బైబిల్లో అసంబద్ధాల? అసంభవం (Rationale of Bible Bandaram) - part 2


51. యూదా మరణ గాథలోని బాధలు
     ఈ యుదా ద్రోహము వలన సంపాదించిన రూకల నిచ్చి పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని ప్రేగులన్నియు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియవచ్చెను. కనుక (ఆ పొలము రక్తభూమి అనబడియున్నది) (అపొ. 1:18, 19).

     అతడు (యూదా) ఆ వెండి నాణేములు దేవాలయములో పారవేసి పోయి. . . . ఉరిపెట్టుకొనెను. ప్రధానయాజకులు ఆ వెండి నాణేములు తీసికొని ఇవి రక్తక్రయ ధనము గనుక వీటిని కానుకపెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి. అందువలన నేటివరకు ఆ పొలము రక్త పొలమనబడుచున్నది. (మత్త. 27:5-8.

     గమనిక: యూదా మరణం అపొ. 1:18-19లో ఒక విధంగా వుంటే, మత్తయి 27:5-8లో మరొక విధంగా వుంది. అలా వుండడం అంతర్గత వైరుధ్యం కాదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు.

     అయితే ఏది తార్కిక వైరుధ్యమనబడుతుందో మన మిత్రునికి తెలిసియుంటే యిక్కడ తంటా ఉండేది కాదు. వాస్తవానికి బాధలు యూదా మరణ గాధలోనివి కావు; మన మిత్రుని తార్కిక జ్ఞానంలోనివే! అదెలాగంటారేమో! ఒక ఉదాహరణతో విషయాలు తేటపడతాయి చూడు.
ఒకే వేదికపైనుండి ఒకే కోవకు చెందిన యిద్దరు వ్యక్తులు ఒకే అంశం మీద మాట్లాడడం చూచియుంటావా? ఆ సందర్భంలో సహజంగా ఒకరు మాట్లాడగా, మిగిలిన సందేశాన్ని మరొకరు యివ్వడానికి ప్రయత్నిస్తారు. మొదటి వ్యక్తి మాటలాడిన తరువాత చెప్పవలసిన వర్తమానం మిగలలేదనుకో, వాస్తవంగా రెండో వ్యక్తి మాటలాడ పనిలేదు. అయితే రెండో వ్యక్తి అదే అంశంమీద మాటలాడ పూనినప్పుడు వాని వర్తమానంలో ఏదో కొంత విశేషమే ఉండి తీరాలి. అలాటి సందర్భాలలో, గోచరించే వ్యత్యాసాలను అంతర్గత వైరుధ్యాలనడం మూఢత్వమే గాని తార్కిక జ్ఞానం కాదు.

     కేవలం వ్యత్యాసాలే తార్కిక వైరుధ్యాలనబడవు. తార్కిక వైరుధ్యమంటే మన మిత్రునికి నాకు జరుగుతున్నట్టు, ఒకరు "అవును" అన్నది మరొకరు "కాదు" అని రుజువు చేసేదైయుండాలి. అయితే పై లేఖనాల్లో ఏం జరిగింది? యూదా మరణాన్ని గురించి మొదట పేతురు ఒక సందర్భంలో చెప్పాడు (అపొ. 1:18-19). అదే అంశం మీద మిగిలిపోయిన దానిని మత్తయి తెలిపాడు (మత్తయి 27:5-8) పేతురు, మత్తయిల మధ్య పరస్పర విరుద్ధ భావాలు లేవు. అంటే పేతురు చెప్పింది మత్తయి కాదనడం లేదు. కాని పేతురు మాటల్లో ఆ అంశంపై తగ్గిన విశేషాలను మత్తయి తన రచనలో పూర్తి చేశాడు. ఈ యిద్దరి వర్తమానాలను యొక చోట చేర్చి అసలు యూదా మరణం ఎలా జరిగిందో గ్రహించవచ్చు.

     ఆ పొలం యూదా ద్రోహంవలన సంపాదించిన రూకలిచ్చి కొన్నదే! అయితే దాన్ని కొన్నది ఎవరో పేతురు ప్రస్తావించలేదు. ఈ సందర్భం మొదటినుండి ఎలా జరిగిందో మత్తయి వివరించాడు చూడు. ఆ రాత్రి యూదా యేసును యూదులకు అప్పగించాడు. యూదా అధికారులు ఆ రాత్రియందే ఆయన్ను విచారించారు గాని ధర్మశాస్త్రాన్ని బట్టి మరణానికి తగిన ఏ నేరం వారికి ఆయనయందు కనబడలేదు.

     "ఉదయమైనప్పుడు ప్రధానయాజకులును, ప్రజల పెద్దలందరును యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి, తీసికొనిపోయి, అధిపతియైన పొంతిపిలాతునకు అప్పగించిరి. అప్పుడాయనను అప్పగించిన యూదా, ఆయనకు శిక్ష విధించబడగా చూచి, పశ్చాత్తాప పడి, ఆ ముప్పది వెండి నాణెములు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును మరల తెచ్చి- నేను నిరపరాధ రక్తమును (నీతిమంతుని రక్తమును) అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు-దానితో మాకేమి? నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి, పోయి ఉరిపెట్టుకొనెను." (అయితే ఉరి పోసుకున్నది ఎప్పుడు? ఎక్కడ? అనేవి యిక్కడ చర్చించబడలేదు. ఈ సందర్భంలో ప్రధానయాజకుల, పెద్దల చర్యలే వివరించబడ్డాయి! అలా యూదా పడవేసి పోయిన డబ్బుతో వారేమి చేశారు? అదే యిక్కడ చర్చించబడింది) “కాబట్టి వారు ఆలోచనచేసి వాటినిచ్చి, పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరివాని పొలము కొనిరి." (మత్తయి 27:1-8).

     ప్రధాన యాజకులు ఆ పొలాన్ని కొన్న తరువాత అతడు ఉరిపెట్టుకున్నాడో లేక అతడు ఉరిపెట్టుకున్న ప్రాంతంలోని పొలాన్నే వారు కొన్నారో తెలియదు. ఆ స్థలము హిన్నోము లోయకు సంబంధించినది. ఆ లోయలో నిలిచి పైకి చూస్తే, నిడివిగా నిలిచి ఎత్తుగానున్న రాళ్ళు, వాటి మధ్య ఎదుగుచుండిన చెట్ల భయంకరంగా కన్పిస్తూ ఉంటాయని చూచినవారు చెప్పుతున్నారు. ఆ చోటుకు పైగా నున్న ఆ చెట్లలో ఒకదానిపై యూదా ఉరిపెట్టుకొనియుండాలి. ఉరి పెట్టుకున్న ఆ చెట్టుమీద అతడెంతసేపు నిలిచాడో తెలియదు. అలా ఉరిపెట్టుకున్న తాడు తెగి అతడు క్రిందపడితే, నడిమికి పగిలి బ్రద్దలై పేగులన్నియు బయటికి వచ్చాయనడంలో వింత ఉండదు. లేఖనాల్లో ఈ విషయంపై పూర్తి వివరాలు దొరుకలేదు. వివరాలు దొరకనంత మాత్రాన వ్రాసినవి తప్పనడానికి ఎవనికి న్యాయ సమ్మతమైన హక్కు లేదు. అయితే ఒక మాట! వ్రాసినప్పుడు తమ శ్రోతల దృష్ట్యా వెవ్వేరు కోణాలలో గుండా ఒకే సంగతిని వివరించినందున తేడాలు కన్పిస్తాయి. వీటిని చూచి లేఖనాల్లో పరస్పర విరుద్ధాలున్నాయనడం అర్థ రహితం చేతగాని తనం.
52. ఎక్కడ వుండమని యేసు నిర్ణయం?
     మీరు పైనుండి శక్తి పొందువరకు (యెరూషలేము) పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను లూకా 24:9.

     మీరు యెరూషలేము నుండి వెళ్లక నావలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అపొ. 1:4.

     ఆయన మీ కంటె ముందుగా గలిలైయలోకి వెళ్లు చున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు చెప్పుడనెను. మార్కు 16:7.

     పదకొండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలైయలోని కొండకు వెళ్లిరి మత్త. 28:16. 

     గమనిక: ఇది కాల విలువ తెలియని వాడి కేకయే గాని, జ్ఞానికి వచ్చిన సమస్య కాదు. ప్రతిదానికి సమయముంది. గలిలయకు వెళ్లమని యేసు తన అపొస్తలులకు నిర్ణయించిన సమయం వేరు (మత్తయి 28:16; మార్కు 16:7); ఆయన వారిని యెరూషలేములోనే నిలిచియుండుడని ఆజ్ఞాపించిన సమయం వేరు (లూకా 24:49; అపొ. 1:4). అలాటప్పుడు - "ఎక్కడ ఉండమని యేసు నిర్ణయం?" అంటే అర్థమేమి? ఆయా సమయ సందర్భాలను జాగ్రత్తగా గుర్తించగలిగితే లేఖనాల్లో సమస్య ఎక్కడుంది?

     యేసు పునరుత్థానుడైన తరువాత మొదటిసారి తన శిష్యులను కలిసికొనుటకు ఆయన వారికి నిర్ణయించిన స్థలం గలిలయ కొండ (మత్తయి 28:16). గనుక ఆయన సిలువ వేయబడిన మూడవ రోజున కొందరు స్త్రీలు సమాధిని చూడ వచ్చారు గదా? ఆ వచ్చిన స్త్రీలకు దేవదూత యిలా తెలిపాడు - "కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురుతోను చెప్పుడనెను” (మార్కు 16:6-7).

ఈ సంగతులు యిలా మన మిత్రుని రచన్ను చదివినవారికి అర్థం కాకుండా పోవడానికి కారణమేమో తెలుసా? బైబిల్లో ఉన్నది ఉన్నట్లు కోట్ చేస్తే, చదివేవారికి సత్యం తెలిసిపోతుందని - సత్యాన్ని మభ్యపెట్టడానికి ఆయా సమయాల్లో బైబిలు లేఖనాలను అతడు సరిగా కోట్ చేయడు, తాను ఈ సమయంలో కోట్ చేసిన రూపంలో మార్కు 16:7ను చదువుతుంటే - ఎవరు? ఎవరితో? ఏమని? ఎందుకు చెప్పారు? అనే విషయములు తేటగా గ్రహించే వీలు లేకుండాపోయింది. వాస్తవాలను కప్పిపుచ్చేదేనేమో మన మిత్రుడు అంటున్న హేతువాదం!!

     మన మిత్రుని వాదం ఎలా ఉన్నా తమకు అందిన వర్తమానాన్ని బట్టి, అపొస్తలులు గలిలయ కొండకు వెళ్లారు. ప్రభువు వారిని అక్కడ కలుసుకున్నాడు, అయినా మొదటిసారే వారు ఆయన్ని చూచినప్పుడు పూర్ణంగా ఒప్పించబడలేదు; చూచారుగాని వారి సందేహం వారిని వదలలేదు (మత్తయి 28:16-17), గనుక ఆయన మృతులలోనుండి లేచిన తరువాత రమారమి 40 దినాలవరకు ఆయా సమయాల్లో స్థలాల్లో (ఆయన) వారికగపడుతూ, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుతూ; అనేక రుజువులను చూపి, వారికి తనను తాను సజీవునిగా కనుపరచుకొన్నాడు (అపొ. 1:3).

     దీని తరువాతనే కదా అపొ. 1:4 రావాలి? ఇవన్నీ జరిగిన తరువాత ఆయన ఆరోహణం కాకముందు - "ఆయన వారిని కలిసికొని యిలాగు ఆజ్ఞాపించెను. - మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్ధానం కొరకు కనిపెట్టుడి." అని వ్రాయబడింది. కలిసికొనేది - పునరుత్థానుడైన యేసును, కనిపెట్టేది - ఆరోహణుడైన యేసు పంపబోయే పరిశుద్ధాత్మ కొరకు!

     ఎక్కడ ఉండమని యేసు నిర్ణయమో, ఇప్పుడు తెలియలేదా? తెలియకపోతే మాల్లా చెప్పుతున్నా జాగ్రత్తగా గమనించు. పునరుత్థానుడైన తరువాత అపొస్తలులను తొలిగా కలిసికొనుటకు వారిని గలిలయలోని కొండయొద్ద “ఉండమని" యేసు నిర్ణయం! పునరుత్థానుడైన 40 దినాల తరువాత (పైనుండి శక్తిని) పొందునట్లు యెరూషలేములో ఉండమని యేసు నిర్ణయం (లూకా 24:49; అపొ. 1:4-5).

     లేఖనాలు చదివి ఈ సంగతులు తెలిసికొనడానికి పాండిత్యం అవసరం లేదు. సామాన్య జ్ఞానంతో, అక్షరాభ్యాసంగల ఎవడైనా తెలిసికోవచ్చు! అలాటప్పుడు బైబిలు లేఖనాలమీద మన మిత్రునికి యింత గొప్ప ప్రశ్న ఎందువలన వచ్చిందో చదువరి గ్రహించలేదా? ఇలాటి చొప్పదంటు ప్రశ్నలతో బైబిలును విమర్శించితే, దాన్ని జ్ఞానమని భ్రమించి, తల్లడిల్లడంలోనే మన మిత్రుని హేతువాదం యొక్క రహస్యముందేమో? బైబిల్లో మాత్రం సమస్య లేదు.
53. ఆరోహణ మెక్కడ?
     ఆయన బేతనియ వరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణ మాయెను లూకా. 24:50, 51.

     ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను.... అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. అపొ. 1:9-11.

     గమనిక: పై లేఖనాలను చదివిన తరువాత మన మిత్రునికి ఆరోహణమెక్కడ? "అనే ప్రశ్న వచ్చిందంటే? ఆయన చేసిన బహు గ్రంథావలోకనం, ఆయన బైబిలును అర్థం చేసుకొన్నవిధానం బయటపడి పోయింది. మన మిత్రుడు చేసిన బహు గ్రంథావలోకనం అలా ఉంచి, అసలు అతడు బైబిలు చదవడానికి చేతగానివాడని పదే పదే రుజువు చేసికొన్నాడు, అదెలాగో జాగ్రత్తగా చూడు!

     మన మిత్రుడు తన ప్రశ్న కొరకు కోట్ చేసిన రెండు లేఖన భాగాలు లూకా అనే ఒకని కలంనుండి వచ్చినవే (లూకా 1:1-3; అపొ. 1:1-3లను చూడు). బైబిలును విమర్శించిన మన మిత్రుడు బ్రహ్మం, "32 మూగవాడి కేక"లో అసంబద్ధంలో పడ్డాడు గాని, లూకా సువార్త, అపొస్తలుల కార్యములు అనే రచనలను వ్రాసిన లూకా, అలాటి అసంబద్ధాల్లో పడలేదు. లూకాకు తాను మాట్లాడుతున్న స్థలాలను గూర్చి బాగా తెలుసు.

     లూకా 19:29లో చూడు. లూకా పై రెండు స్థలాలను గూర్చి యిలా ఒక్కచోటే సూచించాడు - "ఆయన (యేసు) ఒలీవల కొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యులనిద్దరిని పిలిచి." బేతనియ గ్రామం యెక్కడ ఉందట? ఒలీవల కొండ దగ్గరట. రైట్? ఈ సంగతి తెలియనివాడు ఏ మాత్రపు హేతువాదో! సరే ఆయన పాండిత్యాన్ని అక్కడుంచి, బైబిలు చూడు.

     వాస్తవంగా ఒలీవల కొండ చరియలో 'బేతనియ” అనే గ్రామముంది, అది యెరూషలేమునకు రెండు మైళ్ల దూరంలో ఉంది (యోహాను 11:18). అది లాజరు మరియ, మార్త అనేవారి గ్రామం (యోహాను 11:1). యేసుకు విందుచేసిన కుష్టురోగియైన సీమోను కూడా బేతనియవాడే (మత్తయి 26:6). అక్కడ విందులో ఆయన మరలా కన్పిస్తాడు (యోహాను 12:1-3).

     యేసు యెరూషలేములో పని చేస్తే ఆయన ఒలీవకొండ యొద్దనున్న బేతనియలో సాధారణంగా బస చేస్తూ ఉండేవాడు (మత్తయి 21:17, 26:6; మార్కు 11:11). పట్టణపు రద్దీనుండి, బేతనియ గ్రామీణ వాతావరణంనుండి తప్పించుకొని, ఆ కొండమీద తన శిష్యులతో కూర్చుండడం ప్రభువుకు వాడుకగా ఉన్నట్టు కన్పిస్తుంది. పైగా ఆ కొండమీదికి ఎక్కికూర్చుంటే, యెరూషలేము దేవాలయపు కట్టడాలు తేటగా కన్పిస్తాయి (మార్కు 13:3; మత్తయి 24:3).

     యేసు తన శిష్యులతో వాడుకగా వెళ్లే స్థలం - ఒలీవల కొండ (లూకా 22:39) గనుక ఆయన ఆ కొండపైనుండి ఆరోహణుడయ్యాడనటంలో వింత లేదు (అపొ. 1:9- 12). ఆయన అక్కడ ఆరోహణుడయ్యాడంటే, యెరూషలేమునుండి తన శిష్యులను బేతనియవరకు తీసుకొనిపోయాడని అర్థం. అక్కడ వారి మధ్యనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడయ్యాడంటే - ప్రశ్నకు తావుగాని, అర్థంగాని లేదు. గనుక ఆరోహణం సత్యమేనని తేలిపోయింది.
54. ఇంతకూ చెప్పారా, లేదా?
     వారు బయటికి వచ్చి వణకును, విస్మయమును పట్టినవారై సమాధి యొద్దనుండి పారిపోయిరి. వారు భయపడినందున యెవనితోను మేమియు చెప్పలేదు. మార్కు 16:8.

     అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదకొండుగురు శిష్యులకును తనవారి కందరికిని
తెలియజేసిరి. లూకా 24:8, 9.

     గమనిక: పై లేఖనాలను పరిశీలించి, వాటిలో యిలాటి ప్రశ్నకు తావుందో లేదో అనే ఆలోచన లేకుండానే మన మిత్రుడు ప్రశ్నించాడు. “అడిగేవానికి చెప్పేవాడు లోకువ" అన్నట్టు, ఏదో ఓ ప్రశ్న వేయాలి అనే భావంతోనే మన మిత్రుడు ప్రశ్నించినట్టున్నాడు గాని, జ్ఞానయుక్తమైన పండితునిలా అతడు ప్రశ్నించలేదు, అందులో అసంబద్ధమనే తన ప్రయోగానికి యిక్కడ అర్థమే లేదు.

     యేసు సమాధిని చూడవచ్చిన ఆ స్త్రీలకు కలిగిన రెండు రకాలైన మానసిక స్థితులూ, అట్టి మానసిక స్థితుల్లో వారు చేసిన పనులు, పై లేఖనాల్లో వివరించబడ్డాయి. గనుక ఏ మానసిక స్థితిలో ఉన్నప్పుడు వారు చెప్పలే దు, ఏ పరిస్థితిలో వారు చెప్పారు? అని విమర్శనాత్మకంగా సంగతులు ఆలోచిస్తే యిక్కడ సమస్య తీరిపోతుంది. ఇలాటి విమర్శనాత్మకమైన పరిశీలన చేయకపోవటమే హేతువాదమేమో! ఏదియేమైనా, మన పాయింటుకు పోదాం.

     వారి "గురువు" ఘోరంగా చిత్ర హింసలతో చంపబడి, సిలువ గాయాలతో సమాధి చేయబడి, రెండు రోజులు దాటిపోయి, మూడవ దినమయ్యింది. ఆరోజు ఆయన మృత దేహానికి వారు సుగంధ ద్రవ్యాలు పూయ తలపెట్టినట్టున్నారు. అయితే సమాధి ముందు ఎంతో పెద్ద రాయి! దాన్ని ఎవరైనా పొర్లించితేగాని వారు చేయనుద్దేశించిన పనిని చేయ వల్లపడదు. పైగా వారు శవంగా ఉన్నవాని కొరకే సిద్ధపడి వచ్చారు గాని, పునరుత్థానుడైన యేసుకొరకు తమ మనస్సులను సిద్ధం చేసికొని రాలేదు! అది ఆ స్త్రీల మొదటి పరిస్థితి అర్థమయ్యిందా?

     అయినా వారు వచ్చేసరికి సమాధి ముఖ ద్వారమునుండి రాయి పొర్లింపబడియుంది, గనుక కొండలోనికి తొలవబడిన సమాధిలోనికి వారు నడిచిపోగలిగారు. పోయి చూస్తే వారు వెదుకుతున్న యేసు యొక్క మృతదేహం అందులో లేదు. అయితే తాము ఎదురు చూడని మరోవ్యక్తి కనబడ్డాడు. దానితో ఆ స్త్రీలకు కలవరం కలిగింది. పైగా అతడు వారితో మాటలాడ మొదలుపెట్టాడు. దానితో వారు సమాధిలోనుండి బయటికి వచ్చి వణకుచు విస్మయమొంది సమాధియొద్దనుండి పారిపోయారు. ఆ పరిస్థితిలో వారు భయపడినందున యెవనితో యేమియు చెప్పలేదు. అయితే వారి భయము, వణకు (గుండె దడ) తగ్గిన తరువాత యెవనితో ఏదియు చెప్పలేదని దాని భావం కాదు. వారి భీతి అణగింది. తాము చూచిన, విన్న సంగతులను గూర్చి ఆలోచించారు. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని, సమాధి యొద్దనుండి వెళ్లిన తరువాత (ఎంత సమయం తరువాతనో?)"యీ సంగతులన్నియు పదకొండుగురు శిష్యులకును,” తనవారి కందరికిని తెలియజేశారు.

     పై లేఖనాల్లో పరస్పర వైరుధ్య మెక్కడుందో యిప్పుడు చెప్పు చూద్దాం! అయినా, ఎలావుంటే ఒక విషయం పరస్పర విరుద్ధమౌతుందో మన మిత్రునికి అసలు తెలియనే తెలియనట్టుంది. అందుకే ప్రతి చిన్న విషయంలో అసంబద్ధముందని తేలిగ్గా అన్నాడు. అయినా తెలియనివన్నియు తప్పులని పలుకదగునా?
55. యేసు పునరుత్థానానికి ఆధారాలు!
     ఆదివారమున (సిలువ వేసిన మరుసటి దినమున) యింక చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియు పెందలకడ లేచి సమాధి యొద్దకు వచ్చి సమాధిమీద ఉండిన రాయి తీయబడి యుండుట చూచెను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకును వచ్చి - ప్రభువును సమాధిలోనుండి యెత్తుకుని పోయిరి. ఆయనను యెక్కడ వుంచిరో యెరుగమని చెప్పెను . . . . . అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి యోహా. 20:1-9.

     ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను, ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చుచుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియజేసెను. కాని ఆయన బ్రతికియున్నాడనియు, ఆమెకు కనబడెననియు వారు విని నమ్మకపోయిరి. మార్కు 16 9-11.

     ఆయన యింక గలిలైయలో నున్నప్పుడు - మనుష్య కుమారుడు పాపిష్ణులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి యున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదకొండుగురు శిష్యులకును, తక్కిన వారికందరికిని తెలియజేసిరి. ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా - మగ్దలేనే మరియయు, యోహాన్నయు, యాకోబు తల్లియైన మరియయు, వారితోకూడనున్న ఇతర స్త్రీలును లూకా 24:6-10. (ఇంకా చూడు; మత్త. 20; 19; 27, 63, 64; మార్కు 8:3;10 34 లూకా. 18:32-34; 1 కొరిం. 15: 4-6).

     గమనిక: యేసు పునరుత్థాన ఆధారాలకు ఏ సమస్యా లేదు, అవి నమ్మదగినవిగానే ఉన్నాయ్. అయితే మన మిత్రుడు ఆ లేఖనాలతో గారడి చేయబూను కొని వాటిలో సమస్య ఉన్నదంటున్నాడే గాని నిజానికి సమస్య లేఖనాల్లో లేదు. మొదట ఆ లేఖనాలను మన మిత్రుడు ఎలా గారడీ చేశాడో చూడు! ఆ తరువాత పునరుత్థాన రుజువులను పరిశీలిద్దాం.

     "ఆదివారమున" అని బైబిలునుండి కోట్ చేసి, దానికి తన భావాన్ని బ్రాకెట్లలో "సిలువవేసిన మరుసటి దినమున" అని మన మిత్రుడు చెప్పాడు; కాని, ఆ భావం బైబిలునుండి వచ్చింది కాదు. అది మన మిత్రుని కల్పనా కథ మాత్రమే! అది నీకు తెలుసా? (యోహాను 19:31, 42 చూడు). తెలియకపోతే బైబిలును తెరిచి చూడు. అయినా ఇలా లేని మాటలు కల్పించేది హేతువాదమే నంటావా? మన మిత్రుడు నిజంగానే హేతువాదియై ఉంటే బైబిలువంటి గ్రంథాన్ని విమర్శించేటప్పుడు యిలాటి నీచమైన పనికి దిగియుండడానికి వీల్లేదు.

     దాన్ని అలా ఉంచి, తాను చూపిన చివరి కొటేషన్ కు (లూకా 24:6-10) వద్దాం. హేతువాది ఎవడైనా సత్యాన్ని కప్పిపుచ్చడానికి చూస్తాడా? అయితే, లూకా24లో 1నుండి 5 వచనాలను వదలి, మన మిత్రుడు 6నుండి 10వరకు మాత్రమే కోట్ చేశాడేం? అంతకు ముందునుండి చదివితే సత్యం బయటపడుతుందనా? ఏమి? పోనీ, తాను కోట్ చేసినట్టు చెప్పుకున్న లూకా 24:6నైనా మన మిత్రుడు సరిగా కోట్ చేశాడనుకుంటావేమో! లేదు సుమీ! లేదు! అందుకే చివరి కొటేషన్ యొక్క ప్రారంభం అర్థరహితంగా ఉండిపోయింది. ఈ గారడీ పనులవలన విజ్ఞానాన్ని ఏమి చేయాలనో? గ్రంథంతో పరిచయంలేని జనులను ఏమి చేయాలనో? అసలు యిలాటి పనులవలన మన మిత్రుడు సాధింప తలపెట్టింది ఏమో! ఏదియేమైనా, పునరుత్థానానికి నమ్మదగిన ఆధారాలున్నాయి; చూడు.

     1. పూర్వచరిత్ర: చట్టప్రకారం ఒకని శిక్షించడం వేరు; ద్వేషాన్నిబట్టి ఒకని హింసించి చంపడం వేరు. నజరేయుడగు యేసు సిలువవేయబడిన ఆ రోజున ఈ తారతమ్యం తేటగా కన్పిస్తుంది. ఆయనతోపాటు సిలువవేయబడినవారేమో చట్ట ప్రకారం శిక్షింప బడ్డారు కాని, నజరేయుడగు యేసైతే పాతాళమంత కఠోరమైన ఈర్ష్యతో సిలువ వేయబడ్డాడు. సిలువ మరణమే నీచమైన, ఘోరమైన మరణమైతే, అది పూర్ణమైన ద్వేషంతో, తీరని పగతో విధించినప్పుడు, దాని ననుభవించేవాడు పొందే వేదనకు, అవమానానికి హద్దుండదు. అలా సిలువ వేయబడిన నజరేయుడగు యేసు పక్షాన నిలవడానికి తనను ప్రేమించిన శిష్యులే భీతిల్లిన సమయమది. కడకు యేసు సిలువలో మరణించాడు.

     యూదుల ఆచారాన్నిబట్టి ఆయన మృతదేహాన్ని సమాధి చేయాలి కదూ, అయినా దీనికి ఆయన అపొస్తలులుగాని, బంధు జనంగాని పూనుకొన్నట్టు లేదు. అరిమతయియ అనే యూదుల పట్టణానికి చెందిన యోసేపు యేసు శిష్యుల్లో ఒకడు. అతడు ధనవంతుడు, ఘనత వహించినవాడు. గనుక అతడు తెగించి సమాధి చేయడానికై యేసు దేహాన్ని తనకిమ్మని రోమా అధిపతియైన పిలాతునడిగాడు. పిలాతు యేసు మృతదేహాన్నియోసేపుకు అప్పగించాడు (మార్కు 15:43-45) యూదులు పాతిపెట్టే మర్యాద చొప్పున నీకొదేము తెచ్చిన సుగంధ ద్రవ్యాలను యేసు దేహానికి పూసి, నారబట్టలు చుట్టారు. ఆయన సిలువ వేయబడిన స్థలానికి సమీపంలో యోసేపు తనకొరకు తొలిపించుకొన్న క్రొత్త సమాధి ఉంది. ఆ సమాధిలో యేసు మృతదేహాన్నిఉంచి, పెద్ద రాయితో దాన్నిమూసారు (యోహాను 19:38–42; మత్తయి 27:57-60), ఇది ఆయన శిష్యులు చేసిన పని. అయితే ఆయన అపొస్తలులకు ఈ కార్యక్రమంతో ఎంతవరకు సంబంధముందో సరిగా తెలియదు.

     శత్రుత్వాన్ని వహించిన యూదా మతనాయకులైతే "యేసు” అనే వ్యక్తిని లయపరచ డానికి చేసినది చాలదన్నట్లు, వారు ఆయన మాటలను సహా వ్యర్థపరచగోరారు! గనుక వారు పిలాతునొద్దకు వచ్చి - "అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి మూడవ దినమువరకు సమాధిని భద్రముచేయ నాజ్ఞాపించుము; వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొనిపోయి -ఆయన మృతులలోనుండి లేచెనని ప్రజలతో చెప్పుదురేమో; అప్పుడు మొదటి వంచనకంటె కడపటి వంచన మరి చెడ్డదై యుండునని చెప్పిరి. అందుకు పిలాతు- కావలివారున్నారుగదా మీరువెళ్లి మీచేతనైనంతమట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్లి కావలివారిని కూడ ఉంచుకొని రాతికి ముద్రవేసి సమాధిని భద్రము చేసిరి" (మత్తయి 27:63–66). 

     2. ఖాళీ సమాధి: కనీసం మూడు రోజులుపాటైనా యేసు మృతదేహాన్ని సమాధిలో బంధించి ఉంచాలని, ఆయన శత్రువులు సమకట్టారు గనుక రోమా అధిపతి ఉత్తరువు తోనూ, రోమా సైనికుల సహకారంతోనూ యూదా మత నాయకులు ఈ పనికి పూనుకొన్నారు. పోతే, జరిగిన ఏర్పాట్లు ఎంత జాగ్రత్తగా ఉన్నాయో మరొకసారి చూడు! కొండలోనికి తొలిచిన సమాధి; సమాధిలో యేసు దేహం; దానిపై పొర్లింపబడిన గొప్ప రాయి; దానిమీద కైసరు ముద్ర; దానిముందు రోమా సైనికుల కావలి; ఆ సమాధిని కదిలించ గలవాడు లోకంలో ఉన్నాడా? దానిని తాక తెగించినవాడు ఆ రోమా సైనికులను నిర్వీర్యులనుగా చేయాలి! సమాధిని ముద్రించిన రోమా ఆధిపత్యాన్ని ఎదిరించగలవాడై ఉండాలి! గనుక యేసు మృతదేహం ఆనాటితో సమాధిలో శాశ్వతంగా బంధింపబడినట్టే అయ్యింది.

    అయితే మూడవనాటికి ఆ సమాధి తెరువబడినదనీ, యేసు శిష్యులలో యిద్దరు వెళ్లి ఖాళీ సమాధిలో ప్రవేశించి యేసు మృతదేహాన్ని అందులో కానలేకపోయారనీ మన మిత్రుడు అంగీకారంతో కోట్ చేశాడు, యోహాను 20:1-9 చూడు. అయితే అంతగా బందోబస్తు చేసిన సమాధిని మూడవనాటికే తెరచిందెవరు? పైగా తెరువబడిన సమాధిలో యేసు దేహం లేదే! అది ఏమైనట్టు? యేసు తాను చెప్పినట్టు పునరుత్థానుడు కాలేదనుకో, ఆయన మృతదేహమైనా ఉండాలిగదా? అది సమాధిలో లేకపోతే ఎవరో (కొందరు) ఆయన మృతదేహాన్ని తీసికొనిపోయే ఉండాలి. అయితే దాని తీసుకొనిపోయిందెవరు? శత్రువులా? శిష్యులా?

     యేసు మృతదేహాన్ని సమాధిలో బిగించి, ఆయన మూడవ దినమున లేస్తాడన్న మాటలను నిరర్ధకం చేయబూని, దానికై సమస్త ప్రయత్నాలు చేసిన శత్రువులే ఆయన మృతదేహాన్ని సమాధిలోనుండి తీసి ఉంటారా? అలా తీసి ఉంటారనేది మతిహీనమైన వాదనగా కన్పిస్తుంది. ఒకవేళ ఆయన మృతులలోనుండి లేచాడని ఎవడైనా చెప్పబూనుకుంటే, అట్టివాని నోరు మూయించాలనే ఉద్దేశంతో ఆయన శత్రువులే దానిని తీసివుంటే - యేసు పునరుత్థానాన్ని గూర్చి ఆయన అపొస్తలులు జనులతో మాటలాడినప్పుడు (అపొ. 2:20-25), దానిని వారికి చూపి, పునరుత్థాన వార్తలను శాశ్వతంగా నిరర్ధకం చేయగలిగియుండేవారే కదూ? కాని పునరుత్థాన ప్రకటనకు విరోధంగా వారియొద్ద ఏ రుజువూ లేదు. పైగా యేసు పునరుత్థాన వార్త వారికి (ఆయన శత్రువులకు) తీరని సమస్యగా మిగిలిపోయింది (అపొ. 4:1-20). 

     సరే! ఆ సమాధిలోనుండి యేసు మృతదేహాన్ని ఆయన శత్రువులు తీసికొనిపోలేదను కుందాం. మరి ఖాళీ సమాధికి సమాధానమేమి? ఆయన పునరుత్థానుడు కాకపోతే మిగిలింది ఒకే సమాధానం. అదేమంటే ఆయన మృతదేహాన్ని ఆయన శిష్యులైనా ఎత్తుకొనిపోయి ఉండాలి. ఆ సమాధిని ఎంత భద్రం చేయాలో అంతగా భద్రం చేశారుగదా? అది ఏమైనాసరే, ఆయన శిష్యులే ఆ మృతదేహాన్ని ఎత్తుకొనిపోయి ఉంటారా? అలా జరుగుతూ ఉంటే, అక్కడున్న కావలివారు ఎలా చూస్తూ ఊరుకున్నారో!?

     రోమా సైనికుల కావలిలో ఉంచబడిందేదీ అంత తేలిగ్గా పోయే అవకాశం లేదు. ఎందుకంటే తాము కాస్తున్నది తమ ప్రాణంతో సమానం గనుక ఎవడైనా రోమా సైనికుల కావలిలో ఉంచినదాన్ని అపహరించాలన్నా లేక వారి కావలిలో ఉన్న ఎవడైనా తప్పించుకుపోవాలన్నా ఆ కావలివారి ప్రాణాలుపోతేనే సాధారణంగా అది వీలౌతుంది. ఎందుకంటే తనకప్పగింపబడిన దానిని కాపాడలేని కావలివానికి మరణదండనే విధింపబడుతుంది (అపొ. 12:18-19; 16:23-27 చూడు). 

     ఇలాటి సందర్భాల్లో అవమానకరంగా అధికారులచేత చంపబడకుండునట్టు కావలి వారు తమ్మును తామే పొడుకుకొని చస్తారు. గనుక రోమా కావలివారు అప్రమత్తులై అశ్రద్ధగా ఉండడం అసంభవం, పైగా వారికప్పగించినవాటిని దోచుకోడానికి ఎవ్వరూ తెగించరు. ఎవరైనా ఒకవేళ తెగించితే ఆ సైనికులు బ్రతికి ఉన్నంతవరకు పోరు చేస్తారు, అలా చేయలేని పక్షంలో తాము ఎదిర్కొంటున్న పరిస్థితులను వారు అధికారులకు తెలియజేస్తారు. అవి అక్కడున్న పరిస్థితులు (మత్తయి 28:1-11). 

     పరిస్థితులు అలా ఉండగా, రోమా సైనికులతో యుద్ధము చేసి వారిని జయించే శక్తి యేసు శిష్యులకుందా? ఒకవేళ ఉందే అనుకో! అయినా అంతగా శ్రమపడి యేసు మృతదేహాన్ని తీసికొనిపోయి దానిని వారేమి చేసికొంటారు? పోనీ అలా పోరాడనవసరం లేకుండానే, రోమా సైనికులు నిద్రపోయే సమయాన్ని కనిపెట్టి, అప్పుడే ఆయన శిష్యులు వచ్చి ఆయన మృతదేహాన్ని సమాధిలోనుండి తీసికొనిపోయారే అనుకుందాం, అలా జరిగివుంటే, అక్కడ ఉంచబడిన కావలివారికి మరణ శిక్ష విధింపవలసి ఉంటుంది గదా? నిర్దోషియని రోమా అధిపతియైన పిలాతు ఎరిగిన యేసునే సిలువ వేయించ గలిగిన యూదులు, ఆయన మృతదేహాన్ని కాపాడలేని సైనికులను ఊరకే ఎందుకు వదలిపెడతారు? గనుక యేసు శిష్యులు ఆయన మృతదేహాన్ని ఆ సమాధినుండి తీసికొనిపోలేదని తేలిపోతుంది. 

     ఇటు శత్రువులుగాని, అటు శిష్యులుగాని యేసు మృతదేహాన్ని సమాధిలోనుండి తీసికొని వెళ్లకపోతే, ఆ ఖాళీ సమాధి "యేసు దేహమెక్కడ?" అని అడుగుతున్నట్టుంది. దానికి సమాధానమేమి? దానికి ఒక్కటే సమాధానం - అది పేతురు నోటినుండి వచ్చింది. .... దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానముననుసరించి వారు యేసును సిలువ వేయించి చంపారు. “మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను" (అపొ. 2:22-24). 

     దానికొరకు దేవుడు తన దూతను పంపాడు. “-ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి, రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను; అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలె నుండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి-మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును; ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి.” అనెను (మత్తయి 28:2-7).

    “వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచనచేసి ఆ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి -మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని మీరు చెప్పుడి; ఇది అధిపతి చెవినిపడిన యెడల మేమతని సమ్మతిపరచి మీకేమియు తొందరకలుగకుండ చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడినప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది" (మత్తయి 28:11-15 చూడు) మరి దీనికి మన మిత్రుడు యిప్పుడు ఏమంటాడో! ఇది పునరుత్థానానికి రుజువు కాదా? అది చాలదనుకుంటే ఇంకా చూడు!

     3. అపొస్తలుల మార్పు: ప్రభువు తన అపొస్తలులతో జీవించిన దినాల్లో - తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను, ప్రధాన యాజకులచేతను ఉపేక్షింపబడి, చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని వారికి పలుమార్లు తెలిపాడు (మత్తయి 20:19; మార్కు 8:31; లూకా 18:31–33). ఆలాటి ఒక సందర్భంలోనైతే - అది ఎన్నటికి జరుగకూడదని పేతురు ప్రభువును గద్దించాడు కూడా (మత్తయి 16:20-23). అంటే అప్పటిలో యేసు మరణ, సమాధి, పునరుత్థానాల అవసరతను వారు గుర్తించలేదన్న మాట! పైగా వారు కేవలం తమ బోధకునిబట్టి అతిశయిస్తూ, ఆయన రాజ్యంలో ఎవడు గొప్పవాడైయుంటాడో అనే తగవులు తంటాలు పడుతూ ఉండేవారు (మత్తయి 18:1- 4). రోమా సామ్రాజ్యపు దాస్యంనుండి ఇశ్రాయేలీయులను విమోచించువాడు ఆయనేననీ (లూకా 24:21); ఆయన వారికి రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని వారికి నమ్మకం ఉండేది (అపొ. 1:3).

     అయితే ఆయన మరణం వారి ఆశలన్నిటిని అణగార్చింది. ఆయన్ను వెంబడించి నప్పుడున్న వారి ధైర్యం, ఉత్సాహం, భీతిగా మారిపోయింది. మృతులను బ్రతికించిన యేసే హీనమైన చావు చస్తే, వారివలన యింకా ఏమౌతుంది? వారి త్యాగానికి అర్థమేముంది? అన్నట్టు వారు భావించారు. నిరాశ, భయం వారిని చుట్టుకొన్నాయ్. దుఃఖం, ఏడ్పు వారిని అలుముకొన్నాయ్. ఒకప్పుడు జన సమూహంలో తల ఎత్తికొని తిరిగిన అపొస్తలులే ఆయన మరణంతో చాటున దాగుకొన ప్రయత్నించారు (మార్కు 16:10-11; లూకా 24:21-22; యోహాను 20:19). అయినా ఆ స్థితిలో వారు ఎక్కువ కాలం గడపలేదు.

     అయితే యేసు మృతిపొందిన మూడవ దినమున - కదలిక లేని నీటి మడుగులో రాతి వేతవలన కలకలలు ప్రారంభమైనట్టు, స్తంభించియుండిన యూదుల వాతావరణంలో మరల కలవరాలు ప్రారంభమయ్యాయ్, ఆదివారం పెందలకడ సమాధియొద్దకు వచ్చిన కొందరు స్త్రీలు - యేసు మృతులలోనుండి లేచాడని చెప్పారు కాని, ఆయన బ్రతికి యున్నాడని, ఆయన వారికి కనబడ్డాడని ఆయన అపొస్తలులే నమ్మలేకపోయారు (మార్కు 16:9-11) పేతురు యోహానులు ఆ స్త్రీల మాటలను బట్టి సమాధినొద్దకు వెళ్లారు గాని ఆ సమాధిలో ఆయన ప్రేతవస్త్రాలే తప్ప మరేమీ వారికి కన్పించలేదు (యోహాను 20:1-9). ఇకను ఎటూ తోచనివారై తమ బసకు వారు చేరుకొన్నట్టున్నారు.

     యేసు శిష్యులలో యిద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్లారు. మార్గంలో యేసు వారిని కలిసికొన్నాడు. అయితే వారు మొదట ఆయనును బాటసారి అని భావించి సంభాషించారు. చివరకు వారాయనను గుర్తుపట్టారు. ఆ తరువాత ఆయన వారిని విడిచిపోయాడు (లూకా 24:13-30). వెంటనే వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు. ఆ సమయానికి, ఆయన పదునొకండుగురు అపొస్తలులూ, వారితోనున్నవారు కూడివచ్చి - ప్రభువు నిజంగా లేచి పేతురుకు కనబడినట్టు చెప్పుకొంటున్నారు. వీరు అది విని త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకెలాగు తెలియబడెనో అదియు తెలియజేశారు; గాని వారు వీరి మాటలనైనను నమ్మలేకపోయారు (లూకా 24:31-32; మార్కు 16:12-13). 

     “వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి-మీకు సమాధాన మవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతము (ఆత్మ) తమకు కనబడెనని తలంచిరి. అప్పుడాయన - మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేల? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి, నా కున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమున కుండవని చెప్పి, తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషముచేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఇక్కడ మీయొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చిరి. ఆయన దానిని తీసికొని వారియెదుట భుజించెను ." (లూకా 24:36-43).

     ఆలాగున "ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారికగపడుచు, దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను (రుజువులను) చూపి, వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను" (అపొ. 1:3). “కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు - ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన - కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనియున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు. అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను" (అపొ. 1:6-9). 

     రుజువుపరచబడిన పునరుత్థాన వాస్తవం అపొస్తలుల విశ్వాసాన్ని వారి నిరీక్షణను, వారి దృక్పథాన్ని వారి పరిచర్యను పూర్తిగా మార్చివేసింది. అప్పటినుండి క్రీస్తు యొక్క అపొస్తలులు సమస్త విషయాలలో మార్పు చెందిన వ్యక్తులుగా కన్పిస్తారు. మారిన జీవిత విశ్వాసంలోను, మాదిరిలోను జనులను నడిపించడానికి వారు పూనుకుంటారు. ఈ మార్పును వివరించే వారి చరిత్ర, పునరుత్థానాన్ని సుస్థిరంగా రుజువు చేస్తుంది చూడు.

     పస్కాపండుగ సమయంలో యేసును సిలువ వేయించిన యూదులు, 50 దినాల తరువాత, ప్రథమ ఫలముల పండుగ నాచరించడానికి తిరిగి యెరూషలేము వచ్చి చేరుకుంటారు (అపొ. 2:5). ఈ మధ్య కాలంలో యేసు పునరుత్థాన రుజువులచేత దృఢపరచబడిన అపొస్తలులు, ప్రభువు యొక్క ఆజ్ఞను బట్టి పరిశుద్ధాత్మ కొరకు ఆ పట్టణంలోనే వేచియుంటారు (అపొ. 1:3-4; లూకా 24:49). పెంతెకొస్తు (50వ) దినమున బలముగా వీచు గాలివంటి శబ్దంలా పరిశుద్ధాత్మ పరలోకంనుండి దిగి అపొస్తలులు కూడియున్న యింటికే వస్తాడు.

     ఎన్నడూ చూడని వారి యిండ్ల మీదుగా విమానం పయనించి, వాటికి సమీపంలోనే అది దిగితే, అక్కడున్న జనుల ఆసక్తిని అది ఎలా ఆకర్షిస్తుందో, అలాగే పరిశుద్ధాత్మ యొక్క రాక యెరూషలేములోని జనులను ఆకర్షించింది. వేలాదిమంది జనులు అపొస్తలులున్న చోటుకే కూడివచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఆ పదునొకరితో కూడ పేతురు లేచి నిలిచి, యేసు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలను గూర్చి బోధించాడు (అపొ. 2:3).

     ఇప్పుడు మన ప్రశ్నలేమంటే:
     1. పస్కాపండుగ దినాల్లో, యేసు యింకను సజీవుడుగనే ఉన్నప్పుడు - ఆ రాత్రి చలిమంట వద్ద కొద్దిమంది ముందు యేసును ఎరుగనని ఒట్టుపెట్టుకొన్నపేతురు (మార్కు 14:68-70), యేసు మృతిపొందిన 50 దినాలకు, ఆయనను సిలువ వేయించి చంపిన వేలాదిమంది జనుల మధ్య నిలిచి - ఆయన్ను గూర్చి బోధించే ధైర్యం ఎక్కడనుండి వచ్చింది? (అపొ. 2:22-24). 

     2. యేసు పునరుత్థానుడైన తొలి దినాన, ఆయన మృతులలోనుండి లేచి తమకు కన్పించాడని చెప్పిన స్త్రీల మాటలను నమ్మక, స్వయంగా వెళ్లి యేసు సమాధి ఖాళీగా ఉన్నట్టు చూచియు ఆయన మాటలనుగాని పునరుత్థాన లేఖనాలను గాని గ్రహింపలేని పేతురు - ఆరోజు వారి మధ్య నిలిచి లేఖనాలను కోట్ చేస్తు వాటిని వివరించే జ్ఞానం, "ఆయన పునరుత్థానానికి మేము సాక్షులం"  అని చెప్పే ధీమా ఎక్కడనుండి వచ్చింది (అపొ. 2:25-32)? పైగా అతడు ప్రకటించిన వర్తమానాన్ని అంగీకరించి 3000 మంది క్రీస్తు శిష్యులైరే, అది పునరుత్థానానికి రుజువు కాదా? (అపొ. 2:38–42)

     3. అపొస్తలుల సూచక క్రియలు: యేసు మృతులలోనుండి లేచి ప్రత్యక్షమౌతున్న తొలి దినాల్లో ఆయన్ను చూస్తూ కూడా నమ్మక యింకా సందేహిస్తున్న అపొస్తలులనుద్దేశించి - “నమ్మినవారివలన ఈ సూచక క్రియలు కనబడునని" ప్రభువు వాగ్దానం చేశాడు (మార్కు 16:9-18) మొదట్లో సందేహించినా, ఆయా సమయాల్లో కన్నులారా చూచి, నిదానించి కనుగొని, చేతులతో తాకి చూచి సందేహాలను పూర్తిగా తీర్చుకొని, పునరుత్థానానికి సాక్షులైనవారిలో పేతురు యోహానులిద్దరు దేవాలయానికి వెళ్లారు. అక్కడ ద్వారమునొద్ద వాడుకగా కూర్చుండి భిక్షమడుగుకొనే కుంటివానిని యేసు నామమున వారు నడిపించారు. దానిని చూచి విస్మయమొంది జనులు వారి చుట్టు మూగారు! పేతురు యోహానులు యేసును గూర్చి వారితో మాటలాడారు (అపొ. 3:) యేసును సిలువవేయించి, సమాధిని భద్రం చేయించిన అధికారులకు కూడా అది తెలిసింది.

     "వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును, వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి; వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య యించు మించు అయిదు వేలు ఆయెను" (అపొ. 4:1-4). 

     మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నా, కయపయు, యోహానును అలెక్సంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరును వారితో కూడియుండిరి. వారు పేతురును యోహానును మధ్య నిలువబెట్టి - "మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను - ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్భలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక, మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు అనెను? (అపొ. 4:11).

     “వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని (సామాన్యులని) గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు - సభ వెలుపలికి పొండని వారి కాజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి - ఈ మనుష్యులను మనమేమి చేయదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్నవారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము, అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై - ఇక మీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదురుపెట్టవలెనని చెప్పుకొనిరి" (అపొ. 4:13-17). 

     “అప్పుడు వారిని పిలిపించి - మీరు యేసు నామమును బట్టి యెంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి - దేవుని మాట వినుటకంటె మీమాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి" (అపొ. 4:18–20; ఇంకా చూడు 5:17-18, 28, 30; 1 కొరింథీ. 15:5-8).

     పునరుత్థానం లేదని చూపడానికి మన మిత్రుడు చేసిన ప్రయత్నంలో, తాను చూపిన అపొస్తలుల స్థితికీ (యోహాను 20:1-9; 16:9-11), ఆ తరువాత వారి జీవిత విధానానికీ మధ్య వ్యత్యాసానికి కారణం - పునరుత్థానమే! యేసు పలుమారులు వారికి ప్రత్యక్షమై ఆయన తన పునరుత్థాన రుజువులతో వారిని ఒప్పించి దృఢపరచినందుననే వారి జీవితాల్లో యిలాటి ఆశ్చర్యమైన మార్పు కలిగింది. ఇంకా అనేక ఉదాహరణలను మనం చూడవచ్చు గాని విచక్షణా జ్ఞానంతో ఆలోచించేవారికి యివి సరిపోతాయి గనుక వీటిని నిలుపుతున్నా!

     కొందరు దుర్నీతిచేత సత్యాన్నిఅడ్డగిస్తారు (రోమా 1:18–25) తాము నమ్మినవాటికి విరోధంగా వాస్తవాలు ఎదురైనప్పుడు, అలాటివారు తమ నమ్మకాలను మార్చుకొనడానికి బదులు వాస్తవాలను దాచిపెట్టడానికి పూనుకొంటారు. గనుక ఎన్ని రుజువులు చూపినా ప్రయోజనముండదు. ఈ సందర్భంలోనే అలాటి వ్యక్తులు ఎదురయ్యారు చూడు.

     ముందుగా చర్చించిన సంగతులు సంభవించిన కాలంలో ప్రధాన యాజకుడును అతని కూడనున్నవారందరును సదూకయ్యులే. సదూకయ్యులెట్టివారో అపొ. 5:17:4:5- 6లో (ప్రత్యేకంగా చూడు) "సదూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదని చెప్పుదురు ..." (అపొ. 23:8), గనుక మూడవ దినమున మృతులలోనుండి లేస్తానని చెప్పిన యేసును "వంచకుడని” రుజువు చేయ బూనినవారు ఆయన సమాధిని ముద్రించి, కావలియుంచి భద్రం చేశారు. అయితే వాస్తవానికి వారి నమ్మకాలకు విరోధంగా దేవదూత వచ్చి సమాధిపైనుంచిన రాతిని పొర్లించడం; యేసు మృతులలోనుండి లేవడం జరిగింది. జరిగిన సంగతులను కావలివారిలో కొందరు వెళ్లి ప్రధాన యాజకులతో చెప్పారు (మత్తయి 28:1-14) అయితే ప్రధాన యాజకులు దాన్ని నమ్మారా? లేదు, అబద్ధాలతో దాన్ని కప్పడానికి ప్రయత్నించారు; లంచమిచ్చారు.

     పరిస్థితిని బట్టి యేసు పునరుత్థాన వార్తలను నమ్మలేని అపొస్తలులైతే వాస్తవాలను గుర్తించినప్పుడు - యేసు పునరుత్థాన వాస్తవాలతో వారు ఒప్పింపబడి, సువార్తను ప్రకటింపనారంభించారు. అప్పుడు కూడా ప్రధానయాజకుడూ, అతనితో కూడ ఉన్న ఆ సదూకయ్యులే అపొస్తలుల నోళ్లు మూయించడానికి వారిని బెదిరించారు. జైల్లో పెట్టారు గాని, వాస్తవాలను వారేమాత్రం అంగీకరించినవారు కారు; - కనుక దుర్నీతిచేత సత్యాన్ని అడ్డగించాలని ప్రయత్నించేవారికి ఎన్ని రుజువులు చూపినా ప్రయోజనం లేదని తేలిపోయింది. 

     నీవు సత్యాన్ని వాస్తవాలను బట్టి అంగీకరిస్తావో, లేక నీ విశ్వాసంలోనే నిలిచి సత్యాన్ని (ఆనాటి ప్రధాన యాజకులులా) ఏలాగైనా అడ్డగించాలనే కూర్చుంటావో అది నీ యిష్టం. అయితే నజరేయుడగు యేసు - "శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపించబడ్డాడు (రోమా 1:4). బైబిలును ఆధారం చేసికొని దాన్ని కాదనడానికి ఎవడి తరము కాదు.
56. పట్టుకొంటే ముట్టుకున్నట్టు కాదు!
     యేసు ఆమెను (మగ్దలేనే మరియను) చూచి-నేను యింక తండ్రియొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి - నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. (యోహా. 20:17).

     విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మగ్దలేనే మరియయు, వేరొక మరియయు, సమాధిని చూడవచ్చిరి. . . . . వారు భయముతోను మహానందముతోను సమాధి యొద్దనుండి త్వరగా వెళ్ళి, ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని యెదుర్కొని - మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టి ఆయనకు మొక్కిరి. (మత్త 28:1-9).

     గమనిక: మత్తయి 28లో మగ్దలేనే మరియ యేసు పాదములను పట్టినట్టుంది. యోహాను 20:17లోనైతే ఆయన తన్ను ముట్టవద్దని ఆమెతో అంటున్నాడు. ఇదేమి? "పట్టుకొంటే? -ముట్టుకున్నట్టు కాదా? అని వ్యంగ్యంగా మన మిత్రుడు బైబిలును విమర్శిస్తున్నాడు. మన మిత్రుని వ్యంగ్యం చదువరికి అర్థమయ్యింది కదూ!

     వాస్తవానికి మన మిత్రునిది వెర్రి వ్యంగ్యం! అంతకంటే అతని వ్యంగ్యంలో పండితులు గుర్తించవలసిన ఏ వివేకమూ లేదు. నీకు ఈ సంగతి తెలుసో లేదో కాని, ఆయా భాషా ప్రయోగాలను బట్టి పట్టుకుంటే, ముట్టుకున్నట్టు నిజంగానే కాదు. కావాలంటే ఉదాహరణలు చూడు:

     ఒకడు తన కుమార్తెను "పట్టుకొని" - బడికి తోడుకొని పోతాడు. మరియు అవసాన దశలో ఉన్న తల్లిని "పట్టుకొని” నడిపిస్తాడు. ఆయితే అతడు తన భార్యను - "ముట్టుకుంటాడు.” ఈ పద ప్రయోగాల్లో పట్టుకొంటే తప్పక ముట్టుకున్నట్టు కాదు. ముట్టుకొనడమంటే ఒక భావం - లైంగిక సహవాసం కలిగియుండటం అనేదే. ఈ భావనతోనే 1 కొరింథీ 7:1లో (GUNESKO)'గునెస్కో” అనే పదం ప్రయోగించబడింది. ఆ సందర్భంలో లైంగిక సహవాసమనే పదం తర్జుమాలో వాడకుండ, దాన్నే సున్నితంగా చెప్పడానికి పండితులు-"ముట్టకుండుట" అనే రూపాన్ని వాడారు.

     "స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు" అన్న ఆ ప్రయోగంలో, తన బిడ్డను పట్టుకొని బడికి తీసుకొని పోకుండుట మేలు అనే భావం లేదు; లేక అవసాన కాలంలోనున్న తన తల్లిని పట్టుకొని నడిపించ కుండుట పురుషునికి మేలు అనే భావం లేదు. అక్కడవున్న సందేశమేమంటే - స్తీతో లైంగిక సహావాసం లేకుండ ఉండగలిగితే అది పురుషునికి మేలు" అనేదే. గనుక పట్టుకుంటే ముట్టుకున్నట్లు - అవునో కాదో - ఈ సందర్భంలో నీవే చెప్పు చూద్దాం. విషయ పరిజ్ఞానంలేని మన మిత్రుని వెర్రి మాటలు బైబిలును విమర్శించలేవు సుమీ!

     అయితే ఈ భావానికి, యోహాను 20:17లోని భావానికి సంబంధం లేదు. యోహాను 20:17లో - "నన్ను ముట్టవద్దు" అనే పద ప్రయోగం పూర్తిగా వేరైన భావాన్ని సూచించే మూలం నుండి వచ్చింది. అక్కడ ప్రయోగింపబడిన పదం (HAPTO) "హెప్టో":

     అసలు "ME MOU HAPTOU" అనే గ్రీకు వాక్యంనుండి "నన్ను ముట్టుకోవద్దు" అనే తర్జుమా వచ్చింది. అయితే ఆ తర్జుమా గ్రీకు భాషలో యిమిడియున్న భావాన్ని పూర్ణంగా వ్యక్తం చేయడం లేదు. అంటే, ఉదాహరణకు, "బండారం" అనే తెలుగు పదానికి సమమైన ఆంగ్ల పదం దొరకడం ఎంత కష్టమో, HAPTO అనే గ్రీకు పదానికి కూడా సమమైన తెలుగు పదం దొరకడం అంతే కష్టం - దాన్ని వివరించవలసిందే!
దీనికి గ్రీకు పండితుడైన థేయార్ యిలా అంటున్నాడు - "In John 20:17 ME MOU
HAPTOU is to be explained thus: Don't handle me to see whether I am still clothed with a body; there is no need of such an examination. -- for not yet." (Thayer's Greek English Lexicon of the New Testament. P. 7A.

     గ్రీకులో వ్రాయబడినదానికి సమముగా చేయ ప్రయత్నించిన తర్జుమాలున్నాయ్  - "Jesus said to her, 'Stop clining to the -" (A Quote from Soul Winner's New American Standard New Testament :P. 156 John 20:17).

     ఇంతకు మగ్దలేనే మరియ ఏమి చేసిందో? ఏ మానసిక స్థితిలో ఈ పనిని చేసిందో గమనించు: “ఆయన (యేసు) చనిపోయి సమాధి చేయబడెనే? ఆయన మృతదేహాన్ని గూర్చే నేను ఆలోచిస్తూ వుంటే, ఆయన సజీవుడుగానే ప్రత్యక్షమాయనే! ఇంతకు ఆయన కిప్పుడు భౌతిక దేహం ఉందా? అయితే చూద్దాం” అనే భావంతో ఆమె ఆయన్ను చూస్తుంటే, ఆ ఉద్దేశంతో నన్ను ముట్టవద్దని ప్రభువు ఆమెకు ఈ సందర్భంలో ఆదేశించాడు. ఇది యోహాను 20:17లోని సందేశం.

     అయితే మత్తయి 28:1-9లో చెప్పబడినట్టు- ఆయన పాదాలు పట్టి మ్రొక్కడానికినీ: యోహాను 20:17లో ఉన్నట్టు ఆయనను పట్టి పరీక్షించడానికినీ తేడా లేదా? మరి వ్యత్యాసం లేదంటాడేమి, మన విమర్శకుడు? దేనైన్నా విమర్శించాలంటే - దానిలో అతడు పాండిత్యం గడించినవాడై యుండాలి. మన మిత్రునిలా, కేవలం తెలిసి తెలియని మాటలు పలికేవాడు విమర్శకుడై ఉండనేరడు. బైబిలుమీద అతడు చేసింది విమర్శ కాదని అడుగడుగునా తేలిపోతుంది. అతడు నిజానికి వ్రాసింది బైబిలు బండారాన్ని కాదు; వాస్తవంగా "బైబిలు బండారం" వ్రాస్తున్నాను అనుకొంటూ మన మిత్రుడు, తన బండారన్నే వ్రాసుకున్నాడు. వాస్తవంగా అంతే జరిగింది.

     ఇక్కడ అసలు వాస్తవమేమో చదువరికి అర్థమయ్యుంటుందా? మరలా చూడు: ఆయన పాదములు పట్టి మొక్కడానికి తక్కిన స్త్రీలతో పాటు మగ్దలేనే మరియకు కూడా యేసు అనుమతినిచ్చాడు; కాని ఆయన పునరుత్థానుడైన తరువాత, ఆయనకు భౌతిక దేహముందో లేదో పరీక్షించడానికి మాత్రం ఆమెకు అనుమతినివ్వలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే - అలా పరీక్షించి తెలిసికోడానికి ముందుగానే కొందరు నియమించబడ్డారు; వారు ఆయన అపొస్తలులు (అపొ. 10:10–41 చూడు). ఆయన అపొస్తలులు- ఆయన పునరుత్థానానికి సాక్షులు (యోహాను 15:26–27: అపొ. 2:32, వగైరాలు). ఆయన పునరుత్థానానికి సాక్షులుగా నిలిచియుండబోయే వారికి మాత్రమే ఆ భాగ్యం! అది తాత్కాలికపు ఏర్పాటు కాదు. దానికని కొందరు ముందుగా నిర్ణయింపబడ్డారు. ఆ నియమాన్ని ప్రభువు ఈ సందర్భంలో దాటనుద్దేశించ లేదు. గనుక తోమాలా వారిలో యింకా ఎవడైనా ఆయన శరీర పునరుత్థానాన్ని సందేహించితే (యోహాను 20:19-25), అలాటివాని సందేహం తీర్చడానికిగాను తనను పరీక్షించుకొనే అనుమతిని అపొస్తలులకిచ్చాడు (యోహాను 20: 26 -29). అయితే అలాటి అనుమతి మగ్దలేనే
మరియకే కాదు, తన అపొస్తలులకు తప్ప నరులలో మరి యింకెవరికినీ యిచ్చినట్టు లేదు.

     అందుకే ఆయన అపొస్తలులు తమ ప్రభువును గూర్చి మాట్లాడినప్పుడు“జీవవాక్యమును గూర్చినది ఆదినుండి ఏది యుండేనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయు చున్నాను... ” అని అన్నారు (1 యోహాను 1:1-3). అది కేవలం జనులు అపొస్తలుల మాటలను ఆనందముతో అంగీకరించినప్పుడు మాత్రమే కాదు; వారు ఈ సంగతులు బోధింపకుండ బెదరించినప్పుడు, శ్రమపెట్టబడినప్పుడు సయితం మానక వారు అంటే అపొస్తలులు ఈ సందేశాన్ని ప్రకటించారు (అపొ, 4:18–21; ప్రకటన 1:9-10). దీనికై క్రీస్తు ప్రభువు యొక్క అపొస్తలులను దేవుడు ముందుగానే ఏర్పరచుకొన్నాడు (అపొ. 10:33-10). అలాటి దేవుని ఏర్పాటుకు భిన్నంగా మగ్దలేనే మరియు తన కుతూహలాన్ని తీర్చుకో కోరింది. గనుకనే- "నాకు భౌతిక దేహముందా, లేదా? అనే సందేహాన్ని తీర్చుకోటానికి “నన్ను ముట్టవద్దని" ఆయన మగ్దలేనే మరియతో అన్నాడు. అదీ అక్కడ జరిగింది.

     గనుక ఇప్పుడు మనకు ఏమి అర్థమయ్యింది? దేవుని గ్రంథంలోని సందేశంలో ఏ సమస్యా లేదని; వ్యంగ్యంగానో లేక అపహాస్యంగానో మాటలాడడానికి ఎవనికి అది తావియ్యదని తేలిపోయింది. ఆది భాషలో ఆయా ప్రయోగాలు దేవుని విజ్ఞాన బాహుళ్యాన్ని బయలుపరుస్తున్నాయి. అయితే ఆ భాషా పదాలకు తర్జుమాల్లో సమానమైన పదాలు దొరుకనప్పుడు కొంత యిబ్బంది జరిగి యిలాటి అపార్దాలకు దోహదమయ్యిందని చెప్పవచ్చు. ఆది భాషలో మాత్రం యిలాటివేవీ సమస్యలు కావని చదువరి గ్రహించాలి. గనుక మన మిత్రుని వ్యంగ్య అపహాస్యాన్ని నిర్లక్ష్యపెట్టి బైబిలు వర్తమానాన్ని నిరభ్యంతరంగా అంగీకరించవచ్చు, నమ్మి జీవము పొందవచ్చు.
57. విని చూడలేదా? చూచి వినలేదా?
     (సౌలు)తో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి కాని యెవనిని చూడక మౌనులై నిలుపబడిరి. అపొ. 9:7. (ఇంకా చూడు: అపొ. 26:14).

    సౌలా, సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక శబ్దము పలుకుట వింటిని. నాతో కూడా నున్న వారు ఆవెలుగును చూచిరిగాని మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అపొ. 22:7-9. 

     గమనిక: సౌలుతో ఉన్న మనుష్యులు చూచారని ఒక చోట చూడలేదని మరొకచోట ఉంది; అలాగే - విన్నారని ఒక చోట వినలేదని మరొకచోట ఉందే - అది అసంబద్ధం కాదా? అని మన విమర్శకుడు అడుగుతున్నాడు. ఇది చదవగానే చదువరి కూడా సమస్యలోపడే అవకాశముంది. అయితే దీన్ని సమస్యగా భావించేవారు - ఆ రోజు సౌలుతో ఉన్నవారు చూచిందేమి? విన్నదేమి? అనే ప్రశ్నలు అలోచింప లేదని తేలుతుంది. అటు మన మిత్రుడుగాని, యిటు చదువరిగాని వాటిని ఆలోచించియుంటే, ఇలాటి సందేహాల్లో పడియుండేవారే కారు. గనుక మనం వాటిని పరిశీలనగా చూద్దాం.

     1. సౌలుతో దమస్కు మార్గములోనుండినవారు - చూచినదేమిటి? వెలుగునా? వ్యక్తినా? అపొ. 22:7-9లో వారు "ఆ వెలుగును చూచిరి" అపొ. 9:8లో వారు “ఎవరిని చూడ"లేదు. అంటే, వారు ఏ వ్యక్తినీ చూడలేదు; వారు కేవలం వెలుగును మాత్రమే చూచారు. పై రెండు లేఖనాల్లో యింతవరకు ఏదైనా సమస్య ఉందా? లేదు. అక్కడ ఏమి జరిగింది. వారు వెలుగును చూచారే గాని ఏ వ్యక్తిని అందులో చూడలేదు. వెలుగును చూస్తే వ్యక్తిని చూచినట్టు కాదని గ్రంథం అంది.

     2. సౌలుతో దమస్కు మార్గములోనుండినవారు -విన్నదేమిటి? స్వరమా? వర్తమానమా? (a voice? or a message? Which?) (అపొ. 9:7లో వారు "ఆ స్వరము వినిరి (They heard a voice but not the massage) కానీ ఆ వర్తమానము వినలేదు.” ఇది రెండు విధాలుగా సంభవించే అవకాశముంది. స్వరము వింటే వర్తమానం విన్నట్టు కాదు! కానవసరం లేదు!!

     మన మిత్రుడు చూపిన అపొ. 26:14 ప్రకారం - సౌలుతో మాట్లాడిన వ్యక్తి, హెబ్రీ భాషలో అతనితో మాట్లాడినట్టు చెప్పబడింది. సౌలుకు హెబ్రీ భాష తెలుసు (అపొ. 22:7). అయితే తనతోనున్నవారికి ఆ భాష వచ్చునో రాదో తెలియదు. ఒకవేళ వారికి ఆ భాష తెలియకపోతే, సౌలుతో మాట్లాడినవాని స్వరం వారికి వినిపించినా, అతనితో మాట్లాడినవాని వర్తమానం వారికి అందలేదనే చెప్పాలి:

     ఉదా: తమిళం నేర్చుకోని నా బంధువులు మా యింటికి వచ్చారనుకో! ఇక్కడ నాతో మాట్లాడుతున్న మా పొరుగువారి పలుకులు వారి చెవినిబడతాయి కాని, అది వారికి కేవలం ఏదో శబ్దం విన్నట్టే ఉంటుంది. అలాగే సౌలుతోనున్నవారికి హెబ్రీ భాష తెలియకపోతే, ఆ భాషలో అతనితో మాట్లాడుతున్న వ్యక్తి స్వరం కేవలం శబ్దంలాగానే వారికి వినిపించే అవకాశముంది. అందులోని వర్తమానం వారికి అందదు.

     ఇకపోతే రెండవది: వర్తమానం కేవలం వ్యక్తిగతమైనదే అయినప్పుడు తక్కిన వారికి అందకుండా మాట్లాడుకునే రూపం కూడా ఉంటుంది. అలా జరిగినప్పుడు ఎదుటి వ్యక్తులు మాట్లాడుకొంటున్నట్టు మాత్రమే చూచేవారికి గ్రాహ్యమౌతుంది కాని వారు ఏమి మాట్లాడు కొంటున్నారో తెలియదు. గనుక సౌలుతో ఒక మానవ స్వరం మాట్లాడుతున్నట్టు అతనితో కూడా ఉన్నవారు విన్నారు గాని; అతనితో మాట్లాడినవాని స్వరాన్ని గుర్తుపట్టలేదు. "మీరు విన్న స్వరం ఎవరిది?" అని వారినడిగితే- "ఎవరిదో మాకు తెలియదు" అని చెప్పగలిగిన పరిస్థితిలోనే వారు ఉన్నారు. అందువలన - వారు "స్వరము (శబ్దము) వినిరి గాని” అని అపొ. 9:7లో ఉంటే, "నాతో మాటలాడిన వాని స్వరము (సందేశం) వారు వినలేదని” అపొ. 22:7-9లో సూచింపబడింది. ఇందులో తార్కికమైన ఏ సమస్యాలేదు.

     ఈ సంగతులు యిలా జరగడానికి దేవుని మహా జ్ఞానంలో చోటు లేకుండపోలేదు. పౌలు యొక్క అపొస్తలత్వానికి తనతోకూడ దమస్కు మార్గంలోవున్నవారిని సాక్షులుగా దేవుడు నిలిపియున్నాడనే చెప్పాలి. వారు వెలుగును చూచారు. సౌలు ఆ వెలుగులో ప్రత్యక్షమైన వ్యక్తిని చూచాడు. ఆ వెలుగులోనుండి మానవ స్వరంవంటి యొక స్వరం అతనితో మాట్లాడడం, సౌలు దానికి ప్రత్యుత్తరమియ్యడం వగైరాలు వారు విన్నారు అయితే సందేశమేదో వారివరకు రాలేదు. సౌలు మార్పునుబట్టి, తాను చెప్పుకొన్నట్టు ప్రభువే అతన్ని ఏర్పరచుకొన్నాడనడానికి అతనితోనున్నవారు ముద్రగా నిలిచారు. ఇలాటి ఉద్దేశంతో బయలుపరచబడిన లేఖనాలపై మన మిత్రుని ప్రశ్నలకు తావుందా? ఆయా రచనలను పరిశీలించి వాటి ఉద్దేశం తెలిసికోకుండ అవి రుజువుపరచే వర్తమానాన్ని గ్రహింపకుండ వాటిని ప్రశ్నించడమే -హేతువాదమైతే – దాన్ని వివేకులు అంగీకరిస్తారా? తార్కిక జ్ఞానులు దానితో సమ్మతిస్తారా? అయినా కోర్టులో వాదించినవారికి ఈ సంగతులు ఎలా తెలియకుండా పోయాయో?
58. పౌలు అపొస్తలులను చూచాడా, లేదా?
     యూదులు అతని చంపనాలోచింపగా...... అతడు (సౌలు) యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు ప్రయత్నము చేసెను  . . . . బర్నబా అతని దగ్గరకు తీసి అపాస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి - అతడు త్రోవలో ప్రభువును చూచెననియు అతనితో మాటలాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను. అపొ. 9:24-27.

     ముందుగా అపోస్తలులైనవారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్లలేదు కాని వెంటనే అరేబి దేశములోకి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైన మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేముకు వచ్చి అతనితోకూడ పదునైదు దినములుంటిని. అతని తప్ప అపొస్తలులలో మరి యెవనిని నేను చూడలేదు. కాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. గల 1; 17-19, (సౌలు అంటే పౌలే. చూడు; (ఆపొ. 13:10 )

     గమనిక: మన మిత్రుని పాయింటు పాఠకులకు అర్థమయిందను కుంటాను - పౌలు అపొస్తలులను చూచినట్టు ఒక చోటుంది. చూడలేదన్నట్టు మరో చోట ఉంది గదా? యింతకు పౌలు అపొస్తలులను చూచాడా, లేదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. అయినా ఇలా అతడు అడిగింది సంగతులను అర్థం చేసుకుని, సత్యాన్ని అనుసరించడానికి కాదుసుమీ! వాస్తవాలను కప్పిపుచ్చి పాఠకులను తప్పు దార్లు పట్టించడానికే!

     మన విమర్శకుని ఈ లక్ష్య సాధనలో - బైబిలు కొటేషన్లో కీలకమైన పదాలను ఎగురగొట్టాడు; అంటే - అపొ. 9:14-29ని బైబిలునుండి మన మిత్రుడు కోట్ చేస్తూ - "అనేక దినములైన తరువాత" అనే మాటలను విడిచిపెట్టి, తాను కోట్ చేసింది ప్రారంభమని మనం నమ్మేలా - "యూదులు అతని చంప నాలోచింపగా" అంటూ పేరానే ప్రారంభించాడు; చూడు! ఉన్నవాటిని లేనట్టు చూపి, తన పాఠకులను తప్పు దార్లు పట్టించేదేనా హేతువాదమంటే? అయినా యిదేమి హేతువాదమో, బహు చిత్రంగానే ఉంది! ఇదే మన మిత్రుని విజ్ఞాన బాట.!

     దాన్ని అలా ఉంచి, పౌలు జీవితానికి సంబంధించి - అపొ. 9; గలతీ. 1ల్లో సూచింపబడ్డ సంఘటనలను కాలక్రమంలో చూచి, ఆ తరువాత మన మిత్రుని ప్రశ్నకు సమాధానం ఆలోచన చేద్దాం.

     1. సౌలు దమస్కులోని క్రైస్తవులను హింసించడానికై అధికార పత్రాలతో సపరివారంగా యెరూషలేము నుండి బయలుదేరాడు (అపొ. 9:1-3).
     2. దమస్కు సమీపంలో ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యాడు (అపొ, 9:3, 4, 8).
     3. ఆ దర్శనంవలన అంధుడై అతడు దమస్కులోనికి నడిపింపబడ్డాడు (అపొ. 9:7, 9).
     4. దమస్కులో అననీయ సౌలును కలుసుకొని అతనికి బాప్తిస్మమిచ్చాడు (అపొ. 9:20-23).
     5. వెంటనే అతడు అరేబియాకు వెళ్లి తరువాత దమస్కుకే తిరిగి వచ్చాడు (గలతీ. 1:17),
     6. అతడు దమస్కులో నిలిచి యేసు నామాన్ని బోధిస్తూ మూడు సంవత్సరములు గడిపాడు. చివరికి అతన్ని చంపడానికి యూదులు ఆలోచించి దమస్కు అధిపతిని ప్రేరేపించినట్టున్నారు. ఆ అధిపతి పౌలును పట్టగోరాడు. ఆ సందర్భంగా కిటికీగుండా గోడమీదనుండి అతడు గంపలో దింపబడ్డాడు (అపొ. 9:23, 2 కొరింతి. 11:33).
     7. "అనేక దినములైన పిమ్మట” (అని లూకా అంటే - అపొ. 9:23); “మూడు సంవత్సరములైన తరువాత? (అని పౌలంటాడు 1:18), పౌలు పేతురును పరిచయం చేసుకొనగోరి యెరూషలేము వచ్చాడు.
     8. అయితే శిష్యులు అతనిని చేర్చుకోడానికి భయపడ్డారు. బర్నబాయైతే సౌలు మాటలచే ఒప్పింపబడి అతని చేర్చుకొని, అపొస్తలులతో పరిచయం చేయజూశాడు (అపొ. 9:27).
     9. సాధారణంగా ఆయా స్థలాలకు సువార్తకై అపొస్తలులు వెళుతూ ఉంటారు. ఆ సమయంలో స్థానికంగా పని చేస్తున్నపేతురు తప్ప అపొస్తలుల్లో మరెవ్వరూ లేరు కాబోలు! బర్నబా అపొస్తలులతో సౌలును పరిచయం చేయ తలపెట్టినా, సౌలు పరిచయం చేసుకోగోరింది పేతురునే గనుక సమస్య లేకుండపోయింది (అపొ. 9; గలతీ. 1వరకు ఉన్న విషయమిది.
     10. అపొ. 15వ అధ్యాయంలో - సుమారు 7 లేక 8 సంవత్సరాలకు పౌలు బర్నబాలు (గలతీ ప్రాంతంలోని) అంతియొకయ సంఘం ద్వారా యెరూషలేములోనున్న అపొస్తలులు, పెద్దల యొద్దకు పంపబడతారు. ఆ సమయాన్ని గూర్చి మన మిత్రుడు ప్రస్తావించలేదు. అది అతనికి తెలియదు కాబోలు! గనుక ఒక ప్రశ్నను విమర్శగా విసరివేయకముందు, ఆ సందర్భాన్ని గూర్చి చర్చించబడ్డ సంగతులన్నీ ఎరగడానికి ప్రయత్నించాలి! అలా ఎరుగకుండా మాట్లాడడం అవివేకం. పైగా రచనలను కోట్ చేయకముందు వాటి రచనా ఉద్దేశాన్ని గ్రహింపగలిగి యుండాలి. అలా ఎరుగకుండా అసంబద్ధాన్ని జతచేయడం మతిహీనతయే! గనుక
భిన్నమైన ఉద్దేశాలతో ఆయా లేఖనాలను పరిశీలించకయే అసంబద్ధమని చెప్పిన మన మిత్రుని రచనలో - ఏ మంచీ లేదనే చెప్పాలి!
59. విశ్వాస మూలముగనా? క్రియల మూలముగనా?
    పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాస ముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతునిగా యెంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పచున్నాడు. రోమా, 4:5, 6, (ఇంకా చూడు: 2:8,9).

     నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు యెవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాస మతనిని రక్షింప గలదా? . . . . మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని యెంచబడునని మీరు (దీనివలన) గ్రహించితిరి . . . . . . ప్రాణములేని శరీరమేలాగు మృతమో అలాగే క్రియలులేని విశ్వాసమును మృతము. యాకో. 2:14–26.

    గమనిక: మన మిత్రుని ప్రశ్నల్లో విద్యావిహీనతే మాటిమాటికి కన్పిస్తుంది. "విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్ధము చేసినట్లు, (పౌలు లేఖనాలను కూడా) తమ స్వకీయ నాశనమునకు అపార్ధము చేయుదురు" అని బైబిలు ఊరకయే చెప్పలేదు (2 పేతురు 3:15-16 చూడు).

    పై రెండు లేఖన భాగాలను కోట్ చేసి - “విశ్వాసము మూలముగనా? క్రియల మూలముగనా? అని అడగడంలో - కేవలం లేఖనాలను అపార్థం చేసిన సంగతే గోచరిస్తుంది. బైబిలు - రెండు రకాలైన క్రియలను చర్చించింది; వాటికి సంబంధించిన చర్చ, పై రెండు లేఖనాలలో సూచింపబడింది. ఆ సంగతి మన మిత్రునికి తెలియకపోవడమే యిలాటి ప్రశ్నలకు హేతువు. అంతేగాని అది బైబిలు సమస్య కాదు. మన మిత్రుని విద్యలోని సమస్యయే.

    బైబిలులో చర్చింపబడ్డ క్రియల్లో ఒకటి - ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు; అంటే నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, వగైరాలు. రెండోరకపు క్రియలు, విశ్వాస క్రియలు – ఆపదలో ఉన్నవానిని ఆదుకొనుట; ఆకలిగొనినవానికి ఆహారమిచ్చుట; వస్త్రహీనునికి వస్త్రములిచ్చుట - వగైరాలు. మొదటివి శిక్షా నియమాన్నిబట్టి జరిగించేవి. అయితే రెండోరకమేమో ప్రేమా నియమాన్ని బట్టి జరిగించేవి! బైబిలు ఈ రెండింటిని తేటగా విడదీస్తుంటే, మన మిత్రుడు వాటిని జోడించి తప్పుగా భావించడం, తప్పని చూపటం తగునా? అయితే యిక్కడ మన మిత్రుడు ఘనకార్యమదే! చూడు.

1. ధర్మశాస్త్ర క్రియలు:
      మన మిత్రుడు మొదటిగా కోట్ చేసిన లేఖన భాగం - ధర్మశాస్త్ర క్రియలకు చెందినది. దీనికి సంబంధించిన చర్చ రోమా 2లోనే ప్రారంభమయ్యింది. అది యూదుల పరిస్థితిని యిలా వివరించింది - "నీవు యూదుడవని పేరు పెట్టుకొని, ధర్మశాస్త్రమును ఆశ్రయించి, దేవునియందు అతిశయపడుచున్నావు కావా? ఎదుటవానికి బోధించు నీవు నీకునీవే బోధించుకొనవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుటవలన దేవుని అవమానపరచెదవా? అని రోమా 2:17నుండి 23వరకు వ్రాయబడింది.

     ధర్మశాస్త్రం మీరుటవలన యూదులు దోషులైనా, తాము నీతిమంతులైనట్టే నటిస్తూ, ధర్మశాస్త్రాన్నిబట్టి అతిశయిస్తూ, అన్యజనులను తృణీకరిస్తున్నారు. వారిలో ఉన్నయిలాటి తత్వాన్ని ఖండిస్తూ, దాన్ని రద్దుపరచడానికే రోమా 4లో యిలా వ్రాయబడింది:
"ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన, క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ...." (రోమా 3:20). 

2. సత్క్రియలు లేక విశ్వాసపు క్రియలు: 
    "ఇట్లుండగా, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది" (రోమా 3:21). అది విశ్వాసమును బట్టి దేవుడు మానవునికి ఆరోపించు నీతి (ఫిలిప్పీ. 3:9) కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు" (రోమా 3:28). దానికి రుజువు వారి మూలపురుషుడగు అబ్రాహామే! (రోమా 4:1, 9). 

    అయితే, "విశ్వాసానికే" ప్రత్యేకంగా క్రియలుంటాయ్; అవి ధర్మశాస్త సంబంధమైన క్రియలు కావనుకున్నాం, కదూ? "ఇంకా చూడు" అని మన మిత్రుడు సూచించాడే దాన్నే చూద్దాం. "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు దేవుని వరమే క్రియలవలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు” (ఎఫెసీ. 2:8-9). మన మిత్రుడు యింతవరకే చూడమన్నాడు గాని, ఆ తరువాత వచనాన్ని చూడమనలేదు ఎందుకో? అది తనకు అనుకూలంగా లేదని కాబోలు!!

    ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలవలన రక్షణ లేదన్న లేఖనమే విశ్వాస సంబంధమైన క్రియలు కావాలంటుంది చూడు, "మరియు” అనే మాటతో 10వ వచనం ప్రారంభిస్తుంది; అంటే ముందు చర్చించిన సందర్భం యింకా పూర్తి కాలేదని అది సూచిస్తుంది. గనుక ఎఫెసీ. 2:8, 9తో కలిపి యిది చదువుదాం. ".... మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము" (ఎఫెసీ. 2:10).

    ఇలా రక్షింపబడిన విశ్వాసులు చేయవలసిన సత్క్రియలున్నాయి. వాటి విషయంలో వెనుకంజ వేస్తున్నవారిని హెచ్చరిస్తూ యాకోబు యిలా అన్నాడు - "నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసమతని రక్షింపగలదా? పైగా ఆ విశ్వాసపు క్రియలు ఎలాటివో యాకోబుయిలా వివరించాడు; “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేకయున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక -సమాధానముగా వెళ్ళుడి. చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును .” (యాకోబు 2:14-17) ఇంకా చూడు! మత్తయి 25:34-10.

    గనుక - "విశ్వాస మూలముగనా? క్రియల మూలముగనా?” అనే మన మిత్రుని ప్రశ్నకు సమాధానం: విశ్వాస మూలముగనూ, విశ్వాస సంబంధమైన క్రియల మూలముగనే బైబిల్లో వ్రాయబడినవి వ్రాయబడినట్టే చదివి గ్రహించగలిగితే - దాని వర్తమానంలో ఎలాటి సమస్యా కన్పించదు. మన మిత్రుని గ్రహింపులోని ఈ లోపాన్ని బైబిలు మీద రుద్ది, అందులో తప్పు ఉందంటున్నాడు గాని, తప్పు మన మిత్రుని జ్ఞానంలోనిదే సుమా!
60. ఎప్పుడూ రానివారిని బూరలెట్లా లేపుతై?
     మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి యెప్పుడును రాడు. యోబు. 7:9.

     మృతులు లేపబడనియెడల క్రీస్తు కూడ లేపబడలేదు. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. 1 కొరిం. 15:16, 52.

     గమనిక: గ్రంథకర్త యొక్క వర్తమానాన్ని ఉన్నది ఉన్నట్టు యథార్థంగా చూపి - అది వాస్తవ విరుద్ధమో, సత్య విరుద్ధమో, ధర్మవిరుద్ధమో, లేక తార్కిక విరుద్దమో అయినప్పుడు ఆ లోటును ఎత్తి చూపేదాన్నే సరియైన విమర్శ అంటారు. అయితే మన మిత్రుని పని సరియైన విమర్శకు ఉండవలసిన లక్షణాల్లో దేన్నీ పాటించినట్లు కన్పించదు! పైగా ఉన్నది లేనట్టున్నూ లేనిది ఉన్నట్టున్నూ పుట్టించి, బైబిలులో ఎలాగైనా నేరం పెట్టాలనే ధేయంతోనే పని చేసినట్టు మన మిత్రుడు అడుగడుగునా కన్పిస్తున్నాడు. అతని హేతువాదం యొక్క ధేయమదేనేమో!

    అదెలాగున్నా మనం తిరిగి లేఖనాల పరిశీలనకు వద్దాం. యోబు 7:9లో వర్తమానమెవరిది? దేవునిదా? మనుష్యునిదా? ఒకవేళ మనుష్యునిదైతే, ఆ మనుష్యుడు ఆ సమయంలో దైవాత్మ ప్రేరేపణతో మాట్లాడుతున్నాడా? లేక పరిస్థితులను బట్టి తనంతట తానే మాట్లాడుతున్నాడా? అనే ప్రశ్నలు తార్కికంగా ఆలోచించి, ఆ మాటల్లో ఉండే వర్తమానాన్ని కనుక్కోవాలి! అలా కాకపోతే బైబిలు వర్తమానం అపార్థం చేయబడుతుంది. పైగా బైబిల్లో దేవుని మాటలే గాక, మానవ జ్ఞానం - వారి ఆలోచనలు, అపోహలు వగైరాలు కూడా అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో దాఖలు చేయబడ్డాయి. గనుకనే - "సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి” అని బైబిలు హెచ్చరించింది (2 తిమోతి 2:15); కలిపి చెరిపే వారిని గూర్చి కూడా జాగ్రత్తగా ఉండమని - బైబిలు సూచించింది (2 కొరింథీ. 2:17, 2 పేతురు 3:15-17).

     గనుక యోబు 7:9ని మనం జాగ్రత్తగా పరిశీలించి చూచినట్లయితే, అందులో వర్తమానం సాతానుచే శ్రమ పెట్టబడి, తన శ్రమకు కారణమేమో, ఎరుగని యోబు పలికిన మాటలేనని తేలిపోయింది. అతని శ్రమకు తన పాపమే కారణమని తన స్నేహితుల అపోహను అతడంగీకరించలేదు కాని, అతడు దేవునిచేత శ్రమపెట్టబడుతున్నాడనే తన స్నేహితుల కల్ల కబుర్లను మాత్రం అతడంగీకరించాడు. వాస్తవంగా దేవుడే అతనిని శ్రమపెడుతున్నాడా? అంటే అది వాస్తవం కాదు (యోబు 1-2 అధ్యాయాలు), వాస్తవాలు తెలియని యోబుపలుకులు దైవ వాక్కు ప్రమాణాలుగా ఎలాగౌతాయ్? వాటిని అలా భావించడం గ్రంథాన్ని చదివి సంగతులు గ్రహించలేకపోవడమే గదా! ఒక వ్యక్తియొక్క శ్రమకు పాపమే కారణం కానవసరంలేదనేది యోబు గ్రంథ సమాచారమైయుంది.

     అయినా యోబు మాటల్లోని భావమేమి? అతడు పునరుత్థానం లేదన్నాడా? లేదే? "మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు" పాతాళమునకు దిగిపోయినవాడు "మరి ఎన్నడును రాడు." (వాడు ఎక్కడికి రాడు?) “అతడు ఇక ఎన్నడును తన యింటికి రాడు; అతని స్థలము అతని మరల నెరుగదు" అని అన్నాడు. అలా అనడంలో, నిత్యత్వాన్ని ఎదుర్కొనడానికి మానవుడు అక్షయుడుగా లేపబడడని అర్థం కాదు; గాని భౌతికదేహానికి మరో జన్మ లేదు. అది శిథిలమైపోయేదేనని అతని భావం. అతడు తన యింటికి తిరిగిరాడు.

     అదెలాగున్నా అతని మాటలను ఈ సందర్భంలో ప్రమాణాలుగా తీసికోనవసరం లేదు. ఎందుకంటే - "నా ఆత్మ వేదనకొలది నేను మాట్లాడెదను" (7:11) అని అతడన్నాడు. అంటే, యోబు 7:9లో సూచింపబడిన మాటలు - మానవ ఆత్మను బట్టి పలికిన మాటలేగాని, దేవుని ఆత్మనుబట్టి పలికిన మాటలు కావని స్పష్టంగా తెలియ జేయబడింది. విమర్శనాత్మకమైన జ్ఞానముంటే యిక యిందులో సమస్య ఎక్కడుంది?

     జాగ్రత్తగా గమనించు: మనుష్యాత్మ పలుకులు = మానవ పలుకులు; దైవాత్మ పలుకులు దేవుని పలుకులు ఈ వ్యత్యాసాన్ని బైబిలు తేటగా సూచిస్తుంది (1 కొరింథీ. 2:11) - నా మాటలకు లేక భావాలకు - నా పొరుగువాని మాటలకు భావాలకు వ్యత్యాసం వస్తే అది సమస్యగా ఎంచనవసరం లేదు. అలాటప్పుడు దేవుని ఆత్మ పలుకులకు (1 కొరింథీ. 15:16-52), మానవ (యోబు) ఆత్మ పలుకులకు తేడా వస్తే, ఆ రెండింటిని ఒకటిగా కూర్చి, వాటి మధ్య పరస్పర విరుద్ధముందని మన మిత్రుడు అంటాడే! అవి మతి ఉండి పలికిన పలుకులేనంటావా? ఇలాటివారినే కలిపి చెరిపేవారనీ (2 కొరింథీ. 2:17), లేఖనాలను అపార్థం చేసేవారనీ (2 పేతురు 3:16) బైబిలు అంటుంది. వారు చేసేది - నీతి విరోధుల తప్పు బోధ అని (2 పేతురు 3:17) బైబిలు తేటగా సూచించింది.

     సరే అదలా పోనిచ్చి, 1 కొరింథీ. 15వ అధ్యాయానికి వద్దాం. అందులో వర్తమానమేమి? దానిలో అసందర్భంగా అక్కడక్కడ మాటలు లాగకముందు - దేన్ని స్థాపించడానికి ఆ అధ్యాయం వ్రాయబడిందో తెలిసికోవలసిన అవసరం లేదా? అయితే ఆ బాధ్యతను వదలి, మన మిత్రుడు ఆ అధ్యాయంలోని వర్తమానాన్ని తాను చూపిన వచనాల ద్వారా ట్విస్టు చేయడానికి ప్రయత్నించాడెందుకో? అలాటి అవినీతికి పాల్పడేదేనా హేతువాదమంటే!

     "క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడని ప్రకటింపబడుచుండగా, మీలో కొందరు - మృతుల పునరుత్థానము లేదని ఎట్లు చెప్పుచున్నారు?" అనేదే 1 కొరింథీ. 15వ అధ్యాయంలోని చర్చనీయాంశం (12 వచనం). ఈ పాయింటే అందులో పలు కోణాలలోనుండి చర్చించబడింది. ఆ వచనం ప్రక్కనే - మృతుల పునరుత్థానము లేనియెడల క్రీస్తు కూడా లేపబడలేదు” (13 వ) అనడంలో - మృతుల పునరుత్థానం తప్పకుండా ఉందని చెప్పడమే ఆ లేఖన భావం. మన మిత్రుడు కోట్ చేసిన 16వ వచనం, దాన్ని స్థాపించడానికే తిరిగి చెప్పబడింది. అయితే అతడు దాన్ని ప్రయోగించినట్టు బైబిలు మాత్రం ప్రయోగించలేదు. అదీ అతడు చేసే గారడీ!

     1 కొరింథీ. 15లో పౌలు ద్వారా యివ్వబడిన సందేశమేమంటే: క్రీస్తు మృతుల లోనుండి లేపబడిన మాట వాస్తవం; దాన్ని మేము కన్నులారా చూచాం (15:5-8). దీన్ని కాదనడానికి ఎవడి తరమూ కాదు; నా జీవితపు మార్పే దానికి ముద్రగా ఉంది. పాత నిబంధన లేఖనాలూ, అపొస్తలుల సాక్ష్యమూ, వారి బోధ, పునరుత్థానానికి రుజువులుగా ఉన్నాయ్; క్రీస్తు పునరుత్థానం ఎంత సత్యమో, "మృతుల పునరుత్థానం కూడా అంతే సత్యం" అనేదే 1 కొరింథీ, 15:16లోని పౌలు వర్తమానం! (అపొ. 17:30-31 వర్తమానాన్ని కూడా చూడు). 

     1. కొరింథీ. 15:52లో ఆ పునరుత్థానం జరుగబోయే విధానం ఎలా ఉంటుందో వివరించబడింది - "ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు.” (ఇంకా చూడు: 1థెస్స. 4:16–17 ఫిలిప్పీ 3:20). దానితో నీవు కూడా లేపబడేది ఖాయం! అయితే అందులో నీ పాలు కీడుచేసినవారితో లేకుండా యిప్పుడే జాగ్రత్తపడు! ఇది తమాషా కాదు! లేకుంటే నిత్య శిక్షను భరించవలసి వస్తుంది సుమీ (2 థెస్స. 1:6-8).
61. పునరుత్థానం ఫలం కాదన్న మాటేనా?
     దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. యోహా. 5:28, 29 (ఇంకా చూడు: ప్రక, 20:12, 13).

     బ్రతికి యుండువారు తాముచత్తురని యెరుగుదురు. అయితే చచ్చినవారు యేమియు యెరుగరు. వారి పేరు మరువబడియున్నది. వారికిక యే ఫలమును కలుగదు. ప్రసం. 9:5. (ఇంకా చూడు: ప్రసం. 3:21, 22).

     గమనిక: ఒకని వర్తమానాన్ని సంపూర్ణంగా వినకుండ, దానిలోని ఉద్దేశాన్నిసరిగా గ్రహింపకుండ అసందర్భంగా అక్కడక్కడ కొన్నిమాటలను మాత్రమే తీసికొని - వాటిమీద తప్పులు పట్టే ప్రయత్నాన్ని నీవు హేతువాదమంటావో? లేక మూఢవాదమంటావో! దాన్ని నీవేమన దలచుకొన్నా యిక్కడ మన మిత్రుడు చేసింది ఈ ఘనకార్యమే! ఇదే అతని విజ్ఞాన మార్గం!!

     అసందర్భంగా ప్రసంగిలో 9:5ని కోట్ చేశాడు; దానికి సపోర్టుగా మళ్ళా ప్రసంగి 3:21, 22ను చూడమన్నాడు. అయితే ప్రసంగిలోని ఉద్దేశాన్ని పూర్తిగా నిర్లక్ష్యపెట్టి, ఆ రచన ఉద్దేశింపని వర్తమానాన్ని మన మిత్రుడు దానికి ఆరోపించాడు. పైగా క్రొత్త నిబంధనలోని మరో లేఖనాన్ని సంబంధం లేకుండానే ప్రసంగితో ముడివేశాడు. అయినా ఆ సందర్భంలో ప్రసంగి ఏమన్నాడు? పునరుత్థానం లేదని ప్రసంగి అన్నాడా? లేదే! మరి ప్రసంగి ఏమన్నాడేం?

     ప్రసంగి తన రచనలో ఏమన్నాడంటే - "ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి' (12:13). ఇదీ అతని సందేశం.

     "ఏం? ఎందుకు? చచ్చిన తరువాత నిత్యత్వమో, పునరుత్థానమో, నిత్యనివాసమో - అట్టిది మరేదీ లేదని నీవన్నావంటగదా?" అని మనం ప్రసంగినడిగితే, ప్రసంగి సమాధానాన్ని తన రచనలోనే వినవచ్చు: - "నేను అలా అనలేదే! నా ఉద్దేశమది కానేకాదు. కావాలంటే 12:14ను చదివి చూడు; పునరుత్థానాన్ని గురించి నేను చెప్పింది అదే" అని ప్రసంగి అంటాడు. అక్కడేముంది? ఏముందో చూడు - 'గూఢమైన ప్రతి యంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని, చెడ్డదేగాని, తీర్పులోనికి తెచ్చును." అని వ్రాయబడియుంది. అయితే పునరుత్థానం లేకుండా, దేవుడు మానవ క్రియలను తీర్పులోనికి ఎలా తెస్తాడు? గనుక ఆయన వాటిని తీర్పులోనికి తెస్తాడంటే, పునరుత్థానం తప్పకుండా ఉందనే అతని భావం, పునరుత్థానాన్ని గూర్చి ప్రసంగిలో సమస్య లేదు. (ప్రసంగి 11:9-10ని చూడు). 

అలాటప్పుడు ప్రసంగి 3:21, 22లలో అతడు చర్చించిన సంగతులేమి? అవి కేవలం భౌతికమైన విషయాలే! - బ్రతికినవారు తాము చస్తామని ఎరుగుదురు. అయితే చచ్చినవారికి అలాటి జ్ఞానం లేదు. భూమిమీద వారి పేరు మరువబడుతుంది. వారికి యిక భౌతికమైన ఏ లాభము కలుగదు. దాన్ని ప్రసంగి యిలా వివరిస్తున్నాడు చూడు: “చనిపోయినవారిక ప్రేమించరు, పగ పెట్టుకోరు, భూమిమీద వారికిక ఎప్పటికిని వంతు లేదు" ఇదీ అతడు చెప్పేది! - "చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు" అని అతడు అందుకే అన్నాడు. పునరుత్థానాన్ని గూర్చి అతడు ఇక్కడ ఈ సందర్భంలో చర్చించలేదు. అంటే భూమిమీద జరిగే పనుల్లో, అనుభవాల్లో, చచ్చినవారికి వాటా లేదనేదే ప్రసంగి ఉద్దేశం (9:4-6). ఈ సంగతి పాఠకులకు తెలియకుండాలనే కాబోలు ప్రసంగిలోని లేఖన భాగాన్ని ప్రస్తావించినప్పుడు, దాని సందర్భాన్ని సూచించే 4, 6 వచనాలను మన మిత్రుడు వదలి, వాటి మధ్యనున్న 5వ వచనాన్ని మాత్రమే అసందర్భంగా కోట్ చేశాడు! ఇలా సత్యాన్ని మభ్యపెట్టేది ఎవరి మేలు కొరకో తెలియకుంది.

     అదెలాగున్నా ప్రసంగి వర్తమానాన్ని సంక్షిప్తంగా మరల అంటున్నా చూడు: మానవుడు చస్తాడనీ; మన్ను మంటికి పోతే, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందనీ (12:1–7), ఆ తరువాత (ఎప్పుడో) తాను జరిగించిన క్రియలను బట్టి - వాడు తీర్పులోకి తేబడుతాడనీ (12:13-14); చచ్చిన తరువాత మానవుడు తన గమ్యాన్ని మార్చుకోలేడనీ (9:4-6); గనుక బ్రతికిన దినాల్లోనే - యెహోవాయందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి సడుచుకోవాలనీ; సూర్యుని క్రింద భౌతికమైన సమస్తమూ వ్యర్ధమేననీ; ప్రసంగి ఉద్ఘాటించాడు. పునరుత్థాన ఫలం భూమిమీద అనుభవించేది కాదు అని ప్రసంగి సూచించాడు.

     ఇట్టి ప్రసంగి వర్తమానంతో - యోహాను 5:28, 29 పూర్ణంగా ఏకీభవిస్తుంది, గనుక పునరుత్థానం తప్పక ఫలమౌతుందన్నమాటే! "దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్నవారందరు (అంటే - శరీర ప్రకారం మరణించినవారందరు) ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానము నకును, కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు (యోహాను 5:28, 29). దీన్ని నమ్మడానికి ఏమైనా ఆధారముందా? అని అడుగుతావేమో! తప్పకుండా వుంది; చూడు.

     "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను (క్రీస్తును) లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు" (అపొ. 17:30-31) మార్పు పొందకపోతే, నీవు చేసిన వాటి ఫలాన్ని అనుభవించకుండ తప్పించుకోలేవు, భద్రము సుమీ! తియ్యని మాటలచేత నిన్నెవ్వడు మోసం చేయకుండునట్లు జాగ్రత్తపడు.
62. భూమి, యెహెూవా - ఎవరు శాశ్వతం?
     తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమి యొకటే యెల్లప్పుడు నిలుచునది. ప్రసం. 14 (ఇంకా చూడు: కీర్త 104:5).

     భూమియు దాని మీద నున్న కృత్యములు కాలిపోవును. 2 పేతురు 3 10.

     ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశమండలము నీ చేతి
పనియైనది. అవి నశించునుగాని నీవు శాశ్వతముగా నుందువు. హెబ్రి.1:10, 11.

     గమనిక: ఇదొక అర్థరహితమైన ప్రశ్న! ఈ వేర్వేరు కాలాలకు, వ్యక్తులకు, పరిస్థితులకు చెందినవాటి మధ్య పరస్పర విరుద్ధం చూపడానికి ప్రయత్నించడం అర్థరహితం, అవివేకం, తార్కిక జ్ఞాన విరుద్ధం కూడా, అయితే మన విమర్శకుడు లేఖనాలను కోట్ చేయడంలో ఈ పనినే జరిగించాడు చూడు!

     మొదటిది: భూమికి, మర్త్యుడైన శరీరికి మధ్య చూపబడ్డ పరిస్థితి
     రెండవది: అంత్య తీర్పులో భూమ్యాకాశాలకు సంభవించే నిజస్థితి
     మూడవది: సృష్టికర్తకు ఆయన సృష్టికి మధ్యగల యథార్థమైన స్థితి
     ఈలాటి వాటి మధ్య అసంబద్ధమున్నదని చెప్ప తగునా? అలా చెప్పితే, అది జ్ఞానమగునా?

     శరీరికి, భూమికి మధ్యగల పోలికలో - భూమి శాశ్వతం; నరుడు అశాశ్వితుడు. అయితే సృష్టికర్తకు సృష్టికి మధ్యగల పోలికలో - దేవుడు శాశ్వతుడు, ఆయన నిత్యుడు; ఆయన సృష్టి అశాశ్వతం; అంత్య దినమున అది కాల్చివేయబడుతుంది! ఇదే పై లేఖనాలలో భావం వాటిలో ఏ సమస్యా లేదు. మన మిత్రుడు బైబిలుమీద ఈలాటి అర్థరహితమైన ప్రశ్నలు వేసి తన పరువును తానే పొగొట్టుకున్నాడు.
63. ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా?
     ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. యోహా. 1:18. 

     మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. ఎవడును చూడనేరడు. 1 తిమొ 6:16 (ఇంకాచూడు: యోహా. 4:24; నిర్గ 33:20).

     తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల పెద్దలతో డెబ్బదిమంది యెక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. నిర్గ 24:9, 10.

     మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతోముఖాముఖిగా మాట్లాడెను. నిర్గ. 33:11. 

     యాకోబు - నేను ముఖాముఖిగా దేవుని చూచితిని; అయినను నా ప్రాణము దక్కినది. ఆది 32:30. (ఇంకా చూడు: నిర్గ, 33:21-23; ఆమో 9 1; ఆది 26:1, 2;
యెహా.14:9).

     గమనిక: ఒక చోట ఎవడూ దేవుని చూడలేదని ఉంది; మరో చోట దేవుని చూచారని ఉంది; ఇలాటి పరస్పర విరుద్ధ భావాలను చూపే బైబిలు తప్పు కాదా? అని మన విమర్శకుడు అడుగుతున్నాడు! కాని ఇందులో తార్కిక విరుద్ధం లేదని అతడెరుగలేక పోవడం శోచనీయం.
ఎలాగంటావేమో! మానవ అనుభవంలో, కొన్నింటికి: వాస్తవాలు వేరుగా; వాటి వ్యవహారికాలు వేరుగా ఉంటాయి! ఈ సంగతి నీకు తెలియదా? ఉదా: "సూర్యోదయం, సూర్యాస్తమయం” అనేవి వ్యవహారికాలే; వాస్తవాలు కావు, భూమి సూర్యునిచుట్టు తిరుగుతుందనేది వాస్తవం! అయినా ప్రొద్దు పొడిసిందని ప్రొద్దుకుంకిందని వ్యవహరిస్తుంటాం. ఒకవైపు అవి వాస్తవాలన్నట్టు కన్పిస్తాయి; అయినా అవి వాస్తవాలు కాకుండా నిలిచియుంటాయి; కదూ? ఇలాటి "వ్యవహారికాలు" - "వాస్తవాలు" ఒకదానికొకటి విరుద్దాలయినా, వాటిని సమస్య లేకుండా అంగీకరిస్తాం! దేవుని చూచే విషయంలో అలాటి పరిస్థితినే - పై లేఖనాలు వివరిస్తుంటే, వాటిలో సమస్య ఎలా ఉంటుందో!?

     దేవుడు ఆత్మ ("ఇంకా చూడు" అంటూ యోహాను 4:24ను చూపుతూ మన విమర్శకుడే ఈ సత్యాన్ని అంగీకరించాడు). ఆత్మ గనుక దేవుడు తన స్వభావాన్ని బట్టి అదృశ్యుడు. అదృశ్యమైనవి తమ చర్యల ద్వారానే తమ ఉనికిని బయలుపరచుకొంటూ ఉంటాయ్. వాటి చర్యల వల్లనే ఆ వాస్తవాలను మానవుడు గ్రహించగలుగుతాడు.

     మానవ కన్నులకు అగోచరమైన విద్యుత్ ప్రవాహాన్ని గూర్చి నీకేం తోస్తుంది? దానితో నిరంతర సంబంధంగల ప్రముఖ మేధావుల్లో సయితం; ఏ ఒక్కడూ తన కన్నులతో దాని రూపాన్ని చూచియుండడు. అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఎవడును ఎప్పడైనను చూచియుండలేదనే చెప్పాలి. అయితే దిన చర్యలో విద్యుత్తును చూచినట్టే వ్యవహరిస్తాం! “కరంటుందా?'; 'లేదు - పోయింది'; 'కరంటు వచ్చిందేమో చూడు" - (స్విచ్ నొక్కి విద్యుత్ ప్రవాహాన్ని కన్నులారా చూచినట్టే) “వచ్చింది” అని అంటాము. ఈలాటి జీవిత అనుభవాలు అదృశ్యమైనవి గోచరిస్తున్నట్టే ప్రతిధ్వనిస్తున్నాయ్. వీటిని పరస్పర విరుద్ధంగా భావించడం బుద్ధిహీనతే ఔతుంది. పైన కోట్ చేయబడ్డ లేఖనాలు ఈలాటి పరిస్థితిని సూచించేవే గనుక వాటిని తప్పుగా వ్యాఖ్యానించడం బుద్ధిహీనతే గదా? ప్రాణాన్ని ఎప్పుడైనా చూచావా? అయినా దాన్ని చూచినట్టే వ్యవహరించడం లేదా?

     ఆత్మ రూపం భౌతిక నేత్రాలకు అదృశ్యమే గనుక, భౌతిక నేత్రాలతో ఎవడును, ఎప్పుడైనను దేవుని చూడలేదనేది వాస్తవం. అయితే దేవుని చూచామని బైబిలులో చెప్పుకున్నవారు ఆయన చర్యలను చూచారు; ఆయన తన చర్యలద్వారా వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన ఆయన చర్యలవలననే దేవుడు వారికి గోచరించాడు; Perception is a mental act; seeing is a physical act. They perceived God with their intellect which is described as seeing God! ఇందులో పరస్పర విరుద్దానికి తావులేదు. బైబిల్లో తప్పు ఏదో మొత్తానికి పట్టినట్టు మన మిత్రుడు భావించాడు గాని; అది కూడా అతని చేజిక్కకుండ ఎగిరిపోయింది. బైబిలులో తప్పులు పట్టటానికి పడిన మన మిత్రుని పాటు, ఒకడు తన పిడికిళ్లతో గాలిని పట్టడానికి పడిన పాటులా ఉంది.

     వారి పాటు అలాటిదని తెలిసియుండి కూడా, కొందరు సత్యాన్ని అంగీకరించరు. వారి అసత్య మార్గాల్లోనే పయనించుతూ ఉంటారు. తమకు మతం లేదని చెప్పుకుంటారు కాని, అదే వారి మతం, మతం లేనివాడైతే సత్యాన్ని అంగీకరించి తీరాలి కదా? కాదనలేని సత్యం కండ్లకు ఎదురుపడినా దాన్ని అంగీకరించలేని రెటమతం కొందరిది. అట్టివారు హేతువాదులు కారు, కానేరరు!
64. ద్విగుణ వ్యక్తిత్వం
     దేవుడు సమాధానమునకే కర్తగాని, అల్లరికి కర్తకాడు. 1 కొరిం. 14:33. నేను వెలుగును సృజించువాడను; అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను; కీడును కలుగజేయువాడను నేనే. యెష. 45:7 (ఇంకా చూడు: న్యాయా. 9:23, 24; 2 థెస్స. 2:11, 12).

     గమనిక: తన వ్యక్తిత్వాన్ని గూర్చిన ఆలోచన కొంచెమైన లేకుండానే, మన మిత్రుడు దేవుని వ్యక్తిత్వంపై దాడి చేయ ప్రయత్నించాడు. ఇలాటి దుస్థితిని విపరీత వాదమంటారు. అయితే దేవుని వ్యక్తిత్వంలో గాని, ఆయన స్వభావంలోగాని ఎలాటి సమస్యా లేదు, చూడు.

     మానవుడు దేవుని స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున చేయబడినవాడే (ఆది 1:26), గనుక మొదట మానవ వ్యక్తిత్వాన్ని ఆలోచిస్తూ, దేవుని వ్యక్తిత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం. మానవుడు పరస్పర విరుద్ధ గుణాల ప్రతిరూపమై ఉండి కూడా, తన వ్యక్తిత్వాన్ని ఏకైక వ్యక్తిత్వంగానే రూపొందించుకుంటాడు. తన స్వభావానికి విరోధంగా చేయ నేర్చిన మానవుడే తన వ్యక్తిత్వాన్ని ఏకైక వ్యక్తిత్వంగా రూపొందించుకోగలిగినప్పుడు, తన స్వభావానికి విరుద్ధంగా ఏమియు చేయలేని దేవుడు తన వ్యక్తిత్వాన్ని ఏకైక వ్యక్తిత్వంగా రూపొందించుకున్నాడనడంలో ఆశ్చర్యం లేదు (2 తిమో 2:13). ఉదాహరణలు సంగతులను విశదపరుస్తాయ్, చూడు.

     మానవునిలో ప్రేమా, ద్వేషాలు; కోపం, శాంతాలు; అసూయ, అప్యాయతలు; కనికరం, కాఠిన్యాలు; వగైరా విరుద్ధ గుణాలు మేళవించబడినవై వానిలో యిమిడి ఉన్నాయ్, ఈ గుణాలన్నీ మనిషిలో తగు పాళ్లలో లేకపోతే, అలాటి వ్యక్తిని మానవుడనడానికే వీలుండదేమో! అయితే మనిషిలో ఈ గుణాలన్నీ మిళితమైయున్నందున వానిని ద్విగుణ వ్యక్తిత్వం (బహు గుణ వ్యక్తిత్వం) గలవాడని అంటామా? అనం! ఎందుకంటే - మనిషికి ప్రేమ ఎంత అవసరమో, ద్వేషం కూడా అంతగా ఉంటేనే మనిషి మనిషిగా తన వ్యక్తిత్వాన్ని పెంచుకొనే వీలుంటుంది. ఇలా అంటే చదువరికి వింతగా వినిపిస్తుందా? అయితే ఓ ఉదాహరణతో విషయం తేటబడుతుంది.

     ఉదా: ఓ మనిషికి ప్రేమ మాత్రమే ఉండి, ద్వేషం లేదనుకో! అలాటివానికి సరైన వ్యక్తిత్వం ఉండదు. ఎందుకో తెలుసా? వాడిలో ఉండేది కేవలం ప్రేమే గనుక - అతడు నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ప్రేమిస్తాడు; మంచినీ ప్రేమిస్తాడు; చెడ్డనూ ప్రేమిస్తాడు. అలాటివాడు విచక్షణా జ్ఞాన శూన్యుడౌతాడు. లేక ఒకవేళ ద్వేషమే వానిలో ఉండి ప్రేమ లేదనుకో తక్కినవాటితో పాటు - వాడు నీతిని, మంచిని, మంచివారిని, జ్ఞానాన్ని సహా ద్వేషిస్తూనే ఉంటాడు. ఒకే ఒక్క గుణంతో మనిషి మనిషిగా ఉంటాడా? అలాటప్పుడు దేవునికి కూడా ఒకే గుణముండాలి అనే మన మిత్రుని వాదన అర్థరహితమైనదంటారా? కాదంటారా?

     ఒక వ్యక్తిలో ఉండే పరస్పర విరుద్ధ గుణాలు వానిని ద్విగుణ వ్యక్తిగానో, లేక బహు గుణ వ్యక్తిగానో చేయవు సరిగదా, అవి లోపించినవాడు మానవ - వ్యక్తిగా రూపొందలేడు. పైగా ఆయా సమయాలలో అవసరమైన విరుద్ధ చర్యలు మానవ వ్యక్తిత్వాన్ని ఎలా ఏకైకంగా తీర్చి దిద్దుతాయో యింకా చూడు!

     "ప్రతి దానికి సమయము కలదు. నాటుటకు నాటిన దానిని పెరికివేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, . అలాగే ప్రతిదానికి (ప్రసంగి 3:1- 8). ఒకవేళ, నాటినవాడే పెరికివేస్తే; పడగోట్టినవాడే కడితే; ఏడ్చినవాడే నవ్వితే; చింపినవాడే కుట్టితే - ద్విగుణ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించినవాడు కానవసరం లేదు కదూ? ఆయా సమయాల్లో అవసరాన్ని బట్టి పరస్పర విరుద్ధ చర్యలను జరిగించి కూడా, మానవుడు ఏకైక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొంటున్నప్పుడు - దేవునిది ద్విగుణ వ్యక్తిత్వం అనడం మతిహీనతేనంటావా? లేదా?

     నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించడం; సత్యాన్ని జరిగించి, అబద్ధాన్ని తిరస్క రించడం, వగైరా చర్యలవలన (హెబ్రీ. 1:9), దేవుని వ్యక్తిత్వం పరిశుద్ధమైనదిగా నిలిచియుంది. పైగా ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమియు చేయలేనివాడై ఉన్నందున, దేవుడు అద్వితీయుడునూ, సత్యవంతుడునై యున్నాడు (యోహాను 17:3). ఎప్పుడు ఏది జరిగించాలి? అనే సంగతులను పరిపూర్ణంగా ఎరిగి, అప్పుడే వాటిని జరిగించు దేవుడు - ద్విగుణ వ్యక్తిత్వం గలవాడుగా ఎలా ఉంటాడు?? సరి. అది అలా ఉంచు. ఇప్పుడు మన మిత్రుని పరిస్థితిని ఆలోచిద్దాం.

     నియమానికి విరోధంగా ప్రశ్నించడమే - హేతువాదమా? లేక అక్రమంగా లేఖనాలను ముడివేయడమే - హేతువాదమా? అయినా 1 కొరింథీలోని సందర్భమేది? యెషయా 45:7లోని సందర్భమేది? ఈ రెండింటిని ముడివేయవచ్చునా? చేతగాని పనులు చేసి, జ్ఞానులమనుకోవడం - వెర్రితనం: మూఢత్వం. ఇంతకుమించి అతని రచనలో యింకేమీ లేదు.

     ఇకపోతే బైబిలు చూడు. కొరింథీ సంఘంలో అనుగ్రహింపబడిన కృపావరాలను సద్వినియోగం చేసుకోలేక, అసభ్యంగా సంఘ కూడికల్లో ప్రవర్తిస్తున్న క్రైస్తవులను హెచ్చరించడానికి 1 కొరింథీ. 14:33 ఉద్దేశింపబడింది. పైగా పూర్ణంగా వేరైన సందర్భాన్ని సూచించే యెషయా 45:7తో దాన్ని ముడివేయడం అవివేకం.

     పాత నిబంధనను బట్టి - తానే ఏర్పరచుకొన్న ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు మానవ రాజ్యాలలో జోక్యం పుచ్చుకొననుద్దేశించిన దేవుని స్వరం యెషయా 45; 7లో వినిపిస్తుంది. అట్టి సందర్భంలో, నీతి న్యాయములను బట్టి తాను అంతకుముందు ఉపయోగించుకొని హెచ్చించిన బబులోనును, దాని దుష్టత్వాన్ని బట్టి కూలద్రోసే ఆయన సమయం ఆసన్నమైంది. ఆయన దానికి తీర్పు తీర్చబోతున్నాడు గనుక (Cyrus) కొరేషు ద్వారా బబులోనుకు చేటును సూచించిన లేఖనమే యెషయా 45:7. బబులోనును హెచ్చించిన దేవుడే, మానని దాని చెడు తనాన్నిబట్టి తిరిగి శిక్షింప బోవుచున్న సందర్భంలో పలికిన మాటలివి. ఇలా సంగతులు తెలియని మన మిత్రుడు తెలిసినవాడులా మాట్లాడ డమే - తన రచనలో జరిగింది; అదే అతని హేతువాదపు బండారం!
65. సాధ్యం; అసాథ్యం
     దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు 10:27(ఇంకా చూడు: మత్త 19:26; ప్రక, 19: 6, 7; ఆది 17:1 యోహా, 3:35).

     యెహోవా యూదా వంశస్తులకు తోడై యున్నందున వారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుప రథములు న్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి, న్యాయా 1:19 (ఇంకా చూడు: మార్కు. 6:5).

     గమనిక: "సాధ్యం, అసాధ్యం" అన్నమాటలను చూడగనే భ్రమపడి బైబిలులో తప్పుందనే ఆలోచనలో పడతారేమో సుమీ! సాధ్యం, అసాధ్యం అనే మాటలు పరస్పర విరుద్ధాలే- అయినా, అవి తార్కిక విరుద్ధాలు కానక్కరలేదు. తార్కిక విరుద్ధం ఎలాటిదో ఎరుగక మన మిత్రుడు ఈ పాటు పడ్డాడు! అంతేగాని బైబిలులో సమస్య లేదు, చూడు.

     ఒకే విషయం ఒకే సమయ సందర్భంలో, “అవును”, “కాదు" అన్నట్టు ఉంటే - అలాటిదాన్ని తార్కిక విరుద్ధంగా భావించవచ్చుగాని, మన మిత్రుడు చూపిన లేఖనాల్లో అలాటి పరిస్థితి లేదు. ఓ ఉదాహరణ ఈ విషయాన్ని తేటపర్చుతుంది. ఉదా: శక్తిని బట్టి, తెలివిగల ప్రతివాడు మోసగాడుగా ఉండే అవకాశముంది; అయితే స్వభావాన్ని బట్టి తెలివిగల ప్రతివాడు మోసగాడుగా ఉండనవసరం లేదు. గనుక శక్తి వేరు, స్వభావం వేరు అని తేలిపోయింది. అవి రెండూ విరుద్ధాలుగా ఉన్నా అవి తార్కిక విరుద్ధాలనబడవు. యౌవన బలమున్నవాడు వ్యభిచారి కాకపోతే - అసంబద్ధమౌతుందా?

     అలాగే "శక్తిని బట్టి" దేవునికి సమస్తమును సాధ్యమే (ఆది. 18:14). అయితే స్వభావాన్ని బట్టి - దేవునికి సమస్తమును సాధ్యం కాదు. అదెలా? అని అడుగుతావేమో! దేవుడు సత్యస్వరూపి గనుక ఆయన అబద్ధికుడై ఉండుట అసాధ్యం (హెబ్రీ. 6:17-18). ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమియూ చేయడు (2 తిమోతి 2:13). తన స్వభావానికి విరోధంగా అబద్ధమాడలేకపోతే, దేవుడు చేతగానివాడనా దాని భావం? మనిషి, మనిషి కానట్టు ప్రవర్తించగలడు. అలా ప్రవర్తించడానికి వాడు నేర్చుకొన్నాడు; దానికి అలవాటుపడ్డాడు కూడా! దేవుడైతే తాను దేవుడు కానట్టు తన స్వభావాన్ని మార్చుకోలేడు. గనుక “సాధ్యం, అసాధ్యం" అనేది ఈ సందర్భంలో కూడా పరస్పర విరుద్ధాలుగా దేవునికి వర్తించవు.

     దేవుని యొక్క శక్తికీ, ఆయన స్వభావానికీ మధ్య ఉన్న వ్యత్యాసమే అసంబద్ధం కానప్పుడు; దేవుని శక్తికీ, ఆయన శక్తి మానవుల ద్వారా వినియోగింపబడే విధానానికీ మధ్య పోలిక కుదరలేదనడం, దాన్ని సమస్యగా చూపడం - కేవలం తెలివితక్కువ తనమే! దేవుని యొక్క సర్వశక్తి మహా విశ్వంలో ప్రత్యక్షంగా కన్పిస్తుంది. అలాటి శక్తిని దేవుడు మానవుని ద్వారా బయలుపరచుకోవాలనుకున్నా మానవ స్వేచ్ఛాచిత్తాన్ని ఆయన త్రోసివేసి దానిని ప్రదర్శించడు. మానవుడు స్వేచ్ఛాచిత్తం గలవాడు గనుక తన విశ్వాసం మేరకే దాన్ని నరుడు వినియోగించుకోగలుగుతాడు. బైబిలు తెలిపే సందేశమిది. “ఇంకా చూడు" అంటూ మన మిత్రుడు చూపిన మార్కు 6:5లో కూడా ఈ సంగతి బయలుపడుతుంది.

     ఉదా: రాత్రి నాల్గవ జామున ప్రభువు నీళ్లమీద నడుస్తూ, తన శిష్యులు పయనిస్తున్న దోనెకు ఎదురుగా వచ్చాడు. శిష్యులు ఆ దృశ్యాన్ని చూచి భయపడ్డారు. గనుక ప్రభువు వారిని ధైర్యపరచడానికి “నేనే, భయపడకుడని” తెలిపాడు. ఆ సమయంలో "పేతురుప్రభువా, నీవే అయితే, నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన (అన్నాడు). ఆయన రమ్మనగానే, పేతురు నీళ్లమీద నడిచాడు గాని, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు ." (మత్తయి 14:22-30). విశ్వాసం ప్రభువు మీద నిలిపినంతవరకు దైవశక్తిని బట్టి, పేతురు నీళ్లమీద నడవగలిగాడు. అయితే ఆ తరువాత గాలిని చూచి అతడు భయపడ్డాడు; విశ్వాసాన్ని కోల్పోయాడు; గనుక కొన్ని క్షణాలకు ముందుగా విశ్వాసం ద్వారా తాను వినియోగించుకొన్న దైవశక్తిని ఆ తరువాత వినియోగించుకోలేక పోయాడు. దోషమెవరిది?

     ఇదే సూత్రం న్యాయాధి. 1:19లో కన్పిస్తుంది. మన్య దేశవాసులతో పోరాడినప్పుడు యూదా వంశస్థులు విశ్వాసం ద్వారా దేవుని సహాయంతో విజయాన్ని సాధించారు. అయితే పేతురు గాలిని చూచి భయపడి విశ్వాసాన్ని కోల్పోయినట్టు, యూదావారు మైదానంలో నివసించే వారి ఇనుప రధాలను చూచి విశ్వాసాన్ని కోల్పోయి భయపడ్డారు. గనుక దైవ సహాయాన్ని పొందలేకపోయారు. మనుష్యులు తమ అవిశ్వాసాన్ని బట్టి దైవ కృపను పొందలేక పోవడాన్ని దేవునిమీద నేరంగా మన మిత్రుడు చూపడం అవివేకం; ఇలాటి అవివేకమే ఆతని హేతువాదమేమో?

     న్యాయాధి. 1:19లోని లేఖనం ఎలా ఉందంటే: రిజర్వాయరు నిండా నీళ్లున్నందున పడమటి పొలాలు తడిపారు; ఐతే తూర్పు పొలాల్లో యింకా గడ్డి కుప్పలు అలాగే ఉన్నందున వాటిని తడపలేకపోయారు. అలా తడపలేకపోవడానికి రిజర్వాయరులో నీళ్లు లేకపోవడం కారణమా? కాదు! అయితే మన మిత్రుడు “అవును" అని అంటున్నాడు. ఇలాటి అవివేక వాదనలవలననే, పైన తాను కోట్ చేసిన లేఖనాలలో సమస్య ఉందంటున్నాడు. ఇదే ఆయన "బండారం!" బైబిలు దానికి దూరంగానే ఉంది! అంటే బండారం యింతకు బైబిలుది కాదన్నమాటే గదూ?
66. సుబుద్ధి; దుర్బుద్ధి
    ప్రభువు ---- ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక ----- దీర్ఘ శాంతము కలవాడై యున్నాడు. 2 పేతు, 3;9. 

    యెహోవా ప్రతి వస్తువును దాని నిమిత్తము కలుగజేసెను కీడుననుభవించుటకై భక్తిహీనులను కలుగజేసెను. సామె. 16:4.

     గమనిక: ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక . దీర్ఘశాంతం చూపే ప్రభువు - కీడుననుభవించడానికి భక్తిహీనులను కలుగజేశాడంటే - అది అసంబద్ధం కాదా? అని మన మిత్రుడడుగుతున్నాడు. ఇలా అడగడం "పద్య, గద్య" పద ప్రయోగాలు; జీవిత వాస్తవాలు, లేఖన భావాలు తెలియకపోవడమే కారణాలు గాని, లేఖనాలలో సమస్య నిజంగా ఉన్నందున కాదు. పై లేఖనాల్లో - సుబుద్ధి; దుర్బుద్ధి అనడానికి తావులేదు చూడు.

     దేవుడు ప్రతి వస్తువును దాని దాని పనికొరకు సృజించిన మాట వాస్తవం. అర్థ రహితంగా, అనవసరంగా ఆయన ఏ వస్తువును సృజింపలేదు. మానవుని నిర్మించడంలో ఆయనకు అన్నిటికంటే ఘనమైన ఉద్దేశముంది. అంటే భూమిమీద మానవుడు దైవ సహవాసంతో నీతి న్యాయాల ననుసరించాలనీ, రుజుమార్గంలో వాడు సుఖసంతోషాల ననుభవించాలనీ, ఆయన కోరి వానిని నిర్మించాడు. పైగా అలా జీవించినవారిని తగిన కాలమందు క్రీస్తుతో కూడ తానుండే స్థలంలో మహిమపరచాలనే ఆయన నరుని నిర్మించాడు (ఎఫెసి. 1:3–9).

     అయినా అట్టి ప్రేమా స్వరూపియైన దేవుని కోర్కెను ఎరుగక, దాన్ని త్రోసివేసి, మానవుడు దుష్టుడై చెడుతనం జరిగించినా, తాను తెలియక చేసినవాటిని బట్టి మానవుని త్రోసివేయక, క్రీస్తునందు వానిని తనతో సమాధానపరచుకో జూచి, కాలం సంపూర్ణమై నప్పుడు, దేవుడు తన కుమారుని పంపాడు (2 కొరింథీ. 5:18–21; గలతీ. 4:4-6). ఆయన..... తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మనయెడల విస్తరింపజేశాడు (ఎఫెసీ. 1:8-9).

     మానవ స్వేచ్ఛాచిత్తానికి అంతరాయం కలుగకుండ, నీతిన్యాయముల పాలకుడుగా దేవుడు, క్రీస్తు యేసు ద్వారా, "నీతిననుసరించి భూ లోకానికి తీర్పు తీర్చబోయే" ఒక దినం నియమించాడు. క్రీస్తు పునరుత్థానం ద్వారా దీన్ని నమ్మడానికి ఆధారము కలిగించాడు (అపొ. 17:30-31). ఇంత జరిగించి కూడా, ఎవడును నశింపవలెనని యిచ్చయింపక "అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు? మీ యెడల దీర్ఘశాంతము కలవాడైయున్నాడు. ఆ దీర్ఘశాంతం అందరు మారుమనస్సు పొందవలెనని కోరేదే.  అయితే లేఖనంలో ఏదీ కీలకమో దాన్ని మభ్యపెట్టడమే మన మిత్రుని హేతువాదం కదూ! అందుకే ఆ మాటలను . . . . డాట్సు పెట్టి వదిలేశాడు. ‘నరుడు మారుమనస్సు పొందాలి" అనే దేవుని యిచ్చలో ఈ వాస్తవం యిమిడియుంది. ఏమంటే- నరుడు యితరులకు కీడు చేసే స్థితినుండి, తన స్వేచ్ఛాచిత్తాన్ని మేలుచేసే దానిగా మార్చుకోవాలనే దేవుని కోరిక అందులో యిమిడి ఉంది. అంటే మానవుడే తన మార్గాన్ని మార్చుకోవాలి! మానవుడు తన స్వేచ్ఛాచిత్తంతో చేయవలసిన తన పనిని దేవుడు వానికొరకు చేయడు. నా బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలని నేను కోరతాను గాని, వారి కొరకు నేను చదువలేను. అలాటిదే దేవుని పరిస్థితి. అయితే ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైనది (2 పేతురు 3:15), అది నరుడు మేలు పొందాలని కోరేదే!

     ఒకవేళ మార్చుకొనే మనస్సే మానవునికి లేకపోతేనో? “దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహై శ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొను చున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు .... శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్తునికి కూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు" (రోమా 2:4-11).

     ఇలా లేఖనాలలో మనం ఎక్కడ చూచినా, మానవ స్వేచ్ఛా చిత్తం ప్రతిధ్వనిస్తుంది. దైవ సహవాసానికై క్రీస్తునందు ద్వారం తెరువబడినా, మానవుడు దాన్ని కావాలని కోరుకుంటేనే, అది వానికి లభిస్తుంది: అసలు భక్తిహీనుడయ్యేలా దేవుడు మానవుని చేయలేదు (ప్రసంగి 7:29). భక్తిహీనత అనేది మనుష్యుని సొంత హృదయ వాంఛనుండి కలిగిందే; అది అతడు కావాలంటే వచ్చింది (రోమా 1:18-25). మనుష్యుడు తన స్వేచ్ఛాచిత్తాన్ని బట్టి భక్తిహీనుడైనా, అతడు తన భక్తిహీనతను బట్టి నశించిపోకూడదని ఎంచిన దేవుడు, వాడు మారుమనస్సు పొందాలనే కోరుకుంటున్నాడు. వాని నిత్య గమ్యాన్ని వాడే మార్చుకొనకపోతే, దానికి దేవుడేం చేస్తాడు? దుష్టత్వం, భక్తిహీనత అనేవి నరుడు తనకై తెచ్చుకున్న సమస్యలు.

     ఓ ఉదాహరణ సంగతిని తేటపరుస్తుంది చూడు! తోటను వేసుకున్నవాడు అందులో నాటుకున్న ప్రతిచెట్టూ దాని దాని కాలంలో ఫలమియ్యాలనే నాటుకుంటాడు గదా? తన కాలంలో ఫలించని చెట్టుకు మరికొంత శ్రద్ధ చూపి, కావలసిన జాగ్రత్తలు తీసుకొంటాడు. అతడెంత చేసినా తన తోటలో ఒక చెట్టు ఫలించేలా లేదు. "ఏమండీ! దీనికెంత చేసినా కాయలు రానేలేదే! అని అతని భార్య ఆశ్చర్యపోయింది.

      ‘అది పొయ్యిలోకేలే” అని అన్నాడు ఆ తోటమాలి! ఇలాటి భావం బైబిలుకు దూరమయ్యింది కాదు; యెహెజ్కేలు 15:1-8ని దీనితో పోల్చి చూడు. అయితే ఆ తోటమాలి ఆ చెట్టును పొయ్యిలోకనే నాటాడా? లేదు. మరి - "అది పొయ్యిలోకేలే? అని అంటాడేమి? అలా అనడంలో, తోటమాలి దానిని గూర్చి తన నిరాశనే వ్యక్తపరచాడు; దాని విషయమై తన ప్రయాస వ్యర్థమయ్యిందనే నిస్పృహనే అతడు బయటపెట్టాడు. ఎంత చేసినా, ఫలించని చెట్టును గూర్చి తోటమాలి భావన ఎలాటిదో, ఎంత చేసినా మార్పుపొందని భక్తిహీనుల పట్ల దేవుని భావం కూడా అలాటిదే! సామె. 16:4లో సూచింపబడింది యిదే, ఇలాటిదాన్ని "సుబుద్ధి, దుర్బుద్ధి" అని వర్ణించడమే హేతు వాదమంట! విజ్ఞాన మార్గంలో, మన మిత్రుని పయనం యిలాటిదేనట!
సరే దాన్ని అలా ఉంచుదాం, జెఫన్యా2:1-2లో మహోన్నతుడు యిలా అంటున్నాడు చూడు - "సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడి రండి?

     బైబిలు చదివినప్పుడు మన మిత్రునికిది కనబడలేదా? కనబడితే అర్థం కాలేదా? "సిగ్గుమాలిన జనులారా, కూడిరండి" అంటూ ఆయన భక్తిహీనులను పిలిచాడు! ఎందుకో? ఎందు కంటే, వారు తమ మార్గాలను మార్చుకోడానికి! "మార్చుకోని వారి విధి"; సమయాన్ని దుర్వినియోగం చేసి, "తమ చెడు మార్గాలలో పోయే వారి విధి" - నిర్ణయం కాకముందే యెహోవా కోపాగ్ని వారి మీదికి రాకముందే! యెహోవా కోపాగ్ని ఎప్పుడు రగులుకొంటుంది? కృపను తిరస్కరించినప్పుడు: తన చెడు మార్గాన్ని సాటివారికి తాను జరిగించే కీడు నరుడు మానలేనప్పుడు; వాడు దానిలో స్థిరపడినప్పుడు - ఇలాటివారిని సూచించడానికే సామె. 16:4 ఉపయోగింపబడింది. అట్టివారు మరి ఏ సత్కార్యానికీ పనికిరానివారై - కీడుననుభవించుటకే పుట్టారా? అన్నట్టున్నారు. అయితే చదువరి పరిస్థితి ఏలాగుందో కాని భక్తిహీనులను గూర్చిన అక్కడ సమాచారమిది.

     నీవు ఎటు తిప్పి చూచినా, బైబిలు లేఖనాలను వాటి సమయం సందర్భం ఉద్దేశం అనేవాటిలో చూచినట్లయితే - వాటిలో ఏ లోపమూ కన్పించదు. ఆలాటి వివేక మార్గమును అనుసరించి బైబిలును పరిశీలించిన ఎవనికి అందులో దోషాలు కానరావు. అయితే తెలియనివన్నియు తప్పులనేవానికి; లేదా తన విశ్వాసానికి, మార్గానికి బైబిలు అడ్డుగా నిలిచి ఉంది అని అనుకునేవానికి, తన "అలుకను బట్టి" లేని తప్పు ఉన్నట్టు కన్పిస్తుందేమో గాని, వాస్తవంగా బైబిల్లో తప్పులు ఉన్నట్టు ఎవడూ చూపలేడు.
67. సదభిప్రాయం; దురాచరణ
     ఆయన మనుష్యులందరును రక్షణపొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలవారై యుండవలెనని ఇచ్చయించు చున్నాడు. 1 తిమో.  2:4.

     వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను. యోహా 12:40, (ఇంకా చూడు: రోమా 9:18).

     గమనిక: మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై యుండాలని యిచ్చయించు దేవుడు, - వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచబడకుండునట్లు - ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి, వారి హృదయాలను కఠినపరచమంటున్నాడేమి? ఇది పరస్పర విరుద్ధం (అసంబద్ధం) కాదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు.

     అయినా మన మిత్రుడు యిక్కడ యింత జాగ్రత్తగా లా పాయింటు లాగినప్పుడు - అభిప్రాయమెప్పటిది? ఆచరణ ఎప్పటిది? అనే విచక్షణా జ్ఞానం మన మిత్రునికి ఉండనవసరం లేదా? ఈలాటి కనీసపు విమర్శనా జ్ఞానం మన మిత్రుడు ప్రదర్శించక పోవడం శోచనీయం కదూ? ఒకవేళ సదభిప్రాయం ముందుదైయుండి దానికి సంబంధించిన దురాచరణ తరువాత వచ్చిందైయుంటే, విమర్శకు తావుండేదేమో గాని; ముందే దురాచరణ ఉండి, ఆ తరువాత సదభిప్రాయం వచ్చిందనుకో, అక్కడ సమస్య ఉండడానికి వీల్లేదు. అయినా, పై లేఖనాలు విమర్శింపబడడానికి వాటిలో కనీసం యిలాటి పరిస్థితి కూడా లేదే!

     దురాచరణ అంటూ మన విమర్శకుడు యోహాను 12:40ని చూపాడే! ఆ లేఖనాన్ని చూపడంలో - యోహాను 12లోని ఉద్దేశాన్ని అతడు (గుర్తించాడా?) లక్ష్యపెట్టాడా? ఆ అధ్యాయంలో అసలు ఎలాటి పరిస్థితులు వర్ణించబడ్డాయో చూడు. యోహాను 12:40లో - యెషయా 6:10 కోట్ చేయబడింది. ఆ సంగతైనా అతనికి తెలుసా? యోహాను తన రచనలో యెషయా 6:10ని ఎందుకు కోట్ చేశాడో, యింతకు అక్కడ యోహాను చెప్పనుద్దేశించిన వర్తమానమేమో - మన మిత్రుడు గ్రహించే ఉంటే - యిలా మాట్లాడేవాడు కాడు. గనుక ముందుగా యోహాను 12లో చర్చింపబడిన వర్తమాన ఉద్దేశాన్ని కొంతవరకు చూద్దాం. చదవను తెలియనివాడే విమర్శకుడైతే, సంగతులు యిలాగే తగలబడతాయ్. యోహాను 12లో సందర్భం చూద్దాం!

     ఎందుకంటే, వెనుక వచ్చిన సదభిప్రాయంవలన ముందున్నదురాచరణను మార్చు కొనడంలో దోషముండదు - మన మిత్రుడు కోట్ చేసిన లేఖనాలలో ఏది ముందుదో, ఏది వెనుకదో చూడు!

     "యేసు, తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి" (12:1). యూదులలో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి. అతనిని బట్టి అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక, ప్రధాన యాజకులు (పునరుత్థానము లేదని భ్రమించి, తలంచే సద్దూకయ్యులు) లాజరును కూడా చంపనాలోచన చేసారు (12:9-11).

     అంటే, అక్కడేం జరిగింది. ఏమి జరిగిందంటే, లాజరు మృతుల్లోనుండి లేపబడిన సందర్భాన్ని కన్నులారా చూచినవారు చెప్పినమాటలను యూదా మత నాయకులు వినలేదు; సరికదా, కండ్లకు ప్రత్యక్షంగా కనబడుతున్న లాజరును చూచి కూడా వారు గ్రహింపలేదు. అయినా వారు అంతటితో ఆగక, యేసు చేసిన సూచక క్రియకు ప్రత్యక్ష సాక్ష్యంగా లాజరు నిలిచాడు గనుక, అలా నిలిచిన లాజరును సహా చంపాలని వారు అనుకుంటున్నారంటే - వాస్తవాలను అంగీకరించే మనస్సు వారికి ఎంతవరకుందో గ్రహింపవచ్చు. వారి చెవులు వినుటకు మందగించలేదా? వారి కన్నులు వాస్తవాలను చూడలేనంత గ్రుడ్డివి కాలేదా? వారి హృదయాలు క్రొవ్వలేదా?

     ఇంకా చూడు! "ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి, మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతో కూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన సూచకక్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో నొకరు - "మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమై పోయినవో చూడుడి?" (ఏం, ప్రయత్నాలు? సత్యాన్ని వాస్తవాలను కప్పడానికి చేసిన ప్రయత్నాలు! అవి ఏమైనవట? నిష్ప్రయోజనమైనవట! అందుకు వారు దిగులుపడుతూ) - "ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి" (యోహాను 12:17–20). ఇదీ యోహాను 12 సందర్భం!

     మన మిత్రుడు వారి కోవకే చెందినవాడైతే, అతని భావాలు కూడా ఈ నా రచనతో అలాగే మారిపోతాయేమో! అయితే తాను ఆ కోవకు, (అంటే-సత్యం ఎదురుపడినా, దాన్ని నిరాకరించే కోవకు) చెందకూడదని నేను కోరుకుంటున్నాను. మన మిత్రుని సంగతి ఎలాగున్నా యోహాను 12లో వర్ణింపబడ్డ నాయకులకు - సత్యాన్ని కనుగొని, దాన్ని నమ్మే మనస్సు లేకపోయింది. సత్యమైనా సరే, అది వారి ఆలోచనలకు విరోధంగా నిలిస్తే, దాన్ని ఎలాగైనా అణచివేయాలనేదే వారి దృష్టి అలాటి జనులు నేటికీ ఉన్నారు. ప్రతి తరంలో అలాటివారు కన్పిస్తునే ఉంటారు. అలాటి వారి కండ్లు, చెవులు సత్యం చూడకుండా మూయబడ్డాయి. అంటే వారు తమ ఆలోచనలకు భిన్నంగా ఉన్న మాటలను వింటారు గాని, వాటిని లక్ష్యపెట్టరు; చూస్తారు గాని వాటిని గుర్తించరు, వారు తమ హృదయాలోచనలను, వ్యర్థమైన తమ లక్ష్యసాధనలకు అప్పగించుకొని, తక్కినవాటిని చులకనగా చూస్తారు. అలాటి పరిస్థితుల్లో చిక్కుకున్నవారు తమ మార్గాలను మార్చుకొనే మానసిక స్థితిలో లేరని లేఖనం తెలుపుతుంది.

     మనుష్యులందరు రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలని దేవుడు ఇచ్చయించుచున్న మాట వాస్తవమే గాని (1తిమోతి 2:4); పైన చర్చింపబడిన వ్యక్తులు తమ ఆలోచనను వదలుకొని, దేవుని మార్గాల్లోకి రాగలరా? అలా రాగలిగితే – “భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను, వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును, వారు మన దేవునివైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును? (యెషయా 55:7). అయితే వారు తమ మార్గాలను మార్చుకోవాలి!

     తమ మార్గాలను మార్చుకోనివారిని ఆయన ఎలాగూ రక్షింపడు గనుక వారితో యిక శ్రమ ఎందుకులే అన్నట్టు - దేవుడు వారిని తమ స్వనాశనానికే, వారి హృదయ వాంఛకే వారిని అప్పగిస్తాడు. ఈ వాస్తవాన్ని సూచించడానికే - “వారు కన్నులతో చూచి, చెవులతో విని హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని నావలన స్వస్థపరచ బడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను" అని వ్రాయబడింది. (వాస్తవానికి యిది యెషయా 6:10 కొటేషన్) అంటే, మనుష్యుడు తన స్వేచ్ఛా చిత్తాన్ని బట్టి తన మార్గాన్ని మార్చుకోలేకుండ తన స్థితిని తాను స్థిరం చేసుకొంటే - దేవుడు వానికి అతని హృదయ వాంఛను సిద్ధింపజేస్తాడనేదే - అక్కడి భావం - "ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును" (సామెతలు 16:9). నేను చెప్పేది సత్యమని నా రచనను చదివే ప్రతివానికి తప్పక తెలుస్తుంది. అయినా కొందరు తమ మార్గాలలోనే ఉండగోరి సత్యాన్ని అంగీకరించరు. దీన్నిబట్టి బైబిలు దేవుని గ్రంథమని
మరొకమారు రుజువు చేయబడుతుంది.

     ఆనాటి ప్రధానయాజకులు, పరిసయ్యులు, మొదలైనవారిలా -నీ అభిప్రాయాలనే నీవు స్థాపించుకోగోరితే - దేవునివలన నీవు మేలు పొందలేవు! అయితే సత్యాన్ని గ్రహించి, జీవిత విధానాన్ని దాని ప్రకారం మల్చుకోవాలనే భావం నీకుంటే - నీవు సత్యాన్ని ప్రేమతో అవలంభించి రక్షింపబడాలనేదే పరమ దేవుని ఉద్దేశం. మన మిత్రుడు కోట్ చేసిన ఆ పై రెండు లేఖనాల్లోని సందేశమిదే! వాటిలో ఏ లోపమూ, వంకా - ఎవడూ చూపలేడు; అభిప్రాయమెట్టిదో, ఆచరణ కూడా అట్టిదే. అయితే దాని నంగీకరించి నీ విశ్వాసపు త్రోవలు మార్చుకోవాలే! ఎటు చూచినా బైబిలే సత్యం.
68. 1 నిమిషము = 40 యేండ్లు!
     ఆయన కోపము నిమిషమాత్రముండును. కీర్త 30:5.

     ఆయన కనికరము చూపటయందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. మీకా, 7:18. 

     యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరము వారందరు నశించువరకు అరణ్యములో నలువది
యేండ్లు వారిని తిరుగులాడ చేసెను. సంఖ్యా 32:13.

     గమనిక: సామ్యాలను, వ్యవహారికాలను - అంటే సాంఘిక పరిథులలో సామాన్యంగా జరిగే ప్రయోగాలను - చట్టాలుగా రూపొందించి, బైబిలులో తప్పులు పట్టడానికి మన మిత్రుడు ప్రయత్నిస్తున్నాడే గాని, నిజానికి లేఖనాలలో సమస్య లేదు. పైగా తాను చూపిన లేఖనాలను మన విమర్శకుడు ఉన్నది ఉన్నట్టు కోట్ చేయక, తనకు అనుకూలమైన దానిని చూపడానికి ప్రయత్నించాడు. కావాలంటే తాను చూపిన లేఖనాలను బైబిల్లో చూడు. అప్పుడు అసలు సంగతేమిటో నీ కర్థమౌతుంది.

     సరే, అదలావుంచి, దానికి ముందు ఓ సంగతి ఆలోచిద్దాం. మన సమాజంలో - అంటే తెలుగువారి మధ్య కొన్ని ప్రయోగాలున్నాయ్. ఉదాహరణకు - మూడో వ్యక్తిని గూర్చి యిద్దరు మిత్రులు మాట్లాడుకొంటున్నప్పుడు - ఆ మూడో వ్యక్తి వారి మధ్యకు వస్తే - “నీకు నూరేళ్లు" లేక “నీకు నిండాయుస్సు" అనే ప్రయోగాలు వినిపిస్తాయ్. సాంఘిక పరిథుల్లో - "నిండాయువు" అంటే నూరేండ్లనేది ఒక సామ్యం. అంతేగాని, దీర్గాయువు, నిండాయుస్సు అనే ప్రయోగాలు నిర్దిష్టమైన కాలాన్ని సూచించడానికి వినియోగింపబడ్డవి కావని; అవి కేవలం శుభాకాంక్షలేయని - అనేవారికి, అనిపించుకునే వారికి కూడా తెలుసు. బైబిలులో 'ఆయన కోపము నిమిషమాత్రముండును" అనే ప్రయోగం కూడా యిలాటిదే! దేవుడు కాల పరిమాణంతో కొలువబడడని బైబిలు బోధిస్తుంది (కీర్తన. 90:1-2, 2 పేతురు 3:9; కీర్తన. 90:4).

     అయితే కీర్తన. 30:5లో వ్రాయబడినట్టు భూమిపైనున్న శరీరుల యెడల ఆయన చూపు దయ, దీర్ఘశాంతాలతో = వారి అక్రమముపై ఆయన ప్రదర్శించే కోపాన్ని పోల్చినట్లయితే - ఆయన కోపం నిమిషమాత్రముండును! మీకా 7:18లోని సందేశంతో ఇది పూర్ణంగా ఏకీభవిస్తుంది. వాటిలో సమస్య లేదు. అయితే ఈ రెండింటిని సంఖ్యా 32:13తో జత చేయడం అసందర్భం. సంఖ్యా 32:13లో వర్ణింపబడిన పరిస్థితి వేరే అది ఎలాటిదో తెలియదా? తెలియకపోతే చూడు.

     ఐగుప్తీయులకు వారు దాస్యం చేసిన కాలంలో - యిబ్బందనే "కొలిమి"లోనుండి ఇశ్రాయేలీయులు విడుదల కోరారు (నిర్గమ. 2:23–25) దేవుడు వారి మనవి ఆలకించి, పరిస్థితులు కల్పించి, మోషేను సిద్ధపరచి, ఐగుప్తులో తన బాహుబలాన్ని ప్రదర్శించి, వారిని బయటికి తెచ్చాడు (నిర్గమ. 4-15 అధ్యాయాలు). అలా వచ్చిన జనులకు స్వాస్థ్యంగా ఒక దేశాన్ని కూడా యివ్వడానికి ఆయన యిష్టపడ్డాడు. పైగా మహోన్నతుడు వారితో నిబంధన చేసికొన్నాడు (నిర్గమ. 19:5-6; ద్వితీయో. 5:1-6). తరువాత ఇశ్రాయేలీయులు వాగ్ధాన భూమి యొక్క పొలిమేర్లను చేరుకున్నారు.

     దాన్ని స్వాధీనపరచుకోడానికి ముందు, వారి గోత్రాల పెద్దలు వాగ్ధాన భూమిని వేగుచూడబోయారు. వారిలో పదిమంది నాయకులు అవిశ్వాసులై, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అధైర్యపరచారు (సంఖ్యా 13:31-33). కనాను వెళ్లడమైతే - వారు కత్తివాతచేత కూలిపోతారట, వారి భార్యలు పిల్లలు కొల్లపోతారట; గనుక యికను ముందుకు వెళ్లరట. వారు ఐగుప్తు దాస్యానికే తిరిగి వెళ్లతారట! వారికోసం యింత శ్రద్ధ చూపి ప్రయాసపడిన తరువాత వారికి వాగ్ధాన భూమి అక్కరలేదని అంటే ఆయనకు కోపం రాదా?

     అయినా మానవ అభీష్టానికి విరోధంగా ఏమియు కోరని దేవుడు - "వాగ్ధాన భూమి మాకు వద్దు" అన్నవారికి దాన్ని స్వాధీనం చేయనిష్టపడలేదు. అసలు అక్కడ జరిగిన సంగతి అదే! అయితే ఇశ్రాయేలీయులను వారి అభీష్టానికి వదలి; వాగ్ధాన భూమి “కావాలి” అన్నవారి నుండి “వద్దు” అన్నవారు వేరయ్యేవరకు ఆయన వేచియున్నాడు. అలా వారు వేరు కావడానికి 40 సంవత్సరముల కాలం పట్టింది. అంతేగాని ఆయన వారి మీద 40 యేండ్లు కోపపడలేదు. అలాటప్పుడు, సంగతులు తెలియపెట్టకుండ 1 నిమిషము = 40 యేండ్లని మన మిత్రుడు ఎలా అంటాడు? ఇలాటి ప్రశ్నలు జ్ఞానాన్ని కాదు, అజ్ఞానాన్నే బయలుపరుస్తాయ్; గనుక ప్రశ్నించక ముందు జాగ్రత్తగా ఆలోచించడం అవసరం. అయినా రచనను చదివి అది ఏమి చెప్పుతుందో తెలుసుకునే జ్ఞానం మన విమర్శకునికి ఎక్కడుంది?

     అరణ్యంలో వారు ఆయన్ను ఎలా శోధించారో వారిని ఆయన ఎలా సహించుతూ వచ్చాడో చూడాలనుకుంటే - కీర్తన. 78 చదివి చూడు. సత్యాన్నిఅంగీకరించే మనస్సుంటే - బైబిల్లో సమస్య లేదు.
69. హేయమైన పెదవులు యెహోవా సృష్టియేనా?
     అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సామె. 12:22.

     యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. 1 రాజు. 22:23. 

     గమనిక: పై లేఖనాల మీద మన మిత్రుని ప్రశ్న విషయపరిజ్ఞానం లేనిదే గాని, బైబిలులోని సమస్య కాదు. “దేవుడు నరులను యథార్థ వంతులనుగా పుట్టించెను గాని వారు వివిధములైన తంత్రములు కల్పించు కొన్నార"నేది వాస్తవం . (ప్రసంగి 7:29). పైగా మానవుడు స్వేచ్ఛా పరుడుగా నిర్మింపబడ్డాడు! దేవుడైతే, ఎవని స్వేచ్ఛా చిత్తంలోనూ జోక్యం పుచ్చుకోడు; ఆయన ఎవనిని మార్చడు; ఎవని కోర్కెకు అడ్డురాడు. మానవుడు మారుమనస్సు పొందాలని ఆయన కోరుకున్నా, అది వాని యిష్టపూర్వకం గానే జరగాలని ఆయన కనిపెడతాడు. అయితే మనుష్యుడు తన మార్గాన్ని తాను స్థిరంగా ఏర్పరచుకొనియుంటే - అది మంచిదో, చెడ్డదో వాని హృదయ వాంఛ వానికి సిద్ధించునట్లు ఆయన పరిస్థితులను మాత్రం కల్పిస్తాడు. ఇదీ దేవుడు మనుష్యులకు చేసేది! 1 రాజులు 22:23 వివరించేది యిదే! అసలు సంగతులు ఎలా జరిగాయో చూడు

     ఆహాబు ఇశ్రాయేలు రాజు. అతనికి పూర్వమున్నవారు చెడుతనం జరిగించినవారే అయితే అతడు - "తన పూర్వీకులందరిని మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడు" (1 రాజులు 16:30-31). ఇలా నశించేవాడు ఎవడైనా (నశింప సిద్ధంగా ఉన్న ఆహాజులా) రక్షింపబడాలంటే సత్యాన్ని ప్రేమతో అవలంభించాలి (2 థెస్స. 2:9). అయితే సత్యాన్ని ప్రేమతో అవలంభింపక పోగా, దుర్నీతియందు అతడు అభిలాషను కనుపరచాడు; అది చాలదన్నట్టు అతడు దురద చెవులు గలవాడై తన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తన కొరకు పోగుచేసికొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపుకు తిరిగినవాడు - ఆహాజు యొక్క స్వకీయమైన చివరి దురాశ, స్నేహంగా ఉన్న సిరియనులతో యుద్ధము చేయచూచి, దానికి అనుకూలమైన బోధకులను తన కొరకు పోగు చేసికొన్నాడు. వారు 400 మంది బయలు ప్రవక్తలు! (2 దినవృ. 18:5).

     పరిస్థితులు అలా ఉండగా, తనతో వియ్యమందిన యూదా రాజైన యెహోషాపాతు ఆహాబు నొద్దకు వచ్చాడు. ఆహాబు యెహోషాపాతుతో సంభాషించి, సిరియనులతో యుద్ధానికి అతన్ని కూడా ప్రేరేపించాడు. ఆ సమయమందు తన పోషణ క్రిందనున్న 400 మంది బయలు ప్రవక్తల యొద్ద ఆహాబు విచారణ చేశాడు. అతని అభిమానం కొరకు ఆ ప్రవక్తలు, అతడు వినగోరినవాటిని, అనగా అతనికి అనుకూలమైనవాటినే యెహోవా పేరట చెప్పారు. ఆ అబద్ధాలు వారు ఎలా పలుకుతున్నారో యెహోవా ప్రవకమైన మీకాయాకు బయలుపరచబడినది! అయితే అతడు వారి మధ్యకు అప్పటికి యింకా పిలువబడలేదు.

     అక్కడ జరుగుతున్న సంగతులు యూదా రాజైన యెహోషాపాతు గ్రహించి - "ఈ సంగతిని విచారించుటకు యెహోవా ప్రవక్తలెవ్వరూ లేరా" అని ఆహాబు నడిగాడు. "లేకేమి? మీకాయా అనే యెహోవా ప్రవక్త ఉన్నాడు గాని అతడు నేను వినగోరినవాటిని చెప్పడు గనుక అతడంటే నాకు పగ? అని ఆహాబు అంటాడు. సత్యమంటే ఆహాబుకు అలర్జీ; సత్యం బోధించేవారంటే అతనికి పగ (2 దినవృ. 18:1–20). అది ఆహాబు యొక్క అంతరంగపు పరిస్థితి!

     దేవుడు, ఆలాటి ఆహాబు యొక్క హృదయ వాంఛననుసరించి అతని కొరకు పరిస్థితులను కల్పించాడు. అదే 1 రాజు 22:23లోని వర్తమానం. గనుక హేయమైన పెదవులు యెహోవా సృష్టి కాదు. ఆయన నిష్కపటంగా సృజించిన పెదవులను జనులు తమ స్వకీయ దురాశలకు లోబరచి, అబద్ధాలు చెప్పడానికి పూనుకొంటారు. అలా పలకడం మానవ వశం. నమ్మేవారు; అబద్ధాలు చెప్పేవారు ఏకమైనప్పుడు వారి హృదయ వాంఛను వారికి స్థిరపరచడం దేవుని కార్యం! "... ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు" (2 థెస్స. 2:11–12). అప్పుడు కూడా అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమే! హేయమైన దానికి మానవుడు అపేక్ష చూపుతున్నాడు, వాని హృదయ వాంఛను వానికి సిద్ధింపజేసే దేవుడు - హేయమైన పెదవులనెలా సృజించిన వాడౌతాడు? దేవుడు సత్యస్వరూపి, పరిశుద్దుడు (ప్రక,6:9)!
70. వ్రేలాడుతున్నదా? నిలిచివున్నదా?
     శూన్యమండలముపైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యముపైని భూమిని వ్రేలాడదీసెను. యోబు 26:7

     భూమియొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటిమీద ఆయన నిలిపి యున్నాడు. 1సమూ 2:8 (ఇంకా చూడు; కీర్త. 104:5).

     గమనిక: భూమి శూన్యంలో వ్రేలాడుతుందని ఒక లేఖనం అన్నది; భూమికి స్తంభములున్నట్టున్నూ వాటిపై లోకము నిలిచియున్నట్టున్నూ - మరో లేఖనం అంటుంది. ఇలాటి వ్యత్యాసాలు పరస్పర విరుద్ధాలు కావా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. దానికి నీవేమంటావో గాని, కేవలం వ్యత్యాసాలే తార్కిక విరుద్ధాలు కావని ముందుగానే చూచాం. అయినా ఈ సందర్భంలో మరో ఉదాహరణ ఈ సంగతిని తేటపర్చుతుంది చూడు. (యోబు కొటేషన్ గూర్చి ముందుగా చర్చించిన సంగతులను మరచి పోకుంటే సమస్య లేదు.)

     పలు కోణాల్లోనుండి తీయబడ్డ ఓ వ్యక్తి యొక్క ఫోటోలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. అవి అలా భిన్నంగా కన్పించినంత మాత్రాన, అవన్నీ ఒకే వ్యక్తి ఫోటోలు కాకుండా పోవు. ఆయా సందర్భాలలో, బైబిలు లేఖనాలు కూడా ఓ వాస్తవాన్ని ఆయా కోణాలనుండి చూపించిన ఫోటోల్లా ఉన్నాయ్! అయితే ఆయా రచనలలో ఉండే వాస్తవాలను చూడగలిగే జ్ఞానం చదివేవానికి అవసరం. అలాటి జ్ఞానమే లేకపోతే, మన మిత్రునిలా లేఖనాలను అపార్థం చేయడమే అవుతుంది!

     అలాగైతే, పై లేఖనాలలో తెలియజేయబడ్డ వాస్తవాలేవి? అంతరిక్షనౌకలు, సేటెలైట్లు, రాకెట్లు - వగైరాలు రోదసిలో (ఆకాశంలో) తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఈ యుగంలో, పై లేఖనాలలో సూచింపబడ్డ వాస్తవాలను గ్రహించడం సులభమే! ప్రస్తుతం - అంతరిక్ష నౌకనే ఉదాహరణగా తీసుకొందాం.

     అంతరిక్ష నౌకలో అనేక భాగాలుంటాయ్, రోదసిలో పయనించునప్పుడు ఎదుర్కోవలసిన ప్రకృతి శక్తులకూ, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా నిలిచి, దాని నిర్మాత సంకల్పించిన పనిని అది సాధించేలా, దానిలో ఉండే భాగాలు విడిపోకుండా ఒకదానితో నొకటి అతుకబడతాయ్ లేదా బిగింపబడతాయ్. అంతరిక్ష నౌక యొక్క ఉనికి (లేక దాని వర్ణన) అది నిర్మింపబడే సమయంలో ఒక విధంగా ఉంటుంది; అది ఆకాశ మహా విశాలంలో పయనించేటప్పుడు మరోవిధంగా ఉంటుంది.

     ఈలాటి పరిస్థితులలో, అంతరిక్షనౌక నిర్మాణ వర్ణనకూ, అది రోదసిలో పయనించే సమయంలోని వర్ణనకు తేడా వచ్చినప్పుడు - అంతరిక్ష నౌక కట్టబడుతుందా? పయనిస్తుందా? అని అడిగితే ఎంత విడ్డూరంగా ఉంటుందో - భూమిని గూర్చి ఈ సందర్భంలో మన మిత్రుని ప్రశ్నలు కూడా అంత విడ్డూరంగానే ఉన్నాయ్.

     1 సమూ 2:8; కీర్తన. 104:5 వగైరాలు భూమి యొక్క నిర్మాణ రూపాన్ని సూచించాయ్. అలా నిర్మింపబడిన భూమి - ఏ వస్తువు యొక్క సపోర్టు లేకుండానే, అది శూన్యంలో ఉంది అనే వాస్తవాన్నియోబు 26:7 సూచించింది. ఇలాటి ఆశ్చర్యకరమైన విజ్ఞాన వాస్తవాలను మానవుడు గుర్తించడానికి నాలుగువేల సంవత్సరములకు ముందే బైబిలు సూచిస్తే, వాటిని బట్టి, బైబిలును అభినందించడానికి బదులు; ఆ వాస్తవాలను వక్రంగా త్రిప్పి, బైబిలుపై నేరాలుగా చూపే మన మిత్రుని ఏమనుకోవాలో ఒకవేళ తన హేతువాదమనేది అలా చేసేదేనేమో! లేకపోతే యిదేమి విడ్డూరం?

     సరే, మన మిత్రుని వాదం అలావుంచి, పై లేఖనాల్లో బైబిలు వివరించిన వాస్తవాలను మరలా చూద్దాం. బైబిలు - “భూమినీ" ‘లోకాన్నీ వేరు వేరుగా చూపింది. ఆ రెండు ఒక్కటే కావు! "భూమి" (EARTH) అనే పదం - సముద్రాలు, నదులు, పర్వత శ్రేణులు మొదలైనవాటితో కూడిన గోళాన్ని సూచించింది. ఇట్టి భూగోళం దాదాపుగా మూడొంతులు జలమయమే; ఈ జలమయమైన భూమిలో — మానవ నివాస యోగ్యమైన చోటును బైబిలు ‘లోకం" (WORLD) అని సూచించింది. బైబిలును విమర్శింప బూనుకొన్న మన మిత్రునికి ఈ విభజనను చూచే జ్ఞానం లేకపోయింది. పై లేఖనాలను మళ్లీ చదువుదాం! (EARTH) "భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము (WORLD)ను  వాటిమీద ఆయన నిలిపియున్నాడు" (1సమూ 2:8) శూన్యంలో వ్రేలాడదీయబడిదేమో భూమి; భూమి యొక్క స్తంభాలమీద నిలిచియున్నదేమో లోకం! లోకం (WORLD) మానవ నివాసయోగ్యమైన చోటు! భూ జలాలతో లేక సముద్రాలతో ముంచివేయ బడకుండ, భూమి యొక్క స్తంభాలమీద అది (లోకం) స్థిరపరచబడింది (ఇంకా చూడు: ఆది. 1:2, 9-10; యోబు 38:4-11). ఇలా నిర్మింపబడిన భూమిని ఆయన "శూన్యముపైని వ్రేలాడదీసెను" (Suspended) ఇలాటి విజ్ఞాన శాస్త్ర వాస్తవాలను చూపుతున్నప్రాచీన గ్రంథమైన బైబిలును వ్యతిరేకించేవాడు విజ్ఞాన శాస్త విరోధి కాకుండా పోడు!

     "ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు; భూమిని (EARTH) లోకమును (WORLD) నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు" (క్రీర్తన. 90:1). భూమికి, లోకానికి బైబిలు చూపిన తేడాను చూడను తెలియక - మన మిత్రుడు ఆ రెంటినీ బైబిలు ఒకటిగా భావించినట్లు అతడు భ్రమించి - "వ్రేలాడుతుందా? నిలిచివున్నదా?” అని అర్థరహితముగా ప్రశ్నించాడు. అతనికి తెలియని ఆశ్చర్యమైన వాస్తవమేమంటే - బైబిలు చెప్పినట్టే - భూమి వ్రేలాడుతుంది; లోకం నిలిచియుంది! బావిలో కప్పలా, తన పరిథికి బయట వాస్తవాలను చూడలేనివాదమే, హేతువాదం కాదుగదా?
71 కర్మ యెవరిది? ఫలమెవరికి?
     పాపము చేయువాడే మరణశిక్షనొందును, తండ్రి యొక్క దోష శిక్షకు కుమారుడు పాత్రుడు కాడు; కుమారుని దోషశిక్షకు తండ్రి పాత్రుడు కాడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును; దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునకే చెందును. యెహె. 18:20 (ఇంకా చూడు: ద్వితీ. 24:16).

     ఆయన యే మాత్రమును దోషులను నిర్దోషులుగా యెంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దౌష్ట్యమును కుమారుల మీదికిని, కుమారుల, కుమారుల మీదికిని రప్పించును. నిర్గ 34:7.

     తన పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి యెష. 14:21. 

గమనిక: "కర్మ - ఫలితం" అని మన మిత్రుడు వర్ణించిన చర్చకు రెండు భాగాలున్నాయని ఎరుగకయే యిలా ప్రశ్నించాడు. అందులో ఒకటి - వ్యక్తుల దోషానికి సంబంధించినది; రెండోది - రాజ్యాల దౌష్ట్యానికి సంబంధించినది. ఈ రెండు రూపాలు పై లేఖనాల్లో చర్చించబడ్డాయి. వీటిని విడదీసి పరిస్థితులు గ్రహించలేకపోగా, బైబిల్లో మన మిత్రుడు తప్పు పట్టినట్టు భ్రమించాడు. అంతేగాని లేఖనాలలో సమస్యలేదు చూడు. మన మిత్రుడు ఇక్కడ కేవలం మూర్ఖవాదమే చేశాడు.

     1. వ్యక్తుల దోషానికి సంబంధించినది:
     సందర్భం - వారు నిర్దోషులేనట! అయితే తండ్రుల దోష శిక్షను వారు మోస్తున్నారట! దానికి సాదృశ్యంగా - "తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్లు పులిసెనని" బబులోను చెరలో ఉన్న యూదులు అంటున్నారు (యెహెఙ్కేలు 18:1-2). అట్టిది సమంజసం కాదు గనుకనే - ఎవడి ప్రవర్తనను బట్టి వాడే దోషిగా ఎంచబడతాడని వారికి తేటగా వివరింపబడింది. యెహెఙ్కేలు18:20లో చెప్పదలచుకొన్నది యిది.

     భౌతికమైన వస్తువులలో, ఆస్తిపాస్తులలో బిడ్డలకు వారసత్వం స్వాస్థ్యం లభిస్తుంది గాని, విద్యా, విజ్ఞానం వగైరాలు, స్వయంగా సంపాదించుకొన్న మనస్సుకే లేక వ్యక్తికే సొంతమౌతాయ్. అలాగే నీతి, దుర్నీతి అనేవి కూడా! అవి వాటిని సంపాదించుకున్న ఆత్మకు సొత్తయి ఉంటాయి. తండ్రి విద్యను బట్టి కుమారునికి డిగ్రీ లభించదు; కుమారుని విజ్ఞానాన్ని బట్టి తండ్రికి ఆ డిగ్రీ యివ్వబడదు. అలాగే దోషము - నిర్దోషత్వం అనేవి కూడా స్వసంపాద్యములే!

     ఈ సందర్భంలో "పాపము చేయువాడే మరణము నొందును" అనేది వాని ఆత్మకు సంబంధించినది. ఈ మరణం ఏదెను తోటలో తొలిగా సంభవించింది (ఆది. 2:17: 3:1-6). ఇది దేవునినుండి మానవుడు పొందే ఎడబాటు; అది అపరాధములచేతను పాపములచేతను చచ్చినవాడైయుండటం (ఎఫెసీ. 2:1-3). తండ్రి పాపం చేసినందుకు కుమారుడు దేవునినుండి దూరపరచబడడు. కుమారుడు పాపం చేస్తే తండ్రి దేవునినుండి ఎడబాయడు. మనస్సాక్షి దోషారోపణే దానికి తొలి ప్రమాణం. యెహెజ్కేలు 18:14-20లోని వర్తమానమిదే! దీనిలో ఏ సమస్య లేదు! ఇకపోతే రెండో భాగానికి వెళ్లదాం:

     2. రాజ్యాల దుష్టత్వానికి సంబంధించినది:
     ఏ దేశ ప్రభుత్వం, లేక రాజ్యం దుష్టత్వం జరిగించుతూ, అవినీతిగా దాని ప్రజలను బాధిస్తూ ఉంటుందో - ఆ రాజ్యం యొక్క పాపం పరిపక్వమయ్యేవరకు దేవుడు వారిని సహించుతునే ఉంటాడు (ఆది. 15:16). తరతరాలుగా రాజ్యసింహాసనంనుండి అవినీతి, దుష్టత్వమే కొనసాగుతున్నట్టయితే, ఆయన ఆ దౌష్ట్యాన్ని ఓర్చి ఓర్చి చివరికి ఆ రాజ్యానికి తీర్పు తీర్చుతాడు; ఆ ప్రభుత్వాన్ని పడగొడతాడు; ఆ రాజ్యాన్ని నశింపజేస్తాడు. అలా జరిగే ఆ తీర్పును సూచిస్తూ - “తన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు" తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పింతునని తెలిపాడు. నిర్గమ 34:7లోని వర్తమానమిదే! అయినా ఆ సమయంలో కూడా నిర్దోషులైన వ్యక్తులను దోషులుగా ఎంచడు సుమండీ! ఇప్పుడు మన మిత్రుని అసంబద్ధమెక్కడో? బైబిలును బైబిలుగా చదవను చేతగానివాడు దాని మిమర్శింపతగునా?

     అదెలావున్నా కాలచక్రంలో - మానవ రాజ్యాలు లేస్తున్నాయ్; పడిపోతున్నాయ్. అయితే వాటి ఔన్నత్య పతనాల వెనుక మహోన్నతుడగు దేవుని చేయి లేకుండపోలేదు. యిర్మీయా 18:7-10; 27:5-8 చదివి చూడు. అది అలావుండగా, నియోబబులోను సామ్రాజ్యం రాజైన నెబుకద్నెజరు కాలంలో శిఖరాగ్రాన్ని అంటింది. చక్రవర్తిగా పలుమార్లు క్రూరంగానే అతడు ప్రవర్తించాడు, గర్వించాడు, దుష్టత్వం జరిగించాడు. అయితే అతని రాజ్యానికి అంతం వెంటనే రాలేదు. అతని కుమారుడు, కుమారుని కుమారుడు మొదలైనవారు తమ తమ వంతుల్లో చేసిన దుష్టత్వానికి ఫలితంగా బబులోను కూలిపోవడానికి రంగం సిద్ధంగా ఉంది. ఆ సందర్భాన్ని సూచిస్తూ, యెషయా 14:21లో - "వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమునుబట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి" అని వ్రాయబడింది. ఇది మన మిత్రుడు కోట్ చేసిన మూడవ లేఖన భాగం. అయితే ఆయా సమయాల్లో అతడు బైబిలును ఉన్నది ఉన్నట్టు కోట్ చేయడనుకో అందుకే మన మిత్రుని కొటేషన్ అసంపూర్ణంగా వుంది. ఏదియేమైనా బైబిలులో సమస్య ఎటు చూచినా లేదు. మొదటిది వ్యక్తులకు సంబంధించింది. అతడు కోట్ చేసిన రెండు, మూడు లేఖనాలు రాజ్యాలకు సంబంధించినవి. ఈలాటి వాటిని ఇలా జతచేయడం లేఖనాలను అపార్థం చేయడమే ఔతుంది (2 పేతురు 3:17 చూడు). 

     బైబిలు ఆశ్చర్యకరమైన దేవుని గ్రంథం. అయితే మన మిత్రుడు బైబిలు పద ప్రయోగాలతో పరిచయం లేనివాడు గనుక, తన విజ్ఞానానికి మించినదానినంతటిని తప్పనడానికి పూనుకున్నాడు. ఈపాటివాడు బైబిలు విమర్శకు దిగకపోయినా తన మర్యాదను కాపాడుకొనేవాడే! తాను గ్రహించలేనివాటిని విమర్శించడమే అతని హేతువాదం కాదు గదా?
72. వెలుగు, చీకటి - యెహోవా నివాసమేది?
     ఆయన మాత్రమే దురవగాహమైన తేజస్సులో నివసించుచు అమరత్వము కలవాడై యున్నాడు. 1 తిమొ. 6:16. 

     సొలొమోను దానిచూచి - గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు (అని చెప్పెను) 1 రాజు, 8:12 (ఇంకా చూడు: కీర్త 18:11).

     గమనిక: వెలుగు, చీకటి - అనేవి పరస్పర స్వాభావిక విరుద్దాలే! అలాటప్పుడు - దేవుడు దురవగాహమైన తేజస్సులో నివసించువాడు అని (1తిమోతి 6:16)లోను; గాధాంధకారమందు నివాసము చేయువాడు అని (1 రాజు 8:12)లోను వ్రాయబడడం అసంబద్ధం కాదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. దీనిని నీవేమనదలుచుకొన్నా నేను మాత్రం కాదంటాను! వాస్తవాలను పరిశీలించి చూద్దాం.

     బైబిలు ప్రకారం దేవుడు సర్వాంతర్యామి (కీర్తన. 139:7-8). అంటే ఆయన మనలో ఎవనికినీ దూరంగా ఉండేవాడు కాడు (అపొ. 17:27-28). అయినా దేవుడు ఆత్మ (యోహాను 4:23-24). గనుక ఆయన అదృశ్యుడు (ప్రకటన 4:3-7). ఈ సత్యాన్ని వివరించడానికే బైబిలులో పలు రకాలైన భాషా ప్రయోగాలు చేయబడ్డాయి. వాటిలో పైన మన మిత్రుడు కోట్ చేసిన 1తిమో 6:16; 1 రాజు 8:12; వగైరాలున్నాయి. ఈ ప్రయోగాలు దేవుని నివాస స్థలాన్ని వర్ణించడానికి బదులు, ఆయన ఆత్మ స్వరూపి; మానవ భౌతిక నేత్రాలకు (తనలో ఉన్న ప్రాణంలా) “అగోచరుడు" అనే వాస్తవాన్ని తెలియపరచడానికే వినియోగింపబడ్డాయి.

     కావాలంటే - మన మిత్రుడు కోట్ చేసిన 1 రాజులు 8:12కు ముందున్న వచనాన్ని బైబిలులో చూడు. అక్కడ ఈ సంగతి తేటపరచబడుతుంది. కాబట్టి యెహోవా "తేజో మహిమ? యెహోవా మందిరములో నిండుకొనగా, ఆ మేఘమున్న హేతువుచేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి" (1 రాజులు 8:11). దీని ప్రక్క వచనాన్నే మన మిత్రుడు కోట్ చేసింది! - "సొలొమోను దాని చూచి (దేన్ని చూచి? యోహోవా తేజో మహిమను చూచి!) - గాధాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు (అని పలికెను)." అయినా సొలొమోను చూచిందేమి? అతడు చూచింది గాధాంధకారాన్నా? కాదు! సొలొమోను మరేమి చూచాడు? సాలొమోను ఆ మందిరంలో చూచింది - 'యెహోవా తేజో మహిమనే! తేజో మహిమను చూచినవాడు; గాధాంధకారాన్ని జ్ఞాపకం చేసికొనడంలో ఉండే ఉద్దేశం - దేవుడు అదృశ్యుడనే గదా?

     "ఇంకా చూడు" అని మన మిత్రుడు చూపిన కీర్తన. 18:11ను చదివితే ఈ విషయం మరింత తేటగా కనబడుతుంది. అక్కడ యిలా వ్రాయబడింది - "గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింపజేసెను; జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసికొనెను. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడగండ్లను, మండుచున్న నిప్పులును దాటిపోయెను” (11, 12 వ.)

     'అంధకారము తన చుట్టు వ్యాపింపజేసెను" - "ఆయన సన్నిధి కాంతిలోనుండి వడగండ్లను, మండుచున్ననిప్పులును దాటిపోయెను" అనేవి పరస్పర విరుద్దాలై ఉండాలనే విషయం, వాటిని ఒకే చోట ప్రయోగించిన రచయితకు తెలియక ప్రయోగింప లేదు. వాటిని అలా ఉపయోగించడంలో - "దేవుడు అదృశ్యుడు" అనే భావాన్ని వ్యక్తపరచడమే బైబిలు లేఖకుల ఉద్దేశం. ఆయన నివాస స్థలాన్ని ఈ లేఖనాలు చిత్రింపనుద్దేశింపలేదు. నీ మనస్సులో లేని ఉద్దేశాన్ని నీ కంటగట్టి, అది నీ ఉద్దేశమని నిన్ను విమర్శిస్తే ఎలా ఉంటుందో, 1 తిమోతి 6:16; 1 రాజులు 8:12ల్లో బైబిలు ఉద్దేశింపని భావాన్ని వాటికి ఆరోపించి – విమర్శించడం కూడా అలాగే ఉంది. ఇది కొంటెవాళ్ల పనిలా ఉంది గాని; పండితుల చర్చగా లేదు. ఇలాటి కొంటి పనే మన మిత్రుని హేతువాదమేమో?
73. పశ్చాత్తాపం; ప్రతీకారం
     మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు కలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపకలవాడునై యుండి తాను చేయ నుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. యోవే 2:13. 

     యోహోవా రోషము కలవాడై ప్రతీకారము చేయువాడు.ఆయన మహోగ్రత కలవాడు. యోహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయుచు తన విరోధులైనవారిమీద కోపముంచుకొనును నహూ, 1:2.

     గమనిక: ఓ గ్రంథాన్ని చదువవలసిన తీరులో బైబిలులోని ప్రతి భాగాన్ని చదివితే, అందులో సమస్య ఉండనే వుండదు. అయితే ఓ గ్రంథాన్ని పఠించి గ్రహించడానికి గుర్తించవలసిన నియమాలన్నిటిని రద్దుచేసి, మన మిత్రుడు బైబిలును విమర్శింప బూనుకొన్నాడు. గనుకనే అర్థరహితంగా అతడు లేఖనాలను కలిపి చెరుపుతున్నాడు, అంతేగాని సమయ సందర్భాల్లో చర్చనీయాంశాలలో లేఖనాలను గుర్తించితే వాటిలో సమస్య కన్పించనే కన్పించదు, చూడు.

     మానవుని మారుమనస్సుకు- దేవుని కరుణా వాత్సల్యాలకు అవినావభావ సంబంధముందని బైబిలు చెప్పుతుంది. మానవుడు తన దుష్టత్వాన్ని చెడుతనాన్ని మార్చుకొని దేవుని యొద్దకు మరలితే, ఆయన అత్యంత కృపగలవాడై ఆ దుష్టునికి తాను చేయనుద్దేశించిన కీడు చేయక మానుకుంటాడు. గనుకనే ఆయన జనులను తన యొద్దకు రమ్మని కోరుకొంటాడు. యోవేలు 2:12-13 చూడు; కృప చూపుటలో దేవునికి పక్షపాతం లేదు.

     పైగా జనములతో లేక మానవ రాజ్యాలతో ఆయన యిలా నిబంధన చేశాడు: "దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమును గూర్చి గాని, రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పియుండగా ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయ నుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును" (యిర్మీయా 18:7-8).

     ఈ సూత్రాన్ననుసరించే దేవుడు నీనెవె వారిని (అష్షూరీయులను) దీనికి, అంటే, ఈ సందర్భానికి సుమారు 150 సం. లకు ముందు ఆదరించాడు. అప్పటిలో తన ఉగ్రతకు పాత్రమైన నీనెవె వారికి యోనాచే వర్తమానం పంపాడు (క్రీ.పూ. 800) వర్తమానాన్ని పొందిన ఆష్షూరీయులు అప్పటిలో తమ దుష్టత్వాన్ని వదులుకొని, మారుమనస్సు పొంది దేవుని కృపను అనుభవించారు (యోనా 3:1-10). ఆ సమయంలో వారికి చేయ నుద్దేశించిన కీడుచేయక, దేవుడు వారి యెడల కరుణా వాత్సల్యాలను కనుపరచాడు. తిరిగి వారిని రాజ్యాలలో (జనాలలో) అధికంగా హెచ్చించాడు కూడా! (2 రాజులు 17:3–30). అయినా ఆ జనులు, అంటే అష్షూరీయులు దేవుని కృపను ఎక్కువ కాలం నిలుపుకో లేదు. పైగా, కాలక్రమంలో వారికి తన కృపను జూపిన దేవునికే విరోధంగా అష్షూరు రాజులు మాటలాడ తెగించారు (యెషయా 10:5-12). అష్షూరీయుల హృదయ గర్వం, వారి కన్నుల అహంకారపు దృష్టి దేవుని మీదికి కూడా మళ్లింది.

     మానవ రాజ్యాలు ఈ రూపంగా మారినప్పుడు ఆయన వారికేమి చేయనుద్దేశించాడో చూడు: “-మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమునుగూర్చి గాని, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి యుండగా, ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును" (యిర్మీయా 18:9-10). గనుక మారుమనస్సు పొంది, దేవుని యెదుట తమ్మును తాము తగ్గించుకొన్నప్పుడు - క్షమించి, రక్షించి, హెచ్చించిన నీనెవె వారినే, ఆయన సుమారు 150 సం.ల తరువాత పడవేయబోవుచున్నాడు. దానికి కారణమే, నహూ. 1:2లో సూచింపబడింది (క్రీ.పూ. 650).

     ఈ చరిత్రను అలావుంచి మన మిత్రుడు కోట్ చేసిన లేఖనాలకు వద్దాం. కీలక సమయాలలో మన మిత్రుని కొటేషన్లు - యథార్థంగా వుండవని చెప్పానే జ్ఞాపకముంది కదూ? అదే తిరిగి యిక్కడ కూడా జరిగింది చూడు. యోవేలు 2:13ను బైబిల్లోనుండి చూద్దాం: "మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాప పడును. గనుక మీ వస్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి? నేను చూపిన ఈ మాటలు మన మిత్రుడు కోట్ చేసిన దానిలో లేవు కదూ? అవి బైబిల్లో వున్నాయ్! బైబిల్లో ఉన్నది వున్నట్టు కోట్ చేస్తే, మన మిత్రుడు వాటిని వక్రంగా త్రిప్పలేడు గనుక బైబిలు మాటలను వక్రంగా త్రిప్పి మన మిత్రుడు అల్లికచేయ ప్రయత్నించినదే ఆయనగారి బండారం!!

     యోవేలు 2:14ను కలిపి, ఆ క్రింద వచనం కూడా చదివితే అసలు సంగతి బాహాటంగా తెలిసి పోతుంది చూడు: "ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?" (14వ వచనం). ఇదీ యోవేలు 2:13 యొక్క సందర్భం.

     గనుక మన మిత్రుడు కోట్ చేసిన ఆ రెండు లేఖనాల్లో భావమేమి?- దుష్టుడు మారుమనస్సు పొందితే- కరుణా వాత్సల్యములు అత్యంత కృపగలవాడునైన యెహోవా శాంతమూర్తియై- ఆ దుష్టునికి చేయనుద్దేశించిన కీడును చేయక మానును (యోవేలు 2:13-14). నహూములో సూచింపబడ్డ నీనెవెవారు యోనా కాలంలో దీన్ని అనుభ వించారు (యోనా 3:1-10) గదా? అయితే యిప్పుడు వారు ఆయనకు విరోధంగా తిరిగి, వారి హృదయ గర్వాన్ని అహంకార దృష్టిని యెహోవా మీద ప్రదర్శింపసాగారు (యెషయా 10:5-12) నహూములోని సందర్భమిది! అట్టివారి యెడల 'యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, ఆయన మహోగ్రతగలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును తనకు విరోధులైన వారిమీద కోపముంచు కొనును" (నహూము 1:2) ఇలాటి లేఖనాలలో అసంబద్ధమెక్కడుందో? పైగా, నహూము 1:3 వచనం చదివితే మన మిత్రుని విమర్శలోని బండారం బయటపడుతుంది, చూడు. "యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు, ఆయన దోషులను, నిర్దోషులుగా ఎంచడు? ఈ సందర్భంలో దోషులెవరు? అష్షూరీయులే! వారి దోషాన్ని ముందుగానే చూచాం, దీర్ఘకాలం ఓరిమితో చూచినా, మార్పు పొందని వారి స్వభావానికి ప్రతీకారం చేసే దేవుని చర్య మారుమనస్సు పొందే వారిపట్ల పశ్చాత్తాపపడే ఆయన స్వభావానికి అడ్డురాదు. మార్చుకొన్న వారియెడల పశ్చాత్తాపము, మార్పుపొందనొల్లని వారియెడల ప్రతీకారం చేసే దేవుని పనులలో సమస్య ఏముంది? అలాటి వర్తమానాన్నితెలియజేసే బైబిల్లో అసంబద్ధ మెక్కడనుండి వచ్చిందో? మిడి మిడి జ్ఞానమే హేతువాదం కాదు గదా?
74. ప్రభువుకు పశ్చాత్తాపం లేదా?
     దేవుడబద్దమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాతాప పడుటకు ఆయన నర పుత్రుడు కాదు. సంఖ్యా 23:19 (ఇంకా చూడు: 1 సమూ. 15:29; మలా. 3:6; యాకో 1:17).

     సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము నొందెను. 1సమూ. 15:35. (ఇంకా చూడు: యోవే. 2:13; ఆది. 6:6 ద్వితీ. 32:37; కీర్త. 135:14; నిర్గ 32:14, యోనా 3:10).

     గమనిక: పాత నిబంధనలో పశ్చాత్తాపం రెండు విధాలుగా సూచింప బడింది. వాటిలో ఒకటి స్వభావ విరుద్ధమైన కార్యములు జరిగించక పోయినా, జరిగిన పరిస్థితులను బట్టి అనుభవించే ఆవేదనను సూచించేది; రెండోది - స్వభావ విరుద్ధంగా ప్రవర్తించి, వాటి పరియవసానాన్ని అనుభవించే ఆవేదనను సూచించేది. ఈ రెండింటిలోనూ, వ్యక్తి అనుభవించే ఆవేదనను పశ్చాత్తాపమన్నారు.

     'పశ్చాత్తాపం" - అనే మాట రెండు మూలలనుండి తెనిగింపబడింది. వాటిలో ఒకటి - nacham (నాచం) అనే పదం; రెండోది Shubh(షూబ్) అనే పదం, "పాత నిబంధనలో nacham (నాచం) అనే పదం 40 సార్లు ప్రయోగింపబడింది. వీటిలో ఎక్కువ భాగం అది దేవునికే వర్తించింది” (SBE, Vol. IV P. 25, 28), నాచం అనే పదం - మేలుకోరి చేసిన పనులవలన లేక స్వభావ సిద్ధంగా చేసినవాటివలన కలిగే పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. అయితే మేలుకోరి స్వాభావికంగా చేసిన పనులవలన 'పశ్చాత్తాపం" కలుగుతుందా? అనే అనుమానం వస్తుందేమో! దేవుని విషయం అలా ఉంచి, మొదట మానవ పరిధిలో అదెలా ఉంటుందో ఓ ఉదాహరణ చూద్దాం.

     భీమన్న కుమారుడు శ్రీను అసాధారణమైన విద్యార్థి శ్రీను M.Scలో గోల్డు మెడల్ పొందాడు. ఉన్నత విద్య కోసం అమెరికా పోతున్నాడు. ప్రయాణ సన్నాహాలు జరుగుతున్నాయ్. విమానం టిక్కెట్ బుక్ చేయడానికి శ్రీను ప్రయత్నించాడు. అయితే తాను కోరుకున్నట్టు 1960 ఆగష్టు 20వ తేది మద్యాహ్నం 12-30కి వెళ్ళే విమానంలో అతనికి ఖాళీ దొరకలేదని విచారంతో ఇంటికి తిరిగి వచ్చాడు.

     భీమన్నచిన్ననాటి స్నేహితుడు సుందర్ మద్రాస్ ఎయిర్ పోర్టు  ఆఫీసరుగా ఉన్నాడట. తన కుమారునికి టిక్కెట్ దొరకలేదు గనుక, తానే దాన్ని సంపాదించ బూని, సెలవులో యింటివద్ద ఉన్న సుందర్ ఇంటికి  తన కుమారునితో కూడా వెళ్లాడు. భీమన్న చివరికి ఎలాగో ఆ ఆఫీసర్ సిఫారసుతో - తన కుమారునికి ఆ విమానంలోనే సీటు సంపాదించాడు. సుందర్ చేసిన సహాయానికి తన స్నేహితునికి కృతజ్ఞత తెలిపి- తండ్రీ, బిడ్డలు కుషీ కుషీగా యింటికి చేరుకున్నారు. మరునాడు శ్రీను అమెరికా ప్రయాణం. తన కుమారుని విషయంలో ఆనందిస్తూ, లేదన్న విమానం టిక్కెట్ తాను సంపాదించిన విధానాన్ని మార్గంలో వివరిస్తూ, మిగిలిన తన కుటుంబంతో పాటు భీమన్న శ్రీనును ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చాడు. ప్రయాణ సమయంవరకు ఆమాట ఈమాట మాట్లాడుకున్నారు. శ్రీను విమానం ఎక్కేవరకు అందరు బయట నిలిచి, తేరిచూచారు; చేతులూపారు. విమానం తలుపు వేయబడింది. కొద్ది నిమిషాల్లో అది వారి కన్నుల మేరను దాటిపోయింది. శ్రీనును గొప్ప విద్యకు పంపానన్న ఆనందంతో, భీమన్నకారును నడుపుకొంటూ ఇంటికి వచ్చాడు. సాయంత్రం తీరిగ్గా వార్తలు వింటానికి కూర్చున్నాడు; తన కుమారుడు ప్రయాణం చేసిన విమానం ఆపదకు గురైనట్టు భీమన్న సడన్ గా విన్నాడు. అతని ఆనందం అణగారింది; ఆవేదన రగిలింది. ఆ విమానంలో టిక్కెట్టు సంపాదించడంలో భీమన్న చేసిన నేరమేమి లేదు. తన కుమారునికి చేతగాని పనిని, తన పలుకుబడితో సాధించాడు; అంతే! అందులో దోషమేమి? అయినా జరిగిన పరిస్థితి భీమన్నను కుంచివేసింది. "టిక్కెట్టు దొరకలేదని నా కొడుకు చెప్పినప్పుడు, నేను ఊరుకున్నా బాగుండేదే!” అంటూ భీమన్న పశ్చాత్తాపపడ్డాడు; దుఃఖించాడు. మేలుకోరి చేసినా, కొన్ని సంగతులు యిలా మారతాయ్. ఇలా మారినప్పుడు అనుభవించే ఆవేదన్ను పశ్చాత్తాపమంటారు. ఇలాటి పరిస్థితిని సూచించేదే nacham అనే హెబ్రీ పదం.

     దైవ మానవుల మధ్యనున్న సంబంధం సంభవాలు, దీనికి భిన్నమైనవైనా, మానవుని మేలుకోరి దేవుడు జరిగించేవాటిని - (తన స్వేచ్ఛా చిత్తాన్ని దుర్వినియోగం చేసుకొన్న) మానవుడు, తనకు కీడుగా మార్చుకొన్నప్పుడు, దానిని చూచి మహోన్నతుడు మనుస్సున అనుభవించే ఆవేదన్ను (nacham) పశ్చాత్తాపమన్నారు. ఇట్టిది తన దోషాన్ని బట్టి అనుభవించే మనోవ్యాకులత కాదు.

     పశ్చాత్తాపంలో రెండో రకం - తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు కలిగే పశ్చాత్తాపం. తన స్వభావానికి విరోధంగా ప్రవర్తించడమే దోషం - లేక పాపం. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమియు చేయలేడు గాని; మనుష్యుడైతే - తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి నేర్చుకున్నాడు (2 తిమోతి 2:13). అబద్ధ మాడడం, హత్య చేయడం వగైరాలు మానవ సహజ స్వభావ లక్షణాలు కావు. అయితే అవి జరిగించడానికి వాడు అలవర్చుకొన్నాడు. వాటి పర్యవసానాన్ని అతడనుభవించే టప్పుడు - పశ్చాత్తాపపడతాడు. ఇట్టి మానసిక స్థితిని సూచించడానికే, హెబ్రీలో (షూబ్) Shubh అనే పదం వినియోగించబడింది. ఇట్టి పశ్చాత్తాపం ప్రభువునకు లేదు. అయినా మన మిత్రునికి యింత పాండిత్యం ఎక్కడనుండి వస్తుంది? ఏదో తెలిసీ తెలియని మాటలతో అమాయకులను బెదరగొడుదామనుకొని మన మిత్రుడు యిలా ప్రశ్నించాడే గాని అడుగడుగున తన అజ్ఞానాన్ని ప్రదర్శించుతున్నట్టు ఎరిగియుంటే - మన మిత్రుడు యిలాటి ప్రశ్నలు వేశేవాడే కాదు. ఇది బైబిలులో సమస్య కాదు; మన మిత్రుని జ్ఞానంలోని సమస్యే మళ్ళా అంటున్నా- స్వభావ విరుద్ధమైన కార్యము జరిగించి పడే పశ్చాత్తాపం ప్రభువుకు లేదు. అందుకే - "దేవుడబద్దమాడుటకు ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడని” బైబిలులో వ్రాయబడింది (సంఖ్యా 23:19).
75. నిష్పక్షపాతి ప్రేమద్వేషాలు!
     దేవునికి పక్షపాతం లేదు. రోమా. 2:11. (ఇంకా చూడు: అపొ. 10:34).

     పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. . . . .ఇందుకు ప్రమాణముగా నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడియున్నది. రోమా. 9:10-13, (ఇంకా చూడు; మలా. 1;2, 3. ఆది 4;45)

     గమనిక: దేవుడు పక్షపాతి కానట్టయితే, ప్రేమద్వేషాలు యిలా కనుపరుస్తాడా? ఇలాటి దేవుని సూచించే బైబిలు తప్పు కాదా? అని మన మిత్రుడు అడుగుతున్నాడు. ఇవి బైబిలు సందేశాన్ని అపార్థం చేసుకొన్న మన మిత్రుని ప్రశ్నలేగాని, వాస్తవానికి అవి బైబిలు చూపే సమస్యలు కావు. లేఖనాల గ్రహింపులో ఈ మన విమర్శకుడు ఎలా పొరబడ్డాడో చూద్దాం.

     బైబిలులో మన కనుగ్రహింపబడిన వర్తమానాన్నిబట్టి యాకోబు ఏశావులు కవలలు. అంటే ఒక తల్లి గర్భములోనుండి ఒకరివెంట మరొకరు బయటికి వచ్చినవారు (ఆది. 25:21-26) కవలలైనా, వారి దేహాలు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయో, వారి బుద్ధి తత్వాలు కూడా అంత వ్యత్యాసంగా ఉన్నాయ్. గనుక వారి వ్యత్యాసాలలో కొన్ని ప్రాముఖ్యమైనవాటిని గమనించుదాం.

     1. ఏశావు వేటాడే అరణ్యవాసి యాకోబైతే సాధువై, తన పితరులతో కూడ గుడారాల్లో నివసించేవాడు (ఆది. 25:27; హెబ్రీ. 11:8-11).
     2. ఏశావు గర్భంనుండి మొదటిగా బైటకు వచ్చినందున జ్యేష్ణుడేగాని; తన జ్యేష్టత్వపు విలువను గ్రహించినవాడుగాని, దాన్ని నిలుపు కోగోరినవాడు గాని కాడు. యాకోబైతే జ్యేష్ఠత్వపు విలువను గ్రహించినవాడై, వీలైతే ఏశావు వద్దనుండి దానిని పొందాలనే ఆపేక్ష కలవాడుగా కన్పిస్తాడు (ఆది. 25:29-33).
     3. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి, ఒక్కపూట కూటికొరకే దానిని అమ్మివేసిన భ్రష్టుడు - వ్యభిచారి (హెబ్రీ. 12:15-17).
     4 కారణం? ఏశావు క్షణిక సుఖానికి పాల్పడేవాడు; యాకోబైతే "రానున్న మేలుకొరకు నేడే కష్టించాలి" అనే తత్వం కలవాడు.
     5. శ్రమానుభవానికి తట్టుకోలేక, అలాటి పరిస్థితి ఏర్పడినప్పుడు సులభ మార్గాలను వెదకేవాడు ఏశావు; యాకోబైతే స్థిరచిత్తుడై తన లక్ష్య సాధనలో శ్రమానుభవాన్నైనా సహించగలవాడు.
     6. తాను యాకోబుకు అమ్మివేసినదానిని అన్యాయంగా తిరిగి అపహరించడానికి ఏశావు పూనుకుంటాడు (ఆది. 27:1-5). ఆ సందర్భంలో యాకోబైతే, అన్యాయాన్నైనా సహింప నిష్టపడతాడు గాని, వాస్తవాలను ఎరుగని తన తండ్రి యొక్క శాపాన్ని పొందటానికి అతడు తెగించలేదు (ఆది. 27:11-13) యాకోబు, ఏశావుల వ్యక్తిత్వపు వ్యత్యాసాలు అలాటివి! అలాటివారిలో నీవు ఎవరి సహవాసం కావాలని కోరుకుంటావో? వారిలో ఎవరితో కలిసి పని చేయాలని యిష్టపడతావో?? ఆలోచించు!

     ఏదియెలాగున్నా వ్యక్తిగతమైన వారి స్వేచ్ఛాచిత్తానికి అంతరాయం కలిగించకుండ; అంటే, వారి స్వాతంత్ర్యంలో జోక్యం పుచ్చుకోకుండ, ఏశావు యాకోబులు ఎట్టివారై ఉంటారో, తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎరుగగలవాడే దేవుడు (యెషయా 44:7) గనుకనే దేవుడు, వారి భవిష్యత్తును గూర్చిన సంగతులను ముందుగా తెలిపారు. ఇలా తెలిపినదాన్నే ప్రవచనమంటారు (రోమా 9:10-13). బైబిలులో ప్రవచనాలు లేవంటాడు మన మిత్రుడు; మరలా ఆ ప్రవచనాలనే సమస్యలుగా రూపొందిస్తాడు. ఇలాటిదేనేమో మన మిత్రుని వాస్తవ వాదం!

     ఇక్కడ చూడు; అక్కడ చూడు; బైబిలులో నీవు యింకెక్కడైనా చూడు: సమయం దాని సందర్భం చర్చనీయాంశం, దాని ఉద్దేశం వగైరాలను గ్రహించి లేఖనాలను పరిశీలించితే వాటిలో ఏ సమస్యా ఉండదు. అంటే, రచనలను చదువవలసిన విధంగా చదివితే, బైబిలులో సమస్య లేదు. (అలా చేతగాని వారే బైబిలు విమర్శకులు).

     రోమా 9:10-13లో చర్చింపబడిన లేఖనం, ఆది. 25:22-23ను సూచిస్తుంది. దాని భావం మలాకీ 1:2–5 వివరించబడింది. యాకోబు ఏశావులు - ఇశ్రాయేలు, ఎదోములనబడతారు! ఆది. 25:22-23లో ప్రవచింపబడింది, అసలు వ్యక్తులను గూర్చి కాదు. సుమీ! ఏశావు, యాకోబులనేవారు యింకా పుట్టలేదు. వారు యింకను తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా ఆమెతో నిట్లనెను - రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును (చిన్నవాని జనపదం బలిష్టమైయుంటుందని సూచిస్తూ) పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను" అంటే, చిన్నవాడే బలము గల గొప్ప జనమౌతాడన్నమాట!

     తరువాత కాలంలో దీనినే మలాకీ అనే యెహోవా ప్రవక్త ఎత్తి చూపాడు. అప్పటికి ఆ రెండు జనపదాలు - ఎదోమీయులు, ఇశ్రాయేలీయులుగా రూపొంది, స్థిరపడి యున్నారు. వీరిలో ఇశ్రాయేలీయులతో దేవుడు తన నిబంధనను చేసుకొన్నాడు. ఎదోమీయులను తన సంకల్పసాధనంగా ఉంచుకో లేదు. వారితో అట్టి నిబంధనను చేసికోలేదు ఈ వ్యత్యాసాన్ని "నేను యాకోబును ప్రేమించితిని ఏశావును ద్వేషించితిని" అనే భాషతో వ్యక్తపరచడం జరిగింది. అయితే వారు (యాకోబు సంతతివారు) ఆ నిబంధన విషయంలో అశ్రద్ధ చేస్తూ దేవుని నిర్లక్ష్యపెట్టుతున్నందున, ఎలా ఒకే గర్భంలోనుండి వచ్చిన కవలలలో ఒకని సంతానాన్ని తన సంకల్ప సాధనంగా నిరాకరించి, మరొకని సంతానాన్ని తన సంకల్ప సాధనంగా ఏర్పరచుకొన్నాడో ఆ సంగతిని ఎత్తి చూపి, మలాకీ ఇశ్రాయేలీయుల నిర్లక్ష్య స్వభావాన్నిబట్టి వారిని మందలించాడు. ఈ రెండు లేఖన భాగాలను మనస్సునందుంచుకొనే, పౌలు రోమాలో వాటిని చర్చించాడు.

     ఇలాటి పరిస్థితుల్లో లేఖనాలలో ఎలా వ్రాయబడియుంటే సమస్య ఉండేదో తెలుసా? ఒకవేళ ఏశావు యాకోబులు బుద్ధికీ, వారి తత్వానికీ, ప్రవర్తనకు సంబంధం లేకుండనే, దేవుని ప్రేమద్వేషాలు బయలుపరచబడియున్నట్టయితే, "దేవుడు పక్షపాతి కాడు" అనే లేఖనం తప్పైయుండేదే! అంటే - అల్ప సంతోషిని, జీవిత విలువలను ఎరుగనివానిని, భ్రష్ణుని, వ్యభిచారిని, జ్యేష్టత్వమును అమ్మివేసినట్టే అమ్మి తిరిగి దాని ఫలితాలను కోరే ఏశావును దేవుడు ప్రేమించి; జీవిత లక్ష్యాలు గలవాడై తన ఆశయాలకొరకు బ్రతుకుతూ, అవసరమైతే అన్యాయాన్నైనా సహించడానికి సిద్ధపడిన యాకోబును ఆయన ద్వేషించియుంటే - నిజంగా దేవుడు పక్షపాతియై ఉండేవాడే! ఆయన పక్షపాతి కాడని చూపిన లేఖనం తప్పైయుండేదే!
అయితే ఆ లేఖనాలు కేవలం దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని వెల్లడిపరుస్తూ, ఆయన దేవత్వానికి రుజువుగా ఉన్నాయే తప్ప, అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా లేవు. ఆయా రచనలను చదివి సంగతులు అర్థం చేసుకోలేని మన మిత్రుడు లేఖనాల గ్రహింపులో తొట్రిల్లాడేగాని వాటిలో ఏ సమస్యా లేదు.

     అయితే యింకో మాట. దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమియు చేయడు (2 తిమోతి 2:13). ఆయన స్వభావ లక్షణాల్లో ఒకటేమంటే ఆయన నీతిని ప్రేమిస్తాడు; దుర్నీతిని ద్వేషిస్తాడు. ఇలాటి తండ్రి స్వభావాన్ని క్రీస్తు యేసు బయలుపరచ వచ్చాడు; బయలుపరిచాడు (హెబ్రీ. 1:8-10; యోహాను 1:18). గనుక ఈ సందర్భంలో క్షణిక సుఖాలకు పాలుపడే భ్రష్ణుని, వ్యభిచారిని (ఏశావును) తన సంకల్ప సాధనంగా వినియోగించుకోలేని దేవుడు, జరుగనైయున్న వాస్తవాలను ముందుగా యిలా తెలియజేశాడేగాని, ఆయన ఏశావును వ్యక్తిగా ద్వేషించలేదు. తన అనాది సంకల్పంలోని సాధనంగా ఉండటానికి ఏశావు పనికిరాడని, గనుకనే అతన్ని త్రోసివేశానని ఆయన తెలియజేయడానికే ఆ ప్రయోగం చేయబడింది: ఈ విషయాలను గూర్చి బైబిల్లో జరిగిన చర్చ యిది! ఈలాటి దైవ లేఖనాల్లో సమస్య ఎక్కడుందో?!

     వ్యక్తి అనే ప్రతివానికి ప్రేమ ద్వేషాలుంటాయ్, నిష్పక్షపాతికైతే ప్రేమ ద్వేషాలు క్రమబద్ధంగా ఉంటాయ్, అలా క్రమబద్ధమైన ప్రేమ ద్వేషాలే పరమ దేవునియందు కన్పిస్తాయ్. అలాటి నమ్మదగిన దేవుని ఆశ్రయించి ఆయన ప్రేమకు పాత్రులు కావాలని మనవి.
76. రక్షణకు, శిక్షణకు తేడా లేదు!
 దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి వేులు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము. రోమా 8:28. 

     ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతివానిని దండించును హెబ్రి. 12;6.

     గమనిక: బైబిలు మీద ఏది విసరినా చెల్లకపోతుందా? అనే ఉద్దేశంతో మన మిత్రుడు తన మాటలను రువ్వేడేగాని, నిజానికి పై లేఖనాలమీద - “రక్షణకు, శిక్షణకు తేడా లేదు!" అని వ్యంగ్యంగా మాట్లాడడానికి తావు (జ్ఞానానికి) లేదు.

     ఎలాగంటే రోమా 8:28లో "రక్షణ" అనే మాట ప్రస్తావించబడనేలేదు సరిగదా; దానికి సంబంధించిన భావం కూడా దానిలో గుప్తమైయుండలేదు. అక్కడ వ్రాయ బడిందేమో గమనించు - "దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము," పోని దీనిలో "శిక్షణ" అనే మాటగాని, ఆ భావంగాని గోచరిస్తుందా? లేదు.

     పోతే హెబ్రీ. 12:6ను చూద్దాం. “-ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును." - దీనిలోనైనా "రక్షణ, శిక్షణ" అనే మాటలు గాని, వాటి స్వభావం గాని గోచరిస్తుందా? లేదు, మరి మన మిత్రుని మాటలు ఎక్కడనుండి పుట్టాయో? ఒకవేళ "శిక్షించి" అనే మాటను చూచి "శిక్షణ" అని భ్రమపడియుంటాడా? అతడు భాషా పండితుడులా కన్పిస్తాడే గనుక మన మిత్రుడు ఈ పని చేయడానికి వీలుంటుందా? "శిక్షణ" అంటే (Training) "శిక్షించు" అంటే (Punishing) ఈ రెండింటికి వ్యత్యాసం లేదా? "శిక్షణ" అనే పదం (Training) తాను కోట్ చేసిన లేఖనాలలో లేదే. లేకపోయినా సరే, బైబిలు లేఖనాలమీద వికట వ్యంగ్యాన్ని ఎలా ప్రయోగించాడో గమనించావా? ఇలాంటి మాటలను మా పల్లెటూరి భాషలో - "పోసుకోలు కబుర్లు” అని అంటారు. అలాటి కబుర్లతో బైబిలువంటి ఒక ఉద్గ్రంథాన్ని విమర్శించేదేనా, మన మిత్రుని విజ్ఞాన మార్గం?? ఇదేనా హేతువాదం?

     పై లేఖనాల్లో బైబిలు వర్తమానమేమో చూడు! తల్లి దండ్రులు తమ బిడ్డల మేలు కోరి జరిగించే కార్యక్రమాలలో వారిని శిక్షించడమనేది ఒకటి. 'తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమాళ్లయినవారందరు శిక్షలో పాలుపొందుచున్నారు, మీరు పొందనియెడల దుర్భీజులేగాని కుమారులు కారు" (హెబ్రీ. 12:8) హెబ్రీ. 12:6లోని సందర్భమిది!

     "మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారియందు భయభక్తులు కలిగి యుంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుకవలెనుగదా? వారు కొన్ని దినములమట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను రక్షించిరిగాని మనము తన పరిశుద్ధతలో పాలుపొందవలెనని మన మేలుకొరకే ఆయన శిక్షించుచున్నాడు" (హెబ్రీ. 12:9-10) ఇదీ హెబ్రీలోని సందేశం!

     తండ్రి శిక్షించుట దేనికట? మనమేలుకొరకే. దీనిని రోమా 8:28లోని సందేశంతో జోడించి చూడు! దేవుని ప్రేమించి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు. మేలుకొరకై సమకూర్చి జరిగించే కార్యక్రమాలలో - ఆయన వారిని కుమారులుగా ప్రేమించి శిక్షించడం - ఒకటి. బైబిలు వర్తమానంలో సమస్య లేదు. బైబిలుదేవుని విధానమది.

     గనుక బైబిలుమీద అర్ధరహితమైన మాటలు రువ్వి మన అవివేకాన్ని వెళ్ళగ్రక్కు కోకుండ జాగ్రత్తపడుదాం. తెలియనివాటిని అడగటం తప్పు కాదుగాని, తెలియకయే జ్ఞానులమనుకొని బైబిలుతో ఆటలాడటం, జ్ఞానుల మధ్య అవమానం పొందటానికే!! అలా చేయకుండ మన గౌరవాన్ని కాపాడుకుందాం.
77. శతాధిపతా? పెద్దలా?
     ఆయన కపెర్నహోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి. . . . . ఆయనను వేడుకొనేను మత్త 8 5, 6. 

     ఆయన. . . . కపెర్నహోములోనికి వచ్చెను. . . . శతాధిపతి. . . . యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు నొద్దకు వచ్చి ..... బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడ వెళ్ళెను లూకా. 7:1-6. 

     గమనిక: మత్తయి 8:5, 6; లూకా 7:1-6లకు మధ్య సమస్య ఉంది అనడంలో మన మిత్రుడు చేసిన పని చదువరికి అర్థమయ్యిందా? ఏమి చేశాడంటే - అస్వాభావికమైన పట్టింపును పట్టించుకొన్నాడు, అంతేగాని వాస్తవంగా పై లేఖనాలలో సమస్య ఉన్నందున అతడిలా ప్రశ్నింపలేదు. ఓ ఉదాహరణ ఈ విషయాన్ని తేటపర్చుతుంది, చూడు.

     తోటి ప్రయాణికుల మధ్య సంభాషణ స్నేహం దాకా వచ్చింది. "బిడ్డలకు పెండ్లిండ్లు చేశారా?" అని రఘు, రామోజీని అడిగాడు. రామోజీ సమాధానం చెప్పకముందే, ప్రక్కన కూర్చున్న అతని బంధువు చొరవ చేసుకొని, "పిల్లలకు పెండ్లిండ్లేమండీ! ఆయన పెద్ద భవనాన్ని కూడా కట్టించాడు!" అని సమాధానం చెప్పాడు. అంతలో నాల్గవ వ్యక్తి సంభాషణలో జొరబడి “రామోజీగారి బిల్డింగును కట్టించిన కాంట్రాక్టరు దాన్ని బహు బాగా కట్టించాడండీ" అని మెచ్చుకున్నాడు. ఇలా జరిగిన సంభాషణను నీవు చదివిన తరువాత, రామోజీ యిల్లును కట్టించింది - రామోజీయా, లేక కాంట్రాక్టరా? అనే ప్రశ్న(లు) ఎంత అసహజమో, పై లేఖనాలను చదివి - శతాధిపతా? పెద్దలా? అనేవి కూడా అంతే అసహజమే!

     మన ఉదాహరణను అలా ఉంచి, అసలు లేఖనాల దగ్గరకే వద్దాం. ఒక గ్రంథాన్ని విమర్శింపక ముందు, అందులో చిత్రింపబడిన సమాజంలో ఆయా విషయాలు ఎలా వ్యవహరించబడ్డాయో ఎరిగియుండాలి. అలా యెరుగకుండ విమర్శింప బూనుకుంటే, ఈలాటి చేతగాని, తప్పుడు లా పాయింట్లే లాగడం జరుగుతుంది. అంతకంటె మన మిత్రుని ప్రశ్నల్లో విశేషమేమీ లేదు, చూడు
క్రొత్త నిబంధనా రచనా దినాల్లో ఓ ప్రముఖుడు ఒక పనిని తన యొద్దనున్నవారిచేత చేయించుకొంటే, స్వయంగా తానే చేయకపోయినా తాను చేసినట్లే వ్యవహరింపబడేది! ఉదా: “అటు తరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి, అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను" (యోహాను 3:22). ఈ లేఖనం చదివితే ప్రభువైన యేసే స్వయంగా బాప్తిస్మమిచ్చినట్టు అనిపిస్తుంది. ఆయితే ఆయనే స్వయంగా బాప్తిస్మమిచ్చారా? లేదు. కావాలంటే తరువాత అధ్యాయంలో ఆ సంగతి వ్రాయబడింది; చూడు.

     "యోహాను కంటే యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మ మిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు, ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్లెను, అయినను యేసే బాప్తిస్మమియ్యలేదు గాని ఆయన శిష్యులిచ్చుచుండిరి" (యోహాను 4:1-3).

ఇంతకూ అక్కడ ఏమి జరిగిందో గమనించావు గదూ? వాస్తవంగా శిష్యులే బాప్తిస్మమిచ్చారు. అయితే ఆ కార్యక్రమం ప్రభువు యొక్క ఉద్దేశాన్ని బట్టి జరిగింది. గనుక ఆయనే బాప్తిస్మమిచ్చినట్టు వ్యవహరింపబడింది. ఆనాటి వ్యావహారిక విధానమది. అదే రకంగా మత్తయి 8:5-6; లూకా 7: 1-6లో కూడా కన్పిస్తుంది. ఈ రెండు లేఖనాలు కలిపి చదివితేగాని అసలు అక్కడ ఏమి సంభవించిందో సంపూర్ణంగా మనకు అర్థం కాదు.

     గతంలో చెప్పేనే; జ్ఞాపకం లేదా? ఇద్దరు ఒకే కోవకు చెందినవారు ఒకే అంశం మీద మాట్లాడితే ఉండే సంబంధాలు, భేదాలు ఎలాగుంటాయో; లేక యిద్దరు విలేఖరులు తమ తమ వార్తాపత్రికల్లో ఒకే సంభవాన్ని ప్రచురిస్తే ఎలాగుంటుందో అలాగే పై లేఖనాలున్నాయ్. ఇలాంటి సందర్భంలో లేఖనాల్లో ఏదో తప్పున్నట్టు - శతాధిపతా? పెద్దలా? అనే ప్రశ్న(లు) అవివేకాన్ని వ్యక్తపరచుతున్నాయ్ గాని; అందులో జ్ఞానమేమీ లేదు, ఇలాంటి అవివేక వితర్కాన్ని వివేకుల పరిధిలోనుండి ఎత్తివేయవలసి ఉంటుంది.

     మరచిపోకండి! బైబిలు బండారమనేది మూఢుల వితర్కంలాంటిదే! ఒకవేళ ఎవడైనా దాన్నే హేతువాదమనదలచుకొంటే, ఆ హేతువాదం యొక్క నిజ స్వరూపాన్ని తేటగా నా రచనా రూపంలో చూడవచ్చు! -నేను సహేతుకంగా మాట్లాడుతున్నాను.
78. యేసు మౌనం - నిజమా? అబద్ధమా?
     ప్రధాన యాజకులును, పెద్దలును ఆయన (యేసు) మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమియు యియ్యలేదు. కాబట్టి పిలాతు - నీమీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా? అని ఆయన నడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు, గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. మత్త 27:12-24. 

     ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధలను గూర్చియు యేసును అడుగగా యేసు - నేను బాహాటముగా లోకం యెదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజ మందిరములోనూ దేవాలయములోను యెల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు (అనెను) .....  పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి - నీవు యూదుల రాజువా అని ఆయననడుగగా యేసు -- నీ యంతట నీవే యీ మాట అనుచున్నావా?
లేక ఇతరులు నీతో నన్ను గూర్చి యిది చెప్పిరా? అని యడిగెను. యోహా. 18:19-34.

     గమనిక: యేసు మౌనం నిజమా? అబద్ధమా? అనే ప్రశ్నలు విచక్షణా జ్ఞాన లోపంవలన వచ్చినవే గాని, నిజంగా సంగతులు చదివి గ్రహింప గోరితే, అలాటివాటికి లేఖనాలలో చోటు లేదు. ఎందుకంటె, ఎవరి ఎదుట? ఎప్పుడు? యేసు మౌనంగా ఉన్నాడో, ఎవరి యెదుట? ఎప్పుడు ఆయన మాట్లాడాడో గమనించగలిగితే, మన మిత్రుని ప్రశ్నలకు స్థానం లేనట్టు తేలిపోతుంది.

     మన మిత్రుడు ప్రశ్నలడుగుతూ, బైబిలులో ఉన్న క్రమాన్ని తప్పించడానికిగాను, సమయ సందర్భాలు గుర్తించకుండ మాట్లాడాడు. విజ్ఞానపరంగా అక్రమాన్ని ప్రోత్సహించేదే తన హేతువాదమా? ఏమి? బైబిలులో చిత్రింపబడిన సంభవాలు ఎలా జరిగాయో చూడు!
     1. మొదటిగా, ప్రభువైన యేసు (ఆ రాత్రివేళ) ప్రధాన యాజకుని యెదుటికి తేబడతాడు. అప్పటి ప్రధాన యాజకుడు (అన్న), ఆయన శిష్యులను గూర్చియు, ఆయన బోధను గూర్చియు అడుగుతాడు. అప్పుడు యేసు మౌనంగా ఉండలేదు. ఆయన అతనికి సమాధానమిచ్చాడు! అయినా ఆయన్ను శిక్షించుటకు తగిన హేతువు అతనికి దొరకలేదు (యోహాను 18:19-23).
     2. ప్రధాన యాజకుడు అన్న ఆయనను ఆనాటి ప్రధాన యాజకుడైన కయప (మాజీ retired perhaps) యొద్దకు ఆయనను పంపాడు (యోహాను 18:24).
     3. వారు కయప యొద్దనుండి అధికార మందిరమునకు అనగా, పిలాతునొద్దకు ఆయనను తీసికొనిపోయారు (యోహాను 18:28). అయితే అధికార మందిరములోనికి వారు వెళ్లలేదు. గనుక అధిపతియైన పిలాతే బయట ఉన్నవారి వద్దకు వచ్చి సంగతులు విచారిస్తాడు (18:28-30). అప్పుడు అతడు ఏ నేరాన్నీ ఆయనయందు కనుగొనలేక పోయాడు. మత్తయి 21:12-29లోని సందేశమిదే!
     4. ఆయన గలిలయవాడైనట్టు పిలాతు వింటాడు. గనుక పిలాతు యేసును గలిలయవాడనుకొని, హేరోదు నొద్దకు పంపుతాడు. (ఈ సంగతి యోహాను వివరించలేదు) దీనికై లూకా 23:1-12 చూడు). అయితే హేరోదు ఆయనను తిరిగి పిలాతునొద్దకే పంపివేశాడు.
     5. కడపటిగా, పిలాతు అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి - ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన రాజరికాన్ని గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పాడు (యోహాను 18:34-36).

     మొత్తం మీద యేసు మౌనం నిజమా? అబద్ధమా? అనే ప్రశ్నలకు - యేసు మౌనం నిజమూ, అబద్ధం కూడా! అంటే, ఆయన మీద మోపబడ్డ నేరాల విషయంలో ప్రత్యుత్తరమేమియు యియ్యక ఆయన మౌనంగా ఉన్నాడు. కాని, ఆయన బోధ, ఆయన శిష్యులు, ఆయన రాజరికం, రాజ్యం అనే విషయాలు వచ్చినప్పుడు ఆయన మాట్లాడాడు! సంగతులు యిలా గ్రహించలేక, యిష్టం వచ్చినట్టు మాట్లాడి జ్ఞానమనుకోడం బుద్ధిహీనతే తప్ప, అది జ్ఞానమనబడదు.

     ఉదాహరణ ఈ సందర్భాన్ని తేటగా వివరిస్తుంది చూడు! నీవేమి చదివావు? నీ తల్లిదండ్రు లెవరు? అనే ప్రశ్నలకు మోహన్ వినయంగా సమాధానం చెప్పాడు. అయితే అతడు తన అధికారిని దూషించినట్టు నేరం మోపబడితే, దానికి అతడు మౌనంగా ఉన్నాడు. ఇందులో మోహన్ మౌనం నిజమా? అబద్ధమా? అని అడిగితే ఎలాగుంటుందో పై లేఖనాల మీద మన మిత్రుని ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయ్. వాటిలోగుండా మన విమర్శకుని జ్ఞానం కారిపోతుంది. ఇలాటి పిల్ల చేష్టలను విజ్ఞానమని భ్రమించడమే - హేతువాదమనబడితే, యిక అది ఎలాటి మతిహీనమైన వాదమో చెప్పనక్కరలేదు.
79. ధర్మశాస్త్రం; నీతి
     ధర్మశానమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా యెంచబడుదురు. రోమా. 2:13. 

     ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా యే మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. రోమా 3:20. 

గమనిక: పై లేఖనాల్లో పరస్పర విరుద్ధముందనడంలో మన మిత్రుడు రెండు తప్పులు చేశాడు. వాటిలో మొదటిది రోమా 2:13ను పూర్తిగా కోట్ చేయలేదు. అది పూర్తిగా కోట్ చేసినట్టయితే, ఆ లేఖనంలోని చర్చ చదువరికి కొంతవరకు అర్ధమైయుండేదే? మన విమర్శకుడు చేసిన రెండో తప్పేమంటే - రోమా 2, 8 అధ్యాయాల్లో ఉన్న లాజిక్ (Logic)ను ఎరుగకుండా మాట్లాడటం. గనుక అసలు రోమా 2, 8 అధ్యాయాలలో విషయాలను కొంతవరకు చూద్దాం.

     ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన ప్రయోజనం లేదు; గాని అందులో వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలకడగా వుండాలి. అలా వుండేవారు మాత్రమే నీతిమంతులుగా ఎంచబడతారు. కారణమేమంటే - ఇశ్రాయేలీయుల నైతిక జీవితానికి ప్రమాణం ఆ ధర్మశాస్త్రమే. అంటే ధర్మశాస్త్రం ఓ కొలకర్రను పోలియుందన్నమాట! కొలకర్రకు సరిగా ఉన్నదానినే, సరిగా ఉన్నట్టు ఆది చూపిస్తుంది. ఇదీ రోమా 2:13లోని భావం. 

     అప్పటిలో యూదుల్లో ప్రతివాడూ ధర్మశాస్త్రమనే కొలకర్రతో కొలువబడినవాడే. అయితే తన క్రియలను బట్టి, ఆ కొలతకు సరిపోయినట్టు బ్రతికిన యూదుడెవ్వడూ లేడు. రోమా 3:10-19 చూడు. కొలతకు తగ్గినదానిని హెచ్చుచేసి చూపగలిగిన శక్తి కొలకర్రలో లేనట్టే, అవిధేయుని నీతిమంతుడని తీర్చగలశక్తి ధర్మశాస్త్రంలో లేదు. రోమా 3:20లోని సందేశమిదే! అసలు యిక్కడ జరిగిన విషయం చదువరికి అర్థమైందా? అర్ధం కాకపోతే మళ్ళా చూడు. తార్కిక విధానంలో దాన్ని తిరిగి చూద్దాం (See the logical format!).

     ధర్మశాస్త్రాన్ని తప్పక అనుసరించువారే నీతిమంతులనబడతారు! (రోమా 2:13). 

     ధర్మశాస్త్రపు క్రియలన్నిటిని తప్పక అనుసరించిన వాడెవ్వడూ లేడు (రోమా 3:10-19).

     గనుక ధర్మశాస్త్రపు క్రియలవలన ఎవడును దేవుని యెదుట నీతిమంతుడుగా తీర్చబడలేదు (3:20).

     ఇప్పుడు "ధర్మశాస్త్రం; నీతి" అనే వాటిమధ్య లేఖనాల్లో ఏదైనా సమస్య ఉన్నట్టు కన్పిస్తుందా? లేదు. అయినా సంగతి యింకా గ్రహింపు కాకపోతే, ఒక సాధారణమైన ఉదాహరణ దీన్ని తేటపరుస్తుంది చూడు.

     350 కిలోల బరువును ఒక్క పట్టున ఎత్తినవారు గొనసపూడిలో మొనగాళ్ళుగా ఎంచబడతారు. గొనసపూడిలో 350 కిలోల బరువును ఒక్క పట్టున ఎత్తిన వాడెవడునూ లేడు. గనుక బరువును ఎత్తడానికి సంబంధించి గొనసపూడిలో మొనగాడుగా ఎంచబడే వాడెవ్వడూ లేడు.

     పై ఉదాహరణలోని తార్కిక రూపమేలాటిదో — రోమా 2, 3 అధ్యాయాల్లో తార్కిక రూపం కూడా అలాటిదే! గనుక యిక్కడ చర్చించబడిన ధర్మశాస్త్రం, నీతి అనేవాటిలో సమస్య ఉండడానికి వీలు లేనేలేదు. అయితే లేఖనాలలో ప్రయోగింపబడ్డ తార్కిక జ్ఞానాన్ని ఎరుగలేని మన మిత్రుడు - వాటిలో లేని తప్పును ఉన్నట్టు భ్రమించి, తప్పుడు (fallacious logic) లాజిక్కును లాగ ప్రయత్నించాడు. ఇదీ యిక్కడ జరిగింది. తప్పుడు లాజిక్ను ప్రయోగించేదే హేతువాదం కాదు గదా?
80. జీవుల సృష్టి - జలములనుంచా? నేలనుంచా?
     దేవుడు --- జీవముకలిగి చలించువాటిని జలములు సమృద్దిగా పుట్టించుగాకనియు, పక్షులు భూమిపై ఆకాశ విశాలములో యెగురుగాకనియు పలికెను. ఆది. 1:20. 

     దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేల నుండి
నిర్మిం(చెను). ఆది. 2:19. 

     గమనిక: జీవుల సృష్టి జలములనుంచా? నేలనుంచా? అనే ప్రశ్న సంగతులు చదివి కూడా గ్రహించలేని పసిపిల్లల ప్రశ్నలా ఉంది గాని, పండితుల ప్రశ్నగా లేదు. సంగతులను పరిశీలించడానికైనా, విమర్శించ డానికైనా ఆయా మాటలను ఆయా సందర్భాలలో చూడాలి. అలా చూస్తే వాస్తవంగా పై లేఖనాలలో సమస్య లేదనేది తేలిపోతుంది.

     మన మిత్రుడు భావించినట్టు జీవులన్నీ ఒకే మూలమునుండి సృజింపబడ్డవి కావు. కొన్ని జలాలనుండి, మరికొన్ని నేలనుండి సృజింపబడ్డాయ్. అవి సృజింపబడిన క్రమాన్ని బట్టయితే, పై లేఖనంలో చెప్పబడినట్టు మొదటిగా జలచరాలు జలములనుండి చేయబడ్డాయ్. ఆ మీదటనే ఆకాశపక్షుల సృష్టి జరిగింది. అయితే సృజింపబడిన ఆకాశ పక్షులు జలములనుండి కాదు; అవి నేలనుండే చేయబడ్డాయ్. ఆ మీదట భూ జంతువులు, చివరిగా నరుడు నేలనుండి సృజింపబడ్డారు (ఆది. 1:10–31 చూడు).

     అయితే ఆకాశపక్షుల సృష్టి తిరిగి ఆది. 2:19లో ప్రస్తావించడానికి కారణం లేకుండపోలేదు. ఆ కారణమేమంటే, నేలనుండి పుట్టింపబడిన వాటికి నేలనుండి నిర్మింపబడిన మానవుడే పేర్లు పెట్టాడు! దేవుడు నరునికి ఈ ఆధిక్యతనిచ్చి తన సృష్టికి వానిని కిరీటంగా చేశాడని సూచించడానికి యిది ప్రస్తావించబడింది. గనుక పై లేఖనాలను గ్రహించలేకనో, లేక ఏదో లేనిపోని పేచీ పెట్టుకోవాలనో మన మిత్రుడు ఇలాటి ప్రశ్నలకు దిగాడే తప్ప వివేకిగా, గ్రంథాన్ని పరిశీలించినవాడుగా, దాన్ని విమర్శించడానికి దిగినట్లు లేదు. ఇలాటి సమాధానం వచ్చే ప్రశ్ననే మన మిత్రుడు మొదట్లో అడిగాడు! గుర్తుంది కదూ?!
81. చెప్పేవి శ్రీరంగనీతులు ...
     నరహత్య చేయకూడదు. నిర్గ. 20:13. 

     అతడు (మోషే) వారిని (లేవీయులను) చూచి - మీలో ప్రతివాడును తన కత్తిని నడుమున కట్టుకొని పోలెములో ద్వారమునుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడును తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వానిని చంపవలెనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడనెను నిర్గ 32:27. 

     గమనిక: నరహత్య చేయకూడదని ముందుగానే చెప్పబడింది గదా! ఆ తరువాత తన సహోదరుని, చెలికానిని, పొరుగువానిని కూడా చంపుడని ఆజ్ఞ జారీ చేయబడిందే! అది పరస్పర విరుద్ధం కాదా! అని విమర్శకుడు అడుగుతున్నాడు. నీ వేమంటావో కాని, నేను కాదంటాను: ఇక పరిస్థితులేమంటాయో ఆలోచన చేద్దాం.

     ఒకని హత్య చేస్తే, ఆ హత్య చేయబడినవాని దేహాన్ని ప్రభుత్వపు హాస్పత్రిలో "పోస్టు మోర్టం" చేసి మరణ కారణాలను కనుగొని ఆ తరువాత ఆ దేహాన్ని భూ స్థాపన చేస్తారు. సాధారణంగా, హత్యచేసినవానిని పట్టి, పోలీసువారి కస్టడీలో వుంచి, తీర్పునకు హాజరు పెట్టి, కోర్టు తీర్పును ముగించిన తరువాత హంతకునికి శిక్ష విధిస్తారు. ఈ సంగతి నీకు తెలియదా?

     అయితే అదే సమయంలో పరదేశంతో యుద్ధం వస్తే, ఆ యుద్ధములో అనేకులను చంపడానికి మందుగుండు సామానుతో పాటు, మన దేశ ప్రభుత్వం సిపాయిలకు సమస్త ప్రోత్సాహాన్ని యిస్తుంది. అది చాలదన్నట్టు ఎక్కువ మందిని చంపినవానిని ఘనపరచి వీరచక్ర, మహా వీరచక్ర అనే బిరుదులతో పాటు, బహుమానాలను కూడా యిస్తుంది. ఒకచోట నరహత్యచేసిన వానిని దండించిన ప్రభుత్వమే, మరొకచోట ఎక్కువ మందిని చంపడానికి జనులను ప్రోత్సహించిందే! ఇలా జరిగించిన ప్రభుత్వం చెప్పింది కూడా శ్రీరంగ నీతులేనా? కాదని వేరుగా చెప్పనక్కర లేదు కదూ?

     అయితే "నరహత్య చేయకూడదు? అనే ఆజ్ఞ నిశ్చలమైన సాంఘిక జీవిత విధానానికి సంబంధించింది మాత్రమే. అంటే నిశ్చలమైన సామాజిక పరిధిలోనే ఆ చట్టం వర్తిస్తుంది. దానికి బయట ఆ చట్టం చెలామణి కావాలని కోరడం అర్థరహితం, సాంఘిక సహజీవనానికి అంతరాయం కలిగే సందర్భంలోకూడా "నరహత్య చేయకూడదు? అనే చట్టం వర్తించదు. ఈ సంగతి మన మిత్రునికి తెలియదు కాబోలు! సామాజికంగా మన మిత్రుని వ్యక్తి వాదానికి యిది కూడా తెలియదంటే, మరి అతని వ్యక్తి వాదమెలాటిదో!

     ఉదా: ప్రభుత్వ అధికారాన్ని వ్యతిరేకించి తిరుగుబాటు చేస్తున్న జన సమూహాన్ని అరికట్టడానికి సాధ్యపడనప్పుడు, ఆ జనసమూహం ప్రభుత్వపు ఆస్తిని, అమాయకుల అసువులను సహా బలికొంటున్నప్పుడు, సహజంగా "పోలీసు కాల్పులకు" ప్రభుత్వం ఆర్డరు జారీచేస్తుంది (Shoot at sight orders). నరహత్య చేయకూడదనే ప్రభుత్వమే, ఈ కాల్పులకు ఆజ్ఞలు జారీ చేస్తుంది సుమా! అది నీకు తెలుసో లేదో! ఆ సమయంలో చనిపోయిన వారిని "హత్యచేయబడినవారని” అనరు. వారిని సహజంగా పట్టించుకోరు. చంపినవారిని "నరహంతకు"లనరు! మద్రాసులో కూడా ఇటీవల యిలాటి కాల్పులవలన కొందరు చనిపోయారు.


     కాశ్మీరులో జరుగుతున్న సంగతులేమి? దాదాపు ప్రతిదినం ఏదో ఒక మూలన కాల్పులు జరుగుతునే ఉన్నాయ్. అలా చేసే టెర్రరిస్తులను అణచాలని ప్రభుత్వం ప్రయాసపడుతుంది. నరహత్య చేయకూడదనే ప్రభుత్వమే- టెర్రరిస్తులను చంపుతుందే! టెర్రరిస్టులు-నరులు కారా? వీటన్నిటిని బట్టి నీకేమి తెలుస్తుంది? ఏమి తెలుస్తుందంటే, నరహత్య చేయకూడదనే చట్టం అన్ని సమయాలకు, సందర్భాలకు వర్తించదు. అది కేవలం నిశ్చలంగా ఉండవలసిన సాంఘిక సహజీవనంలోనే వర్తిస్తుంది. దానికి వెలుపట ఆ చట్టానికి బలంకాని, విలువగాని ఉండదు అని తెలుస్తుంది!

     సాంఘిక చట్టం వేరు; పోలీస్ చట్టం వేరు: మిలటరీ చట్టం వేరు. ఆ సంగతి యిప్పుడు నీకు అర్థమైతే, బైబిలు లేఖనాల వద్దకురా: నిర్గమ. 20:13లో "నరహత్య చేయకూడదు” అనేది కేవలం ఇశ్రాయేలీయుల సాంఘీక సహజీవనానికి సంబంధించిందే. అయితే నిర్గమ. 32:27లో చెప్పబడింది సాంఘిక చట్టం కాదు. అది “పోలీస్ చట్టం” లాటిది. అది అంతరంగ కట్టుబాటు (Law and order)కు సంబంధించిన వారి (Police ordinance) పోలీస్ చట్టమే.

     నిర్గమ. 32:15నుండి 27వరకు చదివి చూస్తే ఈ విషయం తేటపడుతుంది. అక్కడ జనులు తమ రాజ్యాంగ చట్టమైన ధర్మశాస్త్రానికి విరోధంగా తిరుగుబాటు చేశారు. “కాలీస్తాన్" వంటి నినాధాలు వారిమధ్య రేగాయ్. తమ దేవుని విడిచి ఇశ్రేయేలీయులు విగ్రహారాధనకు తిరిగారు: అల్లరి లేపారు. జనుల మధ్య కల్లోలమే యేర్పడింది. దాన్ని అణచి వేయడానికే (Shoot at sight) ఆర్డరు జారీ చేయబడింది. పోలీస్ చట్టానికిసాంఘిక చట్టానికి మధ్య వ్యత్యాసం తెలియక మన మిత్రుడు ఈ పాటు పడ్డాడే గాని, బైబిలు లేఖనాల్లో సమస్య లేదు. గనుక
         "తెలియనివన్నియు తప్పులని పలుకకు ..?"
82. సాత్వికత్త్వమంటే ...?
     మోషే భూమిమీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యా 12:3.

     మోషే యుద్ధసేనలో మండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులునగు సేనా నాయకులమీద కోపపడెను. మోషే వారిని చూచి . మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగము నెరిగిన ప్రతి స్త్రీని చంపుడి: పురుష సంయోగము నెరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి (అనెను) (సంఖ్యా 13:14-18).

     గమనిక: మన విమర్శకుని ఉద్దేశం చదువరికి అర్థమయ్యిందా? మోషే భూమిమీదనున్నవారిలో మిక్కిలి సాత్వికుడైతే, యింత నిర్ధాక్షిణ్యంగా వారిని శిక్షించమంటాడా? మోషే అలా అన్నాడు గనుక అతడు సాత్వికుడని చెప్పిన బైబిలు తప్పైయుండాలని అంటాడు మన విమర్శకుడు. నిజమేనా? సమయ సందర్భాలు తెలియనివారికి అది నిజమనే భావం రావచ్చు. అయితే అది నిజమేనా? పరిశీలించి చూద్దాం. మన మిత్రుని మాటలు సత్యానికి ఎంత దూరంగా ఉన్నాయో తేల్చుకొందాం.

     బైబిలు చెప్పినట్టు మోషే సాత్వికుడే! అందులో ఏ సమస్య లేదు. అయితే రెండో లేఖనంగా మన మిత్రుడు కోట్ చేశాడు చూడు; సంఖ్యా 31వ అధ్యాయం! ఆ అధ్యాయంలోని సమయ సందర్భాలేవి? అది ఏ చట్టానికి సంబంధించింది? అనే ప్రశ్నలను సరిగా గ్రహించగలిగితే అసలు విషయం తేలిపోతుంది.

     సమయం: ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిని స్వాధీనపరచుకోబోయే ప్రయాణంలో ఉన్నారు. వారిలో అవిధేయులు అక్కడక్కడ రాలిపోతూనే ఉన్నారు. నమ్మకంగా ఉన్నవారు దైవ కృపను పొందుతూ సాగి పోతున్నారు. వారిని గూర్చిన భయం పొరుగు దేశాలమీద ఉంది. గనుక సీనాయి అరణ్యంలోని మిద్యాను, మోయాబు దేశాలవారు, రాజైన బాలాకు నాయకత్వంలో, ఇశ్రాయేలీయులను అణచే యోచన చేశారు. దానికై సోదెగాడైన బిలామును పిలిపించుకొని అతని మూలంగా ఇశ్రాయేలీయులను శపించడానికినీ, తాము దీవించబడడానికినీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మిద్యాను, మోయాబీయుల సోదె సొమ్మును తీసుకున్న బిలామునకు ఇశ్రాయేలీయులను శపింప వీలుపడలేదు. పైగా అతడు వారిని దీవించడమే జరిగింది (సంఖ్యా 22, 23, 24 అధ్యాయాలు చూడు). 

     అందువలన రాజైన బాలాకు బిలాము మీద ఆయాసపడ్డాడు. గనుక యిక గత్యంతరం లేక బిలాము బాలాకునకు కపటోపాయాన్ని బోధిస్తాడు (ప్రకటన 2:14 చూడు) ఇతరులవలె ప్రాకారములు గల పట్టణాలు లేక, నివసించడానికి స్థిరమైన యిండ్లులేక కేవలం యాత్రికులుగా, ప్రయాణికులుగా ఉండిన ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడానికి వారి సైన్యం బయట నిలిచియుంది. అట్లుండగా సోదె సొమ్ము నాశించిన బిలాము బోధననుసరించి, ఇశ్రాయేలీయుల సైన్యపు నీతిని, వారి బాధ్యతను చెరపడానికి, రాజైన బాలాకు మోయాబు స్త్రీలలో అందమైన కన్యకలను ఇశ్రాయేలు సైన్యం మధ్యకు పంపుతాడు. సైన్యంలోని ఇశ్రాయేలు అధిపతులు తమ దేశపు మర్యాదను (Country's Morale) తమ ప్రజల భద్రతను ఆ స్త్రీలకు అమ్ముకుంటారు (సంఖ్యా 25:1-5). అది ఎంతటి భయంకరమైన దేశ ద్రోహమో!? ఆలోచించి చూడు.

     శత్రు దండయాత్రనుండి మన దేశాన్ని కాపాడడానికి మన దేశ సైనికులు శిబిరాల వెలుపల కాచుకొనియుంటే, శత్రు దేశం నేరుగా వారితో యుద్ధం చేయడానికి బదులుగా, మన సైనికులను బలహీనపరచి, వారి నీతిని (Morale) మంటగలిపి, మన దేశ రహస్యాలను లాగి, మనలను నాశనం చేయునట్లు స్త్రీలను వారు ఉపయోగించితే, ఎవరి నీతి, నిజాయితుల మీద మన భద్రత ఆధారపడిందో వారే దానిని మరచి, తమ యొద్దకు వచ్చిన స్త్రీలతో వ్యభిచరిస్తూ, వారిని సంతోషపెట్టుటయందు నిమగ్నులైయుంటే - సాత్వికుడైన సైన్యాధిపతి, లేక దేశ నాయకులు ఆ సైన్యాధికారులకును, ఆ స్త్రీలకును - ఏమి చేయాలని నీవు కోరుకుంటావో చెప్పు?

     సైన్యంయొక్క క్రమశిక్షణను, సైన్యంలో జరిగిన ఆ సంఘటన యొక్క అపాయాన్ని ఎరుగలేని నీవు ఏమనుకుంటావో గాని, ఒక దేశం యొక్క సర్వసైన్యాధిపతి, ఆ సంభవాన్ని నీయంత సునాయాసంగా ఆలోచింపలేడు సుమీ! సంఖ్యా 31వ అధ్యాయం ఈ సంభవానికి సంబంధించిన సైనిక చట్టాన్ని సూచిస్తుంది (16 వ. చూడు) అలాటి సందర్భంలో, ఇశ్రాయేలు నాయకుడుగా మోషే, అలా ఆజ్ఞాపించినందుకే లోకమంతా ఏకంగా అతన్ని అభినందించాలి! అలాటి పరిస్థితులు ఎక్కడైనా, ఎప్పుడైనా సంభవించితే మోషే ప్రదర్శించిన ఆ ధర్మాన్నే ఆదర్శాన్నే అనుసరించాలి!

     సాత్వికత్వమంటే . దేశ విద్రోహ చర్యలు జరుగుతున్నప్పుడు దేశ నాయకులు చేతులు నలుపుకుంటూ, దేశ ద్రోహాన్ని ప్రోత్సహించడం కాదు సుమీ! అయితే మోషే అలా ప్రోత్సహించలేదని, అతనిపై మన మిత్రుడు తప్పు మోప బూనుకున్నాడు. కదూ! అలాటి మనస్సు లేకపోతే మన మిత్రుడు మోషేను విమర్శింప తెగిస్తాడా? మన విమర్శకుని గూర్చి గతంలో ఏమనుకుంటారో గాని, సంగతులు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వస్తే - హేతువాదం ముచ్చట ప్రక్కనుంచి – బహు సాధారణమైన జ్ఞానంగాని, వివేచనగాని లేని మూర్ఖ వితర్కిగా మన మిత్రుని బండారం తేలిపోతుంది. బైబిలుపై అతడు వ్రాసిన తన హేతువాదం యొక్క బండారమిదే!
83. హత్య, దోపిడి - ఆత్మ ఫలమేనా?
     ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. గల. 5:22.

     యెహోవా ఆత్మ అతని (సమ్సోను) మీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కధ భావమును చెప్పినవారికి బట్టల నిచ్చెను. న్యాయా, 14:19. 

     గమనిక: గలతీ. 5:22, న్యాయాధి. 14:19లకు మధ్య సమస్య ఉందంటే, మన విమర్శకునివలె వాస్తవాలు తెలియనివారు మూఢంగా అక్కడ సమస్య ఉందని భావిస్తారేమో సుమీ! దీనికై బైబిలంతా ఎరుగనవసరం లేదు. కేవలం గలతీ పత్రిక యొక్క సందేశం తెలిసిన వాడెవడైనా, ఆ లేఖనాల మధ్య సమస్య ఉందంటే నవ్వుతాడు. అది ఎలాగో చూద్దాం.

     "న్యాయాధిపతులు" అనే రచన ధర్మశాస్త్రపు చరిత్ర రచనల్లో రెండవది. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడ్డ ఆ ధర్మశాస్త్రాన్నివారు ఎలా అనుసరించుతూ వచ్చారో సూచించడమే దాని ఉద్దేశం. అంటే, ఇశ్రాయేలు గోత్రాలు న్యాయాధిపతులచే నడిపింపబడుతున్న కాలంలోని చరిత్రను తెలుపుతున్నందున ఆ రచన్ను "న్యాయాధిపతులని" పిలిచారు. ఇది పాత నిబంధనకు సంబంధించిన చరిత్ర.

     "గలతీ" క్రొత్త నిబంధనలోని భాగం, క్రొత్త నిబంధన ధర్మశాస్త్రంవంటిది కాదు కారిపోవును తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు (యిర్మీయా 31:31-34), ధర్మశాస్త్రాన్ని గూర్చి గలతీ పత్రిక ఎలా వర్ణించిందో చూడు.
     1. ధర్మశాస్త్ర నియమంలో ఎవడూ సరిగా నిలువలేదు గనుక ధర్మశాస్త్రంచేత ఎవడునూ దేవుని యెదుట నీతిమంతుడని తీర్చబడడు (గలతీ. 3:11).
     2. "ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు . క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపమునుండి విమోచించెను" (గలతీ. 3:13-14).
     3. "ఆత్మఫల"మిచ్చు ఆత్మను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలవలన పొందలేదని గలతీ పత్రికయే వక్కాణించింది (గలతీ. 3:1-4).
     4. ధర్మశాస్త్రం తీసివేయబడి, దాని స్థానంలో క్రొత్త నిబంధన స్థాపింపబడింది; పైగా క్రైస్తవులు ధర్మశాస్త్ర సంబంధులు కారని అందు స్థిరపరచబడింది (గలతీ. 4:21-31). క్రీస్తునందున్నవారు స్వతంత్రులుగా చేయబడినవారు గనుక దాస్యమనే ధర్మశాస్త్రపు కాడి క్రిందికి వెళ్లవద్దని ఖండితంగా ఆజ్ఞాపించబడ్డారు (గలతీ. 5:1).

     ధర్మశాస్త్రాన్ని క్రొత్త నిబంధనతో పోల్చిన లేఖనాన్ని చూడు (2 కొరింథీ. 3:6-18). అక్కడ ధర్మశాస్త్రాన్ని "అక్షరమని"; క్రొత్త నిబంధనను "ఆత్మ"యని పాలు సూచించాడు (6, 7, 8, 17 వచనాలను గమనించు) గనుక గలతీ. 5:22లో సూచింపబడిన "ఆత్మఫలం" ధర్మశాస్త్ర ఫలం కాదు. గనుక ధర్మశాస్త్రం క్రింద జరిగిన సంభవాన్ని క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఆత్మఫలానికి పోల్చి బైబిలును పరిహసింప పనిలేదు. అలా చేసేది వెర్రితనమే గాని, విజ్ఞానం కాదు. అ రెండింటిని అలా పోల్చడానికి ఆత్మ ఫలాలను గూర్చి పలికిన గలతీ పత్రికయే సమ్మతించలేదు (గలతీ 5:1).

     గలతీ. 5:22ను, న్యాయాధి. 14:19తో జతచేయుట ఎలాగుందంటే, ఒక ఎద్దును గాడిదను కలిపి కాడి కట్టి, వాటితో అరక దున్నలేకపోగా, దాన్ని చూచి హేళన చేసినట్టుంది. అసలు అలాటి జతను కాడికట్టమన్నదెవరు? చేయకూడని పని చేసి, అది కుదరకపోతే పరిహాసాలాడేదేనా మన మిత్రుని హేతువాదం? ఇలాటి అర్థ రహితమైన మాటలచేత అమాయకులు ఊరకే మోసపోతారు. హేతువాదియనేవాడెవడైనా అమాయకులను మోసం చేయ తలపెడతాడా?

     అయితే ఒక మాట! ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీయులను పీడించుతున్న ఫిలిష్తీయులను శిక్షించాలన్నదేవుని కోర్కెకు సాధనంగా సమ్సోను వినియోగింపబడ్డాడు. దానికై ఆయన అతన్ని బలపరచాడు. వాటిలో ఒక సంఘటనను సూచించేదే న్యాయాధి. 14:17. దానికీ క్రొత్త నిబంధన ఏర్పాటుకూ ఏ సంబంధమూ లేదు.

     ఇంతకు ముందు దీన్ని చూచాం; కాని అవసరతను బట్టి తిరిగి జ్ఞాపకం చేసుకొందాం. ఏమంటే: క్రొత్త నిబంధన, క్రొత్త ద్రాక్షారసానికీ, పాత నిబంధన, పాత ద్రాక్షారసానికీ, బైబిల్లో పోలికగా చూపబడ్డాయి! "పాత తిత్తులలో (animal skin bottles) క్రొత్త ద్రాక్షారసము పోయరు; పోసినయెడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండు(ను)' ఈ పోలికే మరో రకంగా చూపబడింది. "ఎవడును పాత బట్టకు (పాత నిబంధనకు), క్రొత్త బట్ట (క్రొత్త నిబంధనకు) మాసిక వేయడు; వేసినయెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును చినుగు మరి ఎక్కువగును" (మత్తయి 9:16-17).

     క్రొత్త నిబంధనతో పాత నిబంధనకు మాసిక వేయకూడదని బైబిలు యింత తేటగా చెప్పుతుంటే, అలా చేసిన మన మిత్రుని యొక్క బైబిలు జ్ఞానాన్ని ఏమనాలో! మరి అతని బైబిలు జ్ఞానాన్ని పొగిడేవారి స్థితి ఎలాటిదో చెప్పనవసరం లేదు; చదువరే ఆలోచించుకోవచ్చు.
84. శాసన ధిక్కారం చేసిన కోడి
     (యేసు-) పేతురూ, నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పువరకు నేడు కోడి కూయదని చెప్పుచున్నాను అనెను. లూకా. 22:34 (ఇంకా చూడు: యోహా. 13:38).

     ఆయన యెవడో నే నెరుగను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్లెను. అంతట కోడి కూసెను .....  మీరు చెప్పుచున్న మనుష్యుని నే నెరుగనని చెప్పి శపించుకొనుటకును, ఒట్టుపెట్టుకొనుటకును, మొదలు పెట్టెను. వెంటనే రెండవమారు కోడికూసెను. కనుక - కోడి రెండు మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనలో చెప్పిన మాట పేతురు జ్ఞాపమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను. మార్కు 14:68-72. 

     గమనిక: భాషను చదివి విషయాలను గ్రహించలేనివానికే పై లేఖనాల్లో సమస్య కన్పిస్తుందేమో కాని, వాటిని చదివి సంగతేమో తెలుసుకొనే జ్ఞానమున్నవానికి వాటిలో సమస్య కన్పించదు. నిజంగా శాసన ధిక్కారం చేసింది కోడి కాదు, మన మిత్రుడే వాస్తవ ధిక్కారం చేస్తున్నాడు; ఎలాగంటావేమో!

     ఒక విషయాన్ని “సాధారణంగా" తెలిపే మాటలుంటాయ్; “సునిసితంగా" తెలిపే మాటలు కూడా ఉంటాయ్. ఉదా: కాంతి (Light) ఒక సెకండుకు 299,000 కి.మీ. వేగంతో ప్రయాణం చేస్తుందంటాం. ఇది సాధారణంగా సూచించే విధానం. అయితే దాన్నేసునిసితంగా (ఖచ్చితంగా) చెప్పాలంటే 299,792 కి.మీ. వేగంలో పయనిస్తుందని చెప్పాలి. ఇలా ఒకదాన్ని సాధారణంగా ప్రయోగించేదానికి, సునిసితంగా చెప్పేదానికి మధ్య పరస్పర వైరుధ్యముందనడం మతిహీనతే ఔతుంది.

     ఇక మన పాయింటునకు వద్దాం. యేసు ఈ సందర్భంలో పేతురుతో అన్నమాటలను లూకా బహు సాధారణంగా ప్రయోగించాడు. అయితే మార్కు దాన్నే రికార్డు చేస్తూ(తాను పేతురుతో సన్నిహితంగా ఉన్నాడు గనుక 1 పేతురు 5:13), పేతురుకు వచ్చిన జ్ఞాపకాన్ని ఖచ్చితంగా వ్రాశాడు.

     అసలు యేసు పేతురుతో ఏమని చెప్పాడట? "కోడి రెండుమార్లు కూయక మునుప నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పుదువని" ఆయన అతనితో చెప్పాడట! ఆయన తనతో చెప్పిన ఆ మాటలను జ్ఞాపకమునకు తెచ్చుకొని పేతురు తలపోస్తూ ఏడ్చాడు. అయినా యిందులో వచ్చిన తంటా ఏమి? పేతురు ముమ్మారు ఆయన్ను ఎరుగననలేదా? లేక కోడి రెండు మార్లు కూయలేదా? కోడి రెండు మార్లు కూయకముందే ఆయన్ను ఎరుగనని పేతురు ముమ్మారు పలికాడు. పై తెలుపబడ్డ వాస్తవాలలో ఏ సమస్యారాలేదు. అయినా చదువను చేతగానివాడు హేతువాది ఎలాగయ్యాడో!!

     మన మిత్రుడు కోట్ చేసిన రూపాన్ని చూచి, "పేతురు యేసును ముమ్మారు ఎరుగనన్నట్టు లేదే" అని చదువరి అనుకుంటాడేమో! తాను మార్కు 14:68-72ను కోట్ చేస్తూ మధ్యలో డాట్సు పెట్టాడు చూడు, వాటిలో ఆ మూడవదాన్ని కప్పివేశాడు. వాస్తవాలను కప్పిపెట్టే వాడు ఎలా వాస్తవవాది ఔతాడు? సత్యాన్ని యిలా మభ్యపెట్టి మన విమర్శకుడు సాధించబోయే ఘనకార్యమేమో! ఇదేనా మన మిత్రుని వైజ్ఞానిక వాదం? ముందు అన్నట్టు - కోడి శాసన ధిక్కారాన్నిచేయలేదు. మన మిత్రుడే హేతువాద ధిక్కారాన్ని చేసాడు.
85. దేవుడు శోధకుడా, కాడా?
     ఆయన (దేవుడు) ఎవనిని శోధింపడు. యాకో. 1:13. 

     దేవుడు అబ్రాహామును శోధించెను ఆది. 22:1.

     గమనిక: పై లేఖనాలను కోట్ చేసినట్టు మన మిత్రుడు తన పాఠకులను భ్రమపెట్టుతున్నాడు. అంటే - తాను కోట్ చేసినట్టే బైబిల్లో ఉన్నదని అతడు తన పాఠకులను నమ్మించ ప్రయత్నించాడు. అయితే తాను కోట్ చేసిన భావంతో ఆది. 22:1 లేదు. ఇలా వక్రంగా మన మిత్రుడు ఎందుకు బైబిలు లేఖనాలను చిత్రించ బూనుకున్నాడో తెలియకున్నది. పైగా, పైది క్రింద, క్రిందిది పైన పెట్టి తన పాఠకులను తబ్బిబ్బు చేయడానికి అతడు మానక ప్రయత్నిస్తునే ఉన్నాడు. ఇందులో అతని ఉద్దేశమేమో తెలియకుంది.

     బైబిలులోనుండి మన మిత్రుడు ఎత్తి చూపిన ఆ రెండు లేఖనాలలో - ఒకవేళ - తాను కోట్ చేసినట్టే ఉన్నా అంటే అతడు కోట్ చేసిన రూపంలోనే బైబిలులో ఉన్నదనుకున్నా పై లేఖనాలలో తార్కిక సమస్యను మన మిత్రుడు చూపలేడు. ఎలాగంటావేమో! వాటి రెండింటి మధ్య కాల భేదముంది. ఆదికాండంలోని అబ్రాహాం తరువాత, రమారమి 2000 సంవత్సరాలకు 'యాకోబు" అనే రచన వచ్చింది. గనుక అప్పుడు ఒకవేళ దేవుడు "అబ్రాహామును శోధించెను" అని ఆది 22:1లో ఉండి, యాకో 1:13లో ఆయన ఎవనిని శోధింపడని ఉన్నా ఆ మాటలలో సమస్య ఉండనవసరం లేదు. అంటే ఆయన అప్పుడు శోధించాడు గాని; యిప్పుడు ఎవనిని శోధించడనే వాటిల్లో సమస్యగాని, సందేహంగాని ఉండనవసరం లేదు. తార్కిక జ్ఞానం
అలాటి భావనను వ్యతిరేకించదు.

     అయినా, అలా అనుకొనడానికైనా, బైబిల్లో ఆలాగు వ్రాయబడియుండలేదే! ఆది. 22:1లో బైబిలులో వ్రాయబడిందేమో చూడు. "ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను..." అని వ్రాయబడియుంది. "శోధించెను" (tempted), "పరిశోధించెను" (examined or tested) అనేవి వేరు వేరు మాటలు; అవి వేర్వేరు భావాలు కలిగియున్నాయ్. అయితే బైబిలులో - దేవుడు అబ్రాహామును "శోధించెను" అనే భావం లేదు. కావాలంటే ఆది. 22:1 నీవే తిరిగి చూడు! ఆయన అతన్ని పరిశోధించినట్టే వ్రాయబడింది!

     "శోధించుట" (temp) అనే మాట - "పడవేయుట", "కుదించుట", "నష్టపరచుట" అనే భావాలతో ప్రయోగింపబడియుంది. అలా చేయ సమకట్టినవాడు దేవుడు కాడు; అపవాదియే! అపవాదిని బైబిలు - "శోధకుడని" వర్ణించింది (మత్తయి 4:1-3) Pairazo =Greek origin

     "పరిశోధించుట" (testing) బంగారును అగ్నిలో పుటమువేసి, దాని విలువను పైకెత్తి చూపినట్లు పరీక్షించుట  "Messah" = to try and prove - Hebrew origin అని భావం. "పరీక్ష ఒకని సామర్థ్యాన్ని బయట పెట్టుటకు చేసే కార్యం." పరీక్ష లేకుండ ఒకని సామర్థ్యం పూర్ణంగా బయటపడదు. అబ్రాహాము ఎలాటివాడైనది సర్వజ్ఞుడైన దేవుడు ఎరిగియున్నా (ఆది. 18:19), దేవుని యెడల అబ్రాహాము కనుపరచిన విశ్వాసమెట్టిదో, ఆయన తన సంకల్పానికి సాధనంగా అబ్రాహామును ఎందుకు కోరుకున్నాడో పదుగురికి ఎరుక చేయడానికే దేవుడు అతన్ని పరీక్షించాడు. ఆది. 22:1లో ప్రస్తావింపబడి, ఆ క్రింద నెరవేర్చబడింది కేవలము ఈ కార్యక్రమమే!

     "శోధించుట" - "పరిశోధించుట” అనే పనులు ఒకే రకమైనవైనా, వాటి వెనుక దాగియున్న ఉద్దేశాలు వేరైయుంటాయి. "శోధన" యొక్క ఉద్దేశం - నష్టపరచుట; వ్యర్థునిగా చేయుటయై ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆయన నరుని ఎన్నడూ పరీక్షింపడు - "ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు - నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు” అని బైబిలు అంది. (యాకోబు 1:13లోని వర్తమానమిది).

     ఆది. 22:1కి మూలం హెబ్రీ భాష; యాకోబు 1:13కి మూలం గ్రీకు భాష వాటి మూల భాషల్లో ఉన్న వ్యత్యాసం తెలుగులో తేటగా చూపబడింది. అందుకే - ఆది. 22:1లో - దేవుడు అబ్రాహామును "పరిశోధించెను" అని ఉపయోగించబడింది, చూడు.

     అయితే "పరిశోధించెను" అనే దానికి శోధించెను అనే పదాన్ని చొప్పించి, పాఠకులను భ్రమపెడుతున్న"మన మిత్రుడు శోధకుడు కాడా!" ఒక వేళ తెలుగు ఏ తర్జుమాలోనైనా -"పరిశోధించెను" అనే స్థానంలో "శోధించెను" అని కన్పించితే అది మానవ దోషమేగాని గ్రంథ సందేశదోషం కాదు.

     ఏదియెలాగున్నా యాకోబు 1:13లో చెప్పబడినట్టు దేవుడు శోధకుడు కాడని రుజువు చేయబడింది. గనుక యింతకు శోధకుడు ఎవరో నీవే తేల్చుకో!
86. ప్రేమ జ్వరం
     దేవుడు ప్రేమ స్వరూపి. 1 యోహా. 4:8, 

     దేవుడు దహించు అగ్నియైయున్నాడు. హెబ్రి. 12:28, 29.

     గమనిక: దేవుడు తన సమస్త లక్షణాలలో పరిపూర్ణుడు (మత్తయి 5:48). ఆయన సత్య స్వరూపి, పరిశుద్ధుడు (ప్రకటన 6:10) యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధిగలవాడు (కీర్తన. 103:8-9). ఆయన సర్వజ్ఞుడు (1 యోహాను 3:20), సర్వశక్తుడు (ఆది. 18:14); సర్వస్థలాల్లో ఉండగలవాడు (యిర్మీయా 23:23-24; అపొ. 17:27); నిత్యుడు (కీర్తన. 90:2). దేవుడు ఆత్మ ఆయన తండ్రి (యోహా 4:24).

     ఇలా, బైబిలు దేవునికున్న అనేక లక్షణాలను తెలుపుతూ ఉంటే, వాటినన్నిటిని విడిచిపెట్టి, ఆయనకున్న లక్షణాలలో రెండింటిని మాత్రమే చూపి, “ప్రేమ జ్వరం" అనడంలో - మన మిత్రునికి మతిపోయినట్టుంది. "పాపిని ప్రేమించే దేవుడే, పాపాన్ని శిక్షిస్తాడు" అనే భావాన్ని ఆ రెండు లేఖనాలు వివరిస్తున్నాయ్. అందులో సమస్య జ్ఞానికి కన్పించదు. మరి వాటి మధ్య అసంబద్ధం మన మిత్రునికి కన్పిస్తుందంటే, అతని ఏమను కోవాలో!

     "ప్రేమించడం; శిక్షించడం" - అనే చర్యలు క్రమబద్ధమైనవిగా, ఒకదాని నొకటి వ్యతిరేకించనివిగా ఉండవచ్చునని చెప్పడానికి ఒక చరిత్ర వాస్తవాన్ని ఆలోచన చేద్దాం. అది ఈ క్రింద ఉదహరించబడుతుంది, చూడు.

     పూర్వకాలం రాజులుండేవారు కదూ! రాజులకు భోజనం తయారు చేసి వడ్డించేది సాధారణంగా వారి భార్యలైన రాణులు కారు. నిపుణులైన వంటవారు వేరుగా, వడ్డించేవారు వేరుగా ఉంటారు. అలా నియమింపబడినవారు తమ పనిలో నిపుణులైనవారు మాత్రమే కారు; నమ్మకత్వం కూడా ఆ పనికి అత్యవసరం! ఎందుకంటే - రాజుల ప్రాణాలు వారి నమ్మకత్వంపైననే ఆధారపడి ఉంటాయ్.

     పరిస్థితులు అలావుండగా; యోసేపు ఐగుప్తు కారాగారంలో ఉన్న దినాల్లో, ఒక వంటగాడు, వడ్డించేవాడు ఏకమై ఫరో రాజును చంపాలని ఆలోచిస్తున్నట్టు వార్తలందాయ్, వెంటనే రాజు వారికి జైలు శిక్ష విధించాడు; ఆ తరువాత అందిన వార్తపై విచారణ జరిపాడు. విచారణలో - వడ్డించేవాడికి ఆ కుట్రలో పాలులేనట్టు తేలిపోయింది. అయితే ఆ నిర్దోషిని చిత్రహింసలకు గురిచేసినందుకు, (ఆ వడ్డించే) వానియందు రాజు జాలిపడి, అతన్ని ప్రేమించి ఆదరించాడు. అయితే వంటవాడు మాత్రం నిజంగా దోషియని రుజువు చేయబడ్డాడు. గనుక అతని యెడల రాజు మహా ఉగ్రుడయ్యాడు. రాజాగ్రహం వానిని దహించే అగ్నిగా మారిపోయింది. ఇలా జరిగిన సంఘటనల్లో - రాజు ప్రేమకు జ్వరం వచ్చిందని అంటామా? ఒకవేళ ఎవడైనా దాన్ని అలా వర్ణించితే, అట్టివాడు తప్పక మతిపోయినవాడై ఉండాలి; ఉండితీరాలి!

     ఎప్పుడు ఎక్కడ ప్రేమగలిగియుండటమో, అప్పుడు అక్కడ ప్రేమగలిగి యుండటం; ఎప్పుడు ఎక్కడ శిక్షించడమో అప్పుడు అక్కడ, శిక్షించడం అత్యవసరం! మన మిత్రుడు కోట్ చేసిన లేఖన భాగాలు యిట్టి దేవుని గుణాతిశయాలను మాత్రమే ప్రచురపరు స్తున్నాయ్. వాటిలో సమస్యలేదు. ఇది ప్రేమ జ్వరం కాదు; అది మన మిత్రుని వివేకానికి వచ్చిన జ్వరం. హేతువాదమంటే యిలాటి అవివేక స్వరాన్ని వినిపించేదేనా? కాకపొతే మన మిత్రుడు హేతువాదియేనా?
87. బాగంటే అపనమ్మకం, అపవిత్రతయేనా?
     దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది మిక్కిలి బాగుగానుండెను. ఆది 1:31.

     ఆలోచించుము, ఆయన తన దూతలయందు నమ్మకముంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. యోబు. 15:15,

     గమనిక: పై లేఖనాల మీద మన మిత్రుడు వేసిన ప్రశ్న అర్థరహితం. అసందర్భాలను కలిపి "యివి అతుకలేదు చూడు!" అని అంటున్నాడు మన మిత్రుడు. అంతకంటే దానిలో విశేషమేమీలేదు. పాలు, పాలు కలవకపోతే ప్రశ్నించాలి; పాలు, నీరు కలవకపోయినా ప్రశ్నించవచ్చు; గాని నూనె నీళ్లలో కలవకపోతే - అది సమస్య కావలసిన అవసరం లేదు. పై లేఖనాలమీద మన మిత్రుడు వేసే ప్రశ్నయిలాటిదే! కావాలంటే నీవే పరిశీలించి చూచుకో!

     బైబిలు దేవుని గ్రంథమే అయినా, అందులో కేవలం దైవ చిత్తాన్ని తెలిపే మాటలే కావు; సాతాను, వాని అనుచరుల మాటలతో పాటు (ఆది 3:1-3; యోహాను 8:44, 48). దానిలో మానవ జ్ఞానం (యోబు 15:15) వగైరాలు కూడ దాఖలు చేయబడ్డాయి. దేవుని మాటలు కానివి, దేవుని మాటలతో ఏకీభవించకపోతే ప్రశ్నించడం, వాటిలో తప్పుపట్టడం మూఢత్వమే, అందులో వివేకమో, జ్ఞానమో లేదు.

     పోతే పై లేఖనాలను పరిశీలించి చూద్దాం. ఆది 1:31 మాత్రం దైవ చిత్తాన్ని సూచించే లేఖనమే. యోబు 15:15లోనివైతే - తప్పులేని చోట తప్పు పట్టాలని (మన మిత్రుడు బ్రహ్మం పూనుకున్నట్టు) పూనుకున్న ఎలీఫజు మాటలే! కావాలంటే వెనకా ముందు పరిశీలనగా చూడు! మన మిత్రుడు కోట్ చేసిన పై రెండు లేఖనాలు నూనె, నీళ్లలాంటివి! అవి అతుకనంత మాత్రాన అసంబద్ధాలు కావు. అవి వాటి స్వభావాన్ని బట్టే అతుకవు, నా మాటలు మన మిత్రుని మాటలు అతుకకపోతే నాకేమీ సమస్య లేదు. వాటి విషయం మీకేమైనా సమస్య ఉంటుందా? లేకపోతే యిప్పుడు బైబిలు లేఖనాల వద్దకు వచ్చి, వాటి సమయం, సందర్భం, ఉద్దేశం, వగైరా సంగతులను ఆలోచన చేద్దాం.

     మహోన్నతుడు తన సృష్టి కార్యక్రమాన్ని ముగించిన తరువాత తాను చేసిన దానినంతటిని చూచినప్పుడు తన మనస్సులో కలిగిన భావనను ఆయన తన ప్రవక్తయైన మోషేకు బయలుపరచాడు. ఆది. 1:31లోని విషయమదే! "దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను" (ఆది. 1:31).

     "ఒకని శ్రమకు వాని పాపమే కారణం కానవసరం లేదు" - అనే వాస్తవం యోబు రచనలో చర్చించబడింది. ఈ చర్చలో (in this debate) దైవ సందేశం, దానితో పాటు యోబు జీవితానుభవం ఒక పక్షాన నిలిచి వాదిస్తుంటే, దానికి విరోధంగా యోబు స్నేహితులు వాదించటానికి నిలిచారు. ఆ యోబు స్నేహితుల్లో, యోబు 15:15ను మాట్లాడిన ఎలీఫజు ఒకడు. వీరి మాటలను దేవుడు అంగీకరించలేదు సుమా! యోబు 42:7-8లో దీన్ని చూడు.

     యోబు శ్రమలో ఉన్నాడని విని, వాని స్నేహితులు అతని ఆదరించాలనే సదుద్దేశంతోనే అతని యొద్దకు వచ్చారు. వారు వచ్చి చూచిన యోబు పరిస్థితి బహు ఘోరంగా ఉంది. అది ఎలాగున్నా శ్రమకు కారణం "పాపమే"నని వారి విశ్వాసం. అందువలన వాగ్వివాదం జరిగింది. ఎందుకంటే, యోబు వారి సిద్ధాంతాన్ని అంగీకరించ లేదు, తనకు వచ్చిన శ్రమకు తాను చేసిన పాపం కారణం కాదని యోబు స్థిరంగా మాట్లాడుతూ ఉంటే - అతని వ్యక్తిత్వాన్ని అనుభవాన్ని మాటలను తృణీకరించుతూ ఎలీఫజు పలికిన మాటల్లోని భాగమే - యోబు 15:15, "ఆలోచించుము, ఆయన తన దూతలయందు నమ్మిక యుంచడు ఆకాశవైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు"; నీ నీతి ఏపాటిదంటూ యోబును క్రుంగదీయడానికి ఎలీఫజు పలికిన మాటలే అవి!

     బైబిలు దేవుని గ్రంథమని చెప్పుకుంటుంటే, మన మిత్రుడు (బ్రహ్మం) ఎలా అంగీకరించకుండ వాదనకు దిగాడో; అలాగే "తన శ్రమకు పాపం కారణం కాదు? అనే వాస్తవానికి విరోధంగా ఎలీఫజు మాట్లాడుతూ, తనకు తెలియని సంగతులు తెలిసినట్టు వదరాడు. అలా వదరిన పలుకులే - యోబు 15:15.

     అసలు రచనలు చదివి, ఆయా రచనల్లో ఉన్న ఉద్దేశాన్ని గ్రహించగలవాడెవ్వడూ ఆది. 1:31ని, యోబు 15:15తో కలపడు. అలా చేసేవాడు కేవలం పామరుడే! ఈ పామరత్వాన్ని పాండిత్యంగా కొలిచే ఆ ఆరాధికులను యిక ఏమనాలో! అలా కొలవలేదనుకో, జ్ఞానియైనవాడు లేక, హేతువాదియైనవాడు తన స్వరాన్ని బైబిలు బండారానికి విరోధంగా ఎత్తాలిగదా? అలా ఎత్తలేదేం?? బైబిలుపైన గళమెత్తే "హేతువాదులు" - బైబిలు బండారంపైన తమ స్వరం ఎత్తలేదంటే, అది రైటనేగదా వారి భావం! ఇక మన మిత్రుల వద్దనున్న "హేతువాదం" నేతిబీరకాయలోని నెయ్యేగదా!
88. యెహోవా నీతులు, కట్టడులు
     నీ పొరుగువాని హింసింపకూడదు, లేవి. 19:13

     ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన యింటనుండు దానిని వెండి నగలను బంగారు నగలను వనములను ఇమ్మని అడిగి తీసికొని మీరు వాటిని మీ కుమారులకును, కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందురు. నిర్గ. 3:22. 

     గమనిక: పై లేఖనాల్లోని వర్తమానాన్నీ పరిస్థితులను, తారుమారు చేసి బైబిల్లో పరస్పర విరుద్ధాలున్నాయి చూడు, అని మన మిత్రుడు అంటున్నాడు, ముందుది వెనుక, వెనుకది ముందు పెట్టి పరస్పర విరుద్దాన్ని చూపడం మోసం కదా? ఏది తార్కిక జ్ఞానాన్ని బట్టి చేయకూడదో దాన్ని మన విమర్శకుడు చేసి, అసంబద్ధాన్ని కల్పించ ప్రయత్నించాడు! అంతకంటే అతని విమర్శలో జ్ఞానయుక్తమైన ఏ పరిస్థితి లేదు.

     పైన తాను కోట్ చేసిన లేఖనాలను చూడు: ఏది ముందుంది?
     నిర్గమ. 3:22 ముందుదా లేక లేవి. 19:13 ముందుదా? అయితే దాన్ని క్రిందికి దించి, కాలక్రమంలో లేవి. 19:13 ముందుదైనట్టున్నూ ఆ తరువాతనే నిర్గమ. 3:22 వచ్చినట్టున్నూ తన రచనను చదివేవారిని మన మిత్రుడు భ్రమపెడుతున్నాడు కదా? అసలు యిదేమి హేతువాదమో? ఇది వింతైన హేతువాదంగానే వుందే. ఒకవేళ ముందే నీ పొరుగువారిని హింసించకూడదు అని ఉంటే - అది కూడా అసంబద్ధమో, కాదో పరీక్షించి ఉండేవారమే. పై లేఖనాలలో కనీసం ఆ పరిస్థితి కూడా లేదు. అలాటప్పుడు ఆ లేఖనాలు అసంబంద్ధాల క్రింద ఎలా ఆలోచింపబడతాయ్? అసలు బైబిలును ఎలా పట్టుకోవాలో కూడా తెలియని మన మిత్రుడే నేడు బైబిలును విమర్శించే హేతువాది! ఆ సంగతిని అలా వుంచి, వాస్తవాలను వాస్తవాలుగా గుర్తించడానికి ఆ లేఖనాలను పరిశీలించి చూద్దాం.

     నిర్గమ. 3:22 ప్రవచనానికి సంబంధించిన లేఖన భాగం. ప్రవచనాలంటేనే "అలర్జీగా" భావించే మన మిత్రుడు ఈ మాట వినగానే వ్యతిరేకంగా ఆలోచింప బూనుకుంటాడేమో! ఏదియెలాగున్నా అక్కడ ఉన్న వాస్తవం అదే కదా? మోషేను తన పనికి నియమించడానికి ముందు దేవుడు అతనికి తెలియజేసిన సమాచారమిది. అంటే అతడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి బయటికి నడిపించే బాధ్యత వహించితే, నిర్గమ. 3:22లో ఆయన అతనికి తెలియజేసిన సమాచారం నెరవేర్చబడడం అతడు కన్నులారా చూస్తాడు! గనుక, యెహోవా మోషేను తన పనికి నియమించుకొన్నట్టు అది రుజువుగా వుండబోతుందని ఆయన అతనికి ముందుగా సూచిస్తాడు. మోషేను ఆ పనికి నియమించినట్టు యెహోవా అతనికి యిచ్చే రుజువుల్లో అది ఒకటైయుంటుంది. అందుకే అది ఆజ్ఞగా యియ్యక, అంటే."ఐగుప్తీయులను దోచుకొనుడి" అని చెప్పక, ".ఐగుప్తీయులను దోచుకొందురు" అని - భవిష్యత్ వార్తగా అది అతనికి సూచింపబడింది.

     మోషేను తన పనికి నియమించినట్టు నిదర్శనంగా యెహోవా నిర్గమ. 3:22లో అతనికి సూచించిన ఈ లేఖనం - ఈ సందర్భానికి రెండవ ప్రవచనమే ఔతుంది. ఇది మొదటిది కాదు సుమా! ఇదే సందర్భాన్ని గురించి, దీనికి సుమారు 400 సంవత్సరాలకు పూర్వమే దేవుడు అబ్రాహాముతో యిలా పలికాడు; గమనించు: "నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమపెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు" (ఆది. 15:13నుండి 16వరకు చూడు).

     అతని సంతతిని (ఇశ్రాయేలీయులను) గూర్చి దేవుడు అబ్రాహామునకు చేసిన వాగ్దాన కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన మాటలకు నెరవేర్పుగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు చేరారు. ఆయన అబ్రాహాముకు సూచించినట్టే - వారు విస్తరించారు; ఐగుప్తీయులచే వారు బాధింపబడ్డారు (నిర్గమ. 1:13-14; 2:23-24 చూడు). ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు చేసిన కఠిన దాస్యానికినీ, వారు అనుభవించిన శ్రమకునూ ప్రతిఫలంగావారు ఐగుప్తును విడిచిపోయే సమయంలో- "మిక్కిలి ఆస్తితో బయలుదేరి వెళ్ళతారని" యెహోవా అబ్రాహాముతో చేసిన వాగ్దానం మోషే నాయకత్వంలో నెరవేర్చబడుతుందని అతనికి తెలుపుటకే నిర్గమ. 3:22 పలుకబడింది. దీన్ని బైబిలు చదువనేర్చిన ఎవడూ కాదనలేడు! బైబిల్లో ప్రవచనాలు లేవనేవాడు, దాన్ని చదవడానికి చేతగానివాడే.

     ఆ సంగతి అలావుంచి, పైన మనం చూస్తున్న ప్రవచనం నెరవేర్చబడకముందు, అసలు వాస్తవంగా అది ఎలా నెరవేర్చబడుతుందో కూడా యెహోవా మోషేకు ముందుగానే సూచించాడు - ఐగుప్తులో సంభవించే చివరి తెగులు తరువాత, ఫరో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెళ్ళగొట్టేది ఖాయం - "కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను (ఆది భాషలో "షాల్" అని అంటే- గురుతుగా ఉండునట్లు) అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పమనెను" (నిర్గమ. 11:2 చూడు). ఆ సందర్భంలో నిజంగా యెహోవా కట్టడ యిదే: అంతేకాక ఆయన - "ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను" అని వ్రాయబడింది చూడు (నిర్గమ. 11:3). వాస్తవాలు యిలాగున్నాయ్.

     తిరిగి ఆలోచించు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వెళ్ళిపోయే సమయంలో - గుర్తుగా ఉండునట్లు వారు తమ స్నేహితులను అడిగి పుచ్చుకొనగను, వారి స్నేహితులు, పొరుగువారు - కటాక్షము కలిగి వాటిని వారికి యివ్వగను - తన పొరుగువారిని హింసించడం ఎక్కడ జరిగిందో అర్ధమే కావడం లేదు. రమారమి మూడు, నాలుగు తరాలుగా బాధింపబడి, ఐగుప్తీయులకు వెట్టి చాకిర్లు చేసి, కూటికీ, గుడ్డకూ సరిగా నోచుకోలేక పోగా, తమ గర్భఫలాన్ని కూడా దక్కించుకోలేని ఇశ్రాయేలీయులకు - చివరిగా యిలాటి ఆదరణ లభించడంలో తప్పేముందో యెహోవా నీతులకు కట్టడలకూ ఏ సమస్య రాలేదు సుమా!

     ధర్మశాస్త్రం యూదుల రాజ్యాంగ చట్టం. అందులో నిర్గ, 3:22-ఇశ్రాయేలీయుల (foreign policy) విదేశీచట్టం; లేవీ. 19:13 - వారి (internal policy) అంతరంగ వ్యవహారాలకు సంబంధించినది - ఈ రెండింటిని యిలా విభజింపవలసియుంది.

     మన మిత్రుని రచనయైన బైబిలు బండారాన్ని పరిశీలించుతూ వుంటే- యిప్పుడు నీకేమనిపిస్తుందో చెప్పు, ఒకవేళ అది నీకేమని అనిపించినా, ఇది మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీమ్ కోర్టులోనుండి ఎలా బయటికి వచ్చిందో ఆలోచిస్తుంటే అర్థం కావడమే లేదు. పైగా హేతువాదులంటే ప్రతిదాన్ని హేతుబద్ధంగా పరిశీలించా లంటారు గదా! అయితే మన దేశంలోని హేతువాదులు- హేతువాదమనే హెడ్డింగ్ క్రింద ఏది చెప్పినా ప్రశ్నించకుండా అంగీకరిస్తారన్నమాటే గదూ?

     ఒకవేళ ఏ మతానికైనా ప్రమాణంగా గ్రంథస్తం చేయబడ్డవి "మన" (రావిపూడి వెంకటాద్రిగారి, వగైరాల) "తాత ముత్తాతల తలకాయలే" కావచ్చు. అయినా, బైబిల్లో గ్రంథస్తం చేయబడ్డవి ఎవడి తాత ముత్తాతల తలకాయలు కావు! (బై, బం. పే 9) "బైబిలు దేవుని గ్రంథమని" దాని రచనను పరిశీలనగా చదవగల ప్రతివానికి, అది రుజువు చేసుకొంటుంది. చదవడం చేతగాకపోతే మన మిత్రుడు బ్రహ్మంలా తమ అజ్ఞానాన్ని వెల్లడి చేసుకోవలసిందేగాని, బైబిలు సందేశంలో మాత్రం అసంబద్ధాలు లేవు. అలా ఉన్నట్టు ఎవరును రుజువు చేయలేరని నా ఈ రచనయే నిరూపిస్తుంది.
89. యెహోవా, సాతాను - లోకాధికారి యెవరు?
     భూమియు, దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులును యెహోవావే, (కీర్త 24:1. (ఇంకా చూడు: 1 కొరిం, 10:26; ప్రక. 1.5).

     పిమ్మట అపవాది (సాతాను) మిగుల యెత్తయిన ఒకకొండమీదికి ఆయనను (యేసును) తోడుకొనిపోయి, యీ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి - నీవు సాగిలపడి నాకు సమస్కారము చేసినయెడల ఇవన్నియు నీ కిచ్చెదనని యేసుతో చెప్పెను. మత్త. 4:8,9.

     ఇప్పుడీ లోకాధికారి (సాతాను) బయటకు తోసివేయబడును. యోహా. 12:31. 

     గమనిక : బైబిలులోని పై లేఖనాలు పరస్పర విరుద్దాలంటాడు మన విమర్శకుడు. ఒకవేళ పై లేఖనం "ఈ లోకాధికారి యెహోవా" అని ఉండి; ఆ తరువాత లేఖనం; "ఈ లోకాధికారి సాతాను" - అని ఉంటే అలాటివాటిని పరస్పర విరుద్దాలో కావో పరిశీలించేవారమే. అలాటి పరిశీలనలో విలువ ఉండేది కూడ. అయితే మన మిత్రుని విపరీత వాదాన్ని బట్టి అలా లేనివి కూడా పరిశీలించవలసి వస్తుంది. గనుక బైబిలు లేఖనాలను పరిశీలించి నిజనిజాలను తెలిసికొందాం.

     "లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తము పాపమునకేగాని, నీతి నిమిత్తముగా విధేయతకేగాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా??" (రోమా 6:16). లేక "ఒకడు దేనివలన జయింపబడునో దానికే దాసుడగును గదా??" (2 పేతురు 2:19). "పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు" (యోహాను 8:34).

     భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులును యెహోవావే. ఆయన వాటికి (వారికి) సృష్టికర్త (1 కొరింథీ. 8:5–6), అయినా, తనను అనుసరించాలని ఆయన మనుష్యులను బలవంతం చేయడు. స్వేచ్ఛా జీవిగా దేవుడు - మానవుని సృజించి, వానితో సహవాసం చేయాలని ఆయన ఎంతగా కోరుకున్నా మానవుడు యిష్టపడితేనే ఆయన వానితో సహవాసం చేయ బూనుకున్నాడు (ఆది. 2:17: ప్రకటన 3:20), లేకుంటే లేదు.

     మానవుడైతే తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసికొని, సృష్టికర్తను విడిచి అపవాది ననుసరింపబూనుకున్నాడు (ఆది. 3:1-6). అపవాదేమో, మానవునిచే పాపం చేయించి, వానిని వశపరచుకొని, వానిపై యాజమాన్యాన్నే చేపట్టాడు (యోహాను 12:31) అంటే -శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలకు వశమైన లోకానికి సాతాను అధికారిగా (యోహాను 2:15-17) మారిపోయాడు (మత్తయి 4:8, 9).

     అపవాది మొదటినుండి పాపము చేయుచున్నాడు. "గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు (క్రీస్తు) ప్రత్యక్షమాయెను" (1 యోహాను 3:8). అప్పటికే, అంటే-క్రీస్తు లోకానికి అరుదెంచేలోపే, నరులు (లోకం) సాతాను వశమై యున్నారు. పైగా ఈ లోకాధికారి ఆయుధాలను ధరించుకొని తన సొత్తును కాపాడు కొంటున్నాడు (లూకా 11:21; మత్తయి 12:29). 

     అపవాది క్రియలను లయపరచటానికే వచ్చిన యేసు, తన సిలువ మరణం ద్వారానే అపవాదిని నశింపజేయాలని ముందుగా నియమింపబడింది (ఆది. 3:15; హెబ్రీ 2:14– 15) దానికి పరిపూర్ణంగా సిద్ధపడిన క్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ - "ఇప్పుడీ లోకాధికారి (సాతాను) బయటకు త్రోసివేయబడు"నని చెప్పాడు (యోహాను 12:31) అంటే, అపవాది మోసగించి సంపాదించుకొన్న తన అధికారంనుండి వాడు దింపివేయ బడతాడని ఆయన తెలిపాడు.

     అలా చెప్పిన మరునాడే ఆయన సిలువ మరణాన్ని ఎదుర్కొన్నాడు, ఆయన పాపమేమియు చేయలేదు. గనుక మరణం ఆయన్ను బంధించలేకపోయింది (అపొ. 2:24) కాబట్టి మరణ వేదనలను తొలగించి దేవుడు క్రీస్తును లేపాడు, పునరుత్థానుడైన క్రీస్తు - "ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను" (కొలస్సీ 2:13-15)అని వ్రాయబడియుంది. నీవు నమ్మినా నమ్మకపోయినా బైబిలు చెప్పేది యిది! బైబిలు చెప్పే లైనులో ఆలోచిస్తే అందులో ఏ దోషమూ లేదు.

     గనుక పునరుత్థానుడైన క్రీస్తుకు - "పరలోకమందును భూమిమీదను సర్వాధికార మియ్యబడింది" (మత్తయి 28-18). ఈ సందర్భాన్ని ప్రకటన గ్రంథం యిలా సూచించింది: "మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని - రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు, శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను" (ప్రకటన 12:10 చూడు). "మరియు మరణముయొక్కయు, పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు" ఆయన స్వాధీనం చేయబడ్డాయి కూడా (ప్రకటన 1:18). సాతానును జయించిన క్రీస్తు, సాతాను చెరను తన చెరగా పట్టుకొనిపోయాడు (ఎఫెసీ. 4:8) ఓడింపబడిన రాజు తన జనులను ఏలునట్లు అనుమతి పొందినవాడైనా, వానిని జయించిన సార్వభౌముని క్రింద సామంతైనట్టు  - అంధకార సంబంధులగు జనులపై సాతాను తన పెత్తనం చెలాయించినా, వాడు క్రీస్తు యేసుకు సామంతుగానే చేయబడ్డాడు.

     భూమి, దాని సంపూర్ణత, లోకమూ దాని నివాసులును యెహోవావే! (They all belong to Him because He is their Creator and Owner). అయితే లోకరాజ్యాలను వాటి వైభవాన్ని సాతాను మోసంతో కైవశం చేసుకొన్నాడు. అందువలన వాడు "ఈ లోకాధికారి” అనబడ్డాడు (యోహాను 12:31), అయితే అపవాది క్రియలను లయపరచుటకు ప్రత్యక్షుడైన క్రీస్తుయేసు (1 యోహాను 3:8), తన కార్యక్రమాన్ని సిలువ విజయం ద్వారా నెరవేర్చి అపవాదిని వాని అంతస్తునుండి పడద్రోశాడు (ప్రకటన 12:10-12). ఇప్పుడు లోకాధికారి క్రీస్తు యేసే (మత్తయి 28:18-20 ప్రకటన 1:5; కొలస్సీ 2:10). ఇదీ ఈ సందర్భంలో ఉన్న బైబిలు సందేశం!

     బైబిలు చదివిన తరువాత కూడా ఈ సంగతులు ఎరుగలేని మన మిత్రుడు బైబిలును విమర్శింపదగునా? చేతగాని పనులే అతని హేతువాదం కాబోలు! తన బండారం సంగతి ఎలాగున్నా బైబిలు సందేశంలో ఏ సమస్యా లేదు సుమా!
90. యేసు అనుగ్రహము, శిష్యుల అల్ప విశ్వాసము
     ఆయన తన పన్నెండుమంది (శిష్యులను) పిలిచి సమస్తమైన దయ్యములమీద శక్తిని, అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారి కనుగ్రహిం(చెను). లూకా 9:1. (ఇంకా చూడు. మత్త 10:1-8).

     అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను. ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థతనొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి - మేమెందుచేత దానిని వెళ్లగొట్ట లేకపోతిమని అడిగిరి. అందుకాయన - మీ అల్పవిశ్వాసము చేతనే (అనెను) మత్త. 17:18–20. 

     గమనిక: పై రెండు లేఖనాలలో సమస్య లేదని చెప్పడానికి వేరే చోటికి పోనవసరం లేదు. మత్తయి 17:18-20ని, మన విమర్శకుడు కోట్ చేశాడే! దానికి ముందున్న కొన్ని వచనాలను చదివితేనే సమస్య పరిష్కారమౌతుంది. అయినా ఈ విషయాన్ని గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో యింకా చూద్దాం.

     దైవానుగ్రహానికీ, మానవ విశ్వాసానికీ మధ్య విడదీయబడని సంబంధమున్నట్టు పలు మార్లు యేసు తన శిష్యులకు వివరించాడు. ఆయన అంజూరపు చెట్టును శపించిన సందర్భంలో "తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి “- అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి. అందుకు యేసు - మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి -నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (మత్తయి 21:19-23).

     మరో సందర్భంలో ఈలాటి అద్భుత శక్తులనే యేసు తన అపొస్తలులకు అను గ్రహించుతూ, "నమ్మినవారివలన ఈ సూచక క్రియలు జరుగునని సూచించాడు" (మార్కు 16:17-19). అయినా, దైవానుగ్రహం, మానవ విశ్వాసం అనేవాటికి ఉన్న అవినావభావ సంబంధం కొరకు మనం యిదంతా తిరుగనవసరం లేదు. మన విమర్శకునిచే రెండవ లేఖనంగా చూపబడ్డ మత్తయి 17:18–20కి ముందున్న కొన్ని వచనాలను చదివితే అసలు సంగతి తేటబడుతుందనుకొన్నాం కదూ! ఇప్పుడు దాన్ని చూద్దాం.

     అక్కడ వ్రాయబడ్డ సందర్భమిది. రోగియైన తన కుమారుని ఒకడు మొదటిగా ప్రభువుయొక్క శిష్యుల యొద్దకు తీసికొనివస్తాడు. కాని వారు ఆ చిన్నవానిని బాగుచేయలేకపోయారు. గనుక ఆ చిన్నవాని తండ్రి, జరిగిన సంగతిని యేసుకు తెలిపి, తన కుమారుని స్వస్థపరచుమని ఆయన్ను వేడుకుంటాడు. అందుకు యేసు - "విశ్వాసము లేని మూర్ఖతరమువారలారా మీతో నేనెంతకాలముందును? ఎంతవరకు మిమ్మును సహింతునని" తన శిష్యులను గద్దించాడు.

     దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది? యేసు యొక్క అనుగ్రహాన్ని తన శిష్యులు వినియోగించుకోవాలనుకుంటే, విశ్వాసం ద్వారానే అది వీలు అవుతుందని తెలియడం లేదా? గత అనుభవంతో ఆయన అనుగ్రహాన్నివారు వినియోగించుకోగలిగారు (లూకా 10:17-20) కాని విశ్వాసం సన్నగిలినప్పుడు యిలాటి దుస్థితినే వారెదుర్కొన్నారు. వారి మాట మీద వారికే నమ్మకం లేనప్పుడు యితరులకు వారేం చేయగలరు? యితరులను వారెలా నమ్మింపగలరు? అలాటప్పుడు "యేసు అనుగ్రహం - శిష్యుల అల్ప విశ్వాసం" అని అపహసించడం అర్థరహితం కదూ? గనుక లేఖనాలను వక్రంగా మార్చితేనో, లేక వాటిని అపార్ధం చేసికొంటినో తప్ప బైబిల్లో పరస్పర విరుద్ధాలు కనిపించే అవకాశం లేదన్న మాట!!

     అయితే ఒక మాట (మొదటి శతాబ్దపు క్రీస్తు శిష్యుల్లా) "మీరిప్పుడు సూచక క్రియలు చేయడంలేదేం? మీకు విశ్వాసం లేదా? అని అడుగుతావేమో!!! సంగతులు పరిష్కారంగా తెలియక అలా పొరపాటుగా ప్రశ్నిస్తున్నావ్. సూచక క్రియలు, మహాత్కార్యాలు, అద్భుతాలు - యేసు ఆనాడు తన శిష్యులకు అనుగ్రహించింది - తనయందు వారి విశ్వాసాన్ని బలపరచడానికినీ, ఆయన రాజ్యాంగ చట్టమైన క్రొత్త నిబంధనను బయలుపరచి, దాన్ని స్థిరపరచడానికి మాత్రమే!" (హెబ్రీ. 2:1-2; మార్కు 16:17-20 చూడు). 

స్వాతంత్య్రాన్నిచ్చే ఆ సంపూర్ణ నియమం (అంటే - క్రొత్త నిబంధన) బయలుపరచ బడిన తరువాత (యాకోబు 1:22-25), అద్దములోవలె దానిలో తేరి చూస్తూ నిలకడగా నుండవలెనని మాత్రమే క్రైస్తవులు ఆజ్ఞాపించబడ్డారు. అప్పటినుండి సూచక క్రియలు, వగైరాలకు క్రైస్తవ విశ్వాసంలో ప్రత్యేకమైన స్థానం లేకుండపోయింది (1 కొరింథీ. 13:8-11 చూడు). అందువల్ల మేమిప్పుడు సూచక క్రియలు చేయడం లేదు. ఎవడైనా సూచక క్రియలు చేస్తానని చెప్పితే, వాడు లేఖనాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు మాత్రమే గుర్తించాలి.

     సూచకక్రియలు నేడు చేయడంలేదని గేలిచేయడమో, యిప్పుడవి జరగటం లేదు గనుక మొదటి శతాబ్దంలో అవి జరిగి యుండలేదని భ్రమించడమో, లేక వాదించడమో అజ్ఞానమౌతుంది సుమీ! అది కూడా గుర్తుపెట్టుకో! అవసరతను బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఆయా కార్యాలు చేయబడ్డాయి, ఏదియెలాగున్నా ఎవడి అనుగ్రహం పొందాలన్నా పొందేవాడికి అతని మీద నమ్మకముండాలి. నిన్ను శంకిస్తూ, నీ అనుగ్రహాన్ని ఎవడైనా పొందగలడా? అల్ప విశ్వాసమంటే ఒకని మాటను లేక అతని శక్తిని శంకించడమే! అలాటివాడు ఏ అనుగ్రహానైనా ఎలా పొందగలుగుతాడు?
91. కృపకు నిదర్శనం ఖూనీలా?
     యెహోవా తన మార్గములన్నింటిలో నీతి కలవాడు; తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. కీర్త 145:17. 

     నేను నీతిపరుడనగు దేవుడను; రక్షించువాడను నేనే, నేను తప్ప మరి యే దేవుడను లేడు యెష. 45:21, (ఇంకా చూడు: కీర్త. 33:5; 103:8, 100:5)

     యెహోవా సెలవిచ్చునదేమనగా . నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతముచేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటినీ హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలనము చేయుమని చెప్పెను. 1సమూ 15:2,3 ఇంకా చూడు: 1 సమూ. 6:19).


     గమనిక: పై చూపబడ్డ లేఖనాల ద్వారా మన విమర్శకుడు చెప్పనుద్దేశించిన సమస్య చదువరులకు అర్థమయ్యిందా? దేవుడు కృపగలవాడైతే ఖూనీలు చేయమన్నాడేం? అని అడుగుతున్నాడు, మన మిత్రుడు. అయితే ఈ లేఖనాలను వాటి వాటి సందర్భాల్లో పెట్టి చూచినట్టయితే యిలాటి ప్రశ్నకు స్థానం లేకుండానే ఉండేది! నిర్ధాక్షిణ్యంగా అమాలేకీయులను హతము చేయుడని తన క్రియలన్నిటిలో కృప చూపు దేవుడే ఎందుకన్నాడో తెలుసుకోడానికి ప్రయత్నించకుండానే తీర్పు చెప్పడం జ్ఞానం కాదు. గనుక యింతకు ఏమి జరిగిందో తెలుసుకొని, ఆ తరువాత మాట్లాడదాం. సరేనా? అయితే చూడు!

     దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యంనుండి విడిపించి, తోడుకొని వచ్చే సమయంలో ఓ సంఘటన జరిగింది. ఇశ్రాయేలీయులు ప్రయాసపడి అలసియున్నప్పుడు, మార్గమున అమాలేకీయులు వారిని ఎదుర్కొని, వారిలో వెనుకనున్న బలహీనులనందరిని నిర్నిమిత్తముగానే హతం చేసారు (నిర్గమ. 17:8-16; ద్వితీయో. 25:17-18). 

     దేవుడు తన క్రియలన్నిటిలో కృప చూపువాడు గనుకనే, అమాలేకీయులు తమ స్వభావాన్ని మార్గాలనూ, మార్చుకొనడానికి ఆయన వారికి రమారమి 400 సంవత్సరాల కాలమిచ్చాడు. అంటే ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణ కాలంనుండి - వారి తొలి రాజైన సౌలు వచ్చేవరకుగల కాలమంతటిలో ఆయన అమాలేకీయులకు కృపజూపుతూనే వచ్చాడు. ఆయన వారికనుగ్రహించిన కృపా కాలంలో అమాలేకీయులు తమ బుద్ధినీ, దుష్టత్వంతో కూడిన తమ క్రూర చర్యలనూ మార్చుకొనియుంటే, దేవుడు వారిని క్షమించి ఉండేవాడే వారికి ఆ కీడు సంభవింపకుండపోయిఉండేదే! (యిర్మీయా 18:7-8 చూడు). 

     అయితే అమాలేకీయులు తమ దుర్మార్గతను విడిచిపెట్టడానికి బదులు, పరమ దేవుని కృపను కాళ్ళదన్నారు. రక్షణార్ధమైన ఆయన దీర్ఘశాంతాన్ని (2 పేతురు 3:15) చులకన చేసారు. కృపను తిరస్కరించి, తరతరాలుగా అవినీతిని కొనసాగిస్తూ వచ్చారు. అట్టి అమాలేకీయులకు - తన మార్గాలన్నిటిలో నీతిగల దేవుడు విధించిన శిక్షారూపమే 1సమూ 15:2-3లో వివరించబడింది. అది యుద్ధం రూపంగానే కనుపరచబడింది! అయినా "యుద్ధాన్ని ఖూనీలని మతి ఉన్నవాడెవడైనా అంటాడా? ఒకవేళ మతిపోయినవాడు అలా అన్నా జ్ఞానంగలవాడు దాన్ని అంగీకరిస్తాడా?? రణరంగంలో ఖూనీలుజరుగవు.

     మరొకసారి కూడ యిదే ఉదాహరణ: ఇంటపడి భార్యను చెరిపి, బిడ్డలను చంపి, యిల్లు దోచుకొనిపోయిన దుర్మార్గుని - శిక్షించే విషయంలో నీవేమంటావో! పైగా, కోర్టు వాయిదాలతో దీర్ఘకాలం సహించి, అతనిలో మార్పేమైనా కనబడుతుందేమోనని కనిపెట్టినా, తన దుష్ట స్వభావాన్ని మార్చుకోని - ఆ దుర్మార్గునికి మరణ శిక్ష విధించినప్పుడు, దాన్ని అన్యాయమంటావా? అలాటప్పుడు - తన్నాశ్రయించినవారు అలసియుండగా – వెనుకనుండి వచ్చి వారిలో బలహీనులను చంపి, దేవుని దీర్ఘశాంతాన్ని చులకన చేసి, ఆయన కృపను కాళ్లదన్ని తమ దుర్మార్గతను విడువకయే ఉన్న అమాలేకీయులకు న్యాయమైన శిక్షను విధించిన దేవుడు - తన స్వభావానికి విరోధంగా ప్రవర్తించాడంటావేం? రణరంగంలో జరిగే మారణహోమాన్ని ఖూనీలనడం మతిహీనత కదూ? ఈ మారణహోమం - ధర్మ యుద్ధ నియమాన్ని ఉల్లంఘించి, సైన్యం అలసియున్నప్పుడు, జనులకు ఆశ్రయం లేనప్పుడు, సైన్యాన్ని విడిచి - వారి వెనుకనున్న స్త్రీలను, పిల్లలను, బలహీనులను కనికరించకుండ, నిర్నిమిత్తంగా, దారుణంగా హింసించి చంపిన అమాలేకీయులకు దేవుడు (దీర్ఘకాలము సహించి కృప చూపి చివరకు) విధించిన శిక్షను ఖూనీలుగా వర్ణించడం - హేతువాది చేసే పనేనా? నిజంగా ఒకడు హేతువాదే అయ్యుంటే, ఈ నందర్భంలో, "కృపకు ప్రతిఫలం తిరస్కారమా?" అని అడగాలి!
92. యోహాను చెర - యేసు బాప్తిస్మం - ఏది ముందు?
     యోహాను చెరసాలలో వేయబడిన తరువాత యేసు - కాలము సంపూర్ణమై యున్నది; దేవుని రాజ్యము సంపూర్ణమై యున్నది; మారుమనస్సు పాంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలలైయకు వచ్చెను. మార్కు 1:14. 

     యేసు తన శిష్యులతో కూడ యూదైయ దేశమునకు వచ్చి, అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను. యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చు చుండెను ....  యోహాను యింక చెరసాలలో వేయబడి యుండలేదు. యోహా. 3:22-24.

     గమనిక: "యేసు బాప్తిస్మం" అనడంలో మన విమర్శకుడు దేన్ని ఉద్దేశించాడో తెలియదు - ఎందుకంటె - యేసు బాప్తిస్మం పొందిన సంఘటన ఒకటుంది. యేసు బాప్తిస్మమిచ్చిన సంఘటన మరొకటుంది. ఈ రెండింటిలో దేనిని మన విమర్శకుడు ఉద్దేశించినా, రెండవ దానినే మనం పరిశీలించితే మొదటిదాన్ని చర్చింప పనిలేదు. అయినా దానికి ముందు ఒక ఉదాహరణను గమనించి చూస్తే అసలు విషయం అర్థమౌతుంది.

     ఉదా: "రవి చనిపోయిన తరువాత రమేష్ వ్యాపారం చేసికొంటూ మద్రాసు చేరుకున్నాడు."
     "రమేష్ తన కుటుంబ సమేతంగా ఆంధ్రాలో కాలం గడుపుతూ, వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అప్పటికి రవి యింకా చనిపోలేదు."

     పై ఉదాహరణలో మీకేదైనా సమస్య ఉన్నట్టు కన్పించిందా? రవి మరణం - రమేష్ మద్రాసు చేరడం, ఏది మందు? అని అడిగితే ఎలా ఉంటుందో; యోహాను చెర - యేసు బాప్తిస్మం - ఏది ముందు? అనేది కూడా అలాగే ఉంది.

     మనం యింకా ముందుకు పోయి, యేసు బాప్తిస్మం పొందినది మొదలు, ఆయన గలిలయలో సువార్త కార్యక్రమాన్ని ప్రారంభించినంతవరకు జరిగిన సంఘటనల్లో కొన్నింటిని వరుసగా గుర్తించగలిగితే - ఈలాటి సమస్యలు తల ఎత్తకుండాపోతాయి. ఆయా సంఘటనలను, జరిగిన స్థలాలను జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే ఏనుగును వర్ణించడంలో గుడ్డివాళ్ల దెబ్బలాటలా మన చర్చ కొనసాగుతుంది. గనుక కాలక్రమంలో సంఘటనలను గుర్తించుదాం.
     1. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే, 40 దినాలు యూదయ అరణ్యంలో శోధింపబడ్డాడు (మత్తయి 3:15, 4:1-10; మార్కు 1:9-13). 
     2. శోధన కాలం ముగిసిన తరువాత ఆయన గలిలయలోని నజరేతుకు వెళ్ళాడు (లూకా 4:1-18). 
     3. అక్కడనుండి ఆయన తన శిష్యులను ఏర్పరచుకొనడానికి యూదయలోని బేతనియలోనున్న యోహాను నొద్దకు రెండవ మారు (యేసు) వచ్చాడు (యోహాను 1:19-51).
     4. తరువాత ఆయన తాను ఏర్పరచుకొన్న శిష్యులతో కూడ యూదయను వదలి గలిలయలోని కానా పెండ్లి విందుకు వెళ్లాడు (యోహాను 2:1-11). 
     5. కానానుండి కపెర్నహూమనకు వెళ్లి, అక్కడ కొన్ని దినాలు గడిపాడు (72 వ.). 
     6. గలిలయలోని కపెర్నహూమునుండి యేసు తన శిష్యులతో కూడ పస్కాపండుగకై యెరూషలేమునకు (యూదయకు) వచ్చాడు (యోహాను 2:13–25). ఆ సమయములో ఆయన దేవాలయాన్ని శుద్దీకరించాడు.
     7. ఆ రాత్రి తన యొద్దకు వచ్చిన నీకొదేముతో ఆయన మాట్లాడాడు (యోహాను 3:2).
     8. ఆ తరువాత యూదయలోనే తన శిష్యులతో కాలము గడుపుచూ బాప్తిస్మమిచ్చు చున్నాడు (యోహాను 3:22). అయితే ఆయనే స్వయంగా బాప్తిస్మమియ్యలేదు. ఆయన శిష్యులే ఆ కార్యక్రమాన్ని చేసారు. అదే సమయంలో సలీము దగ్గరనున్న ఐనోనను స్థలములో యోహాను కూడ బాప్తిస్మమిస్తున్నాడు (యోహాను 3:23-24), యోహాను బాప్తిస్మమిచ్చిన రెండవ స్థలమది.
     9. యోహాను కంటె యేసుకు ఎక్కువమంది శిష్యులవ్వడం జరిగింది. అప్పుడు యూదా మత నాయకుల (పరిసయ్యుల) దృష్టి యోహాను మీదనుండి యేసువైపు మరల్చబడ నారంభించింది (యోహాను 4:1-2).
     10. గనుక ఆయన యూదయను విడిచిపోయాడు. యూదయనుండి గలిలయకు వెళ్లే మార్గంలో, సమరయ ప్రాంతాన్ని దాటాలి. మార్గంలో ఆయన సమరయ స్త్రీని కలిసికొని ఆమెతో మాట్లాడడం మాత్రమేగాక, సమరయులు వచ్చి ఆయనను ఆహ్వానించగా ఆయన వారితో కూడవెళ్లాడు (యోహాను 4:4-45) అప్పటికి యింకా ఆయన గలిలయ పరిచర్య ప్రారంభం కాలేదు.
     11. ఈ మధ్యకాలంలో హేరోదు యోహానును చెరలో వేయిస్తాడు. ఆ సంగతి యేసుకు తెలిసింది - అలా యోహాను చెరలో వేయబడిన తరువాతనే - యేసు గలిలయలో తన సువార్త కార్యక్రమాన్ని ప్రారంభించాడు (మార్కు 1:14-15). 
     12. చెరలోనున్న యోహానును గూర్చి యేసు వినియూ, అతన్ని విడిపింపలేదని యోహాను ఆయన్ను సందేహించి, తన శిష్యులను పంపి సందేహం తీర్చుకుంటాడు (మత్తయి 11:2-13). 

     యోహాను చెర - యేసు బాప్తిస్మం - ఏది ముందో యిప్పుడు చెప్పు చూద్దాం. కాలక్రమంలో వాస్తవాలు యిలా జరిగితే, సువార్తల్లో అలాగే రికార్డు చేయబడలేదేం? అని అడుగుతావేమో! సువార్తల ఉద్దేశం సువార్త చెప్పడమే. యేసు జీవిత గాథను వ్రాయడం వాటి సంకల్పం కాదు గనుక యేసును గూర్చిన సువార్తను లేఖకులు వ్రాసే సమయంలో - ఆయన చేసినవానిలో తమ పాఠకులకు ఏది అవసరమనుకున్నారో వాటిని మాత్రమే రికార్డు చేశారు. బైబిల్లోని సువార్తలు సత్య సువార్తలే; వాటి ఉపదేశం నమ్మదగింది. ఒకవేళ తర్జుమాలో పొరపాట్ల ఎక్కడైన జరిగి ఉంటాయేమో కాని; ఆది భాషలోని బైబిలు లేఖనాల్లో లోపాలు లేవు. గనుక బైబిలును నిరభ్యంతరంగా నమ్మవచ్చు. యోహాను చెర - యేసు బాప్తిస్మం అనే విషయాల మధ్య కాలపరిమాణంలో ఏ దోషమూ లేదు. మరి మన మిత్రుడు ఎందుకు అలా ప్రశ్నించాడో తెలియకుంది. వాస్తవానికి లోటు మాత్రం దైవ లేఖనాలది కాదు. ఇక తప్పు ఎవరిదో నీవే నిర్ణయించుకో!
93. అరణ్యంలోనా, వివాహంలోనా - యేసు యెక్కడ?
     ఆ దినములలో యేసు గలిలైయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళలోనుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము తెరవబడుటయు, పరిశుద్ధాత్మ పావురమువలె తనమీదికి దిగి వచ్చుటయు చూచెను . . . వెంటనే పరిశుద్దాత్త్మ ఆయనను అరణ్యములోనికి వెళ్లునట్లు ప్రేరేపించెను, ఆయన సాతానుచే శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి మృగములతో కూడ నుండెను మార్కు 1:9-13.

     (యేసు బాప్తిస్మము పొందిన) మూడవ దినమున గలిలైయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. యోహా 2, 1-2. 

గమనిక: పై లేఖనంలో అంటే యోహాను 2:1-2కు ముందు మన విమర్శకుడు బ్రాకెట్లలో వ్రాసిన మాటలు బైబిలు మాటలు కావు. బైబిలు అలాంటి భావాన్ని ఎక్కడా బోధించలేదు. లేని వార్తలు పుట్టించి సత్యాన్ని అబద్ధంగా చూపాలని సమకట్టిన మన విమర్శకుని మాటలే అవి ఈ వాస్తవాన్ని గమనించినప్పుడు పై లేఖనాల మధ్య సమస్య లేకుండపోతుంది చూడు.

     బైబిలు చెప్పినట్టు యేసు బాప్తిస్మము పొందిన మూడవ దినమున అరణ్యంలోనే; ఆయన వివాహములో లేడు! బాప్తిస్మమిచ్చు యోహాను నొద్దకు ఆయన తొలిసారి వచ్చింది - బాప్తిస్మం పొందడానికే (మత్తయి 3:13-17). అప్పటికి యేసుకు శిష్యులు లేరు. ఆయన బాప్తిస్మము పొందిన వెంటనే మార్కు 1:9-13లో చెప్పబడినట్లు - ఆయన నలువది దినములవరకు అరణ్యంలో శోధింప బడ్డాడు. అటు తరువాత యేసు గలిలయలో తాను జీవించుచుండిన నజరేతునకు వెళ్లాడు (లూకా 4:13-14). ముందు చర్చను మరోసారి చూడు. (యేసు యోహాను వద్ద బాప్తిస్మంపొంద వచ్చిన దానికిని, శిష్యులను ఏర్పరచుకొనడానికిగాను రెండవమారు యోహాను నొద్దకు వచ్చినదానికిని మధ్య కనీసం 40దినాల కాలం గడిచిపోయింది),

     ఆ దినాలలో జనసమూహాలు యోహాను వద్దనే ఉన్నాయ్. యూదులలో భక్తిగలవారందరు దాదాపు అక్కడనే నిలిచిపోయారు. గనుక బాప్తిస్మమిచ్చుచున్న యోహానే క్రీస్తయి ఉంటాడా? అనే అనుమానం యూదామత నాయకులకు వచ్చింది. దాన్ని తీర్చుకోడానికి వారు అతనియొద్దకు యాజకులను, లేవీయులను పంపుతారు. వారు వచ్చి అతనిని అడిగిన ప్రశ్నలకు యోహాను సమాధానం చెప్పుతాడు (యోహాను 1:19-28) యొర్దాను నదికి అవతలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాయి. జాగ్రత్తగా ఈ స్థలం పేరు గుర్తుంచుకో!

     దీనికి మరునాడు యేసు తన శిష్యులను ఏర్పరచుకొనడానికి గలిలయలోని నజరేతునుండి బేతనియలోనున్న యోహానునొద్దకు వస్తాడు (యోహాను 1:29). ఆయన యోహాను నొద్దకు వచ్చింది - యిది రెండవ సారి. ఆ సమయంలో యోహాను యేసును జనులకు పరిచయం చేస్తూ గతంలో ఆయనను గూర్చి తాను చెప్పిన సంగతులను వారికి జ్ఞాపకము చేసి, యేసు దేవుని కుమారుడని సాక్ష్యమిచ్చాడు (యోహాను 1:29-34).

     (దీనికి తరువాత) "మరునాడు" మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును ఒకచోట నిలిచియుంటారు. ఆ సమయంలో యేసు అలా వెళ్ళుతున్నాడు. అప్పుడు (బాప్తిస్మమిచ్చు యోహాను) నడచుచున్న యేసును చూచి - "ఇదిగో దేవుని గొట్టెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని, యేసును వెంబడించిరి" (యోహాను 1:35-36). ఆ దినముననే మరికొందరిని శిష్యులుగా చేసికొని, యేసు యూదయలోని బేతనియనుండి గలిలయలోని కానా పెండ్లి విందుకు వెళ్లాడు (యోహాను 2:1-2) గనుక యేసు కానాలోని పెండ్లి విందుకు వెళ్లింది, (లేనిదాన్ని కల్పించి మన విమర్శకుడు చెప్పినట్టు) ఆయన బాప్తిస్మము పొందిన మూడవనాడు కాదు. తన శిష్యులను ఏర్పరచుకొనుటకు రెండవమారు యేసు యోహాను నొద్దకు వచ్చిన మూడవ దినముననే! లేని వార్తలు పుట్టించి మన మిత్రుడు చేసింది హేతువాదమేనా?

     గమనిక: రచయితలు తమ పాఠకుల అవసరాన్ని బట్టి రికార్డు చేసినవాటిలో బాప్తిస్మమిచ్చు యోహాను నొద్ద యేసు బాప్తిస్మం పొందవచ్చిన సంఘటనను మత్తయి, మార్కు లూకాలు మాత్రమే రికార్డు చేసారు. అపొస్తలుడైన యోహాను దాన్ని రికార్డు చేయలేదు. అయితే ఆయన తన శిష్యులను ఏర్పరచుకొనడానికి యోహాను వద్దకు వచ్చిన సంఘటనను అపొస్తలుడైన యోహాను రికార్డు చేశాడు. దాన్ని మత్తయి, మార్కు లూకాలు రికార్డు చేయలేదు. ఇలా సంగతులు పరిష్కారంగా తెలిసికోకుండా ఒక సందర్భాన్ని మరొక సందర్భంతో కూర్చి మన విమర్శకుడు లేఖనాలను అపార్థం చేసాడు. ఇలా చేసేది కూడా హేతువాదమేనా? గనుక మన చదువరి ఈ సంగతులను శ్రద్దగా ఆలోచిస్తారని ఎదురు చూస్తున్నాం.
94. అపవిత్రాత్మ దేవుని సంబంధమైనదేనా?
     అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు - వద్దు. నజరేయుడవగు యేసూ, . . . నీవెవడవో నాకు తెలియును. నీవు దేవుని పరిశుద్దుడవు అని కేకలు వేసెను. మార్కు 1:23, 24.

     ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది 1 యోహా. 4:1, 2.

     గమనిక: పై లేఖనాలను యిలా జతచేసి తప్పును స్థాపించడానికి చేసిన ప్రయత్నం - నిజాయితిని తప్పడమే ఔతుంది. ఎలాగంటావేమో! మొదటిగా ఆ లేఖనాలు అసందర్భంగా జతచేయబడ్డాయి. రెండవదిగా యిక్కడ మన విమర్శకునిచే ఉద్దేశింపబడింది బైబిలులో లేదు (He is reading into the Bible). వాస్తవాలను గ్రహించడానికి బైబిలునే పరిశీలించి చూద్దాం. దానికి ముందు ఒక ఉదాహరణ చూడు. మంత్రులలో ఒకరు మీ ప్రాంతానికి వచ్చినప్పుడు, కొందరు నల్ల జెండాలు పట్టుకొని, అతని చుట్టు పోగై, ఆ మంత్రిని పేరు పెట్టి పిలుస్తూ - "నీ వెవడవో మాకు తెలుసు; నీవు (ఫలానా) మంత్రివి కదూ! నీవు మా ప్రాంతానికి ఎందుకు వచ్చావ్" అంటూ కేకలు వేసారనుకో! అప్పుడామంత్రిని మీ ప్రాంతపువారు ఒప్పుకొన్నట్టేనా? లేక అంగీకరించనట్టేనా?

     అలాంటప్పుడు మార్కు 1:23-24లో ఏమి జరిగింది? యేసు కపెర్నహోమనే పట్టణములోని సమాజ మందిరానికి వెళ్లాడు. "ఆ సమయమున వారి సమాజమందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడుండెను. వాడు - నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్మును నశింపజేయ వచ్చితివా? నీ వెవడవో నాకు తెలియును నీవు పరిశుద్దుడవు అని కేకలు వేసెను." ఈ మాటలలో - అపవిత్రాత్మ యేసును ఒప్పుకున్నట్టే ఉందా? లేకుంటే మన విమర్శకుడు - అపవిత్రాత్మ యేసును ఒప్పుకుందని అంటాడేమి? పైగా అలా అనడానికిని (పాఠకులను భ్రమపరచడానికిని) బైబిలులో వ్రాయబడ్డదానిలో మన మిత్రుడు కొంత తీసివేశాడు, చూడు.

     యేసును ఒప్పుకొనడమంటే - నీకెలా తోస్తుందో కాని, ఆయన్ను ఒప్పుకొనడమంటే, బైబిలు భావమేమో చూద్దాం. బైబిలు ప్రకారము యేసును ఒప్పుకొనడమంటే:
     1. యేసును ప్రభువుగా స్వీకరించడం (రోమా 10:9-10) 
     2. దుర్నీతినుండి తొలగిపోవడం (2 తిమోతి 2:19). 
     3. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయడం (లూకా 6:46).
     4. వీటికి భిన్నమయింది ఆయన్ను ఒప్పుకొనడం కాదు. మన మిత్రుడు యేసును ఎంతగా ఒప్పుకున్నాడో, అపవిత్రాత్మ కూడా ఆయనను అంతే ఒప్పుకుంది.

     అలా కాకపోతే, ఆ అపవిత్రాత్మ వీటిలో దేన్ని జరిగించి యేసును ఒప్పుకున్నట్టు రుజువు చేసిందో? వీటిలో అపవిత్రాత్మ వేటినీ జరిగించలేదు సరిగదా, ఆయన అక్కడికి రావడాన్ని కూడ అది యిష్టపడలేదు. ఈలాటి పరిస్థితులలో అపవిత్రాత్మ యేసును ఒప్పుకున్నట్టు స్థాపించలేనివాటిని కల్పించడంలో మన విమర్శకుని ఉద్దేశమేమో! అది చాలదన్నట్టు, అసందర్భంగానే మార్కు 1:23-24లకు వ్యతిరేకంగా, 1 యోహాను 4:1- 2 ఉన్నట్టు చూపాడు. ఈ లేఖనం ఉద్దేశం వేరు. ఆ లేఖనం ఉద్దేశం వేరు. ఉద్దేశాలు ఏకం కానివాటిని జతచేయడం తప్పు కాదా? ఈ సందర్భంలో వాటిని పరిశీలించి చూడు.

"ప్రియులారా! అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు."

     (PNEUMA) (నూమా) "ఆత్మ" అనే పదం క్రొత్త నిబంధనలో 18 సార్లు ఉపయోగింపబడినట్టు గ్రీకు పండితుడైన VINE (వైన్) సూచించాడు, (VINE'S Expository Dictionary of the New Testament P.1085). వాటిలో మార్కు 1:23-24లో "దయ్యమనే" భావంతోనూ, 1 యోహాను 4:1-2లో "బోధ" లేక "ఉపదేశం" అనే భావంతోనూ ఉపయోగింపబడినట్టు వైన్ వివరించాడు. గనుక "ప్రతి ఆత్మను నమ్మక" అనే ప్రయోగం - "ప్రతి ఉపదేశాన్ని నమ్మక" అనే ఉద్దేశంతోనే చేయబడింది అందునుబట్టి మార్కు 1:23–24ను 1 యోహాను 4:1-2లతో ముడిపెట్టి అపవిత్రాత్మ దేవుని సంబంధమైనదేనా? అని ప్రశ్నించడం అర్థరహితమని, అవివేకమని తేలిపోయింది. అపవిత్రాత్మ దేవుని సంబంధమైనదేనా అని అడిగేదానికంటే మన మిత్రుని విమర్శ జ్ఞానయుక్తమైన హేతువాదమేనా? అని అడిగితే సబబుగా ఉంటుంది కదూ!
95. దేశమేది? ఎదురు వచ్చినవారెందరు?
     వారా సముద్రమున కద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. యేసు దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు గోరీలలో నుండి వచ్చి ఆయన కెదురుపడెను. మార్కు 5:1, 2.

     యేసు అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యము పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు యెదురుగా వచ్చిరి. మత్త 8:28.

     గమనిక: ఈ సందర్భంలో దేశము వేరుగా ఉన్నట్టుంది; ఎదురుగా వచ్చిన వారిని గూర్చిన వర్తమానం కూడా వేరుగానే ఉన్నట్టుంది. మార్కు ఒకడని అంటున్నాడు, మత్తయి - యిద్దరంటున్నాడు. ఇలాటివాటిని బట్టి బైబిలులో విరుద్ధ భావాలున్నట్టు కాదా? అని మన విమర్శకుడు అంటాడు. అయితే అవి నిజంగా తార్కిక జ్ఞానానికి విరుద్దాలా? కావు, కానేరవు. వాస్తవాలను గ్రహించడానికి అవి ఆటంకాలా? కాదు! సత్యాన్ని స్థాపించాలన్న దృష్టితోనే సంగతులను ఆలోచన చేద్దాం.

     విశాఖపట్టణాన్ని- వాల్టేరుగాను, వైజాగ్(క్) గానూ; విజయవాడను, బెజవాడగానూ హిందూదేశాన్ని - భారతదేశం లేక ఇండియాగాను సమస్య లేకుండగనే గుర్తించుతున్నాం కదూ? అలాగే మొదటి శతాబ్దంలో "గదర" అనే ప్రాంతాన్ని "గరస" అనే ప్రాంతంగా కూడా వ్యవహరించినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. (UMMKEIS - W. EWNG - ISEEP 1152). గనుక మన విమర్శకునికి వచ్చిన సమస్యల్లో దేశమేది? అనే సమస్య తీరిపోయే ఉండాలి.

     పోతే, "ఎదురు వచ్చిన వారెందరు?" అనే ప్రశ్నను ఆలోచన చేద్దాం. ప్రతి లేఖకుడు (రచయిత) తన పాఠకులను దృష్టిలో నిలుపుకొని విషయాలను గుర్తిస్తాడు; చిత్రిస్తాడు కూడా! ఇలా చేయడంలో రచయిత తన పాఠకుల ఆసక్తినీ, వారి విశ్వాసాన్నీ చూరగొనడానికి ప్రయత్నిస్తాడు. అలాగే సువార్త రచయితలు కూడా చేసారు. మార్కు పాఠకులు వేరు, మత్తయి పాఠకులు వేరు. పాఠకుల దృష్టిలో జరిగిన సంభవాల్లోనుండి వాస్తవాలను ఎన్నుకొని వాటిని రికార్డు చేయడానికి దేవుడు సమ్మతించాడు.

     మార్కు యొక్క పాఠకులు - ఒకని సాహసకృత్యాలను బట్టి లేక అతడు తన పనిలో సాధించిన ఘనవిజయాలను బట్టి ఆకర్షింపబడి, వానిని మాత్రమే గౌరవించి, ఘనపరచి, వానినే వెంటాడగోరేవారు (రోమీయులు). అట్టి రోమీయులను యేసుకు శిష్యులగునట్లు మల్చడం అంత సామాన్యమైన పని కాదు. గనుక యేసు చేసిన పనులన్నిటిని ఊరకే కోట్ చేయడం తన లక్ష్యసాధనకు పనికిరాదు. అందువలననే యేసు ఒకే సమయములో ఎన్ని పనులు చేసినా, వాటిలో ప్రత్యేకమైన ఒకదానిని తీసికొని దాన్ని వివరించుతూ, ఆయన ఎంతటి అసాధారణమైన కార్యాన్ని జరిగించాడో దాన్ని మాత్రమే సూచించడానికి మార్కు పూనుకొన్నాడు! తన రచనలో అతడు పూర్తిగా అలాటివాటినే ప్రత్యేకించి గుర్తించాడు.

     మత్తయి పాఠకులు యూదులు - మెస్సీయా కొరకు కనిపెట్టుకొన్నవారు. బాప్తిస్మ మిచ్చు యోహానును మెస్సీయాగా అంగీకరించాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నవారు (యోహాను 10:22-24) ప్రభువైన యేసు పనులు ఆయన్ను మెస్సీయాగా వారికి ప్రత్యక్షపరుస్తున్నాయి. అయితే ఆయన సామాన్యులతో కలిసిపోవడం వారి అనుమానానికి దోహదమయ్యింది (మత్తయి 9:10). గనుక ఆయన ఎన్ని సూచక క్రియలు వారి ఎదుట చేసినా, అంతరంగంలోనున్న వారి అనుమానాన్ని బట్టి - యింకొకటి చేయమని యూదులు కోరేవారు (మత్తయి 12:28; 1 కొరింథీ. 1:22).

     నజరేయుడగు యేసే వారి - మెస్సీయా అని రుజువు చేయడానికి వారి లేఖనాల్లో ప్రవచనాలను, ఆయన నెరవేర్చిన సందర్భాలను చూపుతూ, సూచక క్రియల విషయంలో వారి తృష్ణ తీర్చాలనే దృష్టితో కాబోలు మత్తయి సంఖ్యకు ప్రాముఖ్యత నిచ్చేవాడు! అందుకే వారి రికారుల్లో తేడా రావడం జరిగింది. ఇద్దరు సాక్షులతో స్థిరపరచబడుతున్న ఆ సంభవాలు తప్పక సత్యాలైయుండి తీరాలి.

     ఓ ఉదాహరణ మన సమస్యను పరిష్కారం చేస్తుంది చూడు. హిందూదేశంనుండి ఒలింపిక్ పరుగు పందానికి యిద్దరు వెళ్లినట్టు ఒక "స్పోర్ట్సు వీక్లి" రిపోర్టిస్తే; మరొక వీక్లీ భారతీయ యువతి దానిలో సాధించిన ఘన విజయాన్ని ప్రశంసిస్తూ, ఆమె ఫోటోతో " పాటు వివరాలను ప్రచురించింది. 1900 సంవత్సరాల తరువాత - ఆ రెండు వీక్లీ రిపోర్టులమీద ఒకడు విమర్శకు దిగి - దేశమేది? వచ్చినవారెందరు? అని అడిగితే ఎలా ఉంటుందో మన విమర్శకుని ప్రశ్న అలాగే వుంది. గనుక బైబిలు లేఖనాలలో సమస్య లేదని చెప్పనవసరం లేదు. సంగతులు పరిష్కారంగా తెలుసుకొనకనే మన మిత్రుడు యిలా పాటుపడ్డాడు! ఈ బండారమే హేతువాదమట!
96. ఒకటికీ, రెంటికీ తేడా లేదా?
     (యేసు) యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తిమయియను గుడ్డిభిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. మార్కు. 10:46. 

     (యేసు) యెరికోనుండి వెళ్లుచుండగా . త్రోవ ప్రక్కన కూర్చున్న యిద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లుచున్నాడని విని. కేకలు వేసిరి. మత్త. 20:29, 30.

     గమనిక: పై రెండు లేఖనాల మధ్య విరోధభావం చూడలేని గ్రుడ్డితనం నాకే వచ్చినట్టుంది. వీటిని ఆలోచిస్తుంటే మొన్న జరిగిన సంఘటనొకటి గుర్తుకు వస్తుంది.

     "ఏమండీ! ఏదో హడావడిగా ఉన్నట్టున్నారే" అని పలుకరించాడు మా యింటి ఓనర్, ఆంద్రానుండి నా స్నేహితులిద్దరు వచ్చారండీ? ... అంటూ, నా మాటలు చాలించాక, నేను బజారుకు వెళ్లాను. నా స్నేహితులిద్దరిలో ఒకనిని ఎరిగిన వ్యక్తి ఎదురయ్యాడు. ఆగి, మార్గంలో అతనితో మాట్లాడుతూ, "మీ ఊరినుండి వెంకన్నగారి కుమారుడు రాజా మా యింటికి వచ్చాడండీ” అని అన్నాను.

     మా యింటి ఓనరుతోను, దారిలో కనబడ్డ వ్యక్తితోనూ, నేను మాట్లాడిన మాటలలో విరోధ భావమున్నట్టు మీకు గోచరించిందా? ఒకటికీ రెంటికీ తేడా లేదా? అనే ప్రశ్న తల ఎత్తిందా? నా ఒక్కడి మాటలలోనే మీకు విరోధ భావం కన్పించకపోతే - మత్తయి, మార్కుల రచనలలో మీకు విరోధ భావం ఎలా కన్పించిందో?

     ఒక విషయాన్ని చర్చించేటప్పుడు – అది మన శ్రోతలకు ఎంతవరకు? ఎలా? సరిపోతుందో - అంతవరకు అలా చర్చించడం సహజం. పై ఉదాహరణలో నా స్నేహితులతో ఎలాంటి పరిచయం లేని మాయింటి ఓనరుతో ఒక విధంగా మాట్లాడాను. నా స్నేహితులలో ఒకని మాత్రమే ఎరిగిన వ్యక్తితో త్రోవలో మరో విధంగా మాట్లాడాను. అంటే శ్రోతలు వేరైనప్పుడు ఒక విషయాన్ని చర్చించే విధానం కూడా వేరౌతుంది. ఇలాంటి పరిస్థితులే మత్తయి, మార్కు రచనలలోని తేడాకు కారణమయ్యింది. అంతేగాని, వాటిలో వాస్తవ వైరుధ్యాలున్నందున ఆ రచనల్లో తేడాలు రాలేదు.

     మత్తయి యూదులకూ, మార్కు రోమీయులకూ తమ వర్తమానాన్ని ఉద్దేశించారని గుర్తించాం, గనుక, ఈ సందర్భంలో మత్తయి తన పాఠకుల అనుభవాలలోనుండి - యేసు "ఆ గుడ్డివారికి" చేసిన సంఘటనలు రికార్డు చేశాడు. మార్కైతే తన పాఠకులు ఎరుగని, తానే స్వయంగా ఎరిగిన గుడ్డివానికి - యేసు చేసినదాన్ని రికార్డు చేశాడు. ఇలా రికార్డు చేయడంలో, ఆ గుడ్డివాని పేరు (బర్తిమయి), అతని తండ్రి పేరు (తీమయి), అతని పూర్వస్థితి, యేసును కలుసుకొన్న తరువాత ఆ గుడ్డివానిలో కలిగిన మార్పు, వగైరాలను వివరించుతూ - కార్య సాధకులను గౌరవించే రోమీయులకు మార్కు తన వర్తమానాన్ని రచించాడు. తమ పాఠకుల దృష్టిలో సంఘటనలను వివరించుటలో ఏర్పడ్డ తేడాలను తప్పులుగా భావించడం జ్ఞానమేనా?

     గనుక ఒకటికీ, రెంటికీ తేడా లేదా? అని అడగటం అర్థరహితం; కదూ?
97. బొందితో కైలాసం యేసు కొక్కడికేనా?
     పరలోకమునుండి దిగి వచ్చినవాడే అనగా పరలోకములోనుండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు యెక్కిపోయిన వాడెవడును లేడు. యోహా 3:13. 

     ఏలియా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెను. 1 రాజు. 2:11. 

     విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హెబ్రీ. 11:5 (ఇంకా చూడు; ఆది. 5;24).

     గమనిక: ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయెనని, హనోకు మరణం చూడకుండునట్లు కొనిపోబడెనని వ్రాయబడియుండగా; క్రీస్తు తప్ప మరెవ్వడూ పరలోకానికి యెక్కిపోలేదని మరో చోట వ్రాయబడడం అసంబద్ధం కాదా? అని అడుగుతున్నాడు మన విమర్శకుడు. మరి నీవేమంటావో కాని బైబిలు మాత్రం అది అసంబద్ధం కాదంటుంది. మత ప్రపంచంలో ఉన్న పుకారును బట్టి (అబద్ధ బోధను బట్టి) సామాన్యుని మనస్సుకు యిది ఒకవేళ అసంబద్ధంగానే కన్పించవచ్చునేమో గాని, తార్కిక జ్ఞానంతో బైబిలును పరిశీలించేవారికి యిక్కడ సమస్య లేదు; - చూడు.

     "ఏలీయా సుడిగాలిచేత ఆకాశమునకు ఆరోహణమాయె"నను మాట వాస్తవమే. అయితే ఆకాశం - పరలోకం కాదు. ఆకాశానికి ఆరోహణుడయ్యాడన్నంత మాత్రాన పరలోకానికి వెళ్లేడని భావం కాదు. మరి ఆకాశానికి ఆరోహణమైన ఏలీయా ఎక్కడికి వెళ్లినట్లు? అని అడుగుతావేమో! దానికి జవాబు చూద్దాం. వీరిలో అందరికంటె ముందటివాడు హనోకు, గనుక ముందుగా హనోకు నొద్దకు వెళ్లదాం. "హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడ్డాడు" ఎక్కడికి? ఎక్కడికనేది - హెబ్రీ 11:5లో గాని, ఆది 5:24లో గాని చూపబడలేదు - అయితే హనోకు, ఏలీయాలు ఎక్కడికి వెళ్లారో తెలిసికొనే అవకాశముందా? తప్పకుండా ఉంది!

     హెబ్రీ. 11లో - విశ్వాసవీరుల జాబితా యివ్వబడింది. ఆ జాబితా భూమిమీద తొలి హతసాక్షియైన హేబెలుతో ప్రారంభమౌతుంది. ఆ లిస్టులో, మరణం చూడకుండ కొనిపోబడిన హనోకు రెండోవాడు (11:5). అందులో క్రమంగా వారిలో ఒక్కొక్కరు చేసిన పనులను గూర్చి తెలుపుకుంటూ వచ్చిన హెబ్రీ రచయిత - 11:32లో యిలా అంటాడు. "ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను బారాకు, సమ్సోను, యెఫ్తా దావీదు, సమూయేలను వారిని గూర్చియు, ప్రవక్తలనుగూర్చియు వివరించుటకు సమయము చాలదు."

     సమయముందనుకుంటే వీరందరిని గూర్చియూ, ప్రవక్తలను గూర్చియూ హెబ్రీ రచయిత వివరించి ఉండేవాడేనట! అయితే సమయము చాలదనే ఉద్దేశంతో వారిని వ్యక్తిగతంగా వివరించలేదు. ప్రవక్తలను గూర్చి సమయం తీసికొని ఆయన వ్రాసియుంటే - ఏలీయాను గూర్చి వివరించకుండా దాటిపోయేవాడు కాడు. ఎందుకంటే ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధిగా లేఖనాల్లో కన్పిస్తాడు. మత్తయి 17:1-4; మార్కు 9:2-5 వగైరాలు చూడు. ఇప్పుడు నీకేం అర్థమయింది? విశ్వాసవీరుల జాబితాలో - మరణం చూడకుండునట్టు కొనిపోబడిన హనోకు ప్రత్యక్షంగాను, ఏలియా పరోక్షంగాను ఉన్నట్టు అర్థం కాలేదా? అయితే వారు ఎక్కడికి వెళ్లినట్టు?? అదే కదూ మన ప్రశ్న! దానికి జవాబు హెబ్రీ. 11:39-40లో ఉంది చూడు. "వీరందరు తమ విశ్వాసముద్వారా సాక్ష్యము పొందినవారైనను, మనము లేకుండ సంపూర్ణులుకాకుండు నిమిత్తము, దేవుడు మనకొరకు మరి శ్రేష్టమైనదానిని ముందుగా సిద్ధపరచెను గనుక వీరు (హానోకు ఏలియాలతో కూడిన బృందం) వాగ్దాన ఫలము అనుభవింప లేదు." అంటే పరలోకం వెళ్లలేదు అని అర్థం.

     భూ నివాసులెవరైనా సరే, వాగ్దాన ఫలాన్ని అనుభవించేది పరలోకములోనే (మత్తయి 25:31–34). ఆ కార్యక్రమం జరిగేది క్రీస్తు రెండవ రాకడలో మాత్రమే (1 కొరింథీ. 15:51-54; 1 థెస్స. 4:14–16). అంతవరకు భూమిమీద విశ్వాసులై జీవితాన్ని చాలించినవారు ఏ విధంగా వెళ్లినవారైనా, పరదైసులోనే ఉంటారు (2 కొరింథీ. 12:2- 4). అంటే దేవునిచే నియమింపబడిన ఆ దినం వచ్చేవరకు ఈ లోక యాత్రను ముగించినవారు (వారి ఆత్మలు) పరదైసులో ఉంటారు (లూకా 23:43; ప్రకటన 14:13). కాలక్రమంలో అది "అబ్రాహాము రొమ్ము" అనే పేరుతో గుర్తించబడింది (లూకా 16:22-25).

     అయితే ప్రభువైన యేసుయొక్క ఆరోహణం వేరే, ఆయన మరణించినప్పుడు ఆయన దేహం సమాధి చేయబడింది; కాని (మత్తయి 27:57-66) భౌతిక కాయం మరణాన్ని రుచిచూచినప్పుడు ఆయన ఆత్మయందు పరదైసునకు వెళ్లాడు (లూకా 23:42-43) ఆయన మూడవ దినమున అక్కడనుండి వచ్చి, తన మృతదేహాన్ని సమాధినుండి లేపుకొని (మత్తయి 28:1-6), ఆ దేహంతోనే (యోహాను 20:20) ఆయన తన శిష్యులకు 40 దినాలవరకు ప్రత్యక్షమౌతూ వచ్చాడు (అపొ. 1:3) చివరిగా వారితో ఒలీవల కొండవరకు నడచిపోయి, వారు చూచుచుండగా ఆయన వారి కన్నుల యెదుటనే ఆరోహణుడయ్యాడు. అయితే ఆయన ఎక్కడికి వెళుతున్నది వారికది అప్పట్లో తెలియలేదు. తెల్లని వస్త్రాలు ధరించిన యిద్దరు మనుష్యులు వారికి యిలా తెలియజేశారు, "గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశమువైపు చూచుచున్నారు? మీ యొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును" (అపొ. 1:8-11; దానియేలు 7:13-14). ఆ తరువాత ఈ విషయం ఆయన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడింది. వారి ప్రభువు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడినవానిగా వారు గుర్తెరిగారు (అపొ. 2:22-36; ఫిలిప్పీ 2:6-11). 

     గనుక బైబిలు ప్రకారం - పరలోకంనుండి దిగివచ్చిన మనుష్య కుమారుడే (క్రీస్తే) తప్ప పరలోకమునకు యెక్కిపోయినవాడు యింతవరకూ ఎవడూ లేడు. హనోకు, ఏలీయాలు పరదైసుకు (క్రీస్తు రెండవ రాకడవరకు నియమింపబడిన నీతిమంతుల విశ్రమ స్థలానికి) కొనిపోబడ్డారు. "మనము లేకుండ" వారు వాగ్దాన ఫలమైన నిత్య స్వాస్థ్యాన్ని అనుభవించ వీలులేదు. గనుక, దేవుని కుమారులు సంపూర్ణులగుటకు వారు వేచియున్నారు (హెబ్రీ. 12:1). క్రీస్తు ప్రభువు చివరిగా ప్రత్యక్షమగునప్పుడు (ఆయన రెండవ రాకడలో) అమరత్వాన్ని ధరించి, దేవుని ప్రజలందరు పరలోకానికి వెళ్తారు (1 థెస్స. 4:16-17; 1 కొరింథీ. 15:50-56). 

     బొందితో కైలాసమనే మాట - బైబిలుకు చెందింది కాదు. కాని దాన్ని మన విమర్శకుడు బైబిలేతర మూలంనుండి తెచ్చి బైబిల్లోనికి చొప్పించ ప్రయత్నించాడు. ఏది యెలాగున్నా మన మిత్రుడూ, చదువరీ, వగైరాలంతా తెలిసికొనవలసినదేమంటే - రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించు కోదు (1 కొరింథీ 15:50). మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన ప్రభువు (ప్రకటన 1:5–6), శరీరంతో పునరుత్థానుడై, ఆ దేహంతోనే నలబై దినాలు తన అపొస్తలులకు కన్పించినా, వారి కన్నులు చూచుచుండగా ఆరోహణమైనప్పుడు ఆయన అక్షయతను ధరించుకొని మాత్రమే పరమునకు వెళ్లాడు. ఇలాటి పరిస్థితి యిప్పటివరకు ఏ మానవునికి లభించకపోయినా, ఆయన రెండవమారు - ప్రత్యక్షమై (2 థెస్స 1:6-7), తన వారినందరిని పరలోకమునకు కొనిపోవునప్పుడు వారు ఆయనవలె మార్పు పొందుతారు (ఫిలిప్పీ 3:20-21; 1 యోహాను 3:1-4). 

     నీవు నమ్మూ నమ్మకపో! బైబిలు బోధించే సత్యమిది. దీనిలో ఏ సమస్యాలేదు.
98. ఇంతకు తీర్చేవాడెవడు?
     తండ్రి యెవనికి తీర్పు తీర్చడు; కాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు. యోహా. 5;22.

     నేను లోకమును రక్షించుటకే వచ్చితినికాని లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు; నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపనివానికి తీర్పు తీర్చువాడొకడు కలడు.
యోహా. 12:47, 48.

     గమనిక: పై లేఖనాలను ఒకదానికొకటి వ్యతిరేకిస్తున్నాయంటాడు మన విమర్శకుడు. అది ఎంతవరకు నిజమో పరిశీలించుదాం. అయితే ఒక మాట: లేఖనాలలో ఒకదానికొకటి ఒకే సమయం ఒకే సందర్భంలో, ఒక లేఖనం "అవును" అన్నట్టుండాలి. తిరిగి అదే సమయానికి సందర్భానికి సంబంధించిన మరొకటి "కాదు" అన్నట్టూ ఉండాలి. అయితే యోహాను 5:22, 12:47-48లు "అవును", "కాదు" అన్నట్టు ఒకే సందర్భంలో ఉన్నాయా? లేవు, చూడు!

     మొదటి లేఖనం ప్రకారం - తీర్పు తీర్చువాడు యేసుక్రీస్తే! అయితే ఆయన లోకానికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు. "లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కాని, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను పంపలేదు" (యోహాను 3:17) ఇంకా చూడు లూకా 19:10; 1 తిమోతి 1:15.

     లోకమునకు తీర్పు తీర్చు అధికారి యేసుక్రీస్తే! ఆ అధికారాన్ని క్రీస్తుకు అప్పగించిన తండ్రి, కాలములను సమయములను తన స్వాధీనంలో ఉంచుకొని, (అపొ. 1:7) - క్రీస్తు లోకానికి తీర్పు తీర్చే సమయాన్ని కూడ ఆయనే నిర్ణయించాడు, చూడు: "ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును, మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత (క్రీస్తుచేత, 1 తిమోతి 2:5) నీతిననునరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు" (అపొ. 17:30-31).

     అయితే ఏం జరిగింది? తీర్పు దినానికి ముందు "పాపులను రక్షించుటకు" దేవుడు తన కుమారుని పంపాడు (యోహాను 3:16). గనుక క్రీస్తు లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకే గాని, తీర్పు తీర్చడానికి కాదు (యోహాను 12:47; 1 తిమోతి 1:15; లూకా 19:19).

     అయినా, రక్షించుటకు అవతరించిన యేసునూ, ఆయన మాటలను ఈ జీవిత కాలంలో నిరాకరించిన పాపులకు - తీర్పు తీర్చే అధికారిగా యేసు అంత్యదినమున ప్రత్యక్షమౌతాడు (2 థెస్స. 1:6-7). భూమిమీద వినిపింపబడిన ఆయన మాటలే అంత్య దినాన తీర్పు తీర్చే ప్రమాణాలుగా వినియోగించబడతాయ్. తీర్పులో నీ మట్టుకు నీకేమి లభిస్తుందో యిప్పుడే తెలిసికోవచ్చు. ఎలాగంటావేమో! "నన్నునిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పుతీర్చువాడొకడు కలడు" అని అన్నాడు యేసు! "ప్రభువా, ఆయనెవరు?" అని అడిగితే - "నేను మీతో చెప్పినమాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును" మరెవరో కాదు అని తెలిపాడు యేసు (యోహాను 12:47-48).

     ఇలాటి లేఖనాలలో పరస్పర వైరుధ్యం ఏ వాదానికి కనబడిందో గాని, నిజమైన హేతువాదికి లేఖనాలలో సమస్య లేదు. అదలావుంచి, చదువరి గుర్తించ వలసిందేమంటే: "మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును" (హెబ్రీ. 9:27) . అంటే, మానవుడు భౌతిక దేహంలో జీవించేది ఒక్కసారే; భౌతిక దేహానికి మరో జన్మలేదు, మరణంతో వాని నిత్య గమ్యం ముద్రింప బడుతుంది. తన నిత్య నివాసం కొరకు ఈ జీవితకాలంలో సిద్ధపడనంత మాత్రాన పర్యవసానాన్ని తప్పించుకోబోయేది లేదు. భక్తిహీనుల తీర్పు నాశనము జరుగువరకు, వాడు (ఆత్మ) పాతాళంలో నిలిచియుండవలసిందే! గత్యంతరం లేదు (లూకా 16:22-23; 2 పేతురు 3:3-7). అదెలాగున్నా యేసు మొదటిరాకడ పాపులను రక్షించడానికే తీర్పు తీర్చడానికి కాదు. ఆయన రెండవరాకడ, "ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యపెట్టిన" వారికి తీర్పు తీర్చడానికే నేడు నిరాకరింపబడే రక్షకుడే రేపు తీర్పు తీర్చే అధికారి!
99. యేసు యెందుకు వచ్చినట్లు?
     యేసు క్రీస్తు అందరికి ప్రభువు: ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. అపొ. 10:36. (ఇంకా చూడు; లూకా 2:14; రోమా 15:33).

     నేను భూమిమీద అగ్ని వేయవచ్చితిని; అది యిదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. నేను భూమిమీద సమాధానము కలుగచేయ వచ్చితినని తలంచుచున్నారా? సమాధానమును కాదు; భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను. లుకా.12:49-51. (ఇంకా చూడు: మత్తయి 10:34; నిర్గము. 15:3).

     గమనిక: యేసు క్రీస్తుద్వారా దేవుడు సమధానకరమైన సువార్తను పంపితే - "నేను భూమిమీద సమాధానమును కలుగజేయ వచ్చితినని తలంచుచున్నారా?" అని యేసు మాట్లాడడం తప్పు కాదా? అది అసంబద్ధం కాదా? అని మన విమర్శకుడు అడుగుతున్నాడు. ప్రశ్నసమంజసంగానే ఉంది. అయితే అసలు సంగతేమో పరిశీలించి చూద్దామా? ఇంతకు మనం చూడవలసింది అదే గదా?

     1. బైబిలు ప్రకారం - మానవుడు పాపం చేసి దేవునితో వైరం తెచ్చుకొన్నాడు (యెషయా 59:1-2). ఆ విరోధాన్ని తొలగించగోరి ప్రేమామయుడైన దేవుడే యేసు క్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తను పంపాడు. మానవుని తనతో సమాధాన పరచుకొనే విధానాన్ని కూడా ఆయన ముందుగానే నియమించాడు. 2 కొరింథీ. 5:20-21 ఆ నియమాన్ని అనుసరించే, క్రీస్తు - మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడునట్లు ఆయన లేపబడ్డాడు, మృతిని గెలిచాడు. గనుక యిప్పుడు మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా దేవునితో సమాధానము కలిగియుండగలము.

     "ఏలయనగా శత్రువులమై యుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన యెడల, సమధానపరచబడినవారమై ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము" (రోమా 4:25-5:1, 10:1, 10, 11). ఇది దేవునితో సమాధానం. ఇది పరిశుద్ధ దేవునితో పాప మానవుడు పొందే సమాధానం!

     2. దేవుడు యేసుక్రీస్తు ద్వారా పంపిన సమాధాన సువార్తలో, భూలోకమందలి జాతులు జనములకు మధ్య ఏర్పడిన వైరమును (భేదాన్ని) తొలగించే పని కూడా యిమిడివుంది, అంటే మానవ జాతులు, జనాలు అనేవారిమధ్య భేదం తొలగింపబడి, వారు ఏకమయ్యే విధానం కూడా ఆ సమాధాన సందేశంలో యిమిడి ఉంది. గనుకనే యూదులకు అన్యజనులకు మధ్య తరతరాలుగా నిలిచియుండిన భేదాన్ని సూచించి, బైబిలు యిలా అంటుంది "- అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్తులైయున్నారు. ఆయన మన సమాధానమై యుండి మీకును, మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును, తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధిచేయుచు ఈ యిద్దరిని తనయందు, ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమధాన పరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై యున్నాడు" (ఎఫెసీ. 2:13-16).

     ఇలా సమాధాసపరచడానికి వచ్చిన యేసు- అగ్ని వేయవచ్చితిని; సమాధానం కలుగజేయ రాలేదంటాడేం? అనేది మన అసలు ప్రశ్న! ఆ ప్రశ్నకే యిప్పుడు సమాధానం చూద్దాం. సమాధానానికి రెండు భాగాలు ఎలాగున్నాయో అలాగే, దానికి రెండు రకాలైన ఫలితాలు కూడా వస్తాయ్,

     1. క్రీస్తు దేవునితో మానవునికి కుదిర్చిన సమాధాన ఫలితంగా- మనుష్యుడు నీతిని ప్రేమించి, దుర్నీతిని ద్వేషింప మొదలుపెడతాడు. తాను సత్యం, నీతి అనేవాటి పక్షంగా నిలిచి - అబద్ధం, అసత్యం, దుర్నీతి, దుష్టత్వం వగైరాలతో తన పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఆ కారణాన్నిబట్టే- మన విమర్శకుని మీద వ్యక్తిగతంగా నాకు ఏలాటి విరోధ భావం లేకున్నా ఆ మన మిత్రుని రచనకు విరోధంగా నేను నిలిచాను! అబద్ధం తన కుయుక్తి చేత సత్యాన్ని మరుగు చేయచూస్తే, దానికి విరోధంగా నేను ఖడ్గం దూసిన కారణమదే! సత్యాన్ని అసత్యంగా చూపడానికి, మన మిత్రుడు తన ". . .బండారం" రూపంలో ప్రయాసపడితే, బైబిలును తమ మార్గాలకు అనుకూలంగా మల్చుకొన్న మతశాఖల్లా, కోర్టులకు వెళ్ళవలసిన పని నాకులేదు. సత్యంతోగల సమాధానం, అబద్ధంతో పోరాటమే ఔతుంది. ప్రభువైన యేసు నాచే దూయించిన ఖడ్గమిదే (ఎఫెసీ. 10:13) వంచన మాటలతో; తెలిసి తెలియని కబుర్లతో, విజ్ఞానమని అబద్ధంగా చెప్పే విపరీత వాదాలతో, పామర జనాన్ని మోసం చేసే "బైబిలు బండారం" వంటి రచనలతో పోరాటం సాగించడమే ఈ విరోధం (2 కొరింథీ. 10:2-6 చూడు)

     2. జనములకు, జాతులకు మధ్య క్రీస్తు కలిగించిన సమాధానానికి ప్రతిఫలంగా సమధానపరచబడిన వ్యక్తులు మానవ సమాజాలలో తరతరాలుగా నిలిచిన - జాతి, కులం, వర్ణం - వగైరా భేదాలకు విరోధంగా నిలిచి పోరాడవలసిన వారైయుంటారు (గలతీ. 3:26-27; ప్రకటన 5:9-10).

     ఉదా: కుల భేదాలతో నిండియున్నసమాజంలోని యువకుడు క్రీస్తు బోధకు లోబడితే - తాను బంధింపబడియున్న "కుల" కట్లను తెంచుకోడానికి ప్రయత్నిస్తాడు, అప్పుడేం జరుగుతుందనుకుంటావ్? తరతరాలుగా పాతుకొనిపోయిన సాంఘిక దురాచారాలను సహా అతడు ఎదుర్కోవలసి వస్తుంది. అది తన సమాజంతోనే కాదు; మొదటిగా అతడు తన యింటివారితోనే పోరాడవలసి వస్తుంది. అది సాయుధ పోరాటంకాదు; అది భావ పోరాటం; లేక సూత్ర పోరాటమే! మానవ సమాజంలో స్వార్థం, దుర్నీతి, వగైరాలవలన వెలసిన సమస్త దుష్కార్యాలు అంతరించేవరకు ఈ పోరాటం కొనసాగాలి! మానని మానవ సాంఘిక సమస్యలకు క్రీస్తు తెచ్చిన ఆ సమాధాన పోరాటమే పరిష్కార మార్గం!

     ఈ పర్యవసానాన్ని సూచిస్తూ, యేసు- భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను. నేను భూమిమీద సమాధానమును కలుగజేయ వచ్చితినని తలంచుచున్నారా? సమాధానమును కాదు. భేదమునే కలుగజేయ వచ్చితినని చెప్పారు.

     అంటే, ఆయన తెచ్చిన సమాధాన సువార్తకు ప్రతిఫలంగా భూమిమీద రెండు రకాలైన పోరాటాలు జరుగుతాయ్. వాటిలో మొదటిది దుర్నీతి దుష్టత్వం; అబద్ధం అసత్యం వగైరాలకు విరోధమైన పోరాటం; రెండవది- సాంఘిక దురాచారాలతో అంటే - కులం, జాతి, వర్గ, భాష వగైరాలవలన కలిగిన భేదాలకు వ్యతిరేకంగా నిలిచి పోరాడటం. అది భావ పోరాటం. ఈ అగ్ని రగులుకోవాలని అది మండాలని దాని ద్వారా దుర్నీతి, అసత్యం, అబద్ధం, సాంఘిక భేదాలు దహించి వేయబడాలని ఆయన ఎంతో కోరుతున్నాడు. అలాటి భావ పోరాటాన్ని కొనసాగిస్తే, ఆయన సూచించినట్టు "ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు"- అనే మాట వాస్తవమౌతుంది. కావాలంటే ప్రయత్నించి చూడు!

     నీతి స్వరూపుడైన దేవునితో పాపియై ఉండిన నరుడు క్రీస్తునందు అనుభవించే "సమాధానం" మొదటిగా వానిని నీతిమంతునిగా తీర్చుతుంది; పైగా అవినీతి, దుష్టత్వం, సాంఘిక దురాచారాలతో సహా పోరాడేవానిగా అతన్ని తీర్చిదిద్దుతుంది. ఇదే పై లేఖనాలలోని వర్తమానం. వాస్తవానికి అవి ఒకదానినొకటి బలపరచుకొంటున్నాయే గాని, మన మిత్రుడు భావించినట్టు, అవి ఒకదానినొకటి ఖండించుకొనడంలేదు.

     అయితే వాటిని అసంబద్ధాలుగా భావించి, మన మిత్రుడు, తాను నిలిచిన కొమ్మను తానే కొట్టివేసుకున్నాడు: తన రచనతో బైబిలు కొరకు త్రవ్విన గుంటలో - తన బండారానికే సమాధి కట్టాడు! సత్యాన్ని అబద్ధంతో వ్యతిరేకించిన ప్రతిసారి యిలాటి ఫలితమే వస్తుంది. గనుక సత్యానికి విరోధంగా నిలువకుండ జాగ్రత్తపడదాం.
100. తలపై విలాసం తలకొక రకం!
     ఇతడు యూదులరాజైన యేసు - అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మత్త. 27:37. 

     యూదులరాజు - అని ఆయన మీద దోషారోపణగా పై విలాసము వ్రాసియుంచిరి. మార్కు. 15;26.

     ఇతడు యూదులరాజు - అని పై విలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను. లూకా. 23;38. 

     యూదుల రాజైన నజరేయుడగు యేసు - అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యోహా. 19;19. 

     గమనిక: యేసు సిలువపై పెట్టబడిన విలాసాన్ని గూర్చి మత్తయి, మార్కు, లూకా, యోహానులు - నాలు విధాలుగా వ్రాసారు. వీరి మాటలలో ఉండే తేడాను బట్టి అసలు యేసు సిలువ వేయబడలేదని మన విమర్శకుడు భావిస్తాడు. అది ఎంతవరకు నిజమో చిట్టచివరిగా తేల్చుకొందాం.

     సహజంగా అవసరాన్నిబట్టి వాస్తవాలు వ్యవహరించబడతాయి కదా? పరిచయాన్ని బట్టి కూడ వ్యవహరించే విధానం మారుతుంది. "ప్రయోగింపబడే మాటలన్నీ ఒకటిగా ఉంటేనే వాస్తవాలు వాస్తవాలుగా గుర్తించబడతాయ్" అనేది పొరపాటు. అందులో చారిత్రక వాస్తవాలైతే లభించే సాక్ష్యాధారాల మీదనూ, రచనలు వగైరాల మీదను నిలిచియుంటాయ్. నమ్మదగిన యిద్దరి సాక్ష్యాధారాన్ని బట్టి న్యాయశాస్త్రం వాస్తవాలను స్థిరపరుస్తుంది. అలాటప్పుడు నలుగురు రచనల మీద స్థిరపరచబడ్డ క్రీస్తు యొక్క సిలువ మరణం తప్పక వాస్తవమై ఉండి తీరాలి!! గత్యంతరం లేదు.

     వారి రచనలో సిలువపై విలాసాన్ని సూచించిన మాటలన్నీ ఒకటిగా లేనందున (సిలువ మరణమే లేదని) నిరాకరించే మన విమర్శకుని పరిస్థితి ఎలాగుందో చూడు!

     సత్యాన్ని ప్రేమించేవారి మనస్సులలో శాశ్వతంగా సమాధి చేయబడ్డ - బైబిలు  బండారంలోని తలపై విలాసం కూడా తలకొకరకం కాదా?
     1. రావిపూడి వెంకటాద్రిగారి పరిచయంలో ఒకచోట - "బ్రహ్మం"
     2. అదే పరిచయంలో మరోచోట - "మిత్రుడు బ్రహ్మం"
     3. చివరి అట్టమీద పరిచయంలో - "నాసిన వీర బ్రహ్మం"
     4. పదిమందికయిన పరిచయంలో - "ఎన్. వి. బ్రహ్మం"

     ఇన్ని రకాల "తలపై విలాసాలు" గల "బైబిలు బండారానికి" రచయితయే లేడనా, దీని భావం? దీనికి అదే భావం కాకపోతే - క్రీస్తు సిలువ మరణం లేకుండా ఎలా పోతుందో? నాలు రకాలైన విలాసాలు గల బైబిలు బండారానికి రచయిత ఉంటే - నాలుగు రకాలైన తలపై విలాసాలు గల సిలువ మరణం లేకుండపోవడమేమి? అడ్డగోలు వ్యవహారమేనా హేతువాదమంటే? లేకపోతే మన మిత్రుడు హేతువాది కాకుండాపోయాడా? వాస్తవాలను స్థాపించకుండా యథార్థవంతుడెవ్వడూ ఈ సందర్భాన్ని తప్పించుకొని దాటిపోడానికి వీల్లేదు!


     "నాసిన వీరబ్రహ్మం" అనే మూలంనుండి బైబిలు బండారంలోని తలపై విలాసాలు ఎలా వచ్చాయో, అలాగే “-యూదుల రాజైన నజరేయుడగు యేసు" అనే వాస్తవంనుండి తక్కిన రూపాలు వచ్చాయి. పరిచయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, బైబిలు బిండారం పై విలాసం తలకొక రకంగా వ్యవహరింపబడినట్టే - సిలువపై విలాసం కూడా వ్యవహరింప బడింది. జ్ఞాని ఎవడూ దీన్ని కాదనలేడు!

     ఇద్దరు వ్యక్తుల సాక్ష్యంతో మన దేశంలో సాధారణంగా ఏ డాక్యుమెంటైనా చెలామణియౌతుంది. పరిశీలనలో నిలిచిన యిద్దరి సాక్ష్యంతో ఏ విషయమైనా వాస్తవమని నిర్ధారణ చేయబడుతుంది. కేవలం యిద్దరే కాదు; నలుగురు సాక్ష్యాలతో పరిశీలనలో నిలిచి, నాలుగు డాక్యూమెంటుల ఆధారంతో రుజువైన యేసు సిలువ మరణం మన మిత్రుని తొలి భాగాన్ని (అవతారికను) రద్దుపరుస్తుంది. ఎందుకంటే, యేసు అనే వ్యక్తి లేడని వాదించడానికీ, దాన్ని స్థాపించడానికీ, మన మిత్రుడు అక్కడ ప్రయాసపడ్డాడు! ఆ ప్రయాస సాక్ష్యాధారాలతో విఫలం చేయబడింది కదూ? ఇంకా కావాలంటే - "బైబిలే దేవుని గ్రంథమైతే బండారమెవరిది?" అనే నా రచనను కూడా, చూడు!

     దాని సంగతి అలా ఉంచి, మన మిత్రుని రచనలో జరిగిన సంగతి చదువరికి అర్థమయ్యింది కదూ? బైబిలు బండారాన్ని బయటపెట్టాలని పూని, తన బండారాన్నే మన మిత్రుడు బయటపెట్టుకున్నాడు! బైబిలులో 100 అసంబద్ధాలు, లేక పరస్పర (Contradictions) విరుద్దాలు ఉన్నట్టు బయలుదేరిన "బైబిలు బండారం" చివరికి ఏ ఒక్కదాన్ని కూడా రుజువు చేయలేకపోయింది సరిగదా; బైబిలు కొరకు తాను త్రవ్విన గోతిలో అదే పడిపోయింది! (మన మిత్రుని 32 పై నా వివరణను చూడు!).

     నూటిలో కనీసం ఒక్కటైనా సత్యం చెప్పలేకపోయిన మన మిత్రుని "బైబిలు బండారాన్ని జ్ఞానమంటావో, మోసమంటావో, వెర్రితనమంటావో మరిదాన్ని యిక నీవేమంటావో! మన మిత్రుని హేతువాదం అదేనేమో?! నిజంగా హేతువాదులు దానితో ఎందరేకీభవిస్తారో! బైబిలుపై గొప్ప విమర్శన రచనగా బయలుదేరి, అనేకులను భ్రమపెట్టిన ఆ రచన యొక్క బండార మిదే! కావాలంటే నీవే పరిశీలించి చూడు.

     ఇంతటి భయంకరమైన విమర్శను, వికట విరుద్దాన్ని ఎదుర్కొని కూడా నిర్దోషంగా సత్యసాక్ష్యంగా నిలిచిన బైబిలు, దేవుని గ్రంథం కాదని తార్కిక జ్ఞాన వివేచనగల వారెవ్వరూ అనలేరు; అనబోరు!
గమనిక: బైబిలు బండారం, గాయత్రీ ప్రెస్, విజయవాడ - 11 రెండవ ముద్రణ - ఏప్రిల్ 1980నుండి తీయబడినదీ విషయ సూచిక.

<< Previous


2 comments: