Thursday 1 September 2016

యేసు దేవుని కుమారుడైన క్రీస్తు

Click here for eBook

1. మనమందరము విశ్వాసవిషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు, ఆయన ఈలాగు నియమించెను (ఎఫేసి 4:11-12).
2. ఇటీవల కాలంలో క్రీస్తు సారూప్యంలోనికి ఎదగాలి అనే నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అట్టి ఎదుగుదలకు (pre-condition), ముందు షరతుగా మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందడం అవసరమైయుంది గదా! ప్రస్తుతానికి, విశ్వాసపు బోధ విషయంలోగాని, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోగాని విశ్వాసులమధ్య ఏకత్వం లేదే!!
3. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టుతానని ప్రభువైన యేసు సూచించారు (మత్తయి 16:16-18). యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే భావనలో ఏకత్వం లేకుండా కట్టబడేది అయన సంఘం ఎలా అయ్యుంటుంది? వాస్తవానికి, “యేసు దేవుని కుమారుడు అనే దానికి కనీసం మూడు రకాలైన విభిన్న సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి, దేవుడనే పరమ తండ్రి, అనగా సకల యుగములలో రాజైయుండి అక్షయుడు, అదృశ్యుడుఅద్వితీయుడు, స్వయంగా నరరూపు దాల్చి కుమారుడయ్యాడని, ఆయన సిలువ మరణం, సమాధి, పునరుత్దానాల అనంతరం పరలోకమునకు వెళ్లి, తిరిగి పరిశుద్ధాత్మ రూపంలో వచ్చాడనీ, గనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడనే విశ్వాసం క్రైస్తవులనబడే వారిలో అధికంగా కనపడుతుంది.
4. దీన్ని తప్పుపడుతూ, రెండవ సిద్ధాంతం వెలసింది. అదేమంటే, నిత్యత్వంలో పరలోకమందు దేవుడు, ఆయన దూతలు, ఆత్మలు ఉన్నాయట! వారిలో ఒకడు దేవుని లక్షణాలన్నీ (సంపూర్ణతను) సాధించాడట, ఆ వ్యక్తికి దేవుడు కుమారుడని పేరుపెట్టాడట; అలాటి అనేకులైన కుమారులు కావాలని దేవుడు కోరి, భూమిమీద నరులను చేశాడని ఈ తెగవారు అంటారు. అంటే, నిత్యత్వంలోనే క్రీస్తు దేవుని కుమారుడైయున్నాడని ఈ సిద్ధాంతం చెపుతోంది. అనేకులు దీనిని నమ్ముతూ ప్రకటిస్తున్నారు కూడా. మొదటి సిద్ధాంతం లోపభూయిష్టమని, యిది తిరుగులేని జ్ఞానమని దీన్ని భోదించేవారు, నమ్మేవారు భ్రమపడుతున్నారు. అది వారి భ్రమమాత్రమే!
5. యేసు దేవుని కుమారుడు” అనడానికి, ఫై రెండింటికినీ భిన్నమైన మరో సిద్ధాంతంకూడా వెలిసింది. యేసుని దేవుడు మొట్ట మొదటిగా సృష్టించాడట; ఆయన ద్వార తిరిగి సమస్తాన్ని సృష్టించాడట. అందుకే యేసు దేవుని తొలిసృష్టిగా దేవుని కుమారుడనబడ్డాడట. I కొరింథీ. 1లో, క్రీస్తు సిలువ యందు దేవుడు కనపరచిన జ్ఞానాన్ని; సృష్టి నిర్మాణంలో అయన కనుపరచిన జ్ఞానంతో (సామెతలు 8) జోడించి, ఈ సిద్ధాంతాన్ని రూపించారు. కొందరు ఈ సిద్ధాంతానికి కట్టుబడియుండే వారు సహితం, యేసు దేవుని కుమారుడని గట్టిగా నమ్ముతారు. ఇంకను వేరే సిద్ధాంతాలు ఉన్నా, ప్రస్తుతం ప్రజల మధ్య అత్యధికంగా వాడుకలో ఉన్నవి ఇవే! దేవుని కుమారుని గూర్చి యిన్ని రకాలైన సిద్ధాంతాలు బయలుదేరినపుడు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలో ఏకత్వం ఎలా సాధ్యమౌతుంది? క్రీస్తు సారూప్యం ఎలావస్తుంది?
6. యేసు దేవుని కుమారుడనే భావన తమ విశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న కారణాన, క్రైస్తవేతరులలో కొందరు దీనిని అవహేళనచేయసాగారు. యేసు దేవుని కుమారుడైతే, దేవుని భార్య ఎవరు? భార్యలేకుండా బిడ్డ (కుమారుడు) ఎలావచ్చాడనే అడ్డసుడి ప్రశ్నలకు దిగారు. అలాటి పనికిమాలిన వ్యతిరేకమైన ప్రశ్నలు ఆత్మ సంభందమైన పరిధిలో చెల్లవనుకో!
7. ఏది యెలాగున్నా, పై మూడు సిద్ధాంతాలలో ఉన్న తప్పొప్పులను చర్చించడం యిచ్చటి ఉద్దేశం కానేకాదు! ఎందుకంటే, పై మూడు సిద్ధాంతాలను, క్రైస్తవేతరుల వ్యంగ ప్రశ్నలను సహితం కొట్టివేస్తూ, అపొస్తలుల బోధ దేవుని కుమారుని నిర్వచిస్తుంది. క్రొత్త నిభందన ప్రకారం, అపొస్తలుల బోధకు భిన్నమైన ఏ బోధ అయినా, అది శాపగ్రస్తమైనదని గ్రంధం తేల్చివేసింది (గలతీ. 1.6-9). అపొస్తలుల బోధకు భిన్నమైన బోధచేసేవారిని గూర్చి యిక మాట్లడపనిలేదు. వారిలోనుండి తొలగిపొండని ధీటైన హెచ్చరికలు లేఖనాల్లో జారిచేయబడ్డాయి (రోమా 16:16-18).
8. దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలో ఏకత్వం పొందడానికి సంబంధించి, ప్రభువైన యేసు ఈ సూచననిచ్చాడు. "మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును (అపొస్తలులును) మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్ధించుటలేదు; వారి (అపొస్తలుల) వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్ధించుచున్నాను" (యోహాను 17:20-21). విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలోను ఏకత్వానికి అపొస్తలుల బోధయే ఆధారమైయుంది. ఇది నిరాక్షేపము. అపొస్తలుల బోధయైతే పై మూడు సిద్ధాంతాలను ఛేదిస్తుంది.
9. అపొస్తలుల బోధ ప్రకారం యేసు దేవుని కుమారుడంటే ఇశ్రాయేలు రాజనియే అర్ధం. దీనికి వేరే అర్ధంలేదు. యేసు నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి - ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏకపటము లేదని అతని గూర్చి చెప్పెను. -నన్ను నీవు ఎలాగు యెరుగుదువని నతనియేలు ఆయనను అడుగగా యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. నతనియేలు - భోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను (యోహాను 1:47-49).ఇశ్రాయేలు రాజువు అంటే, భౌతికమైన, శరీర సంబంధమైన, సున్నతి సంబంధమైన, ధర్మశాస్ర సంబంధమైన ఇశ్రాయేలీయుల రాజు అని దీని అర్ధం కాదు. బెత్లెహేము ఎఫ్రతా, యుదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను (మీకా 5:2). ఇది క్రీస్తుకు సంబంధించిన ప్రవచనమని బైబిలుతో పరిచయమున్న వారికి బాగా తెలుసు.
10. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి - యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. హేరోదురాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడ యెరూషలేము వారందరును కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి - క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను. అందుకు వారు - యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయదేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రమును అల్పమైనదానవు కావు; ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి యున్నదనిరి (మత్తయి 2:1-5).
11. అటు ప్రవచనంలోను, యిటు నెరవేర్చుటలోను చెప్పబడిన సంగతులలో - మొదటిది, ఇశ్రాయేలు అనువారు దేవుని ప్రజలని; వారిని ఏలువాడు ప్రభువైన యేసు అని తేట తెల్లమైనది. ఇంతకు ఇశ్రాయేలనే ఈ ప్రజలెవరు? యిర్మియా యిలా ప్రవచించాడు. క్రొత్త నిభందనను గూర్చిన దేవుని వాగ్ధానాన్ని అతడు వివరించిన మీదట, అతడిలా వ్రాసాడు. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును, దాని తరంగములు ఘోషించునట్లు సముద్రమును రేపువాడునగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు, సైన్యముల కధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ​ఆ నియమములు నా సన్నిధి నుండకుండ పోయినయెడల ఇశ్రాయేలు సంతతివారు నా సన్నిధిని ఎన్నడును జనముగా ఉండకుండపోవును; ఇదే యెహోవా వాక్కు (యిర్మియా 31: 34-35).
12. ఈ ఇశ్రాయేలు వాగ్ధాన ప్రకారమైన క్రొత్త నిబంధన ఇశ్రాయేలేగాని, శరీర సంబంధులుకారని వేరుగా చెప్పనవసరం లేదు. వీరిని గూర్చి అపొస్తలుడైన పౌలు యిలా అన్నాడు: క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు. ఈ పద్ధతిచొప్పున నడుచుకొను వారికందరికి, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధాన మును కృపయు కలుగును గాక (గలతీ. 6:15-16). క్రొత్త నిబంధన ఫలితంగా అవతరించిన వారే ఆ దేవుని ఇశ్రాయేలు.
13. క్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరణం, సమాధి, పునరుత్థానాల అనంతరం వచ్చిన తొలి పెంతెకొస్తు దినాన క్రొత్త నిబంధనకు ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవానికి పరలోకంనుడి పరిశుద్ధాత్మ (chief guest) ముఖ్య అతిధిగా పంపబడ్డాడు. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి (అపొ. 2:5)”. క్రొత్త నిబంధన ఎవరితో చేయబడుతుందని వాగ్ధానముందో, ఆ జనులందరు పోగైయుండిరి. అప్పుడు పరిశుద్ధాత్మ పేతురు నోట ప్రసంగించుతూ మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను (అపొ 2:36).
14. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని - సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు - మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును (అంటే, యుదులకును) మీ పిల్లలకును (ఈ నిబంధనలో ప్రవేశించే వారి పిల్లలకును) దూరస్థులందరికిని (సమస్త అన్యజనులకును), అనగా ప్రభువైన మన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను (అపొ 2:37-39). దేవుని ఎరిగిన వారును క్రీస్తుయేసు సువార్తకు లోబడినవారందరును దేవుని ఇశ్రాయేలై యుంటారు. ఇందులో ఏ భేదమును లేదు. ఇలా క్రీస్తుయేసు నందున్న వారందరు దేవుని నూతన సృష్టియే (IIకోరింధీ. 5:17). ఇందులో మార్పుండదు.
15. ఈ దొడ్డివి కాని (భౌతిక ఇశ్రాయేలుకాని) వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటినికూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱల కాపరి ఒక్కడును అగును అని మీద ప్రభువైన యేసు ఆ నూతన ఇశ్రాయేలును గూర్చి తెలిపారు (యోహాను 10:16; ఎఫెసి. 3:6 కూడా చూడు). ఇంత వరకు దేవుని ఇశ్రాయేలును గూర్చి సంక్షిప్తంగా చూసాం. ఇకపైన దేవుని కొరకు వారిని ఏలే రాజును గూర్చి, అంటే దేవుని కుమారుని గూర్చి ఆలోచిద్దాం.
16. పరమందున్న దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో వాగ్దానం చేసినట్టు వారి సంతానమైన ఇశ్రాయేలీయులను ఇగుప్తు దేశపు బానిసత్వం నుండి వెలుపలికి రప్పించాడు (ఆది 15:13-16)సీనాయి కొండ మీద ఆయన వారితో రాజ్యాంగ నిబంధన చేసుకొని (నిర్గమ 19:5-6), ఆయన వారి మధ్య తన ఏలుబడిని ప్రారంభించాడు. ఆ ఇశ్రాయేలీయులు ఆయనకు యాజక రాజ్యము, ఆయన వారికి రాజు. వాగ్ధాన దేశమైన కనాను వారి భూభాగము ఆయన వారికిచ్చిన ధర్మశాస్త్రము, వారి రాజ్యాంగ చట్టము. ఇశ్రాయేలీయులే ఆ రాజ్య పౌరులు. దేవుని జాతీయ రాజ్యంగా వారు కనానులో స్థిరపడ్డారు, ఒడుదుడుకుల మధ్య శతాబ్దాల తరబడి అలాగే కొనసాగుతున్నారు కూడా.
17. కాల క్రమంలో వారి మధ్య అనేక మార్పులు చోటు చేసికోన్నాయి. ఎట్టకేలకు, సకల జనుల మర్యాద చొప్పున తమకు రాజు కావాలని వారు కోరారు (I సమూ. 8:5). వారు అలా కావాలని ఎప్పుడైనా కోరుకుంటే, రాజ్యంగ చట్టానికి సవరణ అవసరం లేకుండానే, తన స్థానంలో వారిపై ఎవరిని రాజుగా నియమించాలో, ఆ అధికారాన్ని దేవుడు తన వశంలోనే ఉంచుకున్నాడు (ద్వితి. 17:14-19). సకల జనుల మర్యాద చొప్పున రాజుని కోరడంలో, తమ్మును ఏలకుండా వారు దేవుని నిరాకరించారు. వారి రాజ్యాంగం చట్టము అంగీకారంతోనే, ఆయన రాజ్య సింహాసనం కూర్చుండి, ఇశ్రాయేలీయులను ఏలడానికి ఆయన బెన్యామీనుయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి రాజుగానియమించాడు (సమూ 9,10 అధ్యాయాలు).
18. దేవుని సింహాసనము మీద కూర్చుండి, ఆయన కొరకు ఇశ్రాయేలీయులను ఏలుబడి చేసే సౌలు, తన దేవునిపై తిరుగుబాటు చేయగా (I సమూ. 15), యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి యున్నాడు (I సమూ. 15:28). ఆ పొరుగు వాడే దావీదు, శత్రువులను క్షమించుటలో, దావీదు దేవుని హృదయానుసారుడని చెప్పవచ్చు. కాలక్రమంలో, దావీదు యెహోవరాజ్య సింహాసనముపై ఆసీనుడై దేవుని ప్రజలను ఆయన కొరకు పాలింప సాగాడు.
19. అతని ఏలుబడిలో తగిన సమయాన్ని చూచి (II సమూ. 7:1-10), దేవుడు దావీదుతో రెండు మార్చబడని వాగ్దానాలను చేసినాడు. వాటిలో ఒకటి, అతని సంతానానికి సంబందించినది; రెండవది అతని సింహాసనానికి సంబందిచినది. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా నేను నీకు సంతానము కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడ నిద్రించిన తరువాత నీ గర్భములోనుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి, రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించును; అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదనునేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును’. ఈ మాటలు కేవలం క్రీస్తు ప్రభువుకు సంభందించిన మాటలేయని పరిశుద్ధాత్మ తేటగా మాటలాడియున్నాడు ఊహలకు ఇందు తావులేదు (II సమూ. 7:11-14; హెబ్రీ. 1:5బి). వాస్తవానికి, దావీదు కుమారునిగా యేసుక్రీస్తు దేవుని కొరకు ఆయన జనులను ఏలనైయున్నాడని ఇందులో సూచించబడింది. ఇటు తరువాత దీనిని తగిన సమయంలో ప్రస్తావిస్తాను.
20. దావీదు సంతానము గూర్చియు, అతని సింహాసనము గూర్చియు దేవుడు మరొక మూల నుండి తన సందేశాన్ని వినిపించాడు. గమనించు: నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధతైలముతో అతనినభిషేకించియున్నాను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై యుండును.... నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొఱ్ఱపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠకుమారునిగా చేయు దును... నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను నా నిబంధన అతనితో స్థిరముగానుండును(కీర్తన 89:20-28).
21. అతనితో స్థిరముగా ఉండే దేవుని నిబంధన ఏమి? శాశ్వతకాలమువరకు అతని సంతానమును ఆకాశమున్నంతవరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధుల నాచరింపనియెడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొననియెడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బలతోను వారిని శిక్షించెదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను (కీర్తన 89:29-37). ఇట్టి దేవుని మాటలన్నియు దావీదు కుమారుడైన క్రీస్తునందు మాత్రమే నేరవేర్చబడవలసియుందంటే ఆశ్చర్య పోనవసరంలేదు.
22. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ... దూత మరియా,భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమా రుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను(లూకా 1:26-33).
23. యేసు యిటు దేవుని కుమారుడు, అటు దావీదు కుమారుడు; దావీదు సింహాసనముపై ఆసీనుడై, యేసు దేవుని కొరకు దేవుని ఇశ్రాయేలును ఏలువాడనైయున్నాడు. దేవుని కుమారుడంటే, అర్ధం యిదే! వాస్తవానికి దావీదు కుమారుడైన సొలోమోను నుండి ఈ ప్రక్రియ ఆరంభమై (Iదినవృ. 28:4-7), దావీదు నీతి చిగురైన క్రీస్తునందు (యిర్మియా 23:5; ప్రకటన 5:5) యిది (ultimate) చిట్టచివరిగా శాశ్వతంగా నెరవేర్చ బడింది.
24. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో యిదే సంగతి సూటిగా చెప్పబడింది: - నేనతనికి తండ్రినై యుందును. అతడు నాకు కుమారుడై యుండును అని హెబ్రీ. 1:5 లోని కొటేషన్ 2 సమూ. 7:14 లో చెప్పబడింది కేవలం క్రీస్తుని గూర్చి పలకబడిందేనని హెబ్రీ. 1:5 లో పరిశుద్ధాత్మ తేల్చివేశాడు. ఇక దానిపై వాదించడానికి ఎవనికిని తావులేదు. ఎవడైన దానికి విరోధంగా వాదించ తెగించితే, పరిశుద్ధాత్మకే విరోధంగా మాట్లాడ తెగించిన వాడైయుంటాడు. అలా తెగించే ఎవరితోనైనా నాకు సంబంధంలేదు సుమీ!
25. హెబ్రీ పత్రిక తేటపరిచే మరో విషయం: యేసు దేవుని కుమారుడని రుజువు చేయడానికి, హెబ్రీ రచయిత కీర్తన 2:7ను కోట్ చేస్తున్నాడు, గమనించు. కీర్తన 2, పట్టాభిషేకానికి సంబంధించినదైనట్టును, అట్టి సందర్భంలోను కీర్తనయని ఎరగాలి. దావీదు సంతతి వారికి పట్టాభిషేకం చేసే విధానం గ్రంధంలో ఒకచోట తొంగి చూచింది. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి - రాజు చిరంజీవియగునుగాక యనిరి (II దినవృ. 23:11).అట్టి సందర్బంలో ఆనవాయితీగా కీర్తన 2 చదువుటకద్దు అనే పారంపర్యముంది. అది నిజమైనా కాకపోయినా, కీర్తన 2, క్రీస్తుయేసువారి పట్టాభిషేకానికి సంబంధించినదైనట్టును, అది తక్కిన వారికి సంబంధించి కాదన్నట్టును, అటు హెబ్రీ రచయితయు, యిటు అపొస్తలుడైన పౌలును సూచిస్తున్నారు; జాగ్రత్తగా గమనించు.
26. పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని (ఇశ్రాయేలు రాజు) ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను (యుగములను) నిర్మించెను. ఆయన (అంటే, నేడు ఇశ్రాయేలను దేవుని ప్రజలను ఏలు రాజు) దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను (హెబ్రీ. 1:1-4). అంటే పట్టాభిషేకం చేయబడ్డాడన్నమాట!
27. ఏలయనగా – నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనేది కీర్తన 2:7 నుండి హెబ్రీ పత్రికలో కోట్ చేయబడినది. ఈ లేఖనం క్రీస్తు నిత్యత్వంలో కుమారుడనే భావనను కొట్టి పారేస్తుంది. నేడు అనేది తక్కిన మరి ఏరకమైన సిద్దాంతాన్నైనా త్రోసివేస్తుంది, రద్దు పరుస్తోంది. కనియున్నాను అనేది జన్మకుగాని, పునరుత్థానికిగాని సంబంధించినది కాదని; అది కేవలం ఆయన పట్టాభిషేకానికి సంబంధించినదేయని అపొస్తలుల బోధ సూచిస్తుంది; గమనించు.
28. అపొస్తలుడైన పౌలు తన స్వజనులకు సంగతులు ఇలా వివరిస్తున్నాడు: సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది. యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి. ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించ వలెనని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను(అపొ 13: 26-30).
29. ఇక్కడినుండి జాగ్రత్తగా గమనించు! ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి (అపొస్తలలుకు) అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు. దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఈ సందర్భంలో, దేవుడు పితరులకు చేసినవాగ్ధానం, క్రీస్తు రాజరికానికి సంబంధించిందే లేక పట్టాభిషేకానికి సంబంధించిందే. అందువలన పౌలు యిలా అన్నాడు, ఆలాగే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది (అపొ 13: 31-33).
30. గనుక కీర్తన 2, క్రీస్తు పట్టాభిషేకానికి సంబంధించినదని అపొస్తలులు భోదిస్తున్నారు. అందువలన కీర్తన 2కి వెళ్లి సంగతులను ఆలోచిద్దాం: అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు? జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి? మనము వారి కట్లను తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు..... (కీర్తన 2:1-4).
31. “-నేను నా పరిశుద్ద పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను .... నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని యున్నాను(కీర్తన 2:6-7) అని దేవుడు ప్రవచనపు భాషలో క్రీస్తు ప్రభువుతో అన్నట్లు హెబ్రీ రచయితయు, అపొస్తలుడైన పౌలుకు వివరించారు. దీనినే కీర్తన 110:1లో, దావీదు ఇంకో రూపంలో పలికాడు; ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు - నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దీనినే పేతురు, మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను(అపో. 2:36). ఇవన్నియు క్రీస్తు పట్టాభిషేకానికి సంబధించిన సంగతులే.
32. అటు తరువాత, దావీదు ఇలా అన్నాడు: యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము(కీర్తన 110:2). లేఖనాలను నీవు ఏ కోణం గుండా చూచిన, యేసు దేవుని కుమారుడంటే, ఇశ్రాయేలు రాజని మాత్రమే అర్థమిస్తున్నాయి. దీనికి భిన్నంగా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మాటలకు అర్థం చెప్పబూనుకున్న ప్రతివాడును లేఖనాలను తన స్వకీయ నాశనానికే అపార్థం చేస్తున్నాడని గమనించాలి. గత్యంతరం లేదు.
జి. దేవదానం

0 comments:

Post a Comment