యం చేస్తాడని లేదు సుమా! క్రీస్తు రాజ్య పాలనలో వారు వెయ్యేండ్లు ఆయనతో కూడ రాజ్యం చేసిరని మాత్రమే అక్కడ వ్రాయబడియుంది. గనుక వెయ్యేండ్ల పాలన క్రీస్తు చేస్తాడని లేదు. కావాలంటే మళ్లా చూడు. “వారు బ్రతికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి.” ఇది వారిని గూర్చిన సమాచారం; క్రీస్తు పాలనను ఉద్దేశించి చెప్పిన సమాచారం కాదు. క్రీస్తు వెయ్యేండ్లు పరిపాలన చేస్తాడని బైబిల్లో ఎక్కడుంది?

అక్షరార్ధమైన లేఖనం యిలా ఉండగా వెయ్యేండ్ల పరిపాలనలో అందరం ఉంటామనే భావం ఎక్కడనుండి వచ్చిందో? పైగా ఈ వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తు రెండవ రాకడ తరువాతనే అనేదానికి ఆధారం లేఖనాల్లో ఎక్కుడుందో? అది చాలదన్నట్టు, భూమిమీద క్రీస్తు భౌతిక రాజ్యపాలన చేస్తాడని అక్కడ లేదే! భౌతిక రాజ్యపాలనను ఈ “వెయ్యేండ్ల పాలకులు” ప్రభువైన క్రీస్తు కొరకు ఎక్కడనుండి తెచ్చారో?! తెలియకుంది.

యిర్మీయా ప్రవచన భావాన్ని బట్టి, ప్రభువైన యేసు అప్పడూ, యిప్పడే కాదు; ఎన్నడూ భౌతిక రాజ్యపాలన చేయడానికి వీలులేదు. ఎలాగంటావేమో! క్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతతియై ఉన్నాడు (రోమా 1:4) యెకొన్యా (యిర్మీయా 24:1) లేక కొన్యా (యిర్మీయా 22:24) అనేవాడు దావీదు సంతతికి చెంది, అతని సింహాసనం మీద కూర్చుండిన రాజు. అయితే కొన్యా అనే అతనికి యూదాలో దావీదు సింహాసనం మీద కూర్చుండే సంతానం లేదట! ఈ మాట యూదా దేశంతోనే మహోన్నతుడు తెలియజేశారు. జాగ్రత్తగా చూడు.

తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామమున అన్నట్టు - “దేశమా, దేశమా, దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు - సంతానహీనుడనియు, అతని దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యుని గూర్చి వ్రాయుడి. అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇకమీదట ఎవడును యూదాలో రాజుగానుండడు” (యిర్మీయా 22:28-30).

(యె)కొన్యా సంతతివాడెవడును ఇక మీదట యూదాలో రాజుగా ఉండడు! ఈ మాటకు ప్రభువైన యేసుకు సంబంధమేమి? అని అడుగుతావేమో! శరీరమును బట్టి ప్రభువైన యేసు యెకొన్యాసంతతివాడే (మత్తయి 1:1, 11 చూడు), యిర్మీయా ప్రవచనం ప్రభువైన యేసుకు తెలియకుండ వచ్చింది కాదు (మీకా 5:2). ఈ ప్రవచనము నెరిగినవాడు గనుకనే, భౌతిక రాజ్య సింహాసనాన్ని ఆయన నిరాకరించాడు (యోహాను 6:15) తన మరణానికి ముందే సొలొమోను నాటి వైభవాన్ని జ్ఞాపకం చేసికొని, ఆ రూపంలో భౌతిక రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని అపొస్తలులు భావించారు కాబోలు! తన అపొస్తలుల భావాన్ని ఆయన రద్దుపరచారు (మత్తయి 20:20-28) ఆయన తీర్పు తీర్చబడిన సమయంలో తన రాజ్యం ఈలోక సంబంధమైనది కాదని; అది యిహ సంబంధమైనది కాదని తనను ప్రశ్నించిన పిలాతుకు వివరించారు (యోహాను 18:36). అయినా, ఆయనా రాజేనట! గనుక ఆయన పునరుత్థానుడైన తరువాత - “ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా?” అని తన అపొస్తలులు అడిగితే, వారు ఎదురు చూచిన రూపంలో సమాధానం చెప్పకుండానే ఆయన ఆరోహణుడయ్యాడు (అపొ, 1:6-11)

క్రీస్తు మెలీసెదెకు క్రమము చొప్పున యాజకుడు (హెబ్రీ. 7:17). అంటే ఆయన మెలీసెదెకువలె (ఆది. 14:18), రాజై యాజకత్వం చేస్తాడు; లేక యాజకుడై రాజ్యపాలన చేస్తాడు (జెకర్యా 6:12-13; యిర్మీయా 23:5). ఆయన దేవునికిని నరులకును మధ్యవర్తి (1 తిమోతి 2:5). గనుక దేవునిపట్ల దైవముగా, ఆయన ధర్మ విధులను మానవు అంతరంగాల్లో నిలిపి నడిపించుటకై రాజై పాలన చేస్తాడు; మానవాళి పట్ల మన బలహీనతలలో సహానుభవము గలవాడుగా (హెబ్రీ. 4:15-16), తండ్రియైన దేవుని యెదుట యాజకత్వం చేస్తారు. అయితే ధర్మశాస్త సంబంధులైన యాజకులు ఆ కాలంతో ఉన్నారు గనుక “ఈయన భూమిమీద ఉన్నయెడల యాజకుడై యుండడు” (హెబ్రీ 8:4). ఆయన ఎప్పడు యాజకుడై ఉంటాడో అప్పడే రాజైయుంటాడు గనుక ఆయన భూమిమీద ఉన్నయెడల రాజైయుండడని వేరుగా చెప్పనవసరం లేదు.

అందువలన “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడైయుండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయెను” (హెబ్రీ. 8:2). ఏలయనగా, “-నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము” (కీర్తన. 110:1) అని తండ్రియైన దేవుడు ప్రభువైన యేసుకు సెలవిచ్చారు. పైగా, “యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. మెల్మీసెదెకు క్రమము చొప్పన నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు” (కీర్తన. 110:2-4).

ఆరోహణుడై తేజోమయుడైన క్రీస్తుకు ఈ ఏర్పాటు జరుగుచుండగా (దానియేలు 7:12-13; ఫిలిప్పీ 2:8-11), క్రొత్త నిబంధనను అనుసరించి, ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యాన్ని ప్రారంభించడానికి యెరూషలేములో వేచియున్న అపొస్తలుల (మీదికి) యొద్దకు పరిశుద్ధాత్మ పంపబడ్డారు (అపొ. 2:1-5) పరిశుద్ధాత్మ యొక్క అపూర్వమైన రాక వేలకొలది జనులను అపొస్తలులున్న చోటికి ఆకర్షించింది. ప్రభువు వాగ్దానాన్ని బట్టి (మత్తయి 16:18-19), పరిశుద్ధాత్మ పూర్ణుడైన పేతురు సువార్త ప్రకటన ద్వారా పరలోక రాజ్యం యొక్క ద్వారాలను తెరిచాడు. అప్పడే సీయోనులోనుండి ధర్మశాస్త్రం (క్రొత్త నిబంధన) యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలుదేరింది (యెషయా 2:1–2).

ప్రభువైన యేసు యొక్క మరణం, సమాధి, పునరుత్థానాలలో యిమిడియున్నదేవుని ఏర్పాటు విన్నవారికి అర్థమయ్యింది. గనుక వారు తమ పాపపు స్థితిని గుర్తించి, దాని చేసినందుకు మనస్సున నొచ్చుకొన్నవారై, తమ జీవిత నడవడికను దిద్దుకొనగోరి, వారు ఏమి చేయాలో అపొస్తలులనడిగారు. తిరిగి పేతురే సమాధానమిసూ, “మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు . ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి - మూర్ఖులగు ఈ తరమువారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు” (అపొ. 2:38-41). పేతురు తన ప్రసంగంలో కీర్తన. 110:1ని కోట్ చేసి, “మీరు సిలువ వేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.” (అపొ. 2:36) అని తెలిపితే, ఆయన అధికారమునంగీకరించిన వారు ముంచడం పొందారు (అపొ. 2:41).

నీటిమూలంగాను, ఆత్మమూలంగాను జన్మించినవారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభువు ముందుగానే సూచించారు గదా? (యోహాను 3:5). సువార్త ప్రకటనవలన పేతురు పరలోక రాజ్యపు ద్వారాలు తెరువగా, ప్రభువైన యేసు ఆధిపత్యానికి లోబడుట ద్వారా 3000 మంది ఆత్మ సంబంధమైన ఆ రాజ్యంలో ప్రవేశించారు. “అంధకార సంబంధమైన అధికారంనుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా” పరమ తండ్రి వారిని చేశారు (కొలస్సీ. 1:13).

సువార్త ద్వారా చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడి, నీటిమూలంగాను, ఆత్మమూలంగాను జన్మించిన ద్విజులు; క్రీస్తువలె రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధమైన జనముగాను, దేవుని సొత్తయిన ప్రజలుగాను అంగీకరింపబడ్డారు (1 పేతురు 2:9). గత జీవితంలో అపరాధములచేతను పాపముల చేతను చచ్చినవారైయుండగా వారు క్రీస్తుతోపాటు బ్రతికింపబడ్డారు (ఎఫెసీ. 2:1-2). గనుక వారు మొదటి పునరుత్థానములో పాల్గొన్నవారైయుంటారా? ఒకవేళ వీరిలో కొందరు దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడ్డారనుకో, వారు ఆత్మలో సజీవులే గాని చచ్చినవారు కారు గదా? గనుక శరీరంతో జీవించుచున్నవారేమి, శరీరంనుండి వేరుచేయబడ్డవారేమి ఆత్మలో వారందరు సజీవులుగనే, క్రీస్తు ప్రభువు యొక్క ప్రజలుగా ఆయన రాజ్యపాలనలో పాలుగలవారైయుంటారు (ప్రకటన 20:4).

అలా పెంతెకొస్తు దినమున ఆరంభమైన క్రీస్తు పాలన ఎంత కాలం కొనసాగింపబడాలో లేఖనాల్లో సూచింపబడింది. “తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపాలన చేయుచుండవలెను” (1 కొరింథీ. 15:25). ఆయన తన శత్రువులను జయించుకొంటూ వస్తూ ఉంటే, “కడపట నశింపజేయబడు శత్రువు మరణం” (1 కొరింథీ. 15:26) మరి ఈ మరణం నశింపజేయబడేదెప్పడు? విజయమందు మరణం మ్రింగివేయబడునప్పుడే! అది రెండవ రాకడలోనే!! పెంతెకొస్తు దినాన దేవుని రాజ్యంలో ప్రవేశించిన శిశువులు, ప్రభువులా ఉండుటకు అన్ని విషయములలో ఎదిగి (రోమా 8:29); రెండవ రాకడలో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కొనువారైయుంటారు (మత్తయి 25:34).

అయితే “సహోదరులారా, నేను చెప్పనది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి యున్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పడు - విజయమందు మరణము మ్రింగివేయబడెను” అను వాక్యము నెరవేరును (1 కొరింథీ 15:50–54). గనుక ప్రభువైన క్రీస్తు తన రెండవ రాకడవరకు ఆత్మ సంబంధులగు తన ప్రజలను ఏలుచు యాజకత్వం జరిగించుచు ఉండాలి!!

ప్రభువైన యేసు యొక్క రెండవ రాకడ తరువాత ఆయన రాజ్యపాలన చేయరు. ఆయన రాకడ సమయంలోనే తీర్పు జరుగుతుంది. ఆయన తన విరోధులకు భయంకరుడుగా ఉంటారు. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడనివారికిని ప్రతిదండన చేస్తారు (2 థెస్స. 1:6-8). “ఆ దినమున తన పరిశుద్దులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారియందు ప్రశంసింప బడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖమునుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు” (2 థెస్స. 1:9-10). ఆ సమయంలోనే సమాధుల్లో ఉన్న వారు కూడ లేపబడతారు (యోహాను 5:28).

అదే సమయంలో తన ప్రజలకు ఘనమైన స్వాగతమివ్వబడుతుంది. “ఆర్భాటము తోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు (మధ్యాకాశానికి కాదు) ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. (ఏడేండ్లు పెండ్లివిందు తరువాత భూమిమీద వెయ్యేండ్ల పాలనకు వస్తాము అనేది లేదు) కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” అని వ్రాయబడియుంది (1 థెస్స. 4:1617).

“ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రతికింపబడుదురు” (నిత్యజీవమునకో లేక నిందపాలగుటకో! దేనికో!) ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. అపరాధములచేతను పాపముల చేతను చచ్చిన నీవు, నేడు దేవుని కుమారుని శబ్దం వింటివా? ఆత్మసంబంధిగా బ్రతికింప బడతావు. ఇలాగున మొదటి పునరుత్థానములో పాలుగల పరిశుద్దుడవై యాజకుడవై ఉంటావు (యోహాను 5:25). ఇలా బ్రతికింపబడక నీవు సమాధికి చేరితే కూడ, తీర్పుకై బ్రదికింపబడేది ఖాయం (యోహాను 5:28). ఇది తధ్యం అనడానికి క్రీస్తు పునరుత్థానమే రుజువు (అపొ. 17:31). ఇట్టి పునరుత్థానానికి ప్రథమ ఫలము క్రీస్తు.

తరువాత క్రీస్తు వచ్చినప్పుడు (ఆగమనమందు) ఆయనవారు బ్రతికింపబడుదురు. ”అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పడు అంతము వచ్చును” (1 కొరింథీ. 15:24). అంటే అంతవరకు దేవునికిని ఆయన ప్రజలకును సమన్వయం కుదిరించడానికి మధ్యవర్తిగా నిలిచి, తన దేవుని సముఖములో నిలువగల వారైనట్టు తన ప్రజలను నడిపించిన తరువాత యేసు మధ్యవర్తిగా తొలిగి, దేవుని నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొనేలా జనులనూ, వారిని ఉన్నపాటున అంగీకరించేలా దేవునీ పరిచయం చేసి ఆయన తానే తండ్రికి లోబడియుంటాడు (1 కొరింథీ. 15:25-28).

ఇవి రోజులు తరబడి జరిగే పనులు కావు, ఇవన్నీ ఒకేసారి జరిగే పనులే; సృష్టి కూడా యిలాటి శుభ సమయం కొరకు మిగుల ఆశతో తేరిచూస్తూ కనిపెడుతుంది (రోమా 8:20). దేవుని కుమారులు తమ మహిమ స్వాస్థ్యమును అనుభవింపబోవునప్పుడు సృష్టికి కూడా విడుదల లభిస్తుంది. అది అగ్నితోనే దహింపబడి లయమైపోతుంది (2 పేతురు 3:3–12). భౌతికమైనదేదీ యికను ఉండదు. గనుక రెండవ రాకడ తరువాత భౌతికమైన రాజ్యాన్ని ప్రభువైన యేసు భూమిమీద ఏర్పాటు చేస్తారనేది సత్యదూరం. అది అపొస్తలుల లేఖనాలను అపార్ధం చేసికొనడంవలన ఏర్పడ్డ తప్పు అభిప్రాయమే!

ఆయన రాజ్యం నేడే భూమిమీద ఉంది (ప్రకటన 1:9). ఆ నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృపను కలిగియుండాలంటే, క్రీస్తుయేసు ఆధిపత్యాన్ని అంగీకరించినవాడవై నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించి, ఆయన రాజ్యాంగ చట్టమైన క్రొత్త నిబంధనలో నిలిచియుండి శాశ్విత రాజ్యమును స్వతంత్రించుకొనుటకు సిద్ధపడ వలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంగతులను విని, మనో నేత్రాలు వెలిగింపబడిన వాడవై సత్యాన్ని అంగీకరించే మనస్సును మహామహుడు నీకు ప్రసాదించు గాక! ఆమేన్.

1 comment: